శివనిర్మాల్యం స్వీకరించవచ్చా? లేదా? Importance Of Shiva Nirmalyam In Hindu Temple

శివ నిర్మాల్యం

శృణుధ్వం మునయస్సర్వే సావధానతయాధునా | 

సర్వం వదామి సంప్రీత్యా ధన్యా యూయం శివవ్రతాః || 

శివ భక్త శ్శుచి శ్శుద్ధ స్సద్ర్వతీ దృఢనిశ్చయః | 

భక్షయేచ్ఛివనైవేద్యం త్యజేద గ్రాహ్య భావనామ్‌ || 

దృష్ట్వాపి శివనైవేద్యం యాంతి పాపాని దురతః | 

భుక్తే తు శివనైవేద్యే పుణ్యాన్యాయంతి కోటిశః || 

అలం యాగసహస్రేణాప్యలం యాగార్బుదైరపి | 

భక్షితే శివనైవేద్యే శివసాయుజ్యమాప్నుయాత్‌ ||

సర్వమును ప్రేమతో చెప్పెదను. శివవ్రతులగు మీరు ధన్యులు. బాహ్యమందు, అంతరమందు శుచి గలవాడు, దృఢనిశ్చయము, ధృఢవ్రతము గలవాడు నగు శివభక్తుడు 'తీసుకోరాదేమో' అను భావనను వీడి శివనైవేద్యమును భక్షించవలెను. శివ నైవేద్యమును చూచినంతనే పాపములు దూరముగా తొలగును. శివ నైవేద్యమును భక్షించినచో కోటి పుణ్యములు లభించును. వేలాది, లక్షలాది యాగములను చేయబనిలేదు. శివనైవేద్యమును భక్షించిన వ్యక్తి శివసాయుజ్యమును పొందును.

యద్గృహే శివనైవేద్య ప్రచారోస్పి ప్రజాయతే | 

తద్గృహం పావనం సర్వ మన్యపావన కారణమ్‌ || 

ఆగతం శివనైవేద్యం గృహీత్వా శిరసా ముదా | 

భక్షణీయం ప్రయత్నేన శివస్మరణ పూర్వకమ్‌ || 

ఆగతం శివనైవేద్యమన్యదా గ్రాహ్యమిత్యపి | 

విలంబే పాపసంబంధో భవత్యేవ హి మానవే || 

న యస్య శివనైవేద్య గ్రహణేచ్ఛా ప్రజాయతే | 

స పాపిష్ఠో గరిష్ఠ స్స్యాన్నరకం యాత్యపి ధ్రువమ్‌ || 

ఏ గృహములో శివనైవేద్యమును భక్షించి, ఇతరులకు ఇచ్చెదరో, ఆ ఇల్లు పవిత్రమగును. ఇంటిలోని వారిని, ఇంటికి వచ్చిన వారిని పవిత్రముచేయును. భక్తుడు తనకు లభించిన శివనైవేద్యమును ఆనందముతో వినయముగా స్వీకరించి, శివుని స్మరిస్తూ శ్రద్ధగా భక్షించవలెను. శివనైవేద్యము లభించినప్పుడు, మరియొకప్పుడు తీసుకొనవచ్చుననే భావనతో ఆలస్యము చేసిన మానవుడు తప్పక పాపమును పొందును. శివనైవేద్యమును తీసుకొనవలెననే కోరిక ఎవనికి కలుగదో, వాడు మహాపాపియై, నిశ్చయముగా నరకమును పొందును.

