తిరుమల: శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాల్లో ఇకపై ఉచిత ఫోన్ కూడా చేరనుంది. వైకుంఠం క్యూకాంప్లెక్సుల్లోని కంపార్టుమెంట్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులు ఒక్కోసారి తమవారి క్షేమ సమాచారాల కోసం ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గమనించిన టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ భక్తులకు ఉచిత ఫోన్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం ఎయిల్‌టెల్ సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా ఓ ఫోన్‌ను కాలినడక క్యూకాంప్లెక్స్‌లో ఏర్పాటు చేశారు.
సర్వే చేశాకే..
టీటీడీ ఈవోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఈవో ఏకే సింఘాల్ తక్కువ సమయంలోనే భక్తుల సౌకర్యాలపై దృష్టి పెట్టారు. భక్తులు వేచి ఉండే క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో సిబ్బందితో సర్వే చేయించారు. అత్యవసర సమయంలో తమ వారితో మాట్లాడాలంటే ఫోన సౌకర్యం ఉంటే బాగుంటుందని భక్తులు సూచించారు. ఫోన ఏర్పాటుపై అధికారులతో ఈవో చర్చలు జరిపారు.
వంద ఫోన్ల ఏర్పాటుకు ప్రణాళిక
భక్తులు వేచి ఉండే వైకుంఠం-1 కాంప్లెక్స్‌లో 16, వైకుంఠం-2లో 31 కలిపి మొత్తం 47 కంపార్టుమెంట్లు ఉన్నాయి. తొలుత ప్రతి కంపార్టుమెంటులోనూ ఉచిత ఫోన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ఈవో నిర్ణయించారు. ఆ తర్వాత తిరుమలలోని వివిధ ప్రాంతాల్లోనూ ఉచిత ఫోన్లను ఏర్పాటు చేస్తే.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని యోచిస్తున్నారు. ఈ మేరకు సుమారు 100 ఫోన్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
‘ఉచితం’ కోసం సంప్రదింపులు
శ్రీవారి సేవగా ఫోన్లను ఉచితంగా ఏర్పాటు చేసే సంస్థ కోసం వివిధ టెలికాం సంస్థలతో ఈవో, జేఈవోలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకవేళ ఎవరూ ముందుకు రాకుంటే.. నెలకు కొంత మొత్తాన్ని చెల్లించడంపైనా ఆలోచిస్తున్నారు. ఎయిల్‌టెల్ సంస్థ సీయూజీ సర్వీసును టీటీడీ ఉపయోగిస్తోంది. అందువల్ల ప్రస్తుతానికి ఆ సంస్థకు సంబంధించిన ఫోన్‌ను కాలినడక భక్తుల కాంప్లెక్సులో ఏర్పాటు చేసి, ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మొదట కాయిన్ బాక్స్ విధానం చర్చకొచ్చినా.. చివరకు భక్తులకు ఉచితంగా ఫోన్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.
రెండు నిమిషాలకు కట్ అయ్యేలా..
వెనుక వేచి ఉండే భక్తులకు అవకాశమిచ్చేలా ప్రతి రెండు నిమిషాలకు కాల్ కట్ అయ్యే విధాన్ని తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. ఈ విధానంతో భక్తులంతా ఉచిత సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నారు. టీటీడీ మాజీ ఈవో ఐవైఆర్ కృష్ణారావు హయంలో 55 కాయిన్ బాక్సులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా అప్పట్లో ఈ సౌకర్యం కనుమరుగైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఏర్పాటు చేయాలనుకుంటున్న ఉచిత ఫోన్లకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు.
Related Postings:
> Tirumala Foot Path way Information
> Tirumala Alipiri Steps Information
> Tirumala Angapradhakshana Information
> Tirumala Near by Famous Temples List
> Tirumala Surroundings Temples List
> Tirumala Kapila Terdham Information
Tirumala, Tirumala information, Tirumala Temples Details, Tirumala Surrounding tempels list, Tirumala Accommodation Details, Tirumala Alipir Steps Information, Tirumala History, Tirumala Temple Timings, Tirumala Tirupati, TTD, Hindu temples guide.
Comments
Post a Comment