శ్రీ పార్వతీ కల్యాణం పారాయణచేయువారికి సకల శుభాలు కలుగుతాయి | Parvathi Kalyanam Telugu Parayanam Benefits
శ్రీ పార్వతీ కల్యాణం పారాయణచేయువారికి, స్త్రీ, పురుషులు వివాహము కానివారికి వివాహం, అన్యోన్య దాంపత్యము, సంతానములేనివారికి మంచి సంతానం కలుగును.
శ్రీ విభుడాత్మనేత్రసరసీరుహపూజనొనర్చి యే మహా దేవుని సుప్రసాదనియతింగొనే సర్వసు పర్వచక్ర రా క్షావహమైన చక్రము సుధాంశుడికెవ్వని జెంది దక్ష శా పావధినొందె నట్టి సదయాత్ము శివున్ పరమాత్ము గొల్చెదన్ ॥
మహావిష్ణువు తన నేత్రపద్మాలతో పూజించగా సమస్త దేవతా సమూహాన్ని రక్షించే చక్రాన్ని ఇచ్చిన, తన నాశ్రయించిన దక్షుని శాపం నుంచి చంద్రునకు విముక్తిని కలిగించిన గొప్ప దయామయుని, పరమాత్ముని, శివుని నేను కొలుస్తాను.
వాగర్థావివ సంపృత్తా వాగర్థః ప్రతిపత్తయే | జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ॥ పాఠకుల మనసులను ఆకర్షించే శబ్దార్థములు సిద్ధించుటకై శబ్దార్థములకు అధిదేవతలు లోకాలకు తల్లిదండ్రులైన ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులకు నేను నమస్కరిస్తున్నాను.
మన ప్రాచీన పురాణ, ఇతిహాస, ధర్మశాస్త్రాల్లో అన్ని కాలాలకు చెందిన స్త్రీ పురుషులందరికీ మేలుని కలిగించే విశేషములైన అంశాలెన్నో ఉన్నాయి. వాటిలో పార్వతీ కల్యాణం సీతాకల్యాణం, రుక్మిణీ కల్యాణం, చాలా ముఖ్యము లైనవి. శ్రీ పార్వతీ కల్యాణకథ శివమహాపురాణంలోను, వాయుపురాణంలోను, స్కాంద మహాపురాణంలోను వివరంగా వర్ణింప బడింది. తరువాత మహాకవి కాళిదాసు “కుమారసంభవమ్” అనే పేరుతో సంస్కృతంలో ఒక మహా కావ్యాన్ని వ్రాశాడు. ఈ పార్వతీకల్యాణాన్ని భక్తితో చదివిన స్త్రీ, పురుషులకెవరి కైనా వెంటనే పెళ్ళి జరిగి ఆ దంపతులకు గొప్ప సాహసవంతుడైన, సుగుణ వంతుడైన కొడుకు పుడతాడు. వాళ్ళ ఇంట ఏవిధములైన దుష్టగ్రహదోషాలు కలగవు.
పార్వతీదేవి పుట్టుట
దక్షప్రజాపతి తన కుమార్తెలలో పెద్దదైన సతీదేవిని ఈశ్వరునకిచ్చి పెళ్ళి చేశాడు. ఒకసారి ఈశ్వరునిపై కోపంతో సతీపరమేశ్వరులను ఆహ్వానించ కుండగానే ఒక యజ్ఞాన్ని చెయ్యడానికి సిద్ధపడ్డాడు. ఆమె విషయం తెలుసుకుని సతీదేవి తన భర్త అనుమతితో దక్షుని యజ్ఞశాలకు వెళ్ళింది. అక్కడ దక్షుడు పరమశివుని చాలా తీవ్రంగా దూషించాడు. శివదూషణని భరించలేని సతీదేవి అక్కడే యోగాగ్నిలోపడి దగ్ధురాలైంది.
దేవభూమి అయిన ఉత్తరదిక్కున దేవ స్వరూపుడైన హిమవంతుడనే పర్వతరాజు తూర్పు పశ్చిమ దిక్కులకు ఆవరించి ఉన్నాడు. అతడు తన పితృదేవతల మానసపుత్రిక అయిన మేనకాదేవిని పెళ్ళిచేసుకున్నాడు. ఆ దంపతులకు సుగుణవంతుడైన కొడుకు పుట్టాడు. వానికి మైనాకుడు. అనిపేరు పెట్టారు.
తరువాత యోగాగ్నిలో దగ్ధురాలైన సతీదేవి పరమశివుడే ధ్యానిస్తూ మేనకాదేవి గర్భంలో ప్రవేశించి మేనకాహిమవంతుల కుమార్తెగా పుట్టింది. ఆమె గౌరవర్ణంలో ఉండటంచేత ఆమెకు గౌరి అనిపేరు. పెట్టారు. పర్వతరాజు పుత్రిక అయినందున ఆమెను జనులందరు పార్వతి. అని పిలిచారు. పార్వతి శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమాను రాలైంది. కాలానుగుణంగా ఆమె యౌవనవతి అయింది.
పరమశివుడు సతీదేవి వియోగాన్ని భరించలేక హిమవత్పర్వత చరియ లలో తీవ్రమైన తపస్సు చేయప్రారంభించాడు. ఆ విషయాన్ని తెలుసుకుని హిమవంతుడు పరివారంతోపాటుగా తన కుమార్తెను వెంటపెట్టుకుని ఈశ్వ రుడు తపస్సు చేసే ప్రదేశానికి వెళ్ళి ఆయనకు పరిచర్యలు చెయ్యమని స్వయంగా తన కుమార్తె అయిన పార్వతిని నియమించాడు. పార్వతీదేవి స్వయంగా భక్తితో పువ్వులు, సమిధలు, దర్భలు ఈశ్వరునకు సమకూర్చి పెడుతూ ఆయన తపస్సుకి భంగం కలగకుండా పరిచర్య చేస్తున్నది.
తారకాసురుడు పెడుతున్న బాధలను భరించలేక దేవతలందరూ దేవేంద్రునితో కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు. బ్రహ్మ ప్రత్యక్షమై దీనంగా ఉన్నవాళ్ళను చూశాడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మను గొప్పగా స్తుతించారు. "బ్రహ్మదేవా ! సృష్టికిముందు ఒక్కడవే అయిన నీవు సత్త్వరజస్తమో గుణాలను మూడింటిని విభజించి భేదస్వరూపుడవైన నీకు నమస్కారము.
నీవు జలములందుంచిన వీర్యము వలన చరాచరా.. త్మకమైన విశ్వము ఆవిర్భ వించింది. అందుచేతనే నిన్ను ప్రపంచమునకు కారణుడవని చెపుతున్నారు. నీవే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టించి సృష్టిస్థితి సంహారములకు కారణు డవయ్యావు. స్త్రీ పురుషులను సృష్టించాలనే కోరికతో నీ దేహభాగాలే తల్లి దండ్రులని చెపుతున్నారు.
బ్రహ్మదేవా ! నిన్ను నీవే సృష్టించుకుంటున్నావు. నిన్ను నీవే తెలుసుకుంటు న్నావు. నీలో నీవే లయమవుతున్నావు. ఇతరులు అపేక్ష నీకు కొంచెం కూడాలేదు. నీవు ద్రవస్వరూపుడవు, కఠినస్వరూపుడవు, స్థూలము, సూక్ష్మము, కార్యము, కారణము, అణువుల్లో అణువుగా మహత్తులకు మహత్తుగా ఉంటున్నావు. ముందుగా ఓంకారాన్ని కలిగి, ఉదాత్తానుదాత్త స్వరాలను కలిగి, యజ్ఞము పనిగా, స్వర్గము ఫలితంగా కలిగిన వేదాలకు నీవేకారణుడవు అవుతున్నావు.
భోగమోక్షాలరూపమైన నిన్ను ప్రకృతికి సాక్షివైన పరమాత్మవు అని చెపుతున్నారు. నీవు పితృదేవతలకే తండ్రివి. దేవతలకు దేవుడవు. పరమునకంటే పరమైనవాడవు. నీవే హవ్యము, నీవే హోతవు, నీవే యజమానివి. భోజ్యము, భోక్త, భుజింపచేసేవాడవు నీవే నీకంటే రెండవది లేదు.” ఈ విధమైన దేవతల యథార్థ స్తోత్రానికి సంతోషించిన బ్రహ్మ దేవతలను అనుగ్రహించి పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అనే నాలుగు విధాలైన భాష నాలుగు ముఖాలనుంచి వెలువడింది. దేవతల యోగక్షేమాలను అడిగాడు. వాళ్ళ ముఖాలు కాంతివిహీనములై ఉండటానికి కారణాన్ని అడిగాడు. తారకాసురుని వలన తాము పడుతున్న బాధలను వివరించి వాణ్ణి సంహరించమని దేవతలు ప్రార్థించారు.
అప్పుడు బ్రహ్మ చెప్పాడు. "మీ కోరిక నెరవేరుతుంది. కానీ నేను వాణ్ణి సంహరించలేను. వాణ్ణి నేనే వృద్ధిపొందించాను. విషవృక్షాన్నైనా తానే పెంచి తానే నరుకుట తగినదికాదు కదా! వాణ్ణి చంపడానికి ఈశ్వర రేతస్సు నుంచి పుట్టినవాడే సమర్థుడవుతాడు కాని మరెవ్వనికి సాధ్యం కాదు. ఈశ్వరుని రేతస్సును పార్వతి మాత్రమే భరింపగలదు.
అందు వలన ఇనుము అయస్కాంతముచేత ఆకర్షింప బడినట్లుగా శివునకు పరిచర్యలు చేస్తున్న పార్వతిమనస్సును పరమేశ్వరుడు ఆకర్షించేటట్లుగా ప్రయత్నించండి. ఆ పార్వతీపరమేశ్వరుల కుమారుడు మీకు సేనాని అవుతాడు.” ఈ విధంగా చెప్పి బ్రహ్మ అంతర్ధానం చెందాడు. దేవతలు కూడా కార్యాన్ని చక్కపెట్టడానికి దేవలోకానికి వెళ్ళిపోయారు.
అప్పుడు దేవేంద్రుడు పరమేశ్వరుని మనసును చలింపచేయగలిగే శక్తి మన్మథునకుమాత్రమే ఉన్నదని నిశ్చయించి మనసులో తలుచు కున్నాడు. వెంటనే మన్మథుడు స్త్రీల కనుబొమలవంటి అందమైన ధనుస్సుని భుజంపై ధరించి, లేతమామిడి మొగ్గను బాణంగా పట్టుకొని వసంతునితో కలిసి ఇంద్రుని ఎదుటకు వచ్చాడు.
దేవేంద్రుడు మన్మథుని చాలా గౌరవించి తన సింహాసనంపై కూర్చుండపెట్టుకుని "మిత్రమా! నాకు వజ్రాయుధము, నీవును రెండు అస్త్రములు. వజ్రాయుధము తపశ్శాలుర విషయంలో మందమైనది. నీవనే అస్త్రము సర్వకార్యము లలోను సమర్ధమైనది. కార్యసాధనమైనది. నీ బలం నాకు తెలుసును, కావున నాతో సమానుడవైన నిన్ను దేవకార్యసాధనకై నియోగిస్తున్నాను.
తపస్సులో నిమగ్నుడై ఉన్న పరమేశ్వరుని పార్వతి సేవిస్తు న్నది. దేవతలను మిక్కిలిగా బాధించే తారకాసురుని చంపగలశక్తి ఈశ్వర రేతస్సునుంచి పుట్టినవానికే ఉన్నది. అందువలన ఈశ్వరుని మనసు పార్వతిని ఆకర్షించునట్లుగా నీ బాణాన్ని ప్రయోగించు. ఈ పనిలో నీకు వసంతుడు సహాయుడవుతాడు. ఈ పని పార్వతీదేవి వలన కావలసి నదే అయినప్పటికీ బీజమే అంకురమును కారణమైనప్పటికీ ఉత్పత్తికంటే ముందు నీరు ప్రధాన మవుతున్నది.
నీవీ పనికి ప్రధానుడవు. నీ బాణప్రయోగం లేకుండా పరమ శివునకు పార్వతిని చూడాలనే ఆసక్తి కలగదు. దీనివలన నీకు కలిగే కీర్తిని గురించి నేను చెప్పనక్కరలేదు.. ఎందుకంటే యాచించేవాళ్ళు దేవతలు. పని మూడులోకాల వాళ్ళది. పని నీ బాణంచేత మాత్రమే సిద్ధిస్తుంది. నీ పరాక్రమం విచిత్రమైనది.” ఈ విధములైన దేవేంద్రుని ఆజ్ఞాపూర్వకములైన మాటలను విని మన్మథుడు తన భార్య అయిన రతీదేవి, స్నేహితుడైన వసంతునితో కలిసి శివుని తపోభూమికి వెళ్ళాడు.
వసంతుడు ప్రకృతినంతనూ ఫలింపచేశాడు. అయిన్పటికీ నందీశ్వరుని ఆజ్ఞవలన అడవి నిశ్చలమైపోయింది. దేవదారు చెట్టు మొదట అరుగుపై పులితోలు పరుచుకొని సమాధిలో కూర్చున్న మహేశ్వరుని మన్మథుడు చూశాడు. ఆ ఈశ్వరుడు వీరాసనంలో ధ్యానం చేస్తున్నాడు. పాములతో జడలను పైకెత్తి కట్టుకున్నాడు.
జపమాలను చేతిలో ధరించాడు. ప్రాణా యామం చేస్తూ ఉన్నాడు. అంతలో వనదేవతలైన చెలికత్తెలతో పువ్వులు మొదలైనవాటిని పట్టుకొని వస్తున్న పార్వతిని మన్మథుడు చూశాడు. పార్వతీ దేవి పరమశివుని దగ్గరకు వచ్చింది. అదేసమయంలో ఈశ్వరుడు తన తేజస్సును సాక్షాత్కరింప చేసుకుని యోగాన్ని విడిచిపెట్టాడు. నంది శివునకు నమస్కరించి సేవాభావంతో పార్వతి వచ్చిన విషయాన్ని చెప్పాడు.
పార్వతీదేవి చెలికత్తెలు తాము తెచ్చిన పువ్వలను శివుని పాదాల దగ్గర పెట్టారు. పార్వతీదేవి కూడా తన జడలో ధరించిన పువ్వులు జారునట్లుగా వంగి నమస్కరించింది. అప్పుడు శివుడామెను సవతిపోరులేని ప్రియుని భర్తగా పొందుమని ఆశీర్వదించాడు.
మన్మథుడు వాళ్ళిద్దరిని దగ్గరగా చూశాడు. తాను పూలబాణాన్ని ప్రయోగించడానికిదే తగిన సమయమని నిశ్చయించుకుని తన వింటి నారిని సంధించాడు. పార్వతీదేవి తామరపూసల తావళాన్ని శివుని చేతికిచ్చింది. ఆ దండని అందుకోవడానికి శివుడు తీసుకోవడానికి సిద్ధపడ్డాడు.
మన్మథుడు బాణాన్ని వింటికి సంధించాడు. అతడు బాణాన్ని ప్రయోగించే లోపులోనే శివునిలో కొంచెం ధైర్యం తగ్గి తన మూడు కళ్ళతోను ఎర్రని పెదవిగల పార్వతి ముఖాన్ని చూశాడు. పార్వతీదేవి కూడా ఒళ్ళంతా పులకరించగా సిగ్గుతో ముఖాన్ని అడ్డంగా తిప్పుకున్నది.
అంతలో జితేంద్రియుడై శివుడు తన మనసు చలించ డానికి కారణ మేమిటా? అని నలువైపులా చూశాడు. అప్పుడు ఎడమకాలిని వంచి బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న మన్మథుని చూశాడు. వెంటనే శివుని మూడవకంటి నుంచి అగ్ని జ్వాలలు బయటకు వచ్చాయి. ఆ జ్వాలలు దేవతలు వారించేలోపులోనే మన్మథుని దహించేశాయి.
తన భర్త కాలిపోవడాన్ని చూసి రతీదేవి మూర్ఛపోయింది. తన తపస్సునకు అడ్డుపడిన పార్వతినుంచి దూరంగా వెళ్ళిపోవాలని ప్రమథగణాలతో పాటుగా అంతర్ధానం చెందాడు. పార్వతి తనకు చెలికత్తెల ఎదుట అవమానం జరిగిం దని భావించి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది.
తన కళ్ళఎదుటనే మన్మథుడు కాలిపోవడం చూసినపార్వతి శివునిచే తన కోరిక నెరవేరక పోవడాన్ని తలుచుకొని తన రూపాన్ని తానే నిందించు కున్నది. ప్రియుడు గుర్తించని అందము వ్యర్థమైనదిగదా! అని నిరాశపడింది. ఏవిధమైన దోషంలేని అందమైన శరీరాన్ని పొంద డానికి తపస్సు చెయ్యాలని నిశ్చయించుకున్నది.
సగము శరీరాన్నిచ్చే భర్తను పొందడానికి తపసు మాత్రమే సాధనమని అనుకున్నది. తన కూతురి నిశ్చయాన్ని తెలుసుకున్న మేనాదేవి "ఉమా" అని పలికింది. తల్లీవద్దు. అందుచేతనే పార్వతిని ఉమాదేవి అని పిలుస్తున్నారు. "తల్లీ! దిరిసెన పువ్వువలె అతికోమలమైన నీ శరీరం రాతివంటి మిక్కిలి కఠినమైన తపస్సును భరించలేదు.” స్థిరమైన నిశ్చయంగలిగిన పార్వతీ దేవి మనసును మేనక మరలించలేకపోయింది. పట్టుదలగల మనసును, లోతునకు ప్రవహించే నీటిని ఎవ్వరూ నిరోధించలేరుగదా!
నిశ్చలచిత్తురాలైన పార్వతి కోరిక తెలుసుకొన్న తండ్రి హిమవంతుని తన కోరిక నెరవేరేవరకు తాను తపసు చేసుకోవడానికి అనుమతినిమ్మని చెలికత్తెచేత అడిగించింది. హిమవంతుడు తన కుమార్తె పట్టుదలకు సంతో షించి ఆమె తపసుచేయడానికి అంగీకరిస్తూ ఒక విశాలమైన శిఖరంమీద ఆమె తపసు చెయ్యడానికి తగినేర్పాట్లను చేయించాడు.
అప్పుడు పార్వతీదేవి తపసుచేసిన శిఖరమే నేడు గౌరీ శిఖరంగా పేరును పొందింది. పార్వతి తపసు ప్రారంభించడానికి ముందు తన అలంకారాలను అన్నింటినీ విడిచి పెట్టేసింది. సూర్యకాంతిగల నారచీరను కట్టుకున్నది. ఆమె ముఖం తలదువ్వి పువ్వులతో అలంకరించినప్పుడెంత అందంగా ఉండేదో తపస్వినిగా జడలు కట్టినప్పుడు కూడా అంతే అందంగా ప్రకాశిస్తున్నది.
తపోనియమాన్ని అనుస రించి పార్వతి ముంజత్రాటిని మూడు పేటలుగా ధరించింది. దానిచేత ఆమె కటిభాగం కందిపోయి ఎర్రగా అయింది. ఆ దేవి పెదవులకు లత్తుక పూయుటకు ఒంటికి మంచిగంధాన్ని పూసుకోవడానికి ఉపయోగించే చేతులు ఇప్పుడు దర్భలను కోయడానికి, జపమాలని తిప్పడానికి ఉపయోగిస్తున్నది.
శ్రేష్ఠమైన మెత్తని ప్రక్కపై పడుకునే పార్వతి తన చేతినే దిండుగా చేసుకుని రాతిపై పడుకుంటున్నది. వ్రతనియమంలో ఉన్న గౌరీదేవి తన విలాసచేష్ఠను తీగలయందును, చంచలదృష్టి ఆడులేళ్ళయందును మాత్రమే నిలిపి ఉంచింది. ఆ పార్వతి తన ఆశ్రమంలో ఉన్న చిన్న చెట్లకు నీళ్ళుపోస్తూ తన కుమారునకు పాలుపడుతున్నట్లుగా ప్రేమను చూపిస్తున్నది నివ్వెర ధాన్యంచేత పార్వతి లేళ్ళను లాలిస్తుండగా అవి ఆమెపై చనువుతో తిరుగుతున్నాయి.
స్నానము, హోమము, నారచీర ధారణము, స్తుతి పాఠము కలిగిన గౌరీ దేవిని చూడడానికి ఒకనాడు మునులు వచ్చారు. ధర్మంచేత పెద్దవాళ్ళ విషయంలో వయసుని ఎంచరుకదా! పార్వతి తపోభూమిలో పరస్పర వైరముగల జంతువులు తమ విరోధాన్ని విడిచిపెట్టడంచేతను, చెట్లు కోరిన పండ్లను ఇవ్వడంచేతను, కొత్త పర్ణశాలల్లో అగ్నిహోత్రము చేయబడటంచేతను ఆ ప్రదేశము చాలా పవిత్రమైనది.
తాను చేస్తున్న తపస్సు వలన ఫలితం సిద్ధించదని గ్రహించిన పార్వతి తన కోమలమైన శరీరాన్ని లెక్కచెయ్యక కఠినమైన తపసునకు సిద్ధపడింది. ఆ దేవి గ్రీష్మకాలంలో నాలుగు దిక్కులలోను ఉన్న అగ్నులతోపాటుగా అయిదవ అగ్నిగా సూర్యుని తేజస్సుచేత వెలుగుతూ పంచాగ్ని తపస్సు చేసింది. ఆవిధంగా తపింపబడిన పార్వతి అయాచితంగా లభించిన నీళ్ళను, చంద్రకిరణాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేసింది.
పంచాగ్ని మధ్యలో తపించిన ఆమె శరీరంపై తొలకరిజల్లులు పడటం చేత కొంత ఉపశమనం కలిగింది. మొదటి వర్షపునీటి బిందువులు ముందుగా ఆమె కనురెప్పలపైపడి పెదవిమీదకు జారి క్రమంగా నాభిలోకి ప్రవేశించింది. క్రమంగా జడివాన కురిసినప్పుడా పార్వతి రాతిమీద పడుకోగా ఆమె తపస్సు నకు సాక్ష్యములవలె మెరుపులు మెరిశాయి. పుష్యమాస రాత్రులలో మంచు పడుతుండగా చల్లని నీటిలో నిలిచి చక్రవాక పక్షులను చూస్తూ ఉన్నది.
లోకంలో ఎండిపోయి రాలిన ఆకులను తినుట గొప్పతపస్సు అని చెపుతారు. కాని ఆ పార్వతి అలా ఎండిరాలిన ఆకులను కూడా తినకుండగా తపస్సు చెయ్యడం వలన ఆమెను పురాణమును తెలిసినవాళ్ళు "అపర్ణ” అని పిలిచారు. తామర తూడువలె మృదువైన ఆమె శరీరము ఈవిధంగా ఎండకు ఎండి వానలో తడిసి చలికి వణికి మహామునుల తపస్సులను అతిక్రమించింది.
మాయా బ్రహ్మచారి రూపంలో శివుడు వచ్చుట
ఒకనాడు నల్లలేడి చర్మమును, మోదుగుదండాన్ని ధరించి నేర్పుతో మాట్లాడగలిగి, బ్రహ్మతేజస్సు చేత ప్రకాశిస్తూ మూర్తీభవించిన బ్రహ్మచర్యా శ్రమంవలె ఉన్న ఒక బ్రహ్మచారి పార్వతీదేవి తపోవనానికి వచ్చాడు. పార్వతీ దేవి ఆయనకు ఎదురువెళ్ళి గౌరవంగా సపర్యలనుచేసి ఆశ్రమానికి తీసుకొని వచ్చింది.
చిత్తస్థైర్యము కలవాళ్ళు సమానులైనప్ప టికీ ఇతరులపై అధికమైన గౌరవాన్ని చూపిస్తారు. విధిపూర్వకంగా పార్వతిచేసిన పూజాసత్కారాలను పొంది కొంతసేపు మార్గాయాసము తీర్చుకొనేవానివలె నటించి ఉమాదేవిని ఏవిధమైన మనోవికారమూ లేకుండా చూస్తూ క్రమపద్ధతిలో మాట్లాడటానికి పూనుకున్నాడు. "హోమాది కర్మలకు సమిధలు, దర్భలు కష్టపడకుండా దొరుకు తున్నాయా? ఇక్కడి నీళ్ళు నీకు స్నానానికి యోగ్యములై ఉన్నాయా? నీ శక్తిని అనుసరించే తపసు చేస్తున్నావుకదా ? ఎందుకంటే ధర్మసాధనాలలో శరీరమే మొదటిదికదా!
నీవు నీళ్ళుపోసి పెంచుతున్న ఈ తీగల చిగుళ్ళు బాగా పెరుగుతున్నాయా? నీ చంచలములైన చూపులచేత లేళ్ళు తమ జాతి దానవే అనే భ్రమతో నీ చుట్టూ తిరుగుతూ నీ చేతిలోని దర్భలను లాగినప్పుడు నీకు వాటిపై కోపం కలగడంలేదుకదా? ఎందుకంటే తపస్సు చేసేవాళ్ళకు కోపం కలగకూడదు. పార్వతీ!
అందము పాపకార్యాన్ని చెయ్యనివ్వదు అనే మాట నీయందు సత్యమై ఉన్నది. అందుచేతనే మునులందరు నిన్నే అనుస రిస్తున్నారు. నీ తండ్రి అయిన హిమవంతుడు నిన్ను కుమార్తెగా పొందడం వలన పవిత్రుడైనట్లుగా మరి ఇతరములైనవాటిచేత పవిత్రుడు కావడంలేదు. నీవు త్రివర్గాలలో ధర్మాన్నిమాత్రమే అనుసరించడం వలన నేను ధర్మమే త్రివర్గాలలో గొప్పదని తెలుసుకొనుచున్నాను.
ఏడు మాటలచేత స్నేహం ఏర్పడుతుందని విద్వాంసులు చెపుతున్నారు. కావున సుందరీ! నన్ను పరాయి వాణ్ణిగా భావించకు. బ్రాహ్మణునకు సహజమైన స్వభావం చేతను, నీతో ఏర్పడిన స్నేహముచేతను గొప్ప సహనగుణం కల నిన్ను ఒకటి అడగాలను కుంటున్నాను. రహస్యముకానిదైతే సమాధానం చెప్పు.
మొదటి బ్రహ్మ అయిన హిరణ్యగర్భుని వంశంలో పుట్టినదానవు, | మూడు లోకాల సౌందర్యము రాశిగా పోసి సృష్టింపబడిన అందగత్తెవు. ఐశ్వర్యసుఖంకోసం నీవు వెదకనక్కరలేదు. కొత్త యౌవన వయస్సులో ఉన్న దానవు. ఇంతకంటే తపసుకి ఫలితమేమిటో చెప్పు. సాధారణంగా స్త్రీలు భరించలేని అవమానాన్ని పొందినప్పుడీ విధమైన తపశ్చర్యకి పూనుకుంటారు.
అటువంటిది నీకు ఎన్నడూ జరగదు. ఎందుకంటే ఇతరులకెవ్వరికీ లభించని విచారములేని రూపసౌందర్యము కలదానవు. నీ తల్లిదండ్రుల వలన నీకెటు వంటి అవమానము కలగదు. ఇంక ఇతరులవలన ఏవిధంగాను అవమానం జరగదు.
పాముపడగపై ఉన్న మణిని పొందడానికి ఎవడూ సాహసించడు గదా! యౌవనంలో ధరించవలసిన ఆభరణాలను విడిచిపెట్టి ముసలితనంలో ధరింప వలసిన నారబట్టలను ఎందుకు ధరించావో చెప్పు. చంద్రుడు, నక్షత్రాలతో కూడిన రాత్రి సమయంలో సూర్యోదయానికి అర్హమవుతుందేమో చెప్పు. స్వర్గాన్ని కోరి తపసు చేస్తున్నదానవైతే నీ శ్రమ వ్యర్థమే.
ఎందుకంటే నీ తండ్రి నివాసభూములే దేవతావిహార స్థలాలు. లేదా వరుని గురించి తపస్సు చేస్తున్నదానవైతే ఇంక తపస్సుచాలించు. రత్నాన్ని ధరించేవాళ్ళే వెదుక్కుంటారు కానీ రత్నం తనను ధరించేవాళ్ళకోసం వెదకదుకదా! నీ వేడి నిట్టూర్పు వలన నీవు వరుని కోసమే తపస్సు చేస్తున్నట్లుగా నా మనసులో సందేహం కలుగుతున్నది.
నీవు వరించదగినవాడే ఉండడు. అయినా నీవు వరించినప్ప టికీ లభించని వాడెవడుంటాడు? ఆహా! నిన్ను ఇంతగా కష్టపెడుతున్నా ఆ యువకుడెవడోగాని తన సౌందర్యగర్వంతో మోసపోయాడని నేను భావిస్తు న్నాను. ఇటువంటి స్థితిలో నిన్ను చూసిన మనస్సున్నవానికెవనికైనా మనసు మండుతుంది.
ఓ గౌరీ! ఎంతకాలం నీవిలా కష్టపడతారు. ఇంక నీ తపస్సు చాలించు. నేను కూడా తపస్సు చేసినవాడినే. కావాలంటే నా తపస్సులో సగభాగాన్ని నీకు ఇస్తాను. దానివలన నీవు కోరిన ప్రియుని పొందవచ్చును. అతడెవడో నాకు చెప్పు." అని ఈవిధంగా బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడు అడగ్గా సిగ్గుతో తాను చెప్పలేక ప్రక్కనున్న తన చెలికత్తెవైపు క్రీగంటితో సైగ చేసింది.
చెలికత్తె పార్వతి తపః కారణాన్ని చెప్పుట
అప్పుడా పార్వతి చెలికత్తె బ్రహ్మచారితో చెప్పింది “విద్వాంసుడా! మా పార్వతిని గురించి తెలుసుకోవాలని నీకు కుతూహలంగా ఉన్నది. చెపుతాను విను. ఈమెను దేవేంద్రుడు మొదలైన సంపన్నులైన నలుదిక్పాలకులకు పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడినప్పటికీ వాళ్ళని తిరస్క రించి రూపంచేత జయింప శక్యంకానివాడు, మన్మథుని జయించినవాడూ అయిన మహేశ్వరుని భర్తగా పొందదలచి తపస్సు చేస్తున్నది. పూర్వము మన్మథుడు ప్రయోగించిన బాణాన్ని ఈశ్వరుడు హుంకారంతో కోపించగా అది వెనక్కివచ్చి ఈ పార్వతి గుండెలో గాఢంగా నాటుకున్నది.
అప్పటినుంచి తండ్రి ఇంట మదనావస్థను పొందిన పార్వతి నుదుటిపై చందనాన్ని పూసుకున్నప్పటికీ ఒక్కనాడు కూడా ఉపశమ నాన్ని పొందలేదు. మంచుతోగట్టిపడిన రాతిపలకపై పడుకోగా ఈమె శరీరపు వేడికి ఆ మంచుపలక కరిగిపోయిందికానీ ఈమెకు చల్లదనం కలగలేదు. తన ప్రియుని చిత్రాన్ని పటంలోగీసి "ప్రియుడా! నీవు అన్నీ తెలిసిన వాడవని పండితులు చెపుతున్నారు. మరినీపైనే మనసును నిలిపిన నన్నేల తెలుసుకొన లేకపోతున్నావు? అని ప్రశ్నించేది.
రాత్రి మూడు ఝాములు మెలకువగా ఉండి నాలుగవ ఝామున క్షణకాలం కన్నులు మూసి శివుడువచ్చి వెళ్ళిపోతున్నట్లుగా కలగని “నీలకంఠా! ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అని పలవరిస్తూ మేలుకొనేది. జగన్నాథుడైన ఆ పరమేశ్వరుని ఎన్నటికీ చూడలేక తండ్రి అనుమతిని తీసు కుని తపస్సు చెయ్యాలనే ఆలోచనతో మాతో కలిసి ఈ తపోవనానికి వచ్చింది.
ఈమె తపస్సు ప్రారంభించేముందీమె నాటిన విత్తనం మొలకెత్తి పెద్ద చెట్టె పుష్పించి ఫలించి ఈమె తపస్సుకి సాక్ష్యంగా నిలిచింది కానీ ఈమె కోరిక మాత్రం ఇంకా మొలకెత్తనైనాలేదు. తపసుచేత కృశించిపోయిన పార్వతిని చూస్తున్న మాకు ఎండిపోయిన నాగేటిచాలును తడిపిన దేవేంద్రునిలా దుర్లభుడైన ఈశ్వరుడెన్నడు అనుగ్రహిస్తాడో మేము తెలుసు కోలేకపోతున్నాము.” ఈవిధంగా పార్వతి హృదయాన్ని రహస్యం లేకుండా చెప్పిన చెలికత్తెమాట లను విని బ్రహ్మచారి "ఓయీ! నీ చెలికత్తె చెప్నిమాట నిజమేనా?" అని అడి గాడు.
అప్పుడు పార్వతి నమస్కరించి జపమాలని మోచేతిలో వేసుకుని సిగ్గు పడుతూనే బ్రహ్మచారితో చెప్పింది. వేదవిధుల్లో శ్రేష్ఠుడా! నీవు విన్నదంతా నిజమే. ఉన్నత పదవిని పొందడానికి తపస్సే తగిన సాధనంకదా! కోరికలకు పొందరాని విషయం లేదుకదా!" పార్వతి మాటలను విని బ్రహ్మచారి "ఆ మహేశ్వరుడు చాలా అమంగళములైన అలవాట్లు కలవాడని తెలిసికూడా మళ్ళీ వానినే వరిస్తున్నావు. వానిని గురించి ఆలోచించి నీ ప్రయత్నాన్ని విడిచిపెట్టు.
చెడువస్తువుని పొందాలనే పట్టుదలకల పార్వతీ ! మంగళప్రదమైన వివాహకంకణం ధరించిన నీ చేతిని పాములను కడియముగా ధరించిన శివుడు తన చేతితో మొదటిసారిగా పట్టుకున్నప్పుడు నీవు ఏవిధంగా ఓర్చుకో గలవు? నూతన వధువుగా కలహంస గుర్తులు కలిగిన నీపట్టు చీరకొంగుని రక్తంతో తడిసిన ఏనుగు చర్మంతో ముడిపెట్టడం తగినదేమో నీవే ఆలోచించు, గొప్ప రాజభవనంలో పువ్వులు పరిచిన నేలపై పడే నీకాలి పారాణి గుర్తులు వెండ్రుకలతో వెదజల్లబడిన శ్మశానములో ఉండటానికి శత్రువుకూడా సహించ లేడు.
ముక్కంటి వక్షఃస్థలాన్ని పొందడం సులభమే కానీ అతని వక్షఃస్థలంపై ఉన్న చితాభస్మం మంచి గంధపు పూతకలిగిన నీ వక్షఃస్థలానికి అంటుకుం టుంది. పార్వతీ! ఇంత కంటే నవ్వులపాలయ్యే విషయం మరొకటి ఉంది. కొత్తపెళ్ళి కూతురుగా పట్టపుటేనుగుపై ఊరేగవలసిన నీవు ముసలి ఎద్దుపై ఎక్కి తిరగడం చూసిన ప్రజలందరూ నవ్వుతారు. ఇంతకుముందే శివునాశ్ర యించిన చంద్రుని గురించి, ఆయనను పెళ్ళి చేసుకోదలచిన నిన్ను గురించి విచారించవలసి వస్తున్నది.
పార్వతీ! శివునిలో వరునకు ఉండవలసిన లక్షణాలలో ఏ ఒక్కటైనా ఉన్నాయేమో ఆలోచించు. శరీరపు అందాన్ని చూస్తే వంకర కన్నులు, పుట్టుక ఎటువంటిదో ఎవ్వరికీ తెలియదు. దిగంబరత్వమే అతని సంపదను తెలియచేస్తున్నది. అందువలన ఈశ్వ రుని పెళ్ళి చేసుకోవాలనే ఆలోచనను విడిచిపెట్టు. పుణ్యలక్షణురాలవైన నీకు అటువంటి చెడు లక్షణాలు కల ఈశ్వరునకు సంయోగము తగినది. కాదు. శ్మశానంలో ఉన్న మరణ శిలకి యజ్ఞశాలలో ఉన్న యూపస్తంభా నికి చేసే వైదిక పూజని చెయ్యరుకదా!"
ఈశ్వరుని అమంగళాలన్నీ మంగళకరములే అని పార్వతి చెప్పుట
ఈవిధంగా శివుని గురించి తిరస్కారంగా మాట్లాడిన బ్రహ్మచారితో పార్వతీదేవి కోపంతో చెప్పింది. “నీవు నిజంగా ఈశ్వరుని పరమార్థాన్ని తెలిసినవాడవు కావు. అందుచేతనే నాతో ఈవిధంగా మాట్లాడావు. లోక సమాన్యముకాని, కారణమూహింపలేని మహాత్ములను గురించి అవివేకులీ విధంగానే ద్వేషిస్తారు. ఆపదలకు ప్రతీకారంగాగానీ, సంపద లను కోరుకున్న వారుగానీ మంచిగంధం మొదలైన సుగంధ ద్రవ్యాలను అలంకారాలను స్వీకరిస్తారు.
ఏవిధమైన కోరికలులేని ఈశ్వరునకు వీటితో పనిలేదు. ఈశ్వ రుడు దరిద్రుడైనప్పటికీ సంపదలన్నింటికీ కారణుడవుతున్నాడు. శ్మశాన నివాసి అయినప్పటికీ మూడులోకాలకు అధిపతి అవుతున్నాడు. భయంకర రూపం కలిగినప్పటికీ 'శివుడు' (సౌమ్యుడు) అని చెపుతున్నారు. శివుని నిజ తత్త్వాన్ని ఎవ్వరూ ఎరుగరు.
శివుడు ఆభరణాలనూ ధరిస్తాడు. పాములను ధరిస్తాడు. ఏనుగు చర్మాని ధరిస్తాడు. పట్టుబట్టని ధరిస్తాడు. పుణెను పట్టు కుంటాడు, బాలచంద్రుని ధరిస్తాడు. విశ్వమూర్తి అయిన శివుని శరీరము ఇలా ఉంటుందని నిర్ధారణ చెయ్యలేనిది. శివుని శరీర స్పర్శచేత చితాభస్మం పరిశుద్ధిని కలిగిస్తుంది. కావుననే ఆయన తాండవం చేసినప్పుడు రాలిన భస్మాన్ని తలపై ధరించడానికి దేవతలు తన కిరీటాలకు పూనుకుంటున్నారు.
మదపుటేనుగుపై ఊరేగుతూ వచ్చే దేవేంద్రుడు ఎద్దుపై ఎక్కివచ్చే శివునిచూసి ఏనుగుదిగి శివుని పాదాలకు తన శిరసుతో నమస్కరిస్తు న్నాడు. ఓయీ! బ్రాహ్మణా! నష్టస్వభావంచేత శివునిలో అన్నీ దోషాలనే చెప్పబోయి ఒక్కటి మాత్రం నిజమే చెప్పావు. స్వయంభువుడైన బ్రహ్మ పుట్టుకకు కారకుడైన పరమశివుని పుట్టుకను తెలిసికొనడం ఎవ్వరికీ సాధ్యంకాదు. ఇంక నీతో వాదంచాలును. ఆ పరమశివుడు నీవు చెప్పినట్లే ఉండునుగాక. నా మనస్సా తనిపైనే లగ్నమైవుంది.
స్వేచ్ఛగా సంచరించే వాళ్ళు ఇతరుల మాటలను వినరు. చెలులారా! ఈతడు ఇంకా ఏదో మాట్లాడటానికి వాని పెదవులను కదుపుతున్నాడు. మహాత్ములను దూషించిన వాళ్ళేకాక ఆ దూషణలను విన్న వాళ్ళు కూడా పాపాత్ములే అవుతారు. వీనిని నివారించండి. లేదా నేనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. అని చెప్పి పార్వతి అక్కడినుంచి లేచినప్పుడామె పమిట జారింది. అప్పుడీశ్వరుడు నిజరూపంతో ఆమె పమిటకొంగును పట్టుకున్నాడు.
ఆమె వెనక్కు తిరిగిచూసి ఒళ్ళంతా చెమటతో తడవగా వణుకుతున్నదై ముందుకు వెళ్ళడానికి ఎత్తినకాలిని ఎత్తినట్లే ఉంది ప్రవాహానికి కొండ అడ్డుపడిన నదిలా పర్వత పుత్రిక ముందుకు వెళ్ళడానికి ఎత్తిన కాలిని ఎత్తినట్లే ఉంచి ప్రవాహానికి కొండ అడ్డుపడిన నదిలా పర్వతపుత్రిక ముందుకు వెళ్ళలేక అక్కడ నిలువలేక బొమ్మలా ఉండిపోయింది.
అప్పుడీశ్వరుడు "సుందరాంగీ! నీ తపసుచేత నన్ను నీవు కొన్నావు. నేటినుంచి నేను నీ పాద సేవకుడను." అని చెప్పాడు. ఆ మాటలను విని పార్వతి తాను తపసువలన పొందిన కష్టాన్ని మరిచి పోయింది. కష్టము ఫలించగానే తిరిగి క్రొత్త శక్తిపుడుతుంది. తన తండ్రి కన్యాదానం చెయ్యగా తనను భార్యగా స్వీకరింపుమని పార్వతి తన చెలికత్తెచేత శివునకు చెప్పించింది.
పార్వతి మాటలకు శివుడు అంగీకరించి సప్తమహర్షులను స్మరించాడు. తపస్సుచేత తేజోవంతులైన సప్తమహర్షులు అరుంధతీదేవితో కలిసి నలు వైపులా ప్రకాశింపచేస్తూ శివుని దగ్గరకు వచ్చారు. ఆ మహర్షులు ముత్యాల జంద్యాలను ధరించి బంగారపు నారవస్త్రాలను కట్టుకుని రత్నాల జపమాల లను చేతుల్లో పట్టుకుని విరాజిల్లుతున్నారు.
సూర్యుడు తన గుర్రాలను క్రిందికి దింపి తన రథానికి ఉన్న జండాను వంచి సప్తమహర్షులకు, అరుంధతికి నమస్కరించాడు. ప్రళయకాలంలో లోకాలన్నీ నశించినప్పుడు శ్రీమహావిష్ణువు ఆదివరాహరూపంలో భూదేవితో పాటుగా ఈ మహర్షులను కూడ తనకోరలతో పైకెత్తి పట్టుకున్నాడు. ప్రపంచ కారణుడైన బ్రహ్మ తరువాత మిగిలిన సృష్టి చెయ్యడం వలన ప్రాచీనులైన కృష్ణద్వైపాయనాదులు ఈ మహర్షులను ప్రాచీనులైన బ్రహ్మలని స్తుతించారు.
జన్మాంతర ఫలితాలను అనుభవిస్తు న్నప్పటికి ఆ మహర్షులు ఇంకా తపస్సును చేస్తూనే ఉన్నారు. అటువంటి మహర్షుల మధ్యన తనభర్తనే చూస్తూ వస్తున్న అరుంధతీదేవి ఆ ఋషులు తపఃఫలాన్ని సిద్ధింపచేసే దేవతలా ప్రకాశిస్తున్నది. శివుడా మహర్షుల నందరినీ సమానభావనతోనే గౌరవించాడు.
