Drop Down Menus

మాఘ పురాణం 10వ అధ్యాయం | Maghapuranam 10th Day Story in Telugu

మాఘపురాణం -10వ అధ్యాయము :

మృగశృంగుని వివాహము : 

దిలీప మహీజునకు వశిష్ఠువారు ఇట్లు చెప్పసాగిరి –
పువ్వు వికసించగానే వాసన వేయును. అది ఒకరు నేర్పవలసిన అవసరము లేదు. అది ప్రకృతినైజము. ఆవిధముగానే మృగశృంగుడు బాల్యదశ నుండియే హరినామ స్మరణయందాసక్తి గలవాడయ్యెను. అతనికి ఐదు సంవత్సరములు నిండిన తరువాత గురుకులములో చదువ వేసిరి. అచట సకల శాస్త్రములు అతిశ్రద్ధగా నేర్చుకొనుచు, అధ్యాపకుల మన్ననల నొందుచు పాండిత్యము సంపాదించెను. విద్యలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల యానతిపై దేశాటన చేసి యనేక పుణ్యనదులలో స్నానమాచరించి మాఘమాస పలము సంపాదించియుండెను.

కుమారుడు దేశాటన పూర్తిచేసి వచ్చిన తరువాత అతని తల్లిదండ్రులు కన్యను చూచి వివాహం చేయుటకు నిశ్చయించినారు. మృగశృంగుడు తానూ వరించిన సుశీలను మాత్రమె వివాహం చేసుకొనెదనని తన మనో నిశ్చయమును తల్లిదండ్రులకు తెలుపగా కుమారుని ఇష్టప్రకారంగా ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు అతివైభవంగా వివాహం చేసిరి.

సుశీల స్నేహితురాండ్రగు మిగిలిన ఇద్దరూ మృగశృంగుని చూచి “ఆర్యా! మా స్నేహితురాలగు సుశీలను పెండ్లి చేసుకొనినట్లే మా ఇద్దరినీ కూడా యీ శుభలగ్నమున పరిణయమాడుము” అని పలికిరి. మృగశృంగుడు ఆశ్చర్యపడి అసంభవం. అది ఎట్లు జరుగును?” అని ప్రశ్నించగా – “మా సుశీలను పెండ్లాడినట్లే మమ్ము కూడా పెండ్లాడుమని ఆడబడుచులు పట్టుబట్టినారు.

మరి పురుషునకు ఒక్క భార్యయేకదా! ఇద్దరు భార్యలా?” అని మృగశృంగుడు ప్రశ్నించగా –
ఇద్దరు ముగ్గురు యువతులను పురుషుడు వివాహము చేసుకొనుటకు శాస్త్రములు అంగీకరించుచున్నవి కదా! దశరధునకు ముగ్గురు భార్యలు, శ్రీకృష్ణునకు ఎనమండుగురు భార్యలు, పరమేశ్వరునకు గంగా, గౌరీ ఇద్దరు గడ! వారికి లేని అభ్యంతరములు నీకు కలవా అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టిరి. మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు.
వివాహపు వేడుకలను చూడ వచ్చిన అనేకమంది మునీశ్వరులు కూడా మృగశృంగా “అభ్యంతరము తెలుపవలదు. ఆ యిరువురి కన్యల యభీష్టము నెరవేర్చుము. వారు దుఃఖించిన నీకు జయము కలుగదు. అయిననూ ఇటువంటి ఘటనలు మున్ను అనేకములు జరిగియున్నవి” అని పలికిరి. పెద్దలందరి అభిమతము ప్రకారము మృగశృంగుడు ఆయిరువురు కన్యలను కూడా వివాహము చేసుకున్నాడు.

ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతము దిలీపునకు వివరింపగా “మహర్షీ! వివాహములు ఎన్ని విధములు? వాటి వివరములు తెలియజేసి నన్ను సంత్రుప్తుని చేయుడు” అని ప్రార్థించగా వశిష్ఠుల వారు మరల ఇట్లు చెప్పసాగిరి. “రాజా! వివాహములెన్ని విధములో వాటి వివరములు చెప్పెదను. సావదానుడై ఆలకింపుము”


1. బ్రాహ్మణ కన్యను బాగుగా శృంగారించి వరుని పిలిపించి చేయు వివాహమునకు “బ్రాహ్మము” అని పేరు.
2. దైవము: యజ్ఞము చేయు వానికి యజ్ఞము చేయుటకు వధువును ఇచ్చి చేయు పెండ్లికి “దైవము” అని పేరు.
3. ఆర్షము: పెండ్లికుమారుని నుండి రెండు గోవులను పుచ్చుకొని అతనికి పెండ్లి కూతురునిచ్చి పెండ్లి చేయు దానిని “ఆర్షము” అని అందురు.
4. ప్రాజాపత్యము: ధర్మము కోసం దంపతులు కట్టుబడియుండుడని దీవించి చేయు వివాహమునకు ‘ప్రాజాపత్యము’ అని పేరు.
5. అసురము: డబ్బు పుచ్చుకొని కన్యను యిచ్చి వివాహం చేయడానికి ‘అసుర’ అని పేరు.
6. గాధర్వము: ఒకరినొకరు ప్రేమించుకొని వారంతట వారు చేసుకొను వివాహమును ‘గాంధర్వ’ వివాహమని పేరు.
7. రాక్షసము: వరుడు కన్యను బలాత్కారం చేసి వివాహమాడు దానిని ‘రాక్షస’ వివాహమని పేరు.
8. పైశాచిక: మోసగించి అనగా మాయమాటలచే నమ్మించి పెండ్లి చేసుకోను దానిని “పైశాచిక’ మని పేరు.
ఈ ఎనిమిది రకములూ వివాహ సంబంధమైన పేర్లు. గాన వాటి ధర్మములు తెలియపర్చెదను ఆలకింపుడు.


గృహస్థాశ్రమ లక్షణములు : 

మంచి నడవడికతో ఇహమూ, పరమూ సాధించవలయునన్న యీ గృహస్థాశ్రమ మొక్కటియే సరియైన మార్గము.
భార్యయు, భర్తయు అనుకూలంగా నడచుకోనుత, ఉన్నంతలో తృప్తిచెందుట, దైవభక్తితో నడచుకొనుట అతిథి సత్కారములాచారించుట, మొదలగు సద్గుణములతో నడచుకొనే వాడే సరియైన గృహస్తుడనబడును. నోములు నోచుట, వ్రతములు చేయుట, పర్వదినములలో ఉపవాసములుండి కార్తికమాసమందునా, మాఘమాస మందునా నదీస్నానం చేసి, కడు నిష్ఠతో శివకేశవులను స్మరించుట మొదలగు కార్యములాచరించుట వారికి మంచి తేజస్సు కలుగును.\
ప్రాతః కాలమున నిద్రనుంచి లేచినప్పుడు భగవంతుని స్మరించుకొని లేచి, కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నిష్ఠతో భగవంతుని పూజించవలయును. కార్తిక మాసమందు, మాఘ మాసమందు, వైశాఖ మాసమందు తన శక్తి కొలదీ దానధర్మములు చేసినచో గొప్ప ఫలం కలుగును. గాన ప్రతి మనుజుడూ ఇహ సుఖములకే కాక పరలోకమును గురించి కూడా ఆలోచించవలయును.


పతివ్రతా లక్షణములు :

పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తమనేక ఘనకార్యములు చేసిన కాని మంచి ఫలము పొందలేక పోవుచున్నాడు. అటులనే ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలెను. తన భర్త యొక్క మంచి గుణములనే స్వీకరించవలయును గాని, అందాన్ని ఆకారాన్ని చూచి మోసపోకూడదు. అటులనే పురుషులునూ స్త్రీయొక్క అందమునే చూడక, శీలము, గుణమును లెక్కించి ప్రేమతో ఆదరించవలెను. ఆవిధముగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యానురాగముతో కాపురము చేసిన యెడల ఆ సంసారము ఎంతో బాగుండును. ఉత్తమ స్త్రీ తన భర్తను ఏవిధంగా ప్రేమతో సేవిన్చునో ఆ విధంగానే అత్తమాలల సేవ, అతితిసేవలయందు కూడా తగు భక్తిశ్రద్ధలతో చేసినయెడల అట్టి స్త్రీకి సద్గతి కలుగును.
భార్య తన భర్త ఆలోచనయందు మంత్రివలె సలహాలివ్వవలయును. పనిపాటల యందు సేవకురాలి వలె నడుచుకొనవలయును. భోజనం వద్దిన్చునప్పుడు తల్లి తన కుమారునకు ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టులో ఆవిధంగా భర్తకు భోజనం వడ్డించవలెను. శయన మందిరమున వేశ్యవలె భర్తకు ఆనందం కలుగజేయవలయును. రూపంలో లక్ష్మిని బోలియుండవలెను. ఓర్పు వహించుటలో భూదేవిని బోలియుండవలెను. ఈవిధంగా ఏ స్త్రీ నడచుకొనునో ఆమెయే ఉత్తమ స్త్రీ అనబడును.

స్త్రీ బహిష్టు అయిన నాలుగు దినములు ఏ పనిని చేయరాదు. అతిగా మాటలాడ కూడదు. ఎవరినీ ముట్టుకొన రాదు. అ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకొనవలెను. నాలుగవ రోజున సూర్యోదయము కాకుండా తలంటి నీళ్ళు పోసుకొని శుభ్రమైన ఉడుపులు ధరించి భర్త పాదములకు నమస్కరించి సూర్య భగవానునకు నమస్కరించి తర్వాత తమ ఇష్ట దేవతలను పూజించవలయును. ఎటువంటి సమయమునందైననూ భర్త భుజించకుండా తాను భుజించకూడదు.
ఇటువంటి లక్షణములు కలిగివున్న ఆ ముగ్గురు కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందంతో కాలం గడుపుచుండెను. గృహస్థాశ్రమమును ఆదరించుచుండెను.


మృకండుని జననము :

ఉత్తమ లక్షణములు గల స్త్రీలను పెండ్లియాడితిగదా యని మృగశృంగుడు మిగుల ఆనందించెను. ఆ ముగ్గురు పడతులతోను సంసారము చేయుచుండెను. అటుల కొంతకాలం జరిగినది. సుశీల యను భార్య గర్భం ధరించి ఒక శుభలగ్నమున కుమారుని కనెను. తన కన్న తన కుమారుడు అన్ని విద్యలయందు గొప్ప ప్రవీణుడు కావలయునని ఆశ కలవాడై జాతకర్మలు జరిపించి కుమారునికి “మృకండు”డని నామకరణం చేశారు. మృకండుడు దినదిన ప్రవర్థమానుడై తల్లిదండ్రుల యెడ, బంధుజనుల యెడ, పెద్దలయెడ, భయభక్తులు గలిగి పెరుగుచుండెను. ఐదేళ్ళు నిండినవి. మృగశృంగుడు మృకండునకు ఉపనయనం చేసి విద్యనభ్యసించుటకై గురుకులమునకు పంపించినాడు. గురుకులంలో గురువు చెప్పిన సకల శాస్త్రములు నేర్చుకొనుచు సకల లక్షణయుతుడై గురువుయొక్క మన్ననలు పొందుచు, యుక్త వయస్సు వచ్చువరకు చదివి సకల శాస్త్రములయందు ప్రావీణ్యతను సంపాదించెను. మృకండుడు విద్యనూ పూర్తి చేసుకొని తల్లిదండ్రుల కడకు వచ్చెను. మరికొంత కాలమునకు ‘మరుద్వతి’యను కన్యతో వివాహం చేసిరి. ఆనాటినుండీ మృకండుడు గృహస్థాశ్రమము స్వీకరించెను.

మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలకు కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పిరి. పెద్దవారలయిన తరువాత వివాహములు చేసెను. తన కుటుంబమంతయును మాఘమాసంలో స్నానములు, జపములు, దానధర్మములు మరింత నిష్ఠతో జరుపవలసినదిగా ప్రోత్సహించెడివాడు. తామార్జించుకున్న మాఘమాస ఫల ప్రభావంచే సంసారమునండు ఏ ఇబ్బందియు లేకుండా వుండుటే గాక మృగశృంగునకు మనుమలు కూడా కలిగినందున మరింత యానందించి తన వంశ వృక్షం శాఖోపశాఖలగుచున్నది గదాయని సంతోషించుచు తనకింక ఏ ఆశలూ లేనందున భగవస్సాన్నిధ్యంనకు బోవలయునని సంకల్పించి, తపస్సు చేసుకొనుటకు అడవికి వెళ్ళి తన తపోబలముతో శ్రీ మహావిష్ణువును ప్రసన్నుని చేసికొని, నారాయణుని కృపకు పాత్రుడై వైకుంఠమునకేగెను. “విన్నావు కదా భూపాలా! మృగ శృంగుడు తాను చేసుకున్న మాఘమాస ఫలము వలన తనకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుటయే గాక బొందితో శ్రీమన్నారాయణుని వెంట వైకుంఠానికి వెళ్ళినాడు. ఇక అతని జ్యేష్ట కుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను ఆలకింపుము” అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునకు ఇట్లు వివరించినారు.
మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటినుండి జ్యేష్టపుత్రుడగు మృకండుడే సంసార భారమంతయు మోసి, గృహమునందు ఏ అశాంతియు లేకుండా చూచుచుండెను. ఆయనకొక విచారం పీడించుచుండెను. అదెట్టిదనగా తాను వివాహమాడి చాలాకాలం గడిచిననూ సంతానం కలుగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను. అతడొకనాడు ఈవిధముగా తలపోసెను – “కాశీ మహాపుణ్యక్షేత్రము. సాంబశివునకు ప్రత్యక్ష నిలయము. అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయే గాక మనస్సునందు కోరికలు నెరవేరును. అనేకమంది కాశీ విశ్వనాథుని దర్శనము చేసుకొని వారి యభీష్టములను పొందగలిగిరి. గాన నేను నా కుటుంబ సమేతముగా వెళ్ళుదును.” అని మనసున నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరెను.

మార్గమధ్యమున అనేక కౄరమృగముల బారినుండి క్రిమికీటకాల ప్రమాదమునుండి అతికష్టము మీద తప్పించుకొని కుటుంబ సహితముగా కాశీ క్షేత్రము వెళ్ళాడు. కాశీ పట్టణమునానుకొని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతముగా ప్రవహించుచున్నది. మృకండుడు పరివార సహితముగా ప్రసిద్ధి చెందినా మణికర్ణికా ఘట్టమున కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకొని విశ్వనాథుని మందిరమునకు బయలుదేరి వెళ్ళెను. ఆలయంలోనికి రాగానే మృకండునకు ఎక్కడలేని ఆనందం కలిగెను. తన జన్మ తరించెనని తానూ కైలాసమందున్నట్లు తలంచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించెను.

ఈవిధంగా కుటుంబ సమేతముగా మృకండుడు కాశీవిశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణం చేసి దాని కెదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్టించెను. ఆవిధంగా ఒక సంవత్సరమునకు విశ్వేశ్వరుని సన్నిధానమందు గడపనెంచెను. ఒక దినమున మృకండుని మువ్వురు తల్లులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడచిరి. మృకండుడు చాలా కాలము దుఃఖించెను. విధిని ఎవ్వరూ తప్పించలేరు గదా! అయినా ఈశ్వరుని ధ్యానించుచు ప్రాణములను విడచిరి. చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకండుడు యధావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ ఋణమును తీర్చుకున్నాడు. మృకండునకు ఎంతకాలమునకునూ సంతానం కలుగనందున కాశీక్షేత్రమునకు వచ్చినాడు గదా! సంతానం కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేసినాడు. అనేక దానధర్మములు చేసినాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైరి. మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరుని అనేక విధముల స్తుతించగా పరమేశ్వరుడిట్లు పలికెను.

“మహామునీ! మీ భక్తికి ఎంతయో సంతసించినారము. మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కళంక భక్తికి మెచ్చి మీ కోర్కెలను దీర్చగా వచ్చినారము. గాన మీ యభీష్టము నెరింగింపుడు” అని పలికెను. అంత మృకండుడు నమస్కరించి “మహాదేవా! తల్లీ అన్నపూర్ణా! ఇదె మా నమస్కృతులు. లోకరక్షకా! మీ దయవలన నాకు సలక్షణవతి, సౌందర్య సుకుమారవతియగు పత్ని లభించినందువలన నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సంసార సుఖం అనుభవించుచున్నాను. కానే ఎంతకాలమైననూ మాకు సంతానం కలుగనందున క్రుంగి కృశించుచున్నాము. సంతానం లేని వారికి ఉత్తమ గతులు లేవు గదా! కావున మాకు పుత్రసంతానం ప్రసాదించ వేడికొనుచున్నాను” అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించాడు.

మృకండుని దీనాపములాలకించి త్రినేత్రుడిట్లు పలికెను. “మునిసత్తమా! నీ మనోభీష్టము నెరవేరగలదు. కాని ఒక్క నియమమున్నది. బ్రతికి యున్నంతవరకు వైధవ్యముతో వుండు పుత్రిక కావలయునా” లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలయునా”” అని ప్రశ్నించిరి. మృకండునకు ఆశ్చర్యము కలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చెను. కొంత తడవాగి హే శశిధరా! నన్ను పరీక్షింప నెంచితివా? నాకు జ్ఞానోదయ మయినది మొదలు నేటి వరకు మీ ధ్యానమునే సలుపుచు, సేవించుచున్న నాకు ఏమి చెప్పవలయునో తోచకున్నది. అయినను కలకాలము వైధవ్యముతో కృంగి కృశించే పుత్రికకన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమునే ప్రసాదింపుడు” అని నుడివెను.


“అటులనే యగుగాక” యని త్రిశూలధారి వరమిచ్చి పార్వతీ సమేతంగా అంతర్ధానమయ్యెను. పరమేశ్వరానుగ్రాహమున ఒక శుభముహూర్త కాలమున పుత్రుని గనెను. మృకండునకు పుత్రసంతానము కలిగెనని అనేకమంది ఋషిసత్తములు బాలుని చూడవచ్చిరి. వ్యాసమహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ జేసి, మార్కండేయుడని నామకరణం చేసి వెడలెను. ఓ దిలీప మహారాజా! పరమ పూజ్యుడును భాగవతోత్తముడును, అగు మృకండుడు పరమేశ్వరుని మెప్పించి, వారి దయకు పాత్రుడయి సుపుత్రుని బడసెను.


మాఘ పురాణం 11వ అధ్యాయం కొరకు  ఇక్కడ క్లిక్ చేయండి.

Click Here : Magha puranam Day 11
Magha puranam Day 11Key Words : Magha Puranam , Magha purana parayana, Magha puranam PDF Download, Magha puranam in telugu.
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.