గర్భములో శిశువు పిండ రూపంలో భగవంతుని ఎలా ప్రార్థిస్తాడు..
స్త్రీ గర్భములోనే శేష దు:ఖముతో జీవుడు ప్రవేశిస్తాడు. ఫలదీకరణము జరిగిన తరువాత శిశువు పరిణామక్రమము. ఒక రోజుకు ఖలిలమౌతాడు. ఐదు రోజులకు బుద్భుదాకారము పొందుతుంది. పది రోజులకు బదరీఫలములాగా కఠినమైన మాంసపు ముద్దగా తయారవుతాడు.
ఒక నెలకు శిరస్సు ఏర్పడుతుంది. రెండు నెలలకు బాహువులు తదితర అవయవాలు ఏర్పడుతాయి. మూడు నెలలకు గోళ్లు, రోమాలు, చర్మము, లింగము, నవరంధ్రములు ఏర్పడుతాయి. నాలుగు నెలలకు సప్త ధాతువులు ఉద్భవిస్తాయి. ఐదు నెలలకు ఆకలి దప్పికలు ఏర్పడుతాయి. ఆరు నెలలకు జరాయువు, మావిచేకప్పబడి గర్భంలో దక్షిణాన తిరుగుతుంటాడు.
మాతృ భుక్తాన్న పానీయాలచే క్రమక్రమంగా వృద్ది చెందుతూ దుర్గంధ భూయిష్టమైన మల మూత్రాల గుంటలో ఉన్న పురుగులు, సుకుమారమైన శరీరాన్ని కరుస్తూ ఉండగా, ఆ బాధకు తట్టుకోలేక మాటిమాటికి మూర్చబోతాడు. నరకయాతన, నరకాను భవము జీవుడు మాతృ గర్భంలోనే అనుభవించడం ప్రారంభమవుతుంది.
తల్లి తీసుకునే ఆహారములోని, దుస్సాహాలైన కట్వాములు (ఉప్పు) లవణాది పదార్థముల వలన సర్వాంగాల యందు వేదన కలుగుతూ ఉంటుంది. మావి చేత ప్రేవుల చేత చుట్టబడి వక్రీభూతమై పృష్ఠశిరోధరుడై, అధశిరస్కుడై తల్ల కిందులుగా ఉంటాడు. పంజరంలో పక్షిలాగా జీవుడు గర్భంలో బంధింప బడి ఉంటాడు.
అప్పుడు భగవంతుని దయ వలన, పూర్వ జన్మలలో చేసిన పాపములు గుర్తొస్తాయి. అపుడు గత జన్మలో చేసిన పాప పుణ్యముల కారణంగానే కదా ఈ జన్మమునకు వచ్చింది, అని బాధ పడుచూ ఉంటాడు. కర్మ ఫలితం అనుభవించడానికే కదా మరలా ఈ జన్మ అని గుర్తుకు వచ్చి బాధపడుతూ ఉంటాడు.
అలా పరితపిస్తూ జీవుడు బంధభూతాలైన సప్తధాతువులు కలిగి, భగవంతుని మీద కృతజ్ఞతతో (మరలా మానవ జన్మ ఇచ్చినందుకు) గద్గద స్వరంతో భగవంతుని ప్రార్థించడం గర్భంలోనే ప్ర్రారంభిస్తాడు.
గత జన్మలలో చేసిన పాపపుణ్యముల సంఘాతమే కదా ఈ మానవజన్మ. అని తలంచుచూ భగవంతునికి మాతృ గర్భంలో ఉన్నప్పుడే మాట ఇస్తాడు. ప్రమాణం చేస్తాడు. ఓ శ్రీహరీ నీ మాయచే మోహితుడు కావడం వలన బిడ్డలు, భార్య, అహంకారము, మమకారము, కామము వీటియందు పడి, సంసార నిమగ్నుడనై, సంసారమే బ్రతుకని మంచి, చెడులను విడచి ధర్మము, అధర్మము అని చూడకుండా, ధన సంపాదనే ధ్యేయంగా, చేయకూడని, చెప్పుకోలేని పాపములు జరగడానికి కారకుడయ్యాను.
అలా సంపాదించిన ధనము, భాగ్యములను నా భార్యాబిడ్డలు అనుభవించుచున్నారే కానీ నన్ను గురించి పట్టించుకోవడం లేదు. నేను సంపాదించిన ఆస్తిపాస్తులు బిడ్డల పాలు పాపములు మాత్రం నా పాలు అయినది.
ఓ భగవంతుడా ఈ దుర్గంధముతో ఈ గర్భములో ఇక ఉండలేను. దయచేసి నన్ను బయటపడవేయుము. నేను బయటపడితే ఈ సారి పాపకృత్యముల జోలికిపోను. నన్ను నమ్ముము. మీ చరణారవిందములను విడువను. ఎల్లప్పుడూ మీ చరణాలనే స్మరిస్తూ ఉంటాను. ఈ సారైనా ముక్తి పొందడానికి ప్రయత్నము చేస్తాను.
ఈ సారి నాకు సంసారబంధములను కట్టబెట్టవద్దు. పొరపాటున కూడా సంసారము జోలికి పోను. పరాత్పరా ఈ మల మూత్ర కూపములోని దుర్గంధమును భరిచలేక, మరియు జఠరాగ్ని రూపంలోని వేడి వలన మాడిపోవుచున్నాను. భరించలేకున్నాను. నన్ను బయట పడవేయుము. మిమ్ములను మరచిపోను అని ప్రార్థిస్తాడు జీవుడు.
మరి మాతృ గర్భంలో భగవంతునికి ఇచ్చిన మాటను మనము నిలబెట్టుకుంటున్నామా? ఆలోచించండి. మీరే తగు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మనము విజ్ఞులము !
Famous Posts:
Tags: గర్భము, pray, baby, womb, pregnate, god pray