అన్నదాన మహాత్మ్యం పరమాచార్య స్వామివారు చెప్పిన కథ ఇది. This is the story told by Annadana Mahatmyam Paramacharya Swami

అన్నదాన మహాత్మ్యం

పరమాచార్య స్వామివారు చెప్పిన కథ ఇది. కర్ణుడు ఎంతో సంపదను దానంగా ఇచ్చినవాడు. వజ్రాలు, వైఢూర్యాలు, బంగారం, డబ్బు, పాత్రలు - ఏదడిగితే అది అడిగినవారికి లేదనకుండా ఇచ్చాడు.

కురుక్షేత్ర యుద్ధంలో ప్రాణాలు వదిలిన తరువాత, స్వర్గానికి చేరుకున్నాడు. తనకి చాలా ఆకలిగా ఉంది. చుట్టూ ఉన్న పాత్రల్లో వజ్రాలు, వైఢూర్యాలు మరియు బంగారం వున్నాయి. కానీ ఒక్క పిడికెడు వండిన అన్నం కానీ గుక్కెడు నీరు కానీ లేదు. “ఎందుకు ఇలా?” అని అక్కడున్నవారిని అడిగాడు.

“నువ్వు దానశూరుడివి, అందులో సందేహం లేదు. ఎంతో బంగారం, వెండి దానం చేశావు. కానీ నువ్వు ఎప్పుడూ అన్నదానం చెయ్యలేదు. అక్కడ నువ్వు ఇచ్చినదే ఇక్కడ నీకు దొరుకుతుంది” అని చెప్పారు.

కర్ణుడు దాన్ని అవమానంగా భావించాడు. ఈ ధర్మాసూక్ష్మం తను గ్రహించలేకపోయాడు. తరువాత తనకి ఆకలి ఎక్కువకాసాగింది.

అక్కడున్నవారు అతనితో, “ఒకసారి కొందరు ఆకలితో నీవద్దకు వచ్చారు. నీ వేలు చూపించి, ధూర్యోధనుని ఇంటికి వెళ్ళమని చెప్పావు. ‘అన్నం అక్కడ దొరుకుతుంది’ అని చూపిన వెలును నోటిలో ఉంచుకుని చప్పరించు. నీ ఆకలి పోతుంది” అన్నారు.

కర్ణుడు వారు చెప్పినట్టే చేశాడు. వెంటనే అతనికి షడ్రసోపేతమైన భోజనం చేసిన తృప్తి కలిగింది.

ఒక భక్తుడు స్వామివారితో తను చాలా విపరీతమైన కడుపునెప్పితో బాధపడుతున్నాను అని చెప్పాడు.

ప్రతిరోజూ వైశ్వదేవం చేసి, ఆ అన్నాన్ని ఒక అతిథికి సమర్పించినా తరువాత తను తినాల్సిందిగా ఆజ్ఞాపించారు స్వామివారు. స్వామివారి ఆదేశాన్ని అనుసరించి ఆ బాధ నుండి నివారణ పొందాడు ఆ భక్తుడు.

“నీకు కుదిరితే, ఏదైనా క్షేత్రంలో ఒక వంద మందికో లేదా వెయ్యిమందికో అన్నదానం చెయ్యి” అని ఆ భక్తునికి చెప్పారు.

ఆ భక్తుడు గురువాయూర్ వెళ్ళి, అక్కడి గురువాయురప్పన్ దేవాలయంలో అన్నదానం చేశాడు.

తిరువళ్ళువర్ చెబుతారు, “నోయ్ నాది, నోయ్ ముదల్ నాది, అథు థణిక్కుం వాయ్ నాది వాయ్ ప్పచ్చయల్” అని. “అనారోగ్యాన్ని నిర్ధారించి, మూలకారణాన్ని కనుక్కోవాలి. దానికి తగిన పరిహారం తెలుసుకుని, నైపుణ్యంతో అమలుపరచాలి”.

అన్నిటికీ మూలకారణం పాపం. మన పరమాచార్య స్వామివారు మూలాన్ని కనుగొని పూర్తిగా దాన్ని నిర్మూలించే పరిహార చికిత్సా శిరోమణి.

--- శ్రీమఠం బాలు, కాంచీపురం. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

Tags: పరమాచార్య స్వామి, paramacharya, paramacharya story, paramacharya kadhalu, annadanam, kanchi, annadanam mahatyam

Comments