Drop Down Menus

పెళ్ళికాని మగవారికి అద్భుతమైన పరిష్కారం | Puja for Early Marriage/Removing Wedding Obstacles - Sri Subramanya Vratham

పెళ్ళికాని మగవారికి అద్భుతమైన పరిష్కారం

స్త్రీలకళ్యాణ ప్రాప్తికి రుక్మిణీ కళ్యాణం ఉన్నట్లే, మగవారికి శ్రీ సుబ్రహ్మణ్య కళ్యాణం చక్కని అద్భుతమైన పరిష్కారం.

వివాహ సమస్యలు ఉన్న మగవారు " శ్రీ సుబ్రహ్మణ్యుని కళ్యాణం " 41 రోజులు భక్తి, శ్రద్ధ, విశ్వాసములతో పారాయణ చేసి, ప్రతీ రోజూ తమ స్వహస్తాలతో ఏదైనా స్వామి వారికి నివేదన చేసి, ప్రతీ రోజూ శ్రీ సుబ్రహ్మణ్యుని ఆలయానికి వెళ్ళి 21 ప్రదక్షిణలు చేసి, గోత్రనామాలతో అర్చన చేయించుకోవాలి. సంకల్పం చెప్పే సమయంలో " వివాహ దోష పరిహారార్ధం " అని చెప్పి, స్వామిని దర్శించుకుని వస్తుంటే తప్పక సకల వివాహ దోషాలు పరిష్కరించబడతాయి. స్వామి వారి అనుగ్రహం వలన తప్పక శుభం కలుగుతుంది. ఇది ఎందరో జీవితాలలో జరిగినది.

Also Readబంగారు ఉసిరి కాయలు కురిసింది ఇక్కడే

నివేదన చేయడానికి పెద్దగా ఆలోచించవద్దు, మీ శక్తి మేరకు పాలలో చెక్కర కలిపి నివేదించవచ్చు, అటుకులు బెల్లము కలిపి నివేదించవచ్చు, అరటి పండు ముక్కలు చేసి పాలు పెరుగు చెక్కర తేనే నెయ్యి కలిపి నివేదించవచ్చు, ఇవే కాదు మీ శక్తి మేరకు ఏదైనా నివేదించవచ్చు, బాధ పడుతున్నవారు తమ స్వహస్తాలతో తయారు చేయాలి.

మీ దగ్గర శ్రీ వల్లీ కల్యాణం మరియూ శ్రీ దేవసేనా కళ్యాణం ఉంటే వాటిని చదవండి. అవి రెండూ లేకుంటే ఈ పోస్ట్ లో ఉన్నది మీరు ప్రతీ రోజు పారాయణ చేయవచ్చు. అలానే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్రము, శ్రీ సుబ్రహ్మణ్య షోడశ నామాలు, శ్రీ సుబ్రహ్మణ్య అష్టకము చదవడం ఎంతో శ్రేయశ్కరం. కావలసినదల్లా భక్తి, శ్రద్ధ, విశ్వాసము మాత్రమే. ఫలితాల గురించి ఆలోచించవద్దు, అనుమానము, ఆందోళన వద్దు. ఇది ఎవరికి వారు చేస్తే మంచిది, తమ పిల్లల కోసం చేయవచ్చా అని కొంతమంది అడుగుతుంటారు, తప్పని పరిస్థితుల్లో చేయవచ్చు కానీ ఎవరికి వారీ చేస్తే ఉత్తమ ఫలితం శీఘ్రముగా కలుగుతుంది. తప్పక శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం కలిగుతుంది. నాకు తెలిసిన పరిష్కారం చెప్పాను, కొందరికైనా ఇది ఉపయోగపడితే నా శ్రమకు సార్ధకత అందినట్లుగా భావిస్తాను, ఇది సుబ్రహ్మణ్యుడే సూచించినట్లు భావించి వ్రాసాను ...

మొదటగా సుబ్రహ్మణ్యుని చరిత్ర పఠించాలి. ఈ పోస్ట్ లో సుబ్రహ్మణ్యుని చరిత్ర, శ్రీ వల్లీ సుబ్రహ్మణ్యుల కళ్యాణం, శ్రీ దేవసేనా సుబ్రహ్మణ్యుల కళ్యాణం ఉన్నాయి. భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠించండి.

