కాంచీపురం జీవుడికి ముక్తినిచ్చే ఏడు నగరాల్లో ఒకటిి.. శైవం, శాక్తేయం, వైష్ణవమే కాక ఒకప్పుడు బౌద్ధం, జైన మతములకు కూడా ప్రసిద్ధిచెందిన నగరం. భారత దేశంలో ఎక్కడా కనిపించని అరుదైన క్షేత్రం కాంచీపురం. పంచభూత లింగ క్షేత్రాల్లో ఒకటైన శివ కంచి, తిరుపతి లాంటి మరో వైకుంఠ క్షేత్రమైన విష్ణుకంచి, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శక్తికంచి..
ఒకప్పుడు దాదాపు 400 పైచిలుకు ఆలయాలు కలిగిన మహా నగరం కాంచీపురం. భూమికి నాభీస్థానము ఈ నగరం. ఇక్కడ యే కొద్దిపాటి కర్మ చేసినా కోటిరెట్లు ఫలితాన్నిచే క్షేత్రం.. నది, తీర్థం, కొండ, మూడూ కలిగిన ఏకైక క్షేత్రమిది. ఇటువంటి క్షేత్రంలో గాలిలో కూడా దివ్యత్వముంటుంది..
విష్ణు కంచి, శివ కంచిలో హరిహరులను దర్శించుకొని శక్తి కంచిలోకి ప్రవేశించగానే కామాక్షీ అమ్మవారి ఆలయ వీధి, పెద్ద రాజగోపురం, పూల వ్యాపారులు, ఫొటోలూ వగైర అమ్మే చిన్న కొట్లతో నిండిన మాడ వీధులూ, గోపురం లోంచి అలా లోపలకు వెళ్ళగానే అతి విశాలమైన ప్రాంగణములోకి అడుగుపెడతాము, ఎదురుగా ఎడమ ప్రక్కకు ధగ ధగ మెరిపిసిపోతున్న ధ్వజస్తంభం, బలిహరణ మంటపం, అమ్మవారి వాహనమైన సింహము, అక్కడే ఆడుకుంటున్న కోతులు, వాటిని చూస్తూ అక్కడ సాష్టాంగ నమస్కారం చేసి, ముందుకు వెళ్తుండగా కుడి ప్రక్కకు మూక శంకరులు తపస్సు చేసిన మండపం (తరచుగా శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు మూక పంచశతి పారాయణ చేసే చోటు) ఎడమ ప్రక్కకు క్రొత్తగా కట్టిన విశ్రాంతి అరుగు, పూల మొక్కలు..
ఎదురుగా అమ్మవారికి నైవేద్యాలు వండే పాకశాల, అరుగు చూస్తూ కుడి ప్రక్కకు తిరగగా విశాలమైన ఆవరణ, ఎడమ ప్రక్కకు చేతులు, కాళ్ళు కడుక్కోవడానికి, త్రాగడానికీ నీటి సదుపాయం, దాని ప్రక్కన నిశ్చలంగా, ఏకాంతంలో కాశీ విశ్వేశ్వరుడు దర్శనమిస్తారు.. కుడి ప్రక్కకు అమ్మవారి దర్శనానికి క్యూ లైను చూస్తూ ముందుకు వెళ్తుంటే ఎడమ ప్రక్కకు బిల్వము మొదలైన వృక్షాలతో నిండిన “నందన వనం” కనిపిస్తుంది..అలా ముందుకి నడుస్తుంటే కుడి ప్రక్కకు ఒక సందు కనిపిస్తుంది (ఆ సందులో మూడు అంతస్తులలో శివకేశవులు కలిసి దర్శనమిస్తారు) ఎదురుగా ఒక చిన్న రాతి మండపం దానికి కుడివైపున “పంచ గంగా” తీర్థం బహుశోభాయమానంగా సంధ్యా సమయపు దీప కాంతుల్లో మెరుస్తూ 4 కోణాల్లో పైపులతో ఏర్పరచిన ఫౌంటెన్లలోంచి నీళ్ళు ఆకాశాన్ని అంటుతుంటే.. “వావ్” అనకుండా ఉండలేము.. అది దాటి ముందుకు వెళ్తే ఎడమ ప్రక్కకు నవరాత్రి మండపం కనిపిస్తుంది..అలా తీర్థం చుట్టూ ప్రదక్షిణ పూర్తవుతుంటే “దుర్గమ్మ” దర్శనమిస్తుంది.. ఆవిడకు వెనుకవైపు పూర్వం గజశాల ఉండేచోటు కొన్ని గదులు కనిపిస్తాయి.. అటునించి నేరుగా వెళ్తుంటే పెద్ద వేపచెట్టు దాని వెనకాల పెద్ద మండపం బహుశా అక్కడే అమ్మవారిని ఊరేగింపు చేయించి విశేష కార్యక్రమం నిర్వహిస్తారేమో అనిపిస్తుంది.. ఆ మండపానికి నలుదిక్కులా కొన్ని దేవతా రూపాలు వాటితో కథలు మనకు చెబుతున్నారా అనిపించేలాగా కనిపిస్తాయి. అది దాటగానే ఎడమ ప్రక్కకు “శ్రీకార్యం” కార్యాలయము అందులో పుణ్యాత్ములైన “శ్రీ చల్లా విశ్వనాథ శాస్త్రి” గారు కనిపిస్తారు, ఆ ప్రక్కనే బిల్వ వృక్షం, యాగశాల.. కుడివైపు పైకి చూస్తే అమ్మవారి బంగారు విమానము దర్శనమిస్తుంది.. ముందుకు వెళ్తుంటే ఎడమప్రక్కన రాజగోపురం మొదటి అంతస్తున.. కాల భైరవుడు, మహిషాసురమర్ధినీదేవి దర్శనంతో మొదటి ప్రాకారం పూర్తి చేసుకుంటాము..
భైరవుడి ఎదురుగా ఒక బావి కనిపిస్తుంది, ఆ బావి ప్రక్కగా అమ్మవారి రెండో ప్రాకారంలోకి ప్రవేశించడానికి లైనులోపలికి వెళ్ళేటప్పుడు ఎడమవైపు గోడ మీద అరచేతి ప్రమాణంలో "సింధూర గణపతి" దర్శనమిస్తాడు. లైనులోంచి లోపలకు వెళ్తుంటే గతంలో అయితే ఎదురుగా రాజశ్యామలా, బాలా, వారాహి చిత్రపటాలు ఉండేవి.. ఇప్పుడు అవేవి కనపడవు.. ఒక బుల్లి టీవీ దాంట్లో కుంభాభిషేక ఫొటోలు కనిపిస్తూంటాయి.. అలా ఒక గడప దాటగానే.. ఎడమ ప్రక్కకు “నాగరూప సుబ్రహ్మణ్యుడు” (కేవలం నాగు రూపం కాదు..సుబ్రహ్మణ్యుని మూర్తి కూడా ఉంటుంది) కనిపిస్తాడు.. ఎదురుగా పూర్వం అమ్మవారు దేవతలకోసం యుద్ధం చేసి "బంధకాసురుడిని" సంహరించి అక్కడే పాతిపెట్టి జయానికి ప్రతీకగా “జయస్తంభం” దానికి అటువైపు వర సిద్ధి గణపతి, జయస్తంభానికి ఎదురుగా మనకు ఎడమవైపు గడపలోంచి లోపలకు వెళ్తే ఎదురుగా "ప్రసన్న గణపతి" అయన పక్కనే “విఘ్నహరణ గణపతి” కనిపించగానే.. ప్రసన్నుడివై అమ్మవారి దర్శనంలో ఎటువంటి విఘ్నాలు రాకుండా చూడు స్వామి అని నమస్కరించుకొని లైనులో ఎడమ ప్రక్కకు తిరిగి నేరుగా వెళ్ళి మెట్లు ఎక్కగానే “దూర్వాసో మహాముని” దర్శనమిస్తారు, అక్కడ ఎడమ ప్రక్క సందులోకి వెళ్తే "ఇష్ట సిద్ధి