అసోం (ఇదివరకటి పేరు అస్సాం) ఈశాన్య భారతదేశము లోని ఒక రాష్ట్రం. దీని రాజధాని దిస్పూర్. హిమాయల పర్వత సానువుల్లో ఉన్న ప్రాంతము చూట్టూ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర మరియు మేఘాలయ మొదలైన ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. ఆంగ్ల అక్షరము T ఆకారములో ఉండే ఈ రాష్ట్రము భౌగోళికముగా మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు. ఉత్తరాన బ్రహ్మపుత్ర నదీలోయ, మధ్యన కర్బి మరియు చాచర్ కొండలు మరియు దక్షిణాన బరక్ లోయ. అసోం రాష్ట్రములో మార్చి నుండి సెప్టెంబరు వరకు భారీ వర్షాలు కురుస్తాయి. వేసవి నెలల్లో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా అన్ని కాలాల్లోనూ మితముగా ఉంటాయి. బిహు పండుగ అస్సాంలో ఎక్కువ మంది జరుపుకొనే పండుగ. ఇది సంవత్సరంలో మూడు సార్లు వస్తుంది. మాఘ్ (జనవరి), బోహాగ్ (ఏప్రిల్), కతి (అక్టోబరు). దుర్గాపూజ కూడా అస్సాంలో బాగా పెద్దయెత్తున జరుపుకొనే పండుగ. అస్సాంలో స్థిరపడిన లక్షలాది బెంగాలీయుల ప్రభావం కూడా ఈ పండుగ ప్రాచుర్యానికి కొంత కారణం కావచ్చును. భిన్నజాతులు, సంస్కృతుల సమ్మేళనం కారణంగా అస్సాం జానపద సంగీతంలో చాలా వైవిధ్యం కానవస్తుంది. దీనికి ఆధునిక సంగీతంలోని బాణీలు జోడించడం వల్ల మరింత సుసంపన్నమైనది. రుద్ర బారువా, భూపేన్ హజారికా, ఖాగెన్ మహంత - వీరు ప్రసిద్ధులైన సంగీతకారులలో కొందరు.
అస్సాం ప్రసిద్ధ దేవాలయాలు
గౌహతి - కామాఖ్యాదేవి ఆలయం
గౌహతి - అశ్వక్లాంత్ స్వామి ఆలయం
గౌహతి - నవగ్రహ ధామ్
గౌహతి - పాండునాధ ఆలయం
గౌహతి - వశిష్ఠమహర్షి ఆశ్రమం
గౌహతి - మనసాదేవి ఆలయం
గౌహతి - శుక్రేశ్వరాలయం
గౌహతి - ఉమానంద స్వామి వారి దేవాలయం
హోజోలో - హయగ్రీవ మాధవస్వామి ఆలయం
శ్రీ కాంచన కాంతీ దేవి ఆలయం
సాడియా - తమ్రేశ్వరీ దేవి ఆలయం
తేజ్ పూర్ - శ్రీ కృష్ణదేవాలయము
సూర్యపహాడ్ - సూర్యదేవాలయం
శివసాగర్ - శివడాల్ స్వామి దేవాలయం
టిన్ సుకియా - త్రిలింగ మందిరం