Drop Down Menus

మాఘ పురాణం 26వ అధ్యాయం | Maghapuranam 26th Day Story in Telugu

మాఘపురాణం - 26వ అధ్యాయము :

సుధర్ముడు తండ్రిని చేరుట :

పాపమా బాలుని జాతకము ఎటువంటిదో గాని తన తల్లి అడవిలో పులిచే చంపబడింది. ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయినది. ఇక ఆ పిల్లవానిని దీన రక్షకుడగు శ్రీహరియే రక్షించాలి. ఆ రాత్రి బాలుడు ఏడ్చీ ఏడ్చీ అలసి నిద్రపోయాడు. అక్కడొక తులసిమొక్క వున్నది. నిద్రలో బాలుని చెయ్యి తులసిచెట్టు పై బడినందున ఆ రాత్రి అతనికే అపాయమూ కలుగలేదు. పైగా దైవభక్తి కలిగెను. ఉదయమే లేచునప్పటికి అడవిలో ఏకాంతముగా నున్నందున భయపడి బిగ్గరగా ఏడ్చినాడు.

ఆ రోదనకు పక్షులు, జంతువులు, మృగములు కూడా రోదనచేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారము తెచ్చి ఇచ్చుచుండెడివి. ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదినాభి వృద్ధి చెందుతూ ఏ తులసి చెట్టు వద్ద పడి వుండెనో ఆ మొక్కకు ప్రతినిత్యము పూజలు చేయుచు కాలము గడుపుచుండెను.

అలా పెరుగుతూ పన్నెండేండ్లు ప్రాయం గల వాడయ్యెను. ప్రతి దినము తులసి పూజ భగవన్నామ స్మరణ చేస్తూ “నన్ను కాపాడుము తండ్రీ అనాధరక్షకా” అని ప్రార్థించుచు, ఒక్కొక్కప్పుడు విరక్తుడై “ఛీ ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా? నేను బ్రతికెందుకు?” అని దుఃఖించుచుండగా, ఆకాశవాణి “ ఓ బాలచంద్రా! నీవట్లు విచారింపకుము.

ఈ సమీపముననే ఒక కోనేరు వున్నది. మాఘమాసం ప్రవేశించినది. అందుచే నీవా సరస్సులో స్నానం చేసినయెడల శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమగును” అని పలికిన మాటలు ఆకాశమునుండి వినిపించినవి. వెంటనే ఆరాజకుమారుడు సరోవరమునకు వెళ్ళి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని స్తుతించెను.

ఈ బాలుని నిష్కళంక భక్తికి, నిర్మల హృదయానికి లక్ష్మీ నారాయణులు ప్రత్యక్షమై అతనిని దీవించి “బాలకా నీకేమి కావలయునో కోరుకొనుము” అని యనగా “ప్రభూ! నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. నాకు ఆలనా పాలనా చేయువారెవరైననూ లేరు. పుట్టినది మొదలు కష్టములే తప్ప సుఖమన్నది ఎరుగను. ఈ వనచరములే నన్ను రక్షించి పోషించుచున్నది. గాన మీ సన్నిధానమునకు నన్ను తీసుకొని పొండు. మరేమియు అక్కరలేదు” అని ప్రార్థించెను.

“ఓయీ రాజనందనా! నీవు ఇంకను భూలోకమునందు ధర్మంగా పరిపాలన చేయవలసిన యవసరమున్నది. నీ తండ్రియగు సులక్షణుడు వృద్ధుడై నీగురించి నీ కన్నతల్లిని గురించి బెంగతో ఉన్నాడు. గాన నీవు నీ తండ్రి వద్దకు పోయిరమ్ము” అని చెప్పి ఆ కొలను సమీపమున తపస్సు చేసుకొనుచున్న ఒక మునీశ్వరునితోడు యిచ్చి సులక్షణుని వద్దకు పంపెను.

అప్పటికే సులక్షణుడు తన కడసారి భార్య గర్భావిటిగా వుండి ఎటుపోయెనో, పుట్టిన బిడ్డ ఏమాయెనో అని తన రాజ్యమంతయు వెదకించి తానును వెదకి వారి జాడ తెలియనందున విచారమనస్కుడై రాచకార్యములు చూడకుండెను. అటువంటి సమయములో మునివెంట కుమారుడు వెళ్ళెను.

రాజుతో ముని యా బాలుని జన్మవృత్తాంతం తెలియజేయుసరికి సులక్షణ మహారాజు అమితానందభరితుడై బాలుని కౌగలించుకొని మునీశ్వరునికి మర్యాదలు చేసి కుమారునికి సుధర్ముడని పేరు పెట్టి పట్టాభిషేకము చేసెను.

మాఘ పురాణం 27వ అధ్యాయం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

Click Here : Magha Puranam Day 27



Key Words : Magha Puranam , Magha purana parayana, Magha puranam PDF Download, Magha puranam in telugu.
ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON