Drop Down Menus

12 మాసములలో అత్యంత ప్రీతిపాత్రమైనది శ్రావణమాసంలో ఆచరించాల్సిన నియమాలు | What is special about Shravan month?

12 మాసములలో  అత్యంత ప్రీతిపాత్రమైనది శ్రావణమాసం. 

దీనికి ఈపేరు శ్రవణ నక్షత్రముతో కూడిన పూర్ణిమ నాడు రావడం వలన మాత్రమే కాక దీనియొక్క మాహాత్మ్యము వినుటకు ఆనందకరమై/యొగ్యమై అనేక సిద్ధులను ఇచ్చునది గావున ఈపేరు వచ్చినది.

శ్రావణ మాసంలో విధింపబడిన విధులలో ఏ ఒక్కటి అయినా శ్రద్ధగా చేసిన వారు నాకు అత్యంత ప్రియులు. నాకు ఈ మాసము కంటే ప్రియమైనది మరియొకటి లేదు. ఈమాసంలో కోరికలతో పూజించిన వారి కోరికలన్నీ తీరుస్తాను. కోరికలు లేకుండా పూజించిన వారికి మొక్షాన్నీ ఇస్తాను. ఈ మాసంలో ఏ ఒక్క తిథి, వారము కూడా వ్రత ప్రాముఖ్యము లేకుండా లేవు. మహాభారతంలో అనుశాసనిక పర్వంలో ఈమాసం గురించి చెప్తూ –ఎవరైతే శ్రావణ మాసంలో ఏక భుక్తము (ఒక్కపూట భోజనం) చేస్తూ ఇంద్రియ నిగ్రహముతో గడుపుతారో వారికి అన్ని తీర్థములయందు స్నానము చేసిన ఫలితమే కాక వారికి వంశాభివృద్ధి కూడా జరుగుతుంది.

Also Readశ్రావణ శుక్రవారం/ వరలక్ష్మీ వ్రతం పూజ చేసుకునే విధానం.

ఈ నెలలో దైవకార్యాలు స్వల్పంగా చేసినా సరే అవి అనంత ఫలితాలను ఇస్తాయి. మాసమంతా వ్రతం చేయదలచిన వారు భూశయనం, బ్రహ్మచర్యం పాటిస్తూ సత్యమునే పలకాలి. ఫలహారము లేదా హవిష్యాన్నాము ఆకులో మాత్రమే భుజించాలి. ఆకుకూరలు తినరాదు. ఈ మాసంలో చేసే నమస్కారములు, ప్రదక్షిణలు సాధారణ సమయాలలో చేసే వాటికన్నా వేలరెట్ల ఫలితాన్ని ఇస్తాయి.

శ్రావణ మాస పూజా విశేషాలు

సృష్టి,స్థితి లయ కారకులైన త్రిమూర్తులలో స్థితికారుడు,దుష్టశిక్షకుడు,శిష్టరక్షకుడు అయిన శ్రీమహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన, వివిధ వ్రతాలు, పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలు, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసం "శ్రావణ మాసం"

చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాదు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం "శ్రవణా నక్షత్రం" అటువంటి శ్రవణా నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన మాసం.

శ్రావణ మాసంలోని మూడువారాలు అత్యంత పుణ్యప్రదమైనవి. మంగళ,శుక్ర,శనివారాలు ఈ మాసంలో అత్యంత ప్రధానమైనవి,మహత్తును కలిగినవి. శ్రావణ మసంలోని మంగళవారాలు శ్రీగౌరీ పూజకు,శుక్రవారాలు శ్రీలక్ష్మీ పూజకు, శనివారాలు శ్రీమహావిష్ణువు పూజకు ముఖ్యమైన దినాలు. వీటికితోడు శ్రావణమాసంలోని శుక్లపక్షంలోగల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ, ఒక్కోరోజు ఒక్కో దేవుని పూజ చేయాలని శాస్త్ర వచనం.

పాడ్యమి - బ్రహ్మదేవుడు

విదియ - శ్రీయఃపతి

తదియ - పార్వతీదేవి

చవితి - వినాయకుడు

పంచమి - శశి

షష్టి - నాగదేవతలు

సప్తమి - సూర్యుడు

అష్టమి - దుర్గాదేవి

నవమి - మాతృదేవతలు

దశమి - ధర్మరాజు

ఏకాదశి - మహర్షులు

ద్వాదశి - శ్రీమహావిష్ణువు

త్రయోదశి - అనంగుడు

చతుర్దశి - పరమశివుడు

పూర్ణిమ - పితృదేవతలు

మహిళలకు సౌభాగ్యానిచ్చే శ్రావణ మాస వ్రతాలు

శ్రావణమాసం మహిళలకు అత్యంత ముఖ్యమైనది. మహిళలు పాటించే వ్రతాల్లో అధికం ఈ మాసంలోనే ఉండడంవల్ల వ్రతాలమాసమని,సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది.

మంగళగౌరీ వ్రతం

శ్రావణమాసంలో ఆచరించే వ్రతాల్లో ముఖ్యమైనది ఈ వ్రతం. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు చేయాలి. నెలలోని అన్ని మంగళవారాలు దీనిని చేయవలెను.

వరలక్ష్మీ వ్రతం

మహిళలకు అత్యంత ముఖ్యమైన శ్రావణమాసంలో ఆచరించే మరో ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను.


శ్రావణమాసంలో వచ్చే పండగలు

శుక్లచవితి-నాగులచవితి

మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు నాగులచవితి పండుగను జరుపుకుంటారు. ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి పూజిస్తారు.

శుక్ల ఏకాదశి-పుత్రదా ఏకాదశి

ఈ ఏకాదశికే లలితా ఏకాదశి అని కూడా పేరు. పుత్ర సంతానం కావాలనుకునేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది.

శ్రావణ పూర్ణిమ - రాఖీపూర్ణిమ

సోదరుడి సుఖసంతోషాలు కోరుతూ అక్కాచెల్లెళ్ళు సోదరుడి చేతికి రాఖీ కడతారు నుదుట బొట్టు పెట్టి.అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరి ఆశీర్వాదం తీసుకుని కానుకలివ్వడం ఆనవాయితీ. అంతే గాక ఈ దినం పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం.

పూర్ణిమ - హయగ్రీవ జయంతి

వేదాలను రక్షించేందుకు శ్రీమహావిష్ణువు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణ కథనం.హయగ్రీవ జయంతి ఐన ఈ రోజు హయగ్రీవుడిని పూజించి శనగలు,ఉలవలతో గుగ్గిళ్ళు తయారుచేసి నైవేద్యం సమర్పిస్తారు.

కృష్ణవిదియ- శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి

క్రీ.శ.1671 వ సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సరం శ్రావణ బహుళ విదియనాడు శ్రీ రాఘవేంద్రస్వామివారు సజీవంగా సమాధిలో ప్రవేశించారు.

కృష్ణపక్ష అష్టమి - శ్రీకృష్ణాష్టమి

శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన దినం. దీనినే కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని పేర్లు. ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు , మీగడ, వెన్నలను సమర్పించడం ఆచారం.

కృష్ణపక్ష ఏకాదశి - కామిక ఏకాదశి

ఈ దినం ఏకాదశీ వ్రతం, ఉపవాసాలను పాటించడంతో పాటు నవనీతమును దానం చేయడం మంచిది.ఈ ఏకాదశీ వ్రతాన్ని పాటించడం వల్ల మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్ర వచనం.

కృష్ణపక్ష అమావాస్య - పోలాల అమావాస్య

ఇది వృషభాలను పూజించే పండుగ. కాగా కాలక్రమేములో పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. 

శ్రావణమాస వైశిష్ట్యం:- 

ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. శ్రావణమాసము తెలుగు సంవత్సరంలో ఐదవ నెల. ప్రస్తుతం వాడుకలో ఉన్న గ్రెగొరీయన్ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం జూలై, ఆగష్టు నెలల్లో వచ్చును. వర్షఋతువు మూలంగా విరివిగా వర్షాలు పడతాయి.

పంచాంగ ప్రకారంగా ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణానక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. వర్ష రుతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువునికి, ఆయని ధర్మపత్ని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఇరువురికీ అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసం. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు.

శ్రీ మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో అనుకూలమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి. గొప్ప పవిత్రమాసం ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు ఉన్నాయి.

 శ్రావణమాసంలో పండుగలు: 

శ్రావణ శుద్ధ విదియ అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి జయంతి.

- శ్రావణ శుద్ధ చతుర్థి నాగుల చవితి

- శ్రావణ శుద్ధ పంచమి గరుడ పంచమి , కల్కి జయంతి

- శ్రావణ శుద్ధ ఏకాదశి పుత్రదా ( సర్వేషాం) ఏకాదశి

- శ్రావణ శుద్ధ ద్వాదశి వరలక్ష్మి వ్రతం, దామోదర ద్వాదశి.

- శ్రావణ శుద్ధ త్రయోదశి శని త్రయోదశి

- శ్రావణ శుద్ధ చతుర్దశి వరాహజయంతి.

- శ్రావణ పూర్ణిమ రాఖీ పూర్ణిమ,  జంధ్యాల పూర్ణిమ, శ్రీ హయగ్రీవ జయంతి, శ్రీ విఖానస జయంతి, సంస్కృత భాషా దినోత్సవం

- శ్రావణ బహుళ చవితి సంకటహర చతుర్ధి

- శ్రావణ బహుళ అష్ఠమి కృష్ణాష్టమి, ఉట్లోత్సవం.

శ్రావణ బహుళ ఏకాదశి అజ ఏకాదశి, స్వాతంత్ర్య దినోత్సవం

- శ్రావణ బహుళ చతుర్దశి మాసశివరాత్రి

- శ్రావణ బహుళ అమావాస్య పొలాల అమావాస్య.

శ్రావణమాసం వచ్చిందంటే, పిల్లల నుండి పెద్దల వరకు ఆనందించని వారుండరు. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మికానందాన్ని కూర్చేది శ్రావణం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీశోభతో నిండి, ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి.

ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు వర్షఋతువు అనగా శ్రావణ, భాద్రపద మాసముల కాలం, ఈ సమయంలో వేదాధ్యయన కాలంగా చెప్పబడినది. అసలు 'శ్రావణ'మనే ఈ మాస నామమునందే వేదకాలమనే అర్ధం ఉన్నది. శ్రవణమనగా "వినుట"అని అర్థం. వేదము గ్రంధమువలె పఠనం చేసేది కాదు. విని నేర్వదగినది. దీనిని వినిపించేవాడు గురువు. విని నేర్చుకొనే వారు శిష్యుడు. ఈ వేదమునకే 'స్వాధ్యాయ'మనేది మరో నామం.

వేదాధ్యయనం చేసే వానికి మోహం తొలగి బ్రహ్మ స్వరూపం అర్ధమౌతుందని రామాయణమందు చెప్పబడినది. దీనిని బట్టి శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగమునందే చెప్పబడినట్లు తెలుస్తున్నది. స్త్రీలకూ వేదపఠనంతో సమానమైన లలితా సహస్ర నామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు, మోహమును తొలగించి సౌభాగ్యము నిచ్చేవి. అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళ గౌరీ వ్రతమును ఐదు సంవత్సరాల పాటు నిర్వర్తిస్తారు.

పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. పూర్ణిమనాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి వారితో సోదర ప్రేమను పంచుకొంటూ ఈ ఆనందానికి సంకేతంగా వారినుండి బహుమతులను పొంది హృదయానందాన్ని పొందుతారు. "గృహిణీ గృహముచ్యతే" అని చెప్పినందున ఏ ఇంట్లో గృహిణులు ఆనందంగా ఉంటారో ఆ గృహంలోని వారందరూ ఆనందంగానే ఉంటారు. శ్రావణం ఈ విధంగా సంతోషాన్ని కలిగించేదవుతున్నది.

ఈ మాసంలోనే బహుళ అష్టమినాడు శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన రోజు. కృష్ణాష్టమీ వ్రతాచరణం ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. శ్రావణ పూర్ణిమ రోజు బ్రహ్మచారులు గాని గృహస్థులు గాని శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన సిద్ధికి నూతన యజ్ఞోపవీత ( జంధ్యం ) ధారణ అనేది అనాది ఆచారంగా వస్తున్నది. 

శ్రావణ పూర్ణిమ రోజునే శ్రీ మహావిష్ణువు మనోసంకల్పం వల్ల నైమిశారణ్యం లో శ్రీ విఖానస  మునీంద్రులు ఆవిభవించారు..వీరు చెప్పిన ఆగమ విధానంలోనే చాలా వైష్ణవ ఆలయాలలో నేటికీ అర్చనాదులు జరుగుతున్నాయి..

రైతులకు తమ వ్యవసాయ సాగుకు కావలసిన వర్షాలు విస్తారంగా కురిసి వాతవరణంలో మార్పు చెందడం వలన వ్యవసాయ సాగు కార్యములు నిర్విఘ్నంగా సాగగలవని, తమ మనోరథాలు నెరవేరబోతున్నాయని ఆనందిస్తారు. ఈ విధంగా శ్రావణ మాసం అందరికీ ఆనందాన్నిస్తుంది.

శ్రావణమాసం పరమ పవిత్రం. నిత్యం విశేషాలే..

శ్రావణమాస వార వ్రతాలు/ ప్రత్యేకతలు, ఆచరించాల్సిన నియమాలు : – 

సోమవారం : – విశిష్టమైనదిగా చెబుతుంటారు. ముక్కంటికి సోమవారం ప్రీతీకరమైనది. ఈ రోజున స్వామిని పూజిస్తే..సమస్త శుభాలు కలుగుతాయని చెబుతుంటారు. లింగస్వరూపుడికి అభిషేకాలు, అర్చనలు చేయాలని, దీనివల్ల శుభాలు కలుగుతాయని పండితులు వెల్లడిస్తున్నారు.

మంగళవారం : – శ్రావణమాసంలో వచ్చే ప్రతి మంగళవారం ఎంతో ప్రీతీకరమైన రోజు. దేవతలందరినీ భక్తి శ్రద్ధలతో పూజిస్తే శుభాలు కలుగుతాయని నమ్మకం. గౌరీదేవికి పూజలు చేస్తారు. పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ పూలు అద్ది అక్షింతలతో పూజలు నిర్వహిస్తుంటారు. ఇక కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించాలంటారు. అవివాహితులు కూడా వ్రతాన్ని చేస్తారు.

బుధవారం, గురువారం : ఈ రెండు వారాలకు కూడా ప్రాముఖ్యత ఉంది. బుధవారం మహావిష్ణువు కు, గురువారం రాఘవేంద్ర స్వామి, దక్షిణమూర్తికి ప్రీతికరమైన రోజులు.

శుక్రవారం : ప్రతి శుక్రవారం ఎంతో ప్రాధాన్యమైంది. వరలక్ష్మీ వ్రతాన్ని కొంతమంది ఆచరిస్తుంటారు. మహాలక్ష్మి విగ్రహానికి అలంకరణ చేసి ఇరుగు, పొరుగు, బంధువులను పిలిచి వ్రతాన్ని నిర్వహిస్తారు. వచ్చిన వారికి తాంబూళం, శనగల ప్రసాదం ఇస్తారు. ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగా భావించి గౌరవిస్తారు. వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు గారెలు, పూర్ణాలు, తోచిన విధంగా వాయినాలు ఇస్తుంటారనే సంగతి తెలిసిందే. ఈ వ్రతాన్ని చేసే వారికి అన్ని శుభ శకునాలే కలుగుతాయని నమ్మకం. ఆలయాల్లో, ఇంట్లో కుంకుమార్చనలు చేస్తుంటారు. నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తుంటారు.

శనివారం : శ్రీనివాసుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజున కొంతమంది ఉపవాస దీక్షలు చేస్తుంటారు. (చాలా మంది 7 శనివారాలు వ్రతాన్ని ఈ నెల నుండే ప్రారంభిస్తారు) స్వామి వారికి పూజలు, అర్చనలు నిర్వహిస్తారు. ఈ మాసంలో ప్రతి శనివారం స్వామి వారిని కొలిస్తే..శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం.

శ్రావణమాసం, sravana masam, sravanamasam telugu, shravan month importance, festivals august, varalakshmi vratam.

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.