గణపతి" కనిపిస్తారు, అటునుంచి అలా ముందుకు వెళ్తుంటే మనకు కుడి వైపు మహా లక్ష్మీ, మహా సరస్వతీ సమేత కామాక్షీ ఉత్సవమూర్తులు ఉండే మందిరం కనిపిస్తుంది, దాని ఎదురుగా అందరూ కూర్చోవడానికి విశాల ప్రదేశం.. అది దాటుకొని కుడి ప్రక్కకు తిరిగితే పూర్వం ఉత్సవ మూర్తులు, బ్రహ్మచే చేయబడ్డ బంగారు కామాక్షిని ఉంచిన మందిరం ఆ మందిరం లోపల నుంచీ మరో మందిరం కనిపిస్తుంది.. (అందులోనే గుడి మూసేటప్పుడు అమ్మవారి మరో బుల్లి ఉత్సవమూర్తిని పల్లకిలో అంతరాలయం చుట్టూ త్రిప్పుతూ తమిళంలో దుఃఖ నివారిణి కామాక్షీ స్తోత్రము, అభిరామి అంతాది పాడుతూ, హంస సింహాసనంపై కూర్చోబెట్టి, మంగళ నీరాజనం ఇచ్చి ఆరోజుకి అమ్మకు విశ్రాంతి ఇచ్చినట్టు చేస్తారు. అటు నుంచి మళ్ళీ కుడి ప్రక్కకు మెట్లు దిగి ఎడమప్రక్కకు తిరిగి ముందుకు వెళ్తే ఎడమ వైపు రాజశ్యామలా దేవి దర్శనమిస్తుంది.. కుడి ప్రక్కకు అన్నపూర్ణాదేవికి ప్రదక్షిణపూర్వకంగా వెళ్తుంటే ఎడమవైపు ఇద్దరు పత్నులతో ధర్మ శాస్తకు నమస్కరించి ఆ పక్కనే ఉన్న జగద్గురు ఆది శంకరుల వారిని దర్శించుకుంటాం, వారి మందిరం పైన గురు పరంపరకు ప్రతీకగా నారాయణుడు, బ్రహ్మ మొదలుకొని గోవింద భగవత్పాదుల వరకు మూర్తులు కనబడతాయి, ఆది శంకరులు అధిష్ఠించిన పీఠం క్రింది భాగాన 6 శిష్యులు నమస్కారం చేస్తూ కనిపిస్తారు..వీరు షణ్మతాలకు ప్రతీక. శంకరుల మందిరం ప్రక్కనే ఒక చిన్న అరుగు ఉంటుంది.. అక్కడ గోడలపై ఆది శంకరుల జీవితం శిలాఫలకాలపై చిత్రరూపంలో చూడవచ్చు. ఇక్కడితో రెండవ ప్రాకారం పూర్తవుతుంది.
అలా ప్రదక్షిణ చేస్తూ మళ్ళీ విఘ్న హరణ గణపతిని దాటుకుని ముందుకు వెళ్ళి కుడి ప్రక్కకు తిరిగితే ఎడమవైపుకు అమ్మవారికి ఎదురుగా మండపంపై మరొక బంగారు ద్వజస్తంభం, సింహము కనిపిస్తాయి.. కుడి ప్రక్కకు తిరిగితే ఎదురుగా జగన్మాత 3 ఆవరణల అవతల దీపకాంతులలో దివ్యంగా కనపడుతుంది..ఈ 3 ఆవరణల అంతరాలయమే గాయత్రీ మండపము. ఈ మండపం క్రింద మహాబిలము ఉంది దానిపై 24 గాయత్రి మంత్ర బీజాక్షరాలకు ప్రతీకగా 24 స్తంభాలతో మండపము, 4 వేదాలతో వేదిక, అకార ఉకార మకారాత్మకమైన ఓంకార పీఠాన్ని, విష్ణువు మోహిని అవతారంలో వచ్చిన సావిత్ర నామక కల్పం.. స్వాయంభువ మన్వంతరం.. కృత యుగం.. శ్రీముఖ నామ సంవత్సరం ఫాల్గుణ మాసం కృష్ణపక్ష పాడ్యమి గురువారం నాడు ఇంద్రాది దేవతలచే నిర్మించబడినది.
ఈ గయత్రీ మండపంలోకి ప్రవేశించాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి.. కామాక్షీ విలాసమనే గ్రంథానుసారం అందరికి ప్రవేశించే అర్హత లేదు. ఇంతటి మహిమాన్వితమైన గాయత్రీ మండపంలోకి ఆ గయత్రీ అమ్మవారిని నమస్కరిస్తూ ప్రవేశిస్తే మొదటి ఆవరణలో మనకు ఎడమవైపు శ్రీమహావిష్ణువు, సుందరలక్ష్మి, అర్ధనారీశ్వర మూర్తి దర్శనమిస్తారు వీళ్ళు అమ్మవారికి కుడివైపు ఉంటారు, ఎడమవైపు వారాహి, అరూప లక్ష్మి (ఈ అమ్మవారికే కుంకుమ పూసి తిరిగి ఆ కుంకుమనే పేశాదంగా తీసుకుంటారు అందరు), అంజనచ్చాయ కామాక్షీ (కాటుకవన్నె కామాక్షి) వారికి ఎదురుగా ఇద్దరు గణపతులు ఆ గణపతులకు ఎదురుగా చిన్న హోమ గుండం కనిపిస్తాయి అక్కడే సంకల్పాలు చేయిస్తుంటారు పూజారులు..వారాహి దేవి ప్రక్కనే సంతాన స్తంభంగా ప్రసిద్ధిపొందిన స్తంభం ఉంటుంది.. దాని చుట్టూ ప్రదక్షిణ చేసి రాగానే రెండవ గడపకు నేరుగా అమ్మవారి వాహనమైన సింహ మూర్తి గంభీరంగా కనిపిస్తుంది..ఆ ప్రక్కకు కూర్చొని గడప ఆవలి రెండవ ఆవరణలో ఆది శంకరులు ప్రతిష్ఠించిన శ్రీచక్రము దానిపై కమల పువ్వుల గుత్తులు.. అలా ముందుకు రెండవ గడప దాటి మూడవ ఆవరణలోకి చూస్తే ఇందాక చెప్పిన ఓంకార పీఠము దాన్ని అధిరోహించి కూర్చున్న అమ్మవారిని అలా చూస్తుంటే అబ్బా.. ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి అనే ఆనందంలో అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది..
అరచేయంత ఎర్రటి అంచు, పచ్చటి పసుపు రంగు పట్టు చీర, కుచ్చిళ్ళు బారుగా తీసి, ఆపైన మల్లెపూలు, మొదలైన తెల్లటి పూల దండలు అమ్మవారి సన్నని నడుమును కప్పివేస్తూ వడ్డాణము.. ఆపై ఎర్రటి గన్నేరు పూల దండల గుత్తులు, అసలే ఉన్నతమైన వక్షస్థలం, ఎర్ర పూల పైనుంచి మరొక సన్నని తెల్ల పూల దండ, బ్రహ్మ విష్ణు రుద్రులు బహుకరించిన బంగారు ఆభరణాలతో గొంతు ప్రకాశిస్తోంది..
అద్దాల్లాంటి చెక్కిళ్ళు కనబడనీయకుండా.. బుధవారం కనుక పూర్తిగా చందనము అలంకరించుకుని.. తాంబూలం తింటున్న ఎర్రటి పెదవులతో చిరుమందహాసం, మధ్య మధ్యలో మెరుపులాగా కనిపించే తెల్లటి పలువరుస, సన్నటి ముక్కుకి ముక్కెర, నాసాభరణములు మెరిసిపోతుంటే అదే చిరునవ్వేమో అని ఆశ్చర్యపోతాం, సమస్త బ్రహ్మాండాలను కరుణతో చూసే ఆ కళ్ళు, ఇంద్రధనస్సులాంటి కనుబొమలు వాటి మధ్య ఎర్రటి తిలకం, మూడవ కన్ను ఆపై చిన్ని ముంగురులు, తలపై ఎప్పుడూ చంద్రుడు ఒక్కడేనా నేను కూడా ఉంటానని సూర్యుడు కూడా చేరి కిరీటం పెట్టుకోనివ్వకుండా చేశాడు, మన్మథుడు రథచక్రాలుగా మార్చుకున్న తాటంకాలు, పెద్ద పెద్ద పూల మాలలు అమ్మవారి కబరీబంధం కనిపించకుండా భుజాలపైనుంచి కప్పేస్తూ చుట్టూ పూల మాలలు, 4 చేతుల్లో పాశం, అంకుశం, చెరుకు విల్లు, పూల బాణాలు వాటిపై చిన్ని చిలుక .. మొత్తంగా ఎర్రటి దీపాల కాంతుల్లో చందనపు రంగు కాస్త బంగారుమయంగా.. మా అమ్మ బంగారు తల్లిగా బహు శోభాయమానంగా కనిపిస్తుంటే., ఆనంద పారవశ్యంతో
"క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తననతా..
పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్ర వదనా.,
ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధాన కరతలైః,
పురస్తా దాస్తాం నః పురమథితు రాహో పురుషికా.."
అని.. అమ్మవారి రూపాన్ని కీర్తిస్తూ. అదే సమయంలో.
"త్వయా హృత్వా వామం వపురపరి తృప్తేన మనసా..
శరీరార్ధం శంభో రపర మపి శఙ్కే హృతమభూత్..
యదే తత్త్వద్రూపం సకల మరుణాభం త్రినయనం..
కుచాభ్యాం ఆనమ్రం కుటిల శశి చూడాలమకుటం."
అని శంకరుల వలె చమత్కరించి..
నీ దగ్గరా తల్లీ నా ఆటలు అనుకుంటుంటే పూజారి వచ్చి అమ్మవారికి హారతి ఇస్తున్నప్పుడు అమ్మ కళ్ళు త్రిప్పుతూ చూస్తున్నట్టు అనిపిస్తుంటే ఒక్కసారి నావైపు చూడుతల్లీ అని..
"దృశా ద్రాఘీయస్యా దరదళిత నీలోత్పల రుచా..
దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే..
అనేనాయం ధన్యో భవతి న చ తే హాని రియతా..
వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః.."
అంటూ.. నా దీనత్వాన్ని తెలియజేస్తూ.. ఒక్కసారి నావైపు చూడుతల్లీ అని మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తూ. ఇంకా నోటికి వచ్చిన నాలుగు శ్లోకాలు వల్లె వేస్తుంటే. ఇంతలో ప్రక్కనుంచి.. పూజారి లేపేస్తుంటే.. మళ్ళీ ఎప్పుడు చూస్తానో అమ్మా అంటూ అలా చూస్తూ ప్రక్కకు వెళ్ళగానే చేతిలో ఇంత కుంకుమా పూలూ పెట్టి పక్కనున్న గులాబి దండ నా మెడలో వేసి ఇక వెళ్ళిరా అని సైగ చేయగానే, మహాప్రసాదంగా భావించి వెంటనే కళ్ళకద్దుకొని,.. ఆ అమ్మనే తల్చుకుంటూ.. అమ్మా ఈ దీనుడిని కాపాడు తల్లీ అంటూ.. నమస్కరించి..వచ్చిన దారిలో కాకుండా వెనుక వైపు ధర్మ ద్వారం నుండి బయటకొచ్చి అన్నపూర్ణాదేవిని జ్ఞాన భిక్ష ప్రసాదించమని అడిగి. అక్కడే ధర్మ ద్వారానికి ద్వారపాలకులుగా ఉన్న స్కందుడు, శక్తి గణపతికి దణ్ణం పెడుతూ..(ఈ ధర్మ ద్వారమునుండి మాత్రమే ఇప్పుడు గాయత్రీ మండపంలోకి ప్రవేశముంది.. తూర్పువైపు అమ్మవారికి ఎదురుగా ద్వారంలోంచి ప్రవేశంలేదు.)
రెండవ ప్రాకారంలోంచి బయటకొచ్చాక మూక శంకరులు చేసిన మండపంలో కూర్చొని మూక పంచశతిలో వర్ణించిన శ్లోకాలు స్మరిస్తూ అమ్మని ధ్యానిస్తూంటే జీవుడి కథ కంచికి మనం ఇంటికి..
-Aasish Sharma
Hindu Temples Guide Related Postings :
> Kashi Temple information in Telugu
keywords : kanchipuram information in telugu, kamakshi amman temple details, kamakshi amman temple timings , kamakshi amman temple accommodation , kamakshi temple history , kanchipuram temple details, kanchipuram temple history in pdf, kanchipuram history telugu,
keywords : kanchipuram information in telugu, kamakshi amman temple details, kamakshi amman temple timings , kamakshi amman temple accommodation , kamakshi temple history , kanchipuram temple details, kanchipuram temple history in pdf, kanchipuram history telugu,
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Om kanchi Kamakshi deviye namaha
ReplyDelete