Drop Down Menus

యజ్ఞోపవీతము అంటే ఏమిటి? ఎలా ధరించాలి? పఠించవలసిన మంత్రము - Yagnopaveetha Dharana in Telugu

యజ్ఞోపవీతం  మాహాత్మ్యం

యజ్ఞోపవీత ధారణము చేయునపుడు పఠించవలసిన మంత్రము..

"యజ్ఞోపవీతం పరమం పవిత్రం

ప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్‌|

ఆయుష్య మగ్ర్యం ప్రతిముఞ్చ శుభ్రం

యజ్ఞోపవీతం బలమస్తు తేజః ||"

ఇది యజ్ఞోపవీత ధారణము చేయునపుడు పఠించవలసిన మంత్రము.

'యజ్ఞోపవీత' శబ్దములో "యజ్ఞ ఉపవీతం" అను రెండు శబ్దములు ఉన్నవి. వీని అర్థము తెలిసికొనిన గాని, యజ్ఞోపవీత తత్త్వము అవగతము కాదు. 'యజ్ఞ' మనగా పూజ అని, సంగతికరణ మని అర్థము. 'సంగతికరణ' మనగా, రెండుగా విభక్తమై యున్నవానిని ఒకటిగా కలుపుట. 'ఉపవీయతే వామస్కంధః అనేనేతి ఉపవీతమ్‌" అనగా, దీనిచే ఎడమ భుజము కప్ప బడుచున్నది గాన, 'ఉపవీత' మనబడును. 'యజ్ఞార్థం ఉపవీతం యజ్ఞోపవీతమ్‌"- యజ్ఞానుష్ఠానము కొఱకైన ఉపవీతము గాన, 'యజ్ఞోపవీత' మనబడను, యజ్ఞము నందు వేద మంత్రములతో దేవతలకు హవిస్సుల నొసగుదురు.

'యజ్ఞోపవీత్యేవాధీయీత" అనగా యజ్ఞోపవీతము ధరించియే, వేదాధ్యయనము చేయవలయునని శ్రుతి, ఆదేశించుచున్నది. దీనివలన వేదమునకు, యజ్ఞోపవీతమునకు సన్నిహిత సంబంధము ఉన్నట్లు తెలియుచున్నది. ఇంతేగాక, యజ్ఞోపవీతము పరమ పవిత్రమైనది. ప్రజాపతితో గూడా సహజముగా ఆవిర్భవించినది. ఆయుష్ప్రదము, శ్రేష్ఠము (అన్నిటికంటె పూర్వము ఉన్నది) నిర్మలము, బలసామర్థ్యప్రదము.

ఇట్టి యజ్ఞోపవీతము ఉపనయనాధికారము గలవారికే విహితమై యున్నది. భారతీయ మహర్షులు యజ్ఞోపవీత స్వరూప స్వభావములను పలు రీతులుగా చెప్పియున్నారు. ఆపస్తంబ సూత్రానుసారము యజ్ఞోపవీతము ధరించవలయును. కాని, మనమందరము, నేడు అశ్వలాయన సూత్రము ననుసరించి యజ్ఞసూత్రమును ధరించుచున్నాము. ఇది నవతంత్వాత్మకము. ఈ తొమ్మిది తంతువులకు తొమ్మిదిమంది అధిష్ఠాన దైవతములు గలరు 1) ప్రణవము, 2) అగ్ని, 3) భగుడు 4) సోముడు, 5) పితృదేవతలు, 6) ప్రజాపతి, 7) అష్టవసువులు, 8) ధర్మదేవత, 9) విశ్వేదేవతలు. ఈ విధముగా యజ్ఞోపవీత ధారణ చేయుటవలన, ఈ శరీరము సర్వదేవతానిలయమై వైదిక యజ్ఞ యాగాద్యనుష్ఠానమునకు యోగ్యమగును.

ఈ యజ్ఞోపవీతమునందలి దారము 96 బెత్తల పొడవు కలిగి యుండును. అందువలననే, దీనికి వైదిక సంప్రదాయము నందు 'షణ్ణవతి' యను పేరు కలదు. సూర్యుడు మేరుపర్వతము చుట్టూ 96 సారులు తిరుగుటను ఈ 96 బెత్తలు సూచించునని ప్రాచీనుల అభిప్రాయము. యజ్ఞోపవీతము మూడు వరుసలు కలిగియుండుట గాని, గృహస్థు మూడు యజ్ఞోపవీతములు ధరించుటగాని, సత్త్వ, రజస్తమోగుభములను, భూర్భువస్సువ ర్లోకములను, ఋగ్యజుస్సామములను. గార్హపత్య దక్షిణ, ఆహవనీయాగ్నులను సూచించునని శాస్త్రవేత్తల యభిప్రాయము, ఉపనయన సంస్కారమువలన పురుషునకు యజ్ఞోపవీతధారణ యోగ్యత కలుగును. అటులనే, స్త్రీకి వివాహ సంస్కారము వలన, మంగళసూత్ర ధారణ యోగ్యత సిద్ధించును. ఈ మంగళ సూత్రము గూడ, నవతంత్వాత్మకము. మంగళసూత్రము యజ్ఞోపవీతస్థానీయమని గ్రహించవలయును. మంగళసూత్రములేని స్త్రీ, శుభకార్య నిర్వహణయోగ్యత కోల్పోవునట్లుగానే, యజ్ఞోపవీతములేని పురుషుడు, వేదోక్తమైన యజ్ఞాది కర్మానుష్ఠానము చేయునట్టి అధికారము కోల్పోయినవాడగును.

ప్రాతః కాలమునుండి సాయంకాలం వరకు పంచ మహాయజ్ఞములను నిర్వహించవలసియున్నది. 'ఉపవీతము' యజ్ఞార్థము గనుక, మానవుడు నిరంతరము యజ్ఞోపవీతమును ధరించియే ఉండవలయును.

ఇంతవఱకు అధి యజ్ఞపరముగా, అధిదైవతపరముగా యజ్ఞోపవీత తత్త్వము వివరింపబడినది. అధ్యాత్మపరముగా ఋషులు భావనను తెలిసికొనినగాని, యజ్ఞోపవీత స్వరూప స్వభావములు పూర్తిగా తెలియవు.

ఈ శరీరము 'శ్రీపుర'మని, 'బ్రహ్మగిరి'యని, 'శ్రీచక్ర'మని భావన చేయుట ఉపాసనాసంప్రదాయము. శ్రీచక్రము నవచక్రాత్మకము. నవావరణాత్మకము. నవ చక్రాత్మికయై వెలుగొందు చున్న శ్రీలలితా త్రిపురసుందరి, సాక్షాత్తు , కుండలినీ శక్తియే. ఆ పరాభట్టారికను సూచించునట్టి యజ్ఞోపవీతము నవసూత్రాత్మకమై కన్పట్టుచున్నది. ఇంతేకాదు, ప్రాణాయామాది సాధనచే మేల్కొనిన కుండలినీ శక్తి మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూర, అనాహత, విశుద్ధ, అజ్ఞాచ క్రముల వఱకు అధిరోహించును. అచటి నుండి బిందు, నాద, కళాది నవకముద్వారా అధిరోహించి " శివేన సహమోదతే" యనినట్లు సచ్చిదానందరూపిణియగును. ఆ బింద్వాది నవకమునకు ప్రతీకయే యజ్ఞ సూత్రము.

'యజ్ఞ' మనగా 'సంగతికరణ' మని మొదట తెలిసికొంటిమి. శివశక్తి సామరస్యమే, మిథునీభావమే, సంగతికరణము. ఎడమభుజముమీదుగా యజ్ఞోపవీతమును ధరించినవాడు వామార్ధాంగదేహధారియగు అర్థనారీశ్వర స్వరూపుడై యని తెలియవలనయును. ఏలన, యజ్ఞోపవీతము, కుండలినీ శక్తి రూపిణియగు 'ఉమ' యే గదా ! యజ్ఞోపవీతమునకు మూడు ముడులు ఉండును. మేరుదండమునందుగూడ బ్రహ్మ, విష్ణు, రుద్ర గ్రంథులని గ్రంథి త్రయము ఉండును. అగ్ని, సూర్య సోమ మండలములని మేరుదండమునందు మూడు మండలములు కలవని యోగిజనానుభవము. యజ్ఞోపవీతమునందలి మూడు ముడులు, ఆ గ్రంథి త్రయమునకు, ఆ మండల త్రయమునకు ప్రతీకలని భావించవలయును.

పరమేశ్వరునికి 'ఉపవీతీ' అని నామము కలదు. 'ఉపవీతినే' యనుచు నమకము పేర్కొనుచున్నది. దీనివలన పరమేశ్వరునకు గూడా, ఉపవీతము కలదని తెలియుచున్నది. పూజాసమయమున, పరమేశ్వరీ పరమేశ్వరులకు యజ్ఞోపవీత సమర్పణము చేయుట సంప్రదాయసిద్ధముగా వచ్చుచున్నది. అయిన, వారికిగల యజ్ఞోపవీత తత్త్వమును తెలిసికొనవలయును. "భుజంగరూపా కుండలినీశక్తి రుపవీతమ్‌" - సర్పాకారములోనున్న కుండలినీశక్తియే 'ఉపవీత మని అర్థము. కుండలినీశక్తి మూలాధారమున సార్ధత్రివలయమై 31/2 చుట్టలుచుట్టుకొని నిద్రించుచున్న 'భుజంగరూపిణి' యగు పరాశక్తియే. పరమేశ్వరునకు 'కుండలీ' యను నామము ప్రసిద్ధము. ఈశ్వరుడు నాగయజ్ఞోపవీతధారి. విష్ణువు శేషశాయి. శక్తి, శక్తి మంతులకభేదము గాన, ఇద్దరును కుండలీ స్వరూపులే. చేతనుడైన పరమేశ్వరుడు చిచ్ఛిక్తినివీడి, యెన్నడు ఉండడు. కనుక, ఆయన, సదా అపార శక్తిమంతుడై యుండును. సర్వజగద్రక్షకుడైన పరమేశ్వరుడే, యజ్ఞోపవీతధారియై యున్నప్పుడు, ఉపనీతులు సదా ఉపవీతులమై యుండవలయుననుటలో అసంగతమైన విషయ మేమున్నది !

పైవిచారణ వలన తేలిన విషయమ మేమనిన, నేడు ధరింప బడుచున్న యజ్ఞోపవీతము, కుండలినీశక్తికి ప్రతీకమని భావన చేయవలయును. కుండలినీశక్తియగు పరమేశ్వరి షణ్ణవతి కళా స్వరూపిణి. ఆ సత్యమును సూచించుట కొరకే మన పెద్దలు యజ్ఞోపవీతమునందలి సూత్రముయొక్క పొడవు 96 బెత్తలు ఉండవలయునని నిర్ణయించిరి. మూడు సూత్రములు, మూడు యజ్ఞోపవీతములు ధరించుట యను సంప్రదాయము గూడా కుండలినీశక్తిని, ఋగ్యజుస్సామరూపిణి యగు పరదేవతను, త్రిపాద్‌ గాయత్రిని సూచించును.

యోగసాధనాభ్యాసము చేత ఆ కుండలినీ శక్తి మేల్కొని, మూలాధారాది సహస్రారాంతము వ్యాపించును. కుండలినీశక్తి యనగా, చిదగ్నియే. ఆమె తేజ స్తంతురూపములో వ్యాపించును. అట్టి కుండలినీశక్తిని జ్ఞాపకము చేయుచు యజ్ఞోపవీతము గూడా సుత్రరూపమున, నిర్మింపబడుచున్ది. మూడు సూత్రములుగల యజ్ఞోపవీతమును ధరించుటయందు గల తాత్పర్యము, తేజో రూపిణి యగు ఆ పరాశక్తి సుషుమ్నా, ఇడా, పింగళానాడుల ద్వారా పయనించునని సూచించుటకొఱకే అని భావించవలయును. మన శరీరము స్థూల, సూక్ష్మ, కారణ శరీరాత్మకముగా నుండును. ఈ మూడు శరీరములే త్రిపురములు. ఆ త్రిపురములయందు విరాజిల్లుచున్న ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తి స్వరూపిణి యగు లలితా త్రిపురసుందరియే, కుండలినీశక్తి. కనుకనే, యజ్ఞోపవీతము సూత్రత్రయాత్మకమై యుండును.

ఇట్టి మహత్త్వసంపన్నమైన యజ్ఞోపవీతమును ఎన్నడు వీడరాదు. సదా, ధరించియే బహిర్యాగ, అంతర్యాగములను చేయవలయును. తద్ద్వారా శివశక్తి సామరస్యానుభూతిని పొందవలయును. ఈ విధముగా అద్వయ బ్రహ్మానందమును అను భవించుటకై తీవ్రసాధన చేసి, జీవితమును సార్ధక మొనర్చుకొనుట మన యందఱి కర్తవ్యము. ఈ విధనుగా యజ్ఞోపవీతము అధికారి తారతమ్యముతిబట్టి అధియజ్ఞపరముగా, అధిదైవపరముగా, ఆధ్యాత్మపరముగా రమణీయార్థములను బోధించునట్టి పరావాక్‌ స్వరూపిణియగు వేదమాతయే యనియు, కుండలినీ శక్తి శ్రీమహాత్రిసురసుందరియే అనియు, భావించునట్లుగా ఆ పరాశక్తి ధీప్రచోదనము చేయుగాక !

యజ్ఞోపవీతును విసర్జించునపుడు క్రింది శ్లోకమును పఠించుట సంప్రదాయము :

శ్లో || పవిత్రవన్త మతిజీర్ణవన్తం వేదాన్తవేద్యం

పరబ్రహ్మ రూపమ్‌

ఆయుష్య మగ్ర్యం ప్రతిముఞ్చ శుభ్రం

యజ్ఞోపవీతం విసృజేత్తు తేజః ||

అని చెప్పుచు భుజములపైనుండి ప్రాత యజ్ఞోపవీతమును విసర్జించవలెను.

Tags: జంధ్యము, యజ్ఞోపవీతము, Jhandyamu, Yagnopaveetham, 

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments