మద్యానికి బానిసలైన వారిని మద్యం మాన్పించే దేవుడు పాండురంగడు - Secret About Untakallu Panduranga Swamy Temple

మద్యం మాన్పించే పాండురంగడు : ఉంతకళ్ళు

అయ్యప్పమాల ,హనుమంతుడి మాల, బెజవాడ కనకదుర్గమ్మమాల, శ్రీశైల మల్లన్న మాల, తిరుపతి గోవింద మాల .. వీటి గురించి వినే ఉంటారు. 

ఉంతకల్లు పాండురంగడి మాల గురించి విన్నారా? 

'ఆ స్వామి ప్రత్యేకత ఏమిటి' అనేగా మీ సందేహం. 

ఆయన 'మద్యం మాన్పించే దైవ'మని స్థానికుల నమ్మకం!

శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన కవి గా, ‘వికటకవి’ గా ఖ్యాతికెక్కిన తెనాలి రామకృషుడు పాండురంగ భక్తుడు. ఈయన పాండురంగ మహాత్మ్యము గురించి కావ్యాలను వ్రాసాడు. పాండురంగ మహాత్మ్యము చదివితే, దుర్వ్యస నాలకు గురైన వ్యక్తిని పాండురంగడు ఏవిధంగా తప్పించాడో మనకు బోధపడుతుంది. 

అలాగే మద్యం అలవాటుకు బానిసలైన వారిని ఆ బారి నుండి తప్పించే దైవం మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కలదు. అనంతపురం జిల్లా, రాయదుర్గంలోని బొమ్మనహాళ్ సమీపంలో గల ఉంతకల్లు గ్రామంలో కొలువైన ఆ పాండురంగ స్వామే.. మద్యాన్ని మాన్పించే దేవుడు.

ఏకాదశి తిధి వచ్చిందంటే ఆ గుడి భక్తులతో నిండిపోతుంది. ఇసకేస్తే రాలనంత జనం. అందులో పాండురంగడి 'మాల' వేసుకునే వాళ్లే ఎక్కువ. మాలధారణ చేసినవాళ్లంతా ఆ స్వామికి దక్షాలు పెడుతూ, ప్రదక్షిణలు చేస్తూ రోజంతా అక్కడే గడిపేస్తారు.

ఆ మరుసటి రోజు నుంచి వాళ్లను చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతారు. ఎందుకిలా అని | ఎవరైనా, అడిగితే.....'అంతా పాండురంగడి మహత్యం' అంటారు మాల వేసినవాళ్లూ, వాళ్లను ప్రత్యక్షంగా చూసినవాళ్లూ.

ఉంతకళ్లు... ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లో, అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ లో ఉంది. ఈ ఊళ్లో దాదాపు అందరూ పాండురంగ స్వామి భక్తులే. 

వాళ్లు తరచూ మహరాష్ట్రలోని పండరీపురంలో కొలువైన పాండురంగడ్డి దర్శించుకుని వచ్చేవారు. కొన్నాళ్ల తరువాత... 'మన గ్రామంలోనే ఒక పాండురంగడి ఆలయాన్ని ఎందుకు నిర్మించకూడదు' అనుకున్నారు వాళ్లంతా. 

చందాలు వేసుకుని ఆలయ నిర్మాణం ప్రారంభించారు. 2005లో రుక్మిణీ సమేత పాండురంగస్వామి ఆలయాన్ని ప్రారంభించారు. దీని నిర్వహణ గ్రామస్థులే చూసుకునేవారు.

తాగుడు మానేయాల్సిందే !

సాధారణ భక్తులతో పాటు మద్యానికి బానిసలైన వాళ్లు రావడం ఈ ఆలయ ప్రత్యేకత. ఆ వ్యసనాన్ని వదిలించుకోవడానికి పాండురంగస్వామి మాలధారణ చేస్తారు. వాళ్లంతా. 'మా గ్రామం చుట్టుపక్కల ఉన్న ఊళ్లలో తాగుడు ఒక పెద్ద వ్యసనం. మద్యానికి బానిసలై కుటుంబాలని పట్టించుకోకుండా ప్రాణాల మీదకి తెచ్చుకున్నవాళ్లు ఉన్నారు. వాళ్లతో తాగుడు మాన్పించాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అలాంటి వాళ్లను స్థానికుల్లో కొందరు ఈస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. పాండురంగడి మాల వేయించారు. ఈ స్వామి మీద ఉన్న భక్తి, భయంతో వాళ్లలో మార్పు వచ్చింది. ఆ తరువాత తాగుడు జోలికి వెళ్లలేదు. అలాంటి సంఘటనల గురించి చుట్టుపక్కల ఊళ్లలోను తెలిసింది. మద్యానికి బానిసలైన పాళ్లు నెమ్మది నెమ్మదిగా ఆలయానికి వచ్చి, పాండురంగడి మాల వేయడం మొదలు పెట్టారు. వాళ్లు మారిపోయారు. వాళ్ల కోరికలు నెరవేరాయి. అప్పటినుంచి భక్తుల్లో నమ్మకమూ విశ్వాసమూ పెరిగి భక్తుల సంఖ్య పెరిగింది అంటారు అక్కడి ఊరు పెద్దలు.

మూడు రాత్రుల నిద్ర

మామూలుగా ఈ ఆలయానికి భక్తులు రోజు వచ్చి దర్శనం చేసుకుంటారు. అయితే మాలధారణ నిర్వహించేది మాత్రం నెలలో రెండు రోజులే. అది ఏకాదశి రోజునే (ప్రతినెలా వచ్చే ఏకాదశుల్లో) భారీగా నిర్వహిస్తారు. ఆ రోజుల్లో ఉంతకల్లులో ఉత్సవ వాతావరణం నెలకొంటుంది. మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. వాళ్లకోసం గ్రామస్థులే తమ శక్తిమేరకు అతిధి మర్యాదలు చేయడం విశేషం.

ఉంతకల్లుకు ఏకాదశి ముందు రోజు నుంచే భక్తుల రాక మొదలవుతుంది. ప్రతిసారి మాలధారణకు వచ్చే వారు సుమారు 500 మంది దాక ఉంటారు. ఇక ఏకాదశి నాడు వచ్చే సాదారణ భక్తుల సంఖ్య మూడు వేల వరకు ఉంటుంది.

ఏకాదశి నాడు వచ్చే మద్యం బానిసలకు ముందు రోజు సాయంత్రం నుంచే టోకెన్లు పంపిణి చేస్తారు. టోకెన్ తీసుకున్న వాళ్లు రూ. 100 నిర్వాహకులకు చెల్లించాలి. మాలలను అర్ధరాత్రి నుంచి స్వామి సన్నిదిలోనే ఉంచి భజనలు, పూజలు చేస్తారు. మాల వేసుకోవాలనుకున్న వాళ్లంతా తెళ్లవారుజామునే స్నానం చేసి, ఆలయ ప్రాంగణంలో టోకెన్ల ప్రకారం వరుసలో నిలుచుంటారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు మాలధారణ చేస్తారు.

ఆ రోజున వచ్చే భక్తులందరికీ గ్రామస్థులే ఉచిత భోజనం, వసతి కల్పిస్తారు. గ్రామస్థులంతా కలసి వంటావార్పు చేస్తారు. ప్రత్యేకించి గదులు లేకున్నా పాఠశాల, పంచాయతీ భవనం, గ్రామస్థుల ఇళ్లు, ఆరుబయటా భక్తులు ఉంటారు.

మాలధారణ చేసినవారు... తరువాత వచ్చే మూడు ఏకాదశి రాత్రులు ఉంతకల్లులో నిద్ర చేయాలి. ఇతర దేవుళ్లలా పాండురంగ మాలకు నిర్ణీత రోజులంటూ ఏమి ఉండవు. దరించాక ఎప్పటికి అలాగే ఉంచుకోవచ్చు. లేదంటే మూడు ఏకాదశులు నిద్రచేశాక తీసేయవచ్చు.

Famous Posts:

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ


హనుమ నామస్మరణం సర్వపాప నివారణం


స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత

Untakallu Panduranga Swamy Temple, Unthakal Village, Panduranga Swamy Temple, Machilipatnam, Sri Rukmini Panduranga Swamy Temple, Unthakal Panduranga temple, ఉంతకల్లు పాండురంగ స్వామి

Comments