రెండేళ్ల విరామం తరువాత మార్చి 31 నుండి ఆర్జిత లక్కీడిప్ సేవలు, అంగప్రదక్షిణం టోకెన్ల కేటాయింపు - LUCKY DIP AND ANGAPRADAKSHINAM TOKENS STARTED ON MARCH 31
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆఫ్‌లైన్‌లో లక్కీడిప్ ద్వారా భక్తులకు కేటాయించే విధానం రెండేళ్ల విరామం తరువాత మార్చి 31న పునఃప్రారంభం కానుంది. ఇందుకోసం సిఆర్‌వో జనరల్ కౌంటర్లలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా వ్యాప్తి కారణంగా 2020, మార్చి 20న శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం నిలుపుదల చేయడంతోపాటు ఆర్జిత సేవల కేటాయింపును నిలిపివేసిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల తరువాత ఈ విధానాన్ని టిటిడి తిరిగి ప్రారంభించింది.
టికెట్ల కేటాయింపు ఇలా జరుగుతుంది…
– నిర్దేశించిన వివిధ ఆర్జిత సేవా టికెట్ల కోసం యాత్రికులు తిరుమలలోని కరంట్ బుకింగ్ కౌంటర్‌లో ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల మధ్య నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
– రెండు అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌లు వస్తాయి. ఒక స్లిప్ యాత్రికునికి అందిస్తారు. ఇందులో వారి నమోదు సంఖ్య, సేవ తేదీ, వ్యక్తి పేరు, మొబైల్ నంబర్ మొదలైనవి ఉంటాయి. మరొక స్లిప్ రెఫరెన్స్ కోసం కౌంటర్ సిబ్బంది ఉంచుకుంటారు.
– నమోదు చేసుకున్న గృహస్తుల సమక్షంలో సాయంత్రం 6 గంటలకు ఆటోమేటెడ్ రాండమైజ్డ్ నంబరింగ్ సిస్టమ్ ద్వారా ఎల్ఇడి స్క్రీన్లలో మొదటి డిప్ తీస్తారు.
– సాధారణంగా, శుక్రవారం అడ్వాన్స్‌డ్ బుకింగ్ టికెట్లు కలిగి ఉన్న గృహస్తులు గురువారం రాత్రి 8 గంటలలోపు ఆర్జితం కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి. అలా ఎవరైనా చేయని పక్షంలో ఆ టికెట్లను రాత్రి 8.30 గంటలకు రెండోసారి నిర్వహించే లక్కీడిప్ కోసం కరంట్ బుకింగ్‌కు మళ్లిస్తారు.
– లక్కీడిప్‌లో టికెట్లు పొందిన గృహస్తులు వాటిని కొనుగోలు చేసేందుకు రాత్రి 11 గంటలలోపు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం తెలియజేస్తారు. టికెట్లు పొందని వారికి కూడా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు.
– యాత్రికులు డిప్ విధానంలో అవకాశాన్ని పొందడం కోసం ఆటో ఎలిమినేషన్ ప్రక్రియ అమలవుతుంది.
– యాత్రికులు డిప్ విధానంలో ఏదైనా ఆర్జిత సేవ పొంది ఉన్నట్టయితే ఆరు నెలల వరకు తిరిగి వారు ఆర్జిత సేవలను పొందేందుకు అనుమతించబడరు. యాత్రికులు ఒక ఆర్జిత సేవకు మాత్రమే నమోదు చేసుకోవడానికి అనుమతి ఉంటుంది.
– సేవల నమోదు కోసం ఆధార్ తప్పనిసరి. ఎన్ఆర్ఐలు అయితే పాస్‌పోర్ట్ చూపాల్సి ఉంటుంది. యాత్రికులు ఒరిజినల్ ఫొటో గుర్తింపుకార్డుతో స్వయంగా హాజరుకావాలి.
– కొత్తగా పెళ్లయిన జంటలకు నిర్ణీత కోటా ప్రకారం వివాహ కార్డు, లగ్న పత్రిక, ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు సమర్పిస్తే కల్యాణోత్సవం టికెట్ల కేటాయింపు జరుగుతుంది. వివాహం జరిగి 7 రోజులు మించకుండా ఉండాలి. ముందుగా వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన టికెట్లు కేటాయిస్తారు.
– భక్తులు పై మార్గదర్శకాలను గమనించవలసిందిగా కోరడమైనది.
అంగప్రదక్షిణం టోకెన్ల జారీ ఏప్రిల్ 2కు వాయిదా
పరిపాలన కారణాల వల్ల అంగప్రదక్షిణం టోకెన్ల జారీని మార్చి 31వ తేదీ నుండి ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి ఈ టోకెన్లు జారీ చేస్తారు. తిరుమల పీఏసీ- 1లోని రెండు కౌంటర్లలో ప్రతిరోజూ 750 టోకెన్లు జారీ చేయడం జరుగుతుంది.
శుక్రవారాల్లో అభిషేకం కారణంగా అంగ ప్రదక్షిణ టోకెన్లు పూర్తిగా రద్దు చేయడమైనది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరడమైనది.
ఏప్రిల్ 8వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం టోకెన్లు
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్ నెల ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను ఏప్రిల్ 8వ తేదీన ఉదయం 11 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సాఫ్ట్‌వేర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల ఏప్రిల్ 1వ తేదీకి బదులుగా ఏప్రిల్ 8వ తేదీకి దర్శన టోకెన్లను వాయిదా వేశారు.
రోజుకు వెయ్యి టోకెన్ల చొప్పున జారీ చేస్తారు. ఏప్రిల్ 9వ తేదీ నుండి నిర్దేశించిన స్లాట్‌లో వీరిని దర్శనానికి అనుమతిస్తారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రెండేళ్ల తరువాత వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాన్ని టిటిడి పునరుద్ధరించింది.
కాగా, వీరిని ప్రతిరోజూ ఉదయం 10 గంటల స్లాట్‌లో దివ్యాంగుల క్యూలైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. శుక్రవారం నాడు మాత్రం మధ్యాహ్నం 3 గంటల స్లాట్ కేటాయించారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.
angapradakshinam in tirumala 2022, angapradakshinam experience, angapradakshinam in tirumala timings, how to book angapradakshinam in tirumala, how to do angapradakshinam, ttd online, angapradakshinam benefits, Cro office, lucky dip
Comments
Post a Comment