శ్రీ సుబ్రహ్మణ్య చరిత్ర - శ్రీ కుమార సంభవం (స్కందోత్పత్తి)

మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి. ఆయనకు దక్షప్రజాపతి కుమార్తెలు పదమూడు మంది ఆయనకు భార్యలు. కశ్యప ప్రజాపతి భార్యలలో దితి - అదితికి ఉన్నంత ప్రాశస్త్యం మిగిలిన భార్యలకు కనపడదు. దితి భావనలు శ్రీమన్నారాయణుని దుష్టశిక్షణకు అనేకమయిన అవతారములు తీసుకునేటట్లుగా చేసాయి. దితియందు మార్పురాలేదు. క్షేత్రమునందే తేడా ఉన్నది. కశ్యపప్రజాపతిని ‘నాకు ఇంద్రుడిని చంపే పిల్లవాడు కావాలని అడిగితే అపుడు ప్రజాపతి నవ్వి ‘నీ కోరిక తీర్చగలిగిన వాడిని నేను కాదు ఈశ్వరుని సేవించు. నీవొక గొప్ప తపస్సు చెయ్యి తపస్సు చేస్తున్నప్పుడు ధర్మంలో లోపం రాకూడదు. నీకు బిడ్డ పుట్టేవరకూ అలా ఉండగలిగితే నీకు ఇంద్రుడిని సంహరించగలిగిన కుమారుడు పుడతాడు’ అని చెప్పాడు. ఆవిడ లోపలి కశ్యప ప్రజాపతి తేజము ప్రవేశించింది. ఆవిడ గర్భిణి అయింది. లోపల గర్భం పెరుగుతోంది. ఇది ఇంద్రుడికి తెలిసి ఆవిడ దగ్గరకు వచ్చి ‘అమ్మా ! నీకు సేవచేస్తాను’ అన్నాడు. ఆవిడ ధర్మం పాటించి ఇంద్రుడిని సేవ చేయడానికి అంగీకరించింది.

Also Read : తలనీలాలు పుట్టు వెంట్రుకలు ఎందుకివ్వాలి - ఫ‌లితం ఏంటీ ?

ఒకనాడు ఆవిడ మిట్టమధ్యాహ్నం వేళ తల విరబోసుకుని కూర్చుని ఉండగా కునుకు వచ్చి మోకాళ్ళ మీదకి తల వాలిపోయింది. జుట్టు వచ్చి పాదములకు తగిలింది. స్త్రీకి అలా తగలకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం జుట్టు చివర ముడివేసి లేకుండా స్త్రీ తిరుగరాదు. జుట్టు అలా పాదముల మీద పడగానే ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుధంతో లోపల ఉన్న పిండమును ముక్కలుగానరికేశాడు ‘మారుదః మారుదః – ఏడవకండి’ అంటూ ముక్కలుగా నరికేశాడు. అపుడు దితి ఏడ్చి కనీసం వాళ్ళకి నీదగ్గర పదవులియ్యి అని ఇంద్రుని అడిగింది. మారుదః మారుదః అని కడుపులో ఇంద్రుని చేత చెప్పబడ్డారు కనుక వాళ్ళు ‘మరుత్తులు’ అనే పదవులు పొంది స్వర్గలోకంలో వారి పదవులను అధిష్ఠించారు. దితికి మరల భంగపాటు అయింది.

ఇలా కొన్నాళ్ళు అయిపోయింది. మరల ఆవిడ తన భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి ఒక చిత్రమయిన కోరిక కోరింది. ‘నాకు దేవతలనందరిని గెలవగల కుమారుడు కావాలి’ అని అడిగింది. అపుడు ఆయన ‘పదివేల సంవత్సరములు నియమముతో చతుర్ముఖ బ్రహ్మగురించి తపస్సు చెయ్యాలి. నీకు కోరుకున్న కొడుకు పుడతాడు’ అని చెప్పాడు. తపస్సు బ్రహ్మాండంగా ప్రారంభం చేసింది. కొన్నివేల సంవత్సరములు తపస్సు చేసిన తరువాత బ్రహ్మ అనుగ్రహమును పొందింది. గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడికి ‘వజ్రాంగుడు’ అని పేరు పెట్టారు. వజ్రాంగుడు అనగా వజ్రముల వంటి అంగములు కలిగిన వాడు. వాడికి దేహమునందు బలం ఉన్నది. బుద్ధియందు సంస్కారం ఏర్పడలేదు. ఇతడు బయలుదేరి దేవలోకమునకు వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుని జయించి అతడిని పదవీచ్యుతుని చేశాడు. అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు. ఇంద్రుడు, వరుణుడు, దిక్పాలకులు మొదలైన దేవతలనందరినీ బంధించి తన కారాగారంలో పారేశాడు. బ్రహ్మ కశ్యప ప్రజాపతిని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు. వారు వస్తే వజ్రాంగుడు లేచి స్తోత్రం చేసి నమస్కారం చేశాడు. సముచితాసనమున కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులను ఇచ్చాడు. బ్రహ్మ ‘నాయనా! నీవు చేసిన అతిథిమర్యాదకు చాలా సంతోషించాము. దిక్పాలకులకు పదవులను నేను ఇచ్చాను. నీవు వాళ్ళను పట్టుకువచ్చి కారాగారంలో పడేశావు. నువ్వు విజేతవే. అందులో సందేహమేమీ లేదు. కానీ వాళ్ళ పదవులు వాళ్ళను చేసుకొనీ’ అని చెప్పాడు. వాళ్ళమాట మీద వజ్రాంగుడు ఇంద్రుడిని, తాను బంధించిన ఇతర దేవతలను విడిచిపెట్టాడు. వజ్రాంగుడు బ్రహ్మతో ‘మహానుభావా! అనుకోకుండా ఈవేళ నాకోసం ఇలా వచ్చావు. నేను నిన్ను ఒక్కటి ప్రార్థన చేస్తున్నాను. అసలు మనశ్శాంతికి ఏది కారణమో, ఏది నిజమయిన తత్త్వమో, ఏది తెలుసుకోవాలో అది నాకు ఒకసారి దయచేసి బోధ చేయవలసింది. ఉపదేశం చేయవలసింది’ అని అడిగాడు. ఇటువంటి కోరిక కోరేసరికి ఆయన పొంగిపోయి ‘నాయనా! నీవు ఎల్లప్పుడూ సత్త్వ గుణమును పట్టుకుని ఉండు. ఈశ్వరుని నమ్మి ఉండు. నీకు ఏ ఇబ్బంది ఉండదు. నీకు ‘వరాంగి’ అనే ఆమెను భార్యగా నేను సృష్టించి ఇస్తున్నాను. తీసుకో’ అని బ్రహ్మ దగ్గరుండి పౌరోహిత్యం చేసి వజ్రాంగుడికి, వరాంగికి పెళ్ళిచేశారు.

వజ్రాంగుడు తన భార్యతో కలిసి నిరంతరం ధర్మాచరణ చేస్తున్నాడు. ఒకరోజున వజ్రాంగుడు భార్యను పిలిచి ‘నీకు ఏమి కావాలనుకుంటున్నావు? ఏమీ బెంగపెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో చెప్పు’ అని అడిగితే వరాంగి ‘ముల్లోకములను గెలవగలిగిన వాడు, పాకశాసనుని కన్నుల వెంట నీళ్ళు కార్పించగలిగిన వాడు నా కడుపున కొడుకుగా పుట్టేటట్లుగా నన్ను అనుగ్రహించు’ అన్నది. వరాంగి వల్ల వజ్రాంగుడు మనశ్శాంతిని కోల్పోయాడు. పిమ్మట వజ్రాంగుడు బ్రహ్మ గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు. వజ్రాంగుడు నమస్కారం చేసి ‘స్వామీ! వరాంగి కోరిన కొడుకును ఆమెకు ఇప్పించండి’ అని అడిగాడు. వరాంగికి తాను కోరుకున్న కొడుకు పుట్టాడు. వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభం అయింది. వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకు వచ్చి ఆ పిల్లవానికి ‘తారకుడు’ అని పేరు పెట్టాడు. లోకం మాత్రం ఆ పిల్లవానిని తారకాసురుడు అని పిలిచింది.

తారకుడు పెరిగి పెద్దవాడయ్యాడు. వీనిని చూసి దితి, వరాంగి మిక్కిలి సంతోషపడి పోతున్నారు. వీళ్ళ కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడినే బ్రహ్మ గురించి తపస్సు చేసి వరమును పొందమని ప్రోత్సహించారు. తారకుడు కూడా తపస్సుకు బయలుదేరి తపస్సు ప్రారంభించాడు. ఒక్క కాలుమీద నిలబడి కళ్ళు తెరుచుకుని సూర్యుడిని చూస్తున్నాడు. అలా నూరేళ్ళు తపస్సు చేశాడు. తరువాత ఉగ్రతపస్సు మొదలుపెట్టాడు. అందులోంచి ధూమం పుట్టింది. అది లోకములను కాలుస్తోంది. దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి వీని తపస్సు లోకముల నన్నింటిని కాల్చేస్తోంది. మీరు వెళ్ళి వాడికి ఏమి కావాలో అడగండి మహాప్రభో అన్నారు.

తారకుడి ఎదురుగా బ్రహ్మ ప్రత్యక్షమయి నాయనా! ఏమిటి నీ కోరిక? అని అడిగాడు. బ్రహ్మకు తారకుడు ఒక నమస్కారం పెట్టి ‘దేవతలనందరినీ, మూడు లోకములను గెలవగల శక్తిని నాకు ఈయవలసింది. పురారి అయిన పరమశివుడు మన్మథుని దహిస్తాడు. ఆయన కామారి. ఆయనకి కోరిక లేదు. అటువంటి పరమశివునికి కామం కలిగి వీర్య స్ఖలనం అవ్వాలి. అలా అయితే ఆ వీర్యంలోంచి కొడుకు పుడితే వాడి చేతిలో నేను చనిపోతాను. ఆ మేరకు వరం ఇవ్వవలసింది’ అని అడిగాడు. బ్రహ్మ సాంబసదాశివుని తలుచుకుని తథాస్తు అని భారంగా హంసను ఎక్కి వెళ్ళిపోయాడు.

తారకుడిని మూడు లోకములకు రాజ్యాభిషేకం చేసారు. దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏయే పనులు చేయాలో నిర్ణయించి చెప్పేశాడు. ఇలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలనం చేస్తున్నాడు. వాళ్ళందరూ శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్ళి నీవు మమ్మల్ని రక్షించాలి అని చెప్పారు. ఈలోగా తారకుడు రానే వచ్ఛి నారాయణుడితో యుద్ధం మొదలుపెట్టాడు. శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రమును ప్రయోగించారు. సుదర్శన చక్రం తారకుని కంఠమునందు పుష్పమై రాజిల్లింది. అప్పటికి ఎటువంటి మాయ ప్రయోగించాలో అటువంటి విష్ణుమాయ చేసి శ్రీమహావిష్ణువు అక్కడినుండి తప్పుకున్నాడు. అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు. ‘ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్లుగా మేము ఎలా ధన్యులం అవుతామో మమ్మల్ని అనుగ్రహించండి’ అని వేడుకున్నారు.

లోకం అంతా నిలబడాలంటే శివుడికి కొడుకు కలగాలి. కుమారసంభవం జరగాలంటే పరమశివుని తేజస్సును స్వీకరించడానికి జగదంబయే ఉండాలి. కామమే లేని పరమేశ్వరుని యందు మన్మథుడు కామప్రచోదనం చేయగలడని తలచి ఇంద్రుడు మన్మథుని పిలిచి శివుని వద్దకు పంపాడు. మన్మథుడు వెళ్ళి బాణ ప్రయోగం చేసే ప్రయత్నంలో ఉండగా శంకరుడు మూడవకన్ను తెరచాడు. ఆ కంటి మంటకు మన్మథుడు భస్మం అయిపోయాడు. ఇంద్రునితో సహా దేవతలందరూ వెళ్ళిపోయారు. రతీదేవి ఒక్కర్తే భర్త పోయాడని ఏడ్చింది. ఏ మన్మథుడు చేతిలో చెరకువిల్లు, పుష్ప బాణములు పట్టుకుంటే శంకరుని కదలించ లేకపోయాడో దాన్ని అమ్మవారు స్వీకరించింది. అలా స్వీకరించినపుడు ఆవిడ శివకామ సుందరి. అమ్మవారు వెళ్లి గొప్ప తపస్సు చేసింది. శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్ళి తానే చెడగొట్టుకునే మాటలు చెప్పాడు. అమ్మవారు ధూర్త బ్రహ్మచారీ ! శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నీ ప్రాంతమును వదులుతావా వదలవా? అని అదిలించింది. శంకరుడు నిజరూపం చూపించాడు. అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. పార్వతీ కళ్యాణం అయింది. పార్వతీ పరమేశ్వరులిరువురూ తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు.

Also Readచేతిలోని డబ్బు నిలవాలంటే...ఏమి చేయాలి? 

పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వలన ప్రధాన ప్రయోజనం కుమారసంభవం జరగాలి. అందుకు ప్రకృతియందు ఉన్నది ఒక్కటే ఆధారం. మహా తపస్వి అయిన శంకరుని అమ్మవారు ఆకర్షించింది. వారి దివ్యమైన క్రీడ జరుగుతోంది. దానినే శాస్త్రమునందు మైథునము అని పిలిచారు. శివపార్వతుల దివ్యమైన క్రీడ శత దివ్య వత్సరములు జరిగింది. ఆయన అమ్మవారు ఆడితే ఆడతాడు, పాడితే పాడతాడు. కానీ ఆయన తేజస్సు స్ఖలనం కాదు. అనగా ఆయన కామ మోహితుడు కాలేదు. శతదివ్య వత్సరములు అయిపోయాయి. తారకాసురుడు దేవతలను చితక్కొడుతూనే ఉన్నాడు. శివుని తేజస్సులోంచే కుమారుడు పుట్టి తారకాసురుడిని సంహరించగల మహా వీరుడైన ఒక కుమారుడు కావాలి. కానీ ఆ తేజస్సు పార్వతీ దేవియందు ప్రవేశించకుండా ఉండాలి. శివుడితో ‘నీకు మాత్రమే కుమారుడిగా ఉంటాను’ అని సనత్కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది కానీ, ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి యందు గర్భంగా పెరగడానికి అవకాశం ఉండదు. పరమశివుడు ఇన్నింటిని ఏకకాలమునందు నిలబెట్టగలిగిన వాడు. దీనికోసం లోకం తన మీద నిందలు వేసినా మచ్చపడడానికి సిద్ధంగా ఉన్నవాడు. నూరు దివ్య వర్షములు గడిచిపోయినా ఆయనకు కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనం కాలేదు.

ఈ ముడి విడిపోవడం ఎక్కడో ప్రారంభం కావాలి కదా! అందుకని మొట్టమొదట శివమాయ దేవతలమీద ప్రసరించింది. కుమారసంభవం జరిగితే మొదట ప్రయోజనం పొందేవారు దేవతలు. వాళ్ళు శివ మాయా మోహితులు అయి అక్కర్లేని విషయమును చర్చ మొదలుపెట్టారు. బ్రహ్మ కూడా మాయా మోహితుడై పోయాడు. వాళ్ళు ఇప్పుడు అయ్యవారి తేజస్సు జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయే ప్రాణి మహాగొప్ప తేజోమూర్తి అయితే అటువంటి మూర్తి ఈ భూమిమీద నడిస్తే ప్రజలు తట్టుకోగలరా? శివతేజస్సు కదలరాదు అనుకున్నారు. శివపార్వతులు క్రీడిస్తే కొడుకు పుట్టాలని మొదట ఏడ్చిన వీళ్ళే అందరు కలిసి పరమశివుడు దగ్గరకు వెళ్ళారు. ఆయన పార్వతీ దేవితో కలిసి కామక్రీడలో ఉన్నాడు. బ్రహ్మతో కలిసి దేవతలు తనకొరకు వచ్చారని తెలియగానే దర్శనం ఇవ్వడానికి బయటకు వచ్చి మీ కోరిక ఏమిటి? అని అడిగాడు. నీ తేజస్సు కానీ స్ఖలనం అయితే దానిని పట్టగలిగిన వారు లేదు. ఈశ్వరా! మీ తేజస్సును మీయందే ఉంచేసుకోండి. ఏదయినా పర్వత శృంగం మీద కూర్చుని ఇద్దరూ తపస్సు చేసుకోండి అని పరమశివునికి సలహా ఇచ్చారు. దేవతల సలహా విన్న పరశివుడు చిరునవ్వు నవ్వి ఈ భూమి మీద అందరూ సుఖపడెదరు గాక! నా తేజస్సు బయటకు పడకుండు గాక! ఒకే ఒక్కసారి మాత్రం నా తేజస్సు బయటకు వచ్చి తీరాలి. నూరు దివ్య వర్షములు పార్వతీ దేవితో కలిసి నేను క్రీడించిన కారణం చేత స్వస్థానమునుండి కదిలిపోయిన పరమపవిత్రమయిన నా తేజస్సును మీలో ఎవరు భరిస్తారో చెప్పండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు ‘భూమి భరిస్తుంది’ అని చెప్పారు. శివతేజస్సును గ్రహించడానికి భూమి అంగీకరిస్తే శివుని తేజస్సు భూమి మీద పడింది. అది సామాన్యమయినది కాదు. ఉత్తర క్షణం భూమి మీద వ్యాప్తి చెంది ప్రవహించి పర్వతములను, అరణ్యములను అన్నింటిని ఆక్రమించేసింది. అందరూ అగ్నిహోత్రుని ప్రార్థన చేయగా అగ్నిహోత్రుడు వాయువు సహకారంతో తేజస్సును గ్రహించాడు. అయితే ఆ తేజస్సును అగ్నిహోత్రుడు కూడా తనలో ఉంచుకోలేక పోయాడు.ఈ విషయం అమ్మవారు తెలుసుకుని దేవతల భార్యలకు బిడ్డలు జన్మించకుందురు గాక అని దేవతలను శపించింది. పిమ్మట భూమివంక తిరిగి నీవు అనేక రూపములను పొందుతావు. ఒకచోట చౌడు నెల, సారవంతమయిన నేల ఇలా రకరకములయిన రూపములు పొందుతావు. చాలామందికి భార్యవు అవుతావు అన్నది. దేవతలందరూ సిగ్గుతో మ్రాన్పడి పోయారు. శివుడు పశ్చిమ దిశగా హిమవత్పర్వత ప్రాంత శృంగము మీదికి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆయనను అనుగమించి అమ్మవారు వెళ్ళిపోయింది. అగ్నిహోత్రుని దగ్గర ఉన్న శివతేజస్సును గంగయందు విడిచిపెడితే ఉమాదేవి బెంగ పెట్టుకోదు. గంగయందు ప్రవేశపెట్టండి అని చెప్పాడు. అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరకి వెళ్లి అమ్మా! దేవతల ప్రియం కొరకు నీవు గర్భమును దాల్చాలి అని అడిగితే ఆమె శివ తేజస్సును స్వీకరించడానికి మనఃస్ఫూర్తిగా అంగీకరించింది. అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివ తేజమును గంగయందు విడిచిపెట్టాడు. వీళ్ళందరి గుండెలు జారిపోయేటట్లుగా గంగమ్మ ఒకమాట అన్నది. నేను ఈ తేజస్సును భరించలేను. ఏమి చెయ్యను? అని అడిగింది. దేవతలలో మరల కంగారు మొదలయింది. అగ్నిహోత్రుడు గంగతో నీవు భరించ లేకపోతే దానిని హిమవత్పర్వత ప్రాంత పాదముల దగ్గర వదిలిపెట్టు అన్నాడు. గంగ అలాగే చేసింది. తేజస్సు వెళ్లి భూమి మీద పడగానే విశేషమయిన బంగారం, దాని తర్వాత వెండి పుట్టాయి. దాని క్షారం లోంచి రాగి, ఇనుము పుట్టాయి. దాని తేజో మలం లోంచి తగరము, సీసం పుట్టాయి. మిగిలిన తేజస్సు అణువులు భూమితో కలిసిపోతే నానా రకములయిన ధాతువులు పుట్టాయి. అక్కడ శరవణపు పొదlu, దగ్గరలో ఒక తటాకం ఉన్నది. దానిని శరవణ తటాకము అని పిలుస్తారు. అది అమ్మవారి శరీరం. నీరుగా మారింది. ఈ తేజస్సు ఆ తటాకము నందు పడి మెరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణపు పొదల దగ్గర పడ్డాడు. కుమార సంభవం జరిగింది.

ఈవిధంగా కుమార సంభవం జరగగానే దేవతలు పొంగిపోయారు. శరవణ తటాకంలోంచి బయటకు వచ్చాడు కాబట్టే సుబ్రహ్మణ్యుడికి ముమ్మూర్తులా అమ్మవారి రూపే వచ్చింది. చిన్న పిల్లవాడు శూలం పట్టుకుని ముద్దులు మూట కడుతూ ఉంటాడు. పుట్టిన పిల్లవాడికి పాలు పట్టించాలి. వీళ్ళందరూ ఒక సంకల్పం చేశారు. అమ్మవారే కృత్తికా రూపంలో ఉంటుంది. అందుకని వెంటనే ఆ కృత్తికలను ప్రార్థన చేశారు. కృత్తికలు ఆరుగురు వచ్చి మేము పాలు ఇస్తాము కానీ ఈ పిల్లవాడు మాకు కూడా పిల్లవాడిగా చెప్పబడాలి అని వరం ఇవ్వాలి అన్నారు. ఈ పిల్లవాడు మీకు బిడ్డడుగా పిలవబడతాడు అన్నారు. వాళ్ళు వెంటనే మాతృత్వాన్ని పొందారు. మా అమ్మే పాలివ్వడానికి సిద్ధపడిందని ఆరు ముఖములతో ఆ పిల్లవాడు ఏకకాలమునందు పాలు తాగి ‘షణ్ముఖుడు’ అయ్యాడు. కృత్తికల పాలు త్రాగాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు. సనత్కుమారుడు ఇలా జన్మించాడు కాబట్టి గర్భం జారిపోతే బయటకు వచ్చాడు కాబట్టి స్కందుడు అని పిలిచారు. ఆరుగురు కృత్తికల స్తనములను ఏకాకాలమునందు పానము చేసిన వాడు కనుక ఆయనకు ‘షడాననుడు’ అని పేరు వచ్చింది. పరమశివుని తేజస్సులోంచి వచ్చిన పిల్లవాడు కనుక ‘కుమారా’ అని పిలిచారు. అగ్నిహోత్రుడు తనయందు ఉంచుకుని గంగయందు ప్రవేశపెట్టిన కారణం చేత ఆ పిల్లవానిని ‘పావకి’ అని పిలిచారు.

ఆయన ఒకే ఒకసారి తల్లుల పాలు త్రాగి తొందరగా భక్తులను రక్షించడానికి ఒకే రోజులో యౌవనంలో ఉన్న కుమారస్వామిగా మారిపోయాడు. ఉత్తరక్షణం ఆయనకు అభిషేకం చేసేద్దామని పుట్టినరోజునాడే దేవతలందరూ ఆయనను కూర్చోబెట్టి దేవసేనాధిపతిగా అభిషేకం చేసారు. ‘సేనాని’ అని పేరుపొందాడు. ఈయనకే ‘గుహా’ అనే పేరు ఉంది. పరమపవిత్రమయిన ఈ సుబ్రహ్మణ్య స్వామివారి జననము వినడం అన్నది, ఆయన గూర్చి వినడం అన్నది ఎవరికో తప్ప చెల్లదు. ఎవరు కార్తికేయునకు భక్తులై, ఈ లోకమునందు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నారో వారు ఆయుష్మంతులై పుత్రపౌత్రులను చూసి స్కందలోకమును పొందుతారు.

ఒకానొక సమయంలో నారదమహర్షి కైలాసపర్వతం మీద స్నేహితులతో కలిసి ముచ్చటించుకున్నటువంటి సుబ్రహ్మణ్యుని సన్నిధానమునకు వెళ్ళారు. లోకములలో తాను చూసిన విశేషములను చెప్పడం మొదలు పెట్టాడు. ఇప్పుడు నారదుడు వల్లీ కళ్యాణం చేయించడానికి వచ్చాడు. ఒక మహర్షి తేజస్సు వలన అయోనిజయై ఒకపిల్ల ఒకతె అరణ్యమునందు పుట్టి ఉండగా ఒక భిల్లు నాయకునికి దొరికింది ఆ పిల్లను తీసుకు వచ్చి ఆయన పెంచుకుంటున్నాడు. ఆ పిల్ల పేరు వల్లి. ఆమె రాశీభూతమయిన సౌందర్యము. అటువంటి వల్లి నీ భార్య కావాలి అది నా కోరిక. ఆ పిల్ల చుట్టూ పాములు ఉంటాయి ఎప్పుడూ. నువ్వు చూసి భయపడకూడదు సుమా! ఎవరు ఆ పిల్ల వొంటిని పట్టిన పాములను చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యమును చూసి ఉండలేక పొంగిపోతారు అన్నాడు నారదుడు. ఆ మాటలను విని సుబ్రహ్మణ్యుడు భిల్లపురానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళడానికి ముందే నారదుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. నారదుడికి భిల్లరాజు ఎదురువచ్చాడు. మంచి మంచి పువ్వులు, తేనే, పళ్ళు తీసుకువచ్చి నారదుడికి పెట్టాడు. నారదుడు భిల్లరాజుతో “నీకొక శుభవార్త చెప్తాను. మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లను నీకు కూతురుగా పంపాడు. ఈ వల్లీదేవిని పెళ్ళి చేసుకో బోయేవాడు లోకంలో యౌవనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలని అనుకుంటుందో, ఎవరు జగదంబ అందాలు పోసుకున్నవాడో, ఎవరు పరమ సౌందర్యరాశియైన శంకరుని తేజమును పొందిన వాడో, ఎవడు గొప్ప వీరుడో, ఎవడు మహాజ్ఞానియో ఎవడు దేవసేనాధిపతియో అటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు నీ అదృష్టమే అదృష్టం అన్నాడు. భిల్లురాజు నారదుని మాటలు విని చాలా పొంగిపోయాడు.

కుమారస్వామి వనంలోకి ప్రవేశించి వల్లీ దేవి వంక చూసి బహుశః బ్రహ్మ తన సృష్టి శక్తిలోని సౌందర్యమునంతటిని ఒకచోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆమె ఈ వల్లి అయి ఉంటుంది ఈ పిల్లతో ఒకసారి మాట్లాడాలి అని అనుకున్నాడు. ‘లతాంగీ నన్ను చేపట్టవా?” అని అడిగాడు. ఆవిడ ఈయన వంక చూసి ‘అబ్బో ఈతడు ఎంత అందగాడో’ అనుకుని నారదుడు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు సుబ్రహ్మణ్యుడితో వివాహం అవుతుందని చెప్పాడు.

ఈ పిల్లవాడు అందగాడు కావచ్చు కానీ నా మనస్సు నందు పాపపంకిలమయిన భావం కలుగరాదు. నేను సుబ్రహ్మణ్యుడికి చెందినదానను. పార్వతీ పరమేశ్వరుల కుమారుడు అయి ఉంటె నా రొట్టె విరిగి నేతిలో పడినట్లే కదా అనుకుని ‘ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. ఏదయినా అడగవలసి వస్తే మా తల్లిదండ్రులను అడగాలి. అయినా కుమారస్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు. అందువల్ల నా మనస్సు ఆయనకు అర్పించబడింది అని చెప్పింది. ఆమె అలా చెప్పగానే మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు ఒక్కసారి తన నిజరూపమును చూపించాడు. ఆ తల్లి పొంగిపోయింది. ఇంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకు వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల మనస్సులో కుంది ఏడుస్తోంది. అయ్యో ఎక్కడి మహానుభావుడు. నేను ఒక్కమాట నోరు తెరిచి చెప్పలేదు. అని. చెలికత్తె ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావు. ఒక ఆకుమీద ఉత్తరం రాసి ఇవ్వు. నేను పట్టుకుని వెళ్లి ఆయనకు ఇస్తాను అంది.

అక్కడ సుబ్రహ్మణ్యుడు పుష్పవాటిక యందు ఒక సరోవరం ఒడ్డున కూర్చుని ఉన్నాడు. చెలికత్తె వెళ్లి పత్రం చూపించింది. ఆయన చదివి వల్లీదేవి దగ్గరకు వెళదా అన్నాడు. అపుడు చెలికత్తె అలా వద్దు నేను పిల్లను తీసుకువస్తాను అని చెప్పి వెళ్లి వల్లీదేవిని తీసుకువచ్చింది. వారిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఈలోగా తెల్లారిపోయింది. పిల్ల కనపడలేదని అందరూ వెతుకుతూ సరోవరం ఒడ్డు దగ్గరకు రాగా ఇద్దరూ కనపడ్డారు. భిల్ల నాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని తెలియదు. సుబ్రహ్మణ్యుడు కూడా వేటగాని వేషంలో ఉన్నాడు. వెంటనే ఆగ్రహంతో తన పరివారంతో ఆయన మీద బాణములు ప్రయోగించాడు. సుబ్రహ్మణ్యుడు పేలగా నవ్వుతూ వాటినన్నింటినీ స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాస్త్రమును ప్రయోగించాడు. అందరూ క్రిందపడి స్పృహతప్పిపోయారు. అప్పుడు వల్లీ దేవి తన వాళ్ళందరూ పడిపోయారని ఏడ్చింది. అపుడు స్వామివారు అనుగ్రహించేసరికి మరల వారందరికీ స్పృహ వచ్చి లేచారు. వారు లేచి చూసేసరికి శూలం పట్టుకుని నెమలివాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చున్న సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించాడు. ఆ భిల్లులందరూ నేలమీద పది సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు.

నారదుడు దేవసేనతో పార్వతీ పరమేశ్వరులతో అక్కడకు వచ్చాడు. నేనెంత భాగ్యవంతురాలినో కదా అనుకుని వల్లీదేవి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించింది. అపుడు సంతోషంగా పార్వతీ పరమేశ్వరులతో దేవసేనతో కలిసి ఏ అరమరికలూ లేకుండా ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల కోర్కెలు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్య స్వామి వారు తిరుత్తణియందు వెలసి ఉన్నారు. సుబ్రహ్మణ్యుడిని పూజిస్తే మన పాపములన్నీ దగ్ధమయిపోతాయి. వంశాభివృద్ధి జరుగుతుంది.

Also Readమొక్కు తీర్చడం అంటే ఏమిటి ? దేవుడి మొక్కు ఎలా తీర్చుకోవాలి ?

అరిష్టనేమి అనబడే ఒక ప్రజాపతి కుమార్తె దేవసేన. ఈమెకు దైత్యసేన అనే ఒక చెల్లెలు ఉంది. ఒకరోజున దేవసేన తన చెల్లెలయిన దైత్య సేనతో కలిసి ఆడుకుంటోంది. ఆ సమయంలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చి దేవసేనను భయపెట్టి ఎత్తుకుపోయే ప్రయత్నం చేశాడు. ఆవిడ బిగ్గరగా కేకలు పెట్టింది.ఆ సమయంలో ఇంద్రుడు ఐరావతం మీద వెడుతున్నాడు. ఆయన వెంటనే తన వజ్రాయుధంతో ఆ రాక్షసుని సంహరించి అరిష్టనేమి కుమార్తె అయిన ‘ఈ దేవసేనని నా కుమార్తెగా ఇవ్వాల్టి నుంచి పెంచుకుంటాను. దైత్యసేనని నీ దగ్గర ఉంచుకో. దేవసేన నా దగ్గర పెరుగుతుంది. అని అరిష్టనేమికి చెప్పి ఆమెను తీసుకు వెళ్ళి పెంచాడు. ఈ పిల్ల పెరిగి పెద్దదవుతుంటే ఇంద్రునికొక ఆలోచన కలిగింది. ఈ దేవసేనను దక్కించుకోగలిగిన వాడు పరాక్రమముతో పాటు కారుణ్యము అపారముగా కలిగిన వాడి ఉండాలి. అటువంటి వాడికి ఇచ్చి వివాహం చేస్తాను అనుకున్నాడు. ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. తారకాసురుడి తమ్ముడు శూరపద్ముడు. ఆ శూరపద్ముని సంహారం కూడా కుమారస్వామి చేశారు. తన కుమార్తెకు అలాంటి వాడిని ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నాడు. వెళ్లి కుమారస్వామిని వేడుకుని దేవసేననిచ్చి వివాహం చేసాడు.

వివాహంచేసిన స్థలాన్ని తిరుప్పరంకుండ్రం అని పిలుస్తారు. మంచి గుణములు కలగాలంటే కుమారస్వామి ఆరాధనము చేసి తీరవలెనని శాస్త్రం చెప్తోంది. సుబ్రహ్మణ్యానుగ్రహమును పొందాలి..

Famous Posts:

ఒక స్త్రీ పురుషుని నుండి ఏమి కోరుకుంటుంది..?

పెళ్లి కావట్లేదా అయితే ఒక్క సారి ఈగుడిని దర్శించండి...

శయనిస్తున్నశివుడు ప్రపంచంలో ఏకైక_ఆలయం 

ఈ స్తోత్రమును శివుడు పార్వతికి చెప్పెను |  ధన దేవతా స్తోత్రం

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం..శనివారం మహిమ. 

దేవుడిని ఇలా కోరుకోండి.. తప్పక మీ కోరిక తీరుస్తాడు..!

సోమవారం ఇలా చేయండి రుణ బాధలు వదిలిపోతాయ్

చాలా శక్తివంతమైన లక్ష్మీ మంత్రాలు

subramanya swamy pooja for marriage, subramanya swamy vratham in telugu pdf, subramanya, swamy pooja benefits, subramanya swamy aradhana in telugu pdf, vahana pooja mantra in telugu pdf, subramanya swamy abhishekam benefits in telugu, shasti devi pooja vidhanam in telugu, nitya pooja vidhanam in telugu pdf

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.