హృదయే చంద్రకాంతే చ స్వర్ణరూప్యాది నిర్మితే | 

శివదీక్షావతా భక్తే నేదం భక్ష్యమితీర్యతే || 

శివదీక్షాన్వితో భక్తో మహాప్రసాద సంజ్ఞకమ్‌ | 

సర్వేషామపి లింగానాం నైవేద్యం భక్షయేచ్ఛు భమ్‌ || 

అన్యదీక్షా యుజాం నృణాం శివభక్తి రతాత్మనామ్‌ | 

శృణుధ్వం నిర్ణయం ప్రీత్యా శివనైవేద్యభక్షణే || 

శాలగ్రామోద్భవే లింగే రస లింగే తథా ద్విజాః | 

పాపాణే రాజతే స్వర్ణే సుర సిద్ధ ప్రతిష్ఠితే || 

కేసరే స్ఫాటికే రాత్నే జ్యోతిర్లింగేషు సర్వశః | 

చాంద్రాయణ సమం ప్రోక్తం శంభోర్నైవేద్య భక్షణమ్‌ || 

హృదయమునందు గాని, లేక చంద్రకాంతమాణిక్యము, బంగారము, వెండి మొదలగు వాటితో నిర్మించిన లింగముల యందుగాని విరాజిల్లే శివునకు నైవేద్యమిడి ఆ భక్ష్యమును శివదీక్షలో నున్న భక్తుడు భక్షించవలెనని బుుషులు చెప్పిరి. శివదీక్షను పొందిన భక్తుడు మహాప్రసాదము అనబడే, శుభకరమగు, అన్ని లింగముల నైవేద్యమును భక్షించవలెను. ఇతర దీక్షలు గల మానవులు శివభక్తి యందు లగ్నమైన మనస్సు గల వారైనచో, వారు ప్రీతితో శివనైవేద్యమును భక్షించుట అను విషయములో గల నిర్ణయమేమనగా శాలగ్రామము నందు ఉద్భవించిన లింగము, రసలింగము, శిలాలింగము, వెండి లింగము, బంగరు లింగము, దేవతలచే మరియు సిద్ధులచే ప్రతిష్ఠింప చేసిన లింగములు, అన్ని జ్యోతిర్లింగములు అను వాటి యందు విరాజిల్లే శివుని నైవేద్యమును భక్షించిన భక్తునకు చాంద్రాయణ వ్రతము చేసిన ఫలము లభించును.

బ్రహ్మహాపి శుచిర్భూత్వా నిర్మాల్యం యుస్తు ధారయేత్‌ | 

భక్షయిత్వా ద్రుతం తస్య సర్వపాపం ప్రణశ్యతి || 

చండాధికారో యత్రాస్తి తద్భోక్తవ్యం న మానవైః | 

చండాధికారో నో యత్ర భోక్తవ్యం తచ్చ భక్తితః || 

బాణ లింగే చ లౌహే చ సిద్ధే లింగే స్వయంభువి | 

ప్రతిమాసు చ సర్వాసు న చండోధికృతో భవేత్‌ || 

స్నాపయిత్వా విధానేన యో లింగస్నపనోదకమ్‌ | 

త్రిః పిబేత్‌ త్రివిధం పాపం తస్యేహాశు వినశ్యతి || 

ఎవరైతే శుచియై శివుని నిర్మాల్యమును ధరించి, ప్రసాదమును భక్షించునో, వాడు బ్రహ్మహత్యను చేసిన వాడైననూ, వాని పాపమంతయూ వెంటనే పూర్తిగా నశించును.  చండీశ్వరుని అధికారము గల ప్రతిష్ఠలో మానవులు నైవేద్యమును భక్షించరాదు. చండీశ్వరాధి కారము లేని దేవళములో నైవేద్యమును భక్తితో భక్షించవలెను. బాణలింగము, లోహ నిర్మితలింగము, సిద్ధ ప్రతిష్ఠిత లింగము, స్వయం భూలింగము, మరియు అన్ని రకముల శివప్రతిమల విషయములో చండీశ్వరునకు అధికారము ఉండదు. ఎవరైతే లింగమునకు యథావిధిగా అభిషేకమును చేసి, ఆ తీర్థమును మూడుసార్లు స్వీకరించునో, వాని మూడు విధముల పాపములు వెను వెంటనే నశించును.

అగ్రాహ్యం శివనైవేద్యం పత్రం పుష్పం ఫలం జలమ్‌ | 

శాలగ్రామ శిలా సంగాత్సర్వం యాతి పవిత్రతామ్‌ || 

లింగోపరి చ యద్దవ్య్రం తద గ్రాహ్యం మునీశ్వరాః| 

సుపవిత్రం తద్‌ జ్ఞేయం యల్లింగ స్వర్శ బాహ్యతః || 

నైవేద్య నిర్ణయః ప్రోక్త ఇత్థం వో ముని సత్తమాః |

శృణుధ్వం బిల్వ మహాత్మ్యం సావధానతయాస్స్దరాత్‌ || 

గ్రహింపదగని శివనైవేద్యము, పత్రము, పుష్పము, ఫలము, జలము ఇత్యాది సర్వముల శాలగ్రామ శిలయొక్క స్పర్శ చేతపవిత్రతను పొందును. లింగముపైన ఉంచబడిన ద్రవ్యమును గ్రహించరాదు. కాని, లింగస్పర్శకు బయట నున్న శివనైవేద్యము మిక్కిలి పవిత్రమని తెలియవలెను.

Famous Posts:

సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ


తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?


సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

Tags : శివనిర్మాల్యం, Shivanirmalya, Shivalayam, Shiva Abhisekham

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS