Drop Down Menus

మనిషి తెలిసిగాని తెలియకగానీ చేసే కొన్ని తప్పులకు ఈ విధంగా వినాయక శాంతి స్నానం చేయించాలి | Vinayaka Shanti Stanam

వినాయక శాంతి స్నానం..

'మునులారా! మనిషి తెలిసిగాని తెలియకగానీ చేసే కొన్ని పనులు దేవతలకు కోపం తెప్పిస్తాయి. వారు అప్రసన్నులౌతారు. అలా వినాయకుని అప్రసన్నతకు గురైన వారు ఆ విషయాన్ని తెలుసుకొనే అవకాశాన్ని ఆయనే కల్పించాడు' అంటూ వారి లక్షణాలను ఇలా చెప్పనారంభించాడు యాజ్ఞవల్క్య మహర్షి పుంగవుడు.

'వారికి స్వప్నాలెక్కువగా వస్తుంటాయి. ఆ కలలు కూడా స్నానం చేస్తున్నట్లు వస్తాయి. మరి కొన్ని కలల్లో మరణించిన ప్రాణుల తలలు మాత్రమే కనిపిస్తుంటాయి. కలలోనే కాక ఇలలో కూడా వారెపుడూ ఉద్విగ్నులై ఆత్రుతపడుతునే వుంటారు. వారే ప్రయత్నం చేసినా సఫలం కాదు. ఏ కారణమూ లేకుండానే నొప్పులు బాధిస్తుంటాయి. వినాయకుని అప్రసన్నతకు గురైన రాజు రాజ్యాన్ని కోల్పోతాడు; కన్యకు పతి దొరకడు; గర్భిణికి కొడుకు పుట్టడు. కాబట్టి ఇలాంటివారే కాదు ఎలాంటి వారైనా ఈ శాంతిని చేయించాలి.

అప్రసన్నతకు గురైన మనిషికి బంధువులూ బ్రాహ్మణులూ కలిసి ఇలా స్నానం చేయించాలి. భద్రాసనం మీద కూర్చుండబెట్టి బ్రాహ్మణులు స్వస్తివాచన పూర్వకంగా ఈ స్నానాన్ని చేయించాలి. పచ్చ ఆవాలను పొడిగావించి నేతితో కలిపి ముద్దచేసి దానినా వ్యక్తి శరీరంపై నలుగుడు పెట్టాలి. తరువాత అతని లేదా ఆమె యొక్క తలకు సర్వౌషధాలూ, సుగంధద్రవ్యాలూ కలిపి తయారు చేసిన నూనెను పట్టించాలి. ఔషధ మిశ్రితమైన నీటితో నాలుగు కుండలను నింపి వుంచి నలుగుడు పిండిని పూర్తిగా లాగివేసి తలపై పట్టించిన నూనె కాస్త తడియారగానే ఒక్కొక్క కుండనూ (ఈ కుండల్లో నీరు పోయడానికి ముందే పుణ్యనది, సరోవరం వంటి అయిదు పవిత్ర జలాశయాల నుండి తెచ్చిన మట్టినీ, గోరోచనాన్నీ, గంధాన్నీ, గుగ్గిలాన్నీ వేసి వుంచాలి) ఆ వ్యక్తి నెత్తి పై నుండి పోస్తూ స్నానం చేయించాలి.

మొదటి కలశలోని నీటిని పోస్తూ ఆచార్యుడు ఈ శ్లోకాన్ని చదవాలి. (మంత్ర) ఈ మంత్ర శ్లోకాన్ని చదవాలి.

సహస్రాక్షం శతధారమృషిభిః పావనం స్మృతం |

తేన త్వామభిషించామి పావమాన్యః పునంతుతే |

సహస్ర నేత్రాలూ (సహస్ర శక్తులని ఉద్దేశ్యం), అసంఖ్యాక ధారలూ, మహర్షిబృందం పవిత్రములనీ పవిత్రీకరములనీ ఆదేశించిన పవిత్రజలాలతో (వినాయక గ్రస్తుడవైన నిన్ను) అభిషేకిస్తున్నాను. ఉపద్రవశాంతి నీకగుగాక అని దీని భావము. -

రెండవ కలశాన్ని ఈ క్రింది మంత్రయుక్త శ్లోకాన్ని పఠిస్తూ ఆ వ్యక్తి తలపై వంచి అభిషేకించాలి.

భగంతే వరుణోరాజా భగం సూర్యో బృహస్పతిః ||

భగమింద్రశ్చవాయుశ్చ భగం సప్తర్షయో దదుః ।

మూడవ కలశలోని నీటితో వ్యక్తి నభిషేకిస్తూ ఈ మంత్ర పూత శ్లోకాన్ని చదవాలి.

యత్తే కేశేషు దౌర్భాగ్యం సీమంతే యచ్చ మూర్ధని ॥ 

లలాటే కర్ణయోరక్షో రాపస్తద్రఘ్నంతు తే సదా !

నీ సర్వాంగాలనూ పట్టిన దరిద్రం నేటితో ఈ నీటి పవిత్రత వల్ల కడుక్కుపోవాలి గాక అని ఈ శ్లోకభావం.

అనంతరం నాల్గవ కుండలోని నీటిని పోస్తూ పై మూడు శ్లోకాలనూ పఠించాలి. ఎడమ చేతిలో కుశదర్భలను తీసుకొని, బ్రాహ్మణుడు, ఆ వ్యక్తి యొక్క తలను స్పృశిస్తూ మేడి కర్రనుండి చేసిన స్రువ (చెంచాలాటిదేకాని కర్రచివర గోయి వుంటుంది. యజ్ఞాలలో వాడతారు) తో ఆవనూనెను కుడి చేతితో తీసుకొని అగ్నిలో ఆహుతులను సమర్పించాలి. ఈ ఆహుతులను ఈ క్రింది మంత్రాలు చదువుతూ వేయాలి.

మితాయస్వాహా, సమ్మితాయ స్వాహా, శాలాయ స్వాహా, కటంకటాయ స్వాహా, కూష్మాండాయ స్వాహా, రాజపుత్రాయ స్వాహా*

తరువాత లౌకిక అగ్నిలో గిన్నెలో, బియ్యంతో, అన్నాన్ని వండి చరు (హోమగుండంలో వండినలేదా వేసెడి అన్నం) ని తయారు చేసి దానిని ఇంతకు ముందు చెప్పబడిన ఆరు స్వాహా మంత్రాలతో ఆ లౌకికాగ్నిలోనే హవనం చేసి మిగిలిన దానిని ఇంద్రాగ్నియమాది దేవతలకు బలుల కింద సమర్పించాలి. ఆపై ఒక అరుగుపై దర్భలను పఱచి, దానిపై పుష్ప, గంధ, ఉండేరకమాల, పక్వాన్న, పాయసాలూ, నేయి కలిపిన పులావు, ముల్లంగి (ప్రత్యేకం) గడ్డి, అప్పాలు, పెరుగు, బెల్లంవుండలు, లడ్లు, చెఱకుముక్కలు ఈ ద్రవ్యాలన్నిటినీ చేర్చివుంచాలి.

వినాయక జననియైన దుర్గాదేవిని ప్రతిష్ఠించి చేతులు జోడించి నమస్కరించి, అర్ఘ్యమివ్వాలి. పుత్ర సంతానం కావలసిన స్త్రీ దూర్వా, సరసపుష్పాలతో భగవతి పార్వతీ దేవి నర్చించి స్వస్తివచనాలతో బాటు ఈ క్రింది ప్రార్థనా శ్లోకాన్ని చదవాలి.

రూపందేహియశోదేహి భగం భగవతి దేహి మే ।

పుత్రాందేహి శ్రియందేహి సర్వాన్ కామాంశ్చదేహి మే ॥

తరువాత బ్రాహ్మణులను భోజనాలతో తృప్తి పఱచాలి. గురువుగారికి రెండు వస్త్రాలనిచ్చి (అంటే గురు గ్రహానికి) అన్యగ్రహాలను పూజించి మరల ప్రత్యేకంగా సూర్యార్చన చేయాలి. ఈ విధంగా వినాయకునీ గ్రహాలనూ, పూజించిన వ్యక్తులు సర్వకార్యాల్లోనూ సాఫల్యము నందగలరు.

Tags: వినాయక శాంతి స్నానం, Vinayaka Shanti  Stanam, Vinayaka, Ganapathi Pooja, Vinayaka Santhi Pooja Telugu

ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON