Drop Down Menus

కృష్ణుడికి ఇవంటే ఎందుకంత ఇష్టం | Interesting Facts About Lord Krishna | Hindu Temple Guide

కృష్ణుడికి ఇవంటే ఎందుకంత ఇష్టం!

కృష్ణభక్తిలో మునిగిన వారికి ఈ ప్రపంచమే కృష్ణమయంగా కనిపిస్తుంది. ఎటు చూసినా ఆ అల్లరి కృష్ణుడు దోబూచులాడుతూ కవ్విస్తాడు. మరి కృష్ణుడు అన్న మాట తలంపుకు రాగానే క‌నిపించే గుర్తుల సంగతో!

నెమలిపింఛం, వెన్నముద్ద, వేణువు, గోవులు... వీటిలో ఏ ఒక్కదాన్ని చూసినా కూడా కన్నయ్య గుర్తుకురాక మానడు. అంత‌గా కృష్ణుని స‌ఖ్య‌త‌ను దక్కించుకున్న వీటి ప్రత్యేకత ఏమిటో...

నెమలిపింఛం:

ప్రకృతిని చూసి తన పరవశాన్ని వ్యక్తం చేసే ఏకైక జంతువు నెమలి. మబ్బు తునక కనిపించగానే మురిసిపోయి పురివిప్పి ఆడే ధన్యజీవి. అందుకేనేమో ప్రకృతి కూడా బదులుగా, తనలోని సప్తవర్ణాలనూ నెమలి పింఛానికి అద్దింది. త‌న‌ని త‌నివితీరా చూసుకోమంటూ వేయి క‌న్నుల‌నిచ్చింది. మ‌రి ఆ ప్ర‌కృతికే పురుషుడైన కృష్ణునికి ఇష్ట‌మైన ఆభ‌ర‌ణం నెమ‌లి పింఛం కాక మ‌రేముంటుంది. చెదిరిపోని కిరీటంలా త‌న సిగలో అలంక‌రించుకునేందుకు పింఛాన్ని మించిన ఆహార్యం మ‌రేముంటుంది? నెమ‌లికి కాలం క‌లిసివ‌చ్చిన‌ప్పుడు పురివిప్పి ఆడ‌ట‌మే కాదు.... స‌మ‌యం త‌న‌ది కాదు అనుకున్న‌ప్పుడు రెక్క‌ల‌ను ముడుచుకుని ఏ కొమ్మ చాటునో ఒద్దిక‌గా ఉండ‌ట‌మూ తెలుసు. అంటే! నెమ‌లి పింఛం విన‌యాన్నీ, విజ‌యాన్నీ రెంటినీ సూచిస్తోంద‌న్న‌మాట‌. జీవితాన్న ప‌రిపూర్ణంగా ఆస్వాదించ‌మ‌నీ, ప‌రిప‌క్వంగా ప్ర‌వ‌ర్తించ‌మ‌నీ తెలియ‌చేస్తోంద‌న్న‌మాట‌. అందుకేనేమో... నెమ‌లి పింఛం ఇంట్లో ఉంటే దుష్ట‌శ‌క్తులు ద‌రిచేర‌వ‌ని కొంద‌రు న‌మ్ముతారు. మ‌రి ఆ పింఛాన్ని ధ‌రించిన క‌న్న‌య్యే మ‌న గుండెల్లో ఉంటే?

వేణువు:

వేణువు స‌ప్తస్వ‌రాల‌ను ప‌లికించ‌గ‌ల పురాత‌న‌మైన సంగీత ప‌రిక‌ర‌మే కాదు... నిరంత‌రం ఆ చిన్ని క‌న్న‌య్య పెద‌వుల‌ను ముద్దాడిన భాగ్య‌శాలి కూడా! నెమ‌లి త‌న ప‌ర‌వ‌శాన్ని ఆట ద్వారా వ్య‌క్తీక‌రిస్తే, వేణువు అదే ప‌ర‌వ‌శాన్ని త‌న పాట‌లో వినిపిస్తుంది. ఆధ్మాత్మిక‌ప‌రంగా ఆలోచిస్తే వేణువుకి ఉన్న ప్ర‌త్యేక‌త అంతా ఇంతా కాదు. వేణువు మ‌న వెన్నుని త‌ల‌పిస్తుంది. అందులోంచి క‌నుక ష‌ట్చ‌క్రాల‌ను క‌నుక మేల్కొల్ప‌గ‌లిగితే జీవ‌న‌నాదం వినిపిస్తుంద‌ని సూచిస్తుంది. నిరంతంరం వేణువు ఆ క‌న్న‌య్య చెంత‌నే ఉండ‌టం చూసి ఓసారి గోపిక‌ల‌కు కూడా అసూయ క‌లిగింద‌ట‌. వారంతా క‌న్న‌య్య ముర‌ళిని స‌మీపించి `నువ్వంటే ఆ గోపాలుడు ఎందుకంత విలువ‌నిస్తాడు?` అని అడిగార‌ట‌. దానికి వేణువు `మ‌రేమీ లేదు! నా లోప‌ల అంతా శూన్య‌మే! ఆ కార‌ణంగానే క‌న్న‌య్య న‌న్ను ఎలా కావాలంటే అలా మ‌లుచుకునే అవ‌కాశం ఇవ్వ‌గ‌లుగుతున్నాను. అందుకే క‌న్న‌య్య‌కు నేనంటే ఇష్టం!` అని చెప్పింద‌ట‌. మ‌న‌మూ అంతే! అరిష‌డ్వర్గాలు నిండిన మ‌న మ‌న‌సుని క‌నుక ఖాళీ చేసుకోగ‌లిగితే... మ‌నం చేయ‌గ‌లిగిన ప‌నిని చేసి, ఫ‌లితాన్ని ఆ కృష్ణునికి అర్పించ‌గ‌లిగితే... అంత‌కు మించిన క‌ర్మ‌యోగం మ‌రేముంటుంది?  గీత‌లో కృష్ణుడు చేసిన బోధ ఇదే క‌దా! మ‌రి వేణువుని చూస్తే భ‌గ‌వ‌ద్గీత గుర్తుకురాదా!

వెన్న‌ముద్ద‌:

కృష్ణుడి బాల‌లీల‌ల‌లో వెన్న దొంగ‌త‌నాన్ని మించిన మ‌ధుర‌మైన ఘట్టం మ‌రేముంటుంది. ఈనాట‌కీ కృష్ణ‌జ‌న్మాష్ట‌మి వేడుక‌ల‌లో ఉట్టి ప‌గుల‌కొట్టే సంప్ర‌దాయానికే అధిక ఆక‌ర్ష‌ణ‌. మ‌రి ఆ న‌వ‌నీత చోరుడు వెన్న‌నే ఎందుకు దొంగిలించిన‌ట్లో! గోకులంలోని త‌న తోటి బాలుర ఆక‌లినీ తీర్చేందుకు, గోపిక‌ల ఇంట వెన్న రూపంలో నైవేద్యాన్ని ఆర‌గించేందుకూ క‌న్న‌య్య వెన్న‌ని దొంగ‌లించేవాడ‌ని అంటాడు. నిజ‌మే! కానీ ఈ చేష్ట‌లో అంత‌కు మించిన బోధ‌లెన్నో క‌నిపిస్తాయి. వెన్న శుద్ధ‌రూపానికి ప్ర‌తీక‌. నీరులా క‌నిపించే పాల‌ని ప‌దే ప‌దే శ్ర‌మ‌కోర్చి చిలికితే బ‌య‌ట‌ప‌డే  అంతఃరూపం. ప్ర‌తి మ‌నిషీ అంతే! అహంకార‌మ‌నే రూపం క‌మ్ముకుని ప‌నికిరానివారిలా ఉంటారు. కానీ త‌మ అంత‌రాత్మ‌ను మ‌ధించిన రోజున అస‌లు స్థితిని ద‌ర్శించ‌గ‌లుగుతారు. అంతేకాదు! వెన్నను చేతిలో పెట్టుకోగానే ఇట్టే క‌రిగిపోతుంది. త‌న చెంత‌కు వ‌చ్చిన భ‌క్తుల‌ని చూసి, క‌న్న‌య్య మ‌న‌సు కూడా అలాగే క‌రిగిపోతుంది క‌దా!

గోవు:

క‌న్న‌య్య గోపాలుడు కాబ‌ట్టి ఆయ‌న చెంత గోవులు ఉండ‌టం స‌హ‌జ‌మే! కానీ ప్ర‌పంచంలో ఎక్క‌డా క‌నిపించ‌నంత ప్ర‌ముఖంగా భార‌తీయ సంస్కృతి, హైంద‌వ ధ‌ర్మాల‌లో గోమాత‌ ప్ర‌స్తావ‌న ఉంటుంది. అస‌లు గోత్రం అన్న మాటే గోవుల మంద నుంచి వ‌చ్చిందంటారు. భార‌తీయులు గోవుకి ఇంత‌గా ప్ర‌ముఖ్య‌త‌ని ఇవ్వ‌డానికి కార‌ణం లేక‌పోలేదు. అవి కేవ‌లం పాల‌కు, వ్య‌వ‌సాయానికి మాత్ర‌మే తోడ్ప‌డ‌టం లేదు... మ‌న మ‌న‌సుని ఎరిగి మ‌సులుకుంటూ వ‌చ్చాయి. హిందువులు గోవుల‌ను స్వ‌చ్ఛ‌మైన ఆత్మ‌లుగా భావిస్తారు. త‌మ క‌ష్ట‌సుఖాల‌కు స్పందించే జీవులుగా భావిస్తారు. య‌జ‌మాని బాధ‌లో ఉన్న‌ప్పుడు తాను కూడా క‌న్నీరు పెట్టే జీవి గోవు ఒక్క‌టే! అందుకేనేమో క‌న్న‌య్య‌కు గోవులంటే అంత ఇష్టం. అంత‌దాకా ఎందుకు! గోవులు వ‌ర్ష‌పు నీటిలో త‌డిస్తే చిరాకుప‌డిపోతాయ‌నే ఆయ‌న గోవ‌ర్ధ‌న‌గిరిని ఎత్తాడ‌ని న‌మ్మేవారూ లేక‌పోలేదు.

క‌న్న‌య్య చుట్టూ అల్లుకున్న ఇలాంటి ప్ర‌తి గుర్తు వెనుకా ఏదో ఒక కార‌ణం క‌నిపిస్తూనే ఉంటుంది. పొన్న‌చెట్టు, చిరుగ‌జ్జెలు, తుల‌సిమాల‌... ఇలా క‌న్న‌య్య‌తో పాటుగా ఉండే ప్ర‌తి రూపు వెనుకా ఏదో ఒక సూక్ష్మం గోచ‌రిస్తూనే ఉంటుంది. మ‌రి ప‌రిపూర్ణ మాన‌వుడైన గోపాలుని చుట్టూ అంతే ప‌రిపూర్ణ‌మైన వ‌స్తువులు ఉండ‌టంలో త‌ప్పేముంది?

Famous Posts:

సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?


కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?


మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి 


సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం 


మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.


భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?


మహాభారతం నుండి నేర్చుకోవాల్సిన 12 ముఖ్యమైన విషయాలు.


భారతీయులు ప్రతి ఒక్కరూ  తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు 

lord krishna wife, lord krishna quotes, lord krishna pictures, lord krishna stories, lord krishna age, lord krishna birth date, krishna story, krishnastami, krishna pooja.  కృష్ణ

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments