కార్తీక పురాణం -13వ అధ్యాయము | కన్యాదాన ఫలము
ఓ జనక చక్రవర్తీ! కార్తీకమాసములో యింకను విధిగా చేయవలసిన ధర్మములు చాలాయున్నవి. వాటిని వివరించెదను. సావధానుడవై అలకి౦పుము.కార్తీకమాసములో నదీస్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒక వేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షణ తా౦బూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనము చేసిన యెడల యెంతటి మహాపాపములు చేసియున్ననూ, అ పాపములన్నియు పోవును. ఎన్ని నూతులూ, తటాకములూ త్రవ్వించిననూ పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన౦దువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంత కన్న ముఖ్యమైనది కన్యాదానము. కార్తీకమాసమందు భక్తి శ్రద్దలతో కన్యాదానము చేసిన యెడల తాను తరించుటయే గాక తన పితృదేవతలను కూడ తరింపజేసినవాడగును. ఇందులకొక యితిహాసం గలదు. చెప్పెదను శ్రద్దగా అలకి౦పుము.
సువీర చరిత్రము
ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన "సువీరు"డను ఒక రాజుండెను. అతనికి రూపవతియను భార్యకలదు. ఒక సారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినవాడయి, భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీ తీరమందోక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికను కనెను. అ బిడ్డను అతి గారాబముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన అ బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికి శుక్ల పక్ష చంద్రునివలె దినదినాభివృద్ధి నొందుచు, అతిగారబముతో పెరుగుచుండెను, ఆమె చూచు వారలకు కనులపండువుగా, ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచినకొలదీ, బాలికకు నిండు యౌవనదశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడా బాలికనుగాంచి ఆమె అందచందములకు పరవశుడై అ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకా రాజు "ఓ ముని పుత్రా! ప్రస్తుతము నేను కడు బీదస్థితిలో నున్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన యెడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతు" నని చెప్పగా తన చేతిలో రాగి పైసాయైననూ లేకపోవుటచే బాలిక పైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోరతపమాచరించి, కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాది౦చెను. రాజు అ పాత్రను పుచ్చుకొని, సంతోషించి, తన కుమార్తెను ముని కుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులనిద్దరినీ అత్తవారింటికి పంపెను.
అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను. సువీరుడు ముని కుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్చగా ఖర్చుపెట్టుచూ భార్యతో సుఖముగా వుండెను. అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆరాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సురాగానే మరుల యెవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో యెదురు చూచుచుండెను.
ఒకానొక సాధుపుంగవుడు తపతీనదీ తీరమునుండి నర్మదానదీ తీరమునకు స్నానార్ధమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని "ఓయీ! నీవెవ్వడవు? నీ ముఖ వర్చస్సుచూడ రాజవంశమునందు జన్మించిన వానివలె నున్నావు. నీవీ యరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి?" అని ప్రశ్నించగా, సువీరుడు "మహానుభావా! నేను వంగదేశమును నేలుచుండెడిది సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువులాక్రమించుటచే భార్యాసమేతముగా నీ యడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదియునూ లేదు. పుత్రశోకముకంటె గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్యా వియోగము కంటే గొప్పసంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్ఠుడనియినందున యీ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను. నాకు యిద్దరు కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునకిచ్చి, వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితోనే యింత వరకు కాలక్షేపము చేయుచున్నాను" అని చెప్పగా, "ఓ రాజా! నీవు యెంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మము లాలోచి౦పక కన్యనమ్ముకొంటివి. కన్యావిక్రయము మహాపాతకములలో నొకటి, కన్యను విక్రయించిన వారు 'అసిపత్రవన' మను నరక మనుభవి౦తురు. ఆ ద్రవ్యములతో దేవముని, పితృదేవతా ప్రిత్యర్ధము యే వ్రతము చేసినను వారు నశి౦తురు. అదియునుగాక కన్యావిక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్రసంతతి కలుగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చికొని పెండ్లాడిన వారు చేయు గృహస్థధర్మములు వ్యర్ధమగుటయేగాక అతడు మహా నరకమనుభవి౦చును. కన్యావిక్రయము జేసినా వారికీ యెట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణి౦చియే యున్నారు. కావున, రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తికొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు, ధర్మబుద్ధి గల వానికి కన్యాదానము చేయుము. అటుల చేసిన యెడల గంగాస్నాన మొనరించిన ఫలము, అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటయేగాక, మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలిగిపోవును" అని రాజునకు హితోపదేశము చేయగా అందుకా రాజు చిరునవ్వు నవ్వి "ఓ మునివర్యా! దేహసుఖము కంటె దానధర్మముల వలన వచ్చిన ఫలము యెక్కువా? తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోను సిరి సంపదలతోను సుఖముగా వుండక, చనిపోయిన తర్వాత వచ్చెడి యేదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడువమా౦టారా? ధనము, బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణి౦పగలరు కానీ ముక్కు మూసుకొని, నోరు మూసుకొని, బక్క చిక్కి శల్యమైయున్న వారిని లోకము గుర్తిస్తుందా? గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు. కాన, నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనమెవరిత్తురో వారికే యిచ్చి పెండ్లి చేయుదును కాని, కన్యాదానము మాత్రము చేయను" అని నిక్కచిగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను.
మరి కొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొనిపోయి, యమలోకములో అసిపత్రవనమను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శ్రుతకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతిచెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యావిక్రయము వలన ఆ శ్రుతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి.
అంతటా శ్రుతకీర్తి "నేనెరిగున్నంత వరకును ఇతరులకు ఉపకారమును చేసి దానధర్మాదులు, యజ్ఞయాగాదులొనరించి యున్నాను. నాకీ దుర్గతి యేల కలిగె?"నని మనమునందుకొని నిండుకొలువు దీరియున్న యమధర్మరాజు కడకేగి, నమస్కరించి "ప్రభూ! నీవు సర్వజ్ఞుడవు, ధర్మముర్తివి, బుద్దిశాలివి. ప్రాణకోటినంతను సమ౦గా జూచుచుందువు. నేనెన్నడూ ఏ పాపమూ చేసియుండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోడ్కొని వచ్చుటకు కారణమేమి? సెలవిండు" అని ప్రాధేయపడెను. అంత యమధర్మరాజు శ్రుతకీర్తిని గాంచి "శ్రుతకీర్తి! నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీ వెటువంటి దురాచారములూ చేసియుండలేదు. అయిననేమి? నీ వంశియుడగు సువీరుడు తన జ్యేష్టపుత్రికను ధనమునకాశించి అమ్ముకొనెను. కన్య నమ్ముకొనే వారి పూర్వీకులు యిటు మూడు తరములవారు అటు మూడు తరములవారున్ను వారెంతటి పుణ్యపురుషులైనను నరకమనుభావించుటయేగాక, నిచజన్మలెత్తవలసియుండును. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగుదునుగాన, నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరియొక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీతీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా యాశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి, అచటకు పోయి ఆ కన్యను వేదపండితుడును శీలవంతుడునగు ఒక విప్రునకు కార్తీకమాసమున సాల౦కృతముగా కన్యాదానము చేయించుము. అటుల చేసిన యెడల నీవు, నీ పూర్వికులు, సువీరుడు, మీ పితృగణములు కూడా స్వర్గలోకమున కెగుదురు. కార్తీకమాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను, లేక విధివిధానముగా ఆబోతునకు వివాహమొనర్చినను కన్యాదాన ఫలమబ్భును. కనుక, నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినటుల చేసితివేని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు, పోయిరమ్ము" అని పలికెను.
శ్రుతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణకుటిరములో నివసించుచున్న సువీరుని భార్యను, కుమార్తెను చూచి, సంతోషపడి, ఆమెతో యావత్తు విషయములు వివరించి, కార్తీకమాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహము చేసెను. అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాపవిముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలసికొనెను.
కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను, పుణ్యము కలుగును. కార్తీకమాసమున కన్యాదానము చేయవలయునని దీక్షభూని ఆచరించినవాడు. విష్ణుసాన్నిధ్యము పొందును. శక్తి కలిగియుండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును.
ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి త్రయోదశాధ్యాయము - పదమూడో రోజు పారాయణము సమాప్తము.
Credits: Sai Garu
click Here : Karthika Puranam Day 14
ఫోటో పై క్లిక్ చేసి ఆలయ విశేషాలు తెలుసుకోండి :
Karthika Puranam, Karhika Puranam information , Karthika puranam Day 13, Karthika puranam telugu pdf file, Karthika pruanam importance day 13,
Tags
Karthika Puranam