పరమశివునకు అరుంధతిని చూడగానే తాను కూడా భార్యను పొందాలనే కోరిక ఎక్కువైంది. పతివ్రతలైన భార్యలే ధర్మసాధనకు మూలమైనవాళ్ళు. శివునకు భార్యను పొందాలనే కోరిక కలగగా మన్మథునకు ఉపశమనం కలిగింది. సాంగముగా నాలుగు వేదాలను అధ్యయ నంచేసిన ఆ మహర్షులు సంతోషంతో జగద్గురువైన పరమశివునితో చెప్పారు.
"మేము వేదాలను నియమపూర్వకంగా అభ్యసించినందుకు, విధిప్రకారంగా హోమం చేసినందుకు, మేము చేసిన తపస్సునకు నేడు మాకు ఫలితం సిద్ధించింది. జగత్ప్రభువైన నీవు మమ్మల్ని స్మరించడంవలన మా కోరిక సిద్ధించింది. నిన్ను మనసులో కలిగినవాడే పూజ్యుడైనప్పుడు నీ మనస్సులో ఉన్నవాళ్ళు పూజ్యుల్లో శ్రేష్ఠులవుతున్నారు. ముందే మేము సూర్యచంద్రులకంటే.. ఉన్నతమైన స్థానాన్ని పొంది ఉన్నాము. ఇప్పుడు నీవు మమ్మల్ని స్మరించడం వలన ఇంకా ఉన్నతమైన స్థానాన్ని పొందిన వాళ్ళ మయ్యాము.
గొప్పవారి ఆదరణము తమ గుణాలలో విశ్వాసము కలిగించుటచేత మేము నీచే గౌరవాన్ని పొంది మేము గొప్పవాళ్ళ ముగా భావించుకుంటున్నాము. నీవు మమ్మల్ని స్మరించినందువలన వచ్చిన సంతోషాన్ని నీకు చెప్పము. విరూపాక్షా! అంతర్యామివైన నీకు మేము ఏమి చెప్పగలము? నిన్ను మేము స్వయంగా చూస్తున్నప్పటికి నీ యథార్థతత్త్వాన్ని మేము గ్రహింపలేము.
బుద్ధులకు అతీతుడవైన నీ ఆత్మస్వరూపాన్ని మాకు చెప్పు. సృష్టి స్థితి సంహారాలలో ఈ రూపం దేనికి సంబంధించినది? సరే నీ స్వరూప విషయాన్ని అలా ఉంచు. ప్రభూ! నీవు స్మరించగా వచ్చిన మేము చెయ్యదగిన కార్యాన్ని ఆదేశించండి. అప్పుడీశ్వరుడు చెప్పాడు. "ఏవిధమైన కార్యమైనను నా స్వార్థము కోసము కాదని మీరెరుగుదురు. నేను ఎనిమిది మూర్తులతో ఈ స్వరూపాన్ని పొందా నని మీకు తెలిసినదేకదా! అటువంటి నేను వర్షం కోసం దేవేంద్రుని ప్రార్థిం చిన చాతకపక్షిలా దేవతలు శత్రువైన తారకాసురుని సంహరించడానికి సంతానాన్ని పొందుమని నన్ను ప్రార్థిం చారు.
అందువలన యజమాని హోమాగ్నిని సృష్టించడానికి చంద్రకర్రని కోరినట్లుగా పార్వతీదేవి యందు నేను పుత్ర సంతానాన్ని పొందాలను కుంటున్నాను. మీరు హిమవంతుని దగ్గరకువెళ్ళి నాకు పార్వతినిచ్చి పెళ్ళి చెయ్యవలసినదిగా కోరండి.
పెద్దలు కుదిర్చిన సంబంధములకు విరోధములుండవు. మహోన్నతుడు, స్థిరమైనవాడు, భూ భారాన్ని వహిస్తున్న హిమవంతుడు చాలా పూజనీయుడు. వానితో సంబం ధము నాకు శ్రేష్ఠమైనది. లోకంలో ఋషులు చెప్పినమాటలే ఆచారములవు తున్నాయి. కాబట్టి హిమవంతునితో ఏవిధంగా మాట్లాడాలో మీకు నేను చెప్పనక్కరలేదు.
పూజ్యురాలైన అరుంధతీదేవి కూడా అక్కడ కార్యాన్ని నిర్వ హిస్తుంది. సాధారణంగా వివాహవిషయాలలో స్త్రీలే సమర్థులై ఉంటారు. అందువలన మీరు వెంటనే కార్యసిద్ధికై ఓషధీప్రస్థపురానికి వెళ్ళండి మళ్ళీ మనమీ మహాకోశతీరంలోనే కలుసుకుందాము. యోగు లకు ఆద్యుడైన పరమే శ్వరుడే భార్యను కోరుతున్నాడని తెలుసుకున్న మహర్షులు తాము భార్యలతో కూడి ఉన్నందుకు సిగ్గును విడిచిపెట్టారు. అప్పుడు చాలామంచిదని చెప్పి ఆకాశమార్గంలో ఓషధీ ప్రస్థపురానికి వెళ్ళిపోయారు. పరమేశ్వరుడు కూడా తాను ముందుగా నిర్దేశించిన స్థలానికి వెళ్ళిపోయాడు.
మహర్షులాకాశమార్గంలో చాలా వేగంగా ఓషధీప్రస్థపురానికి వెళ్ళారు. ఆ పట్టణం అలాకాపట్టణం కంటే సంపన్నమై స్వర్గలోకంలా ఉంది. మహర్షులా పట్టణాన్ని చూసి స్వర్గంకోసం చేసే పుణ్యకార్యాలు మోసములని భావించారు. ద్వారపాలకులు ఆ మహర్షులను చూస్తూ ఉండగానే వాళ్ళు హిమవంతుని మందిరానికి వెళ్ళారు.
హిమవంతుడు పూజాద్రవ్యములతో మహర్షులకు ఎదురువెళ్ళి స్వాగతించాడు. స్వయంగా మహర్షులను సత్కరిం చిన తరువాత హిమవంతుడు తానే దారిచూపుతూ అంతఃపురానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడా ఋషులను కర్రలతో చెయ్య బడిన ఉన్నతాసనాలపై కూర్చో పెట్టి తానొక ఆసనంపై కూర్చుని మహర్షు లతో చెప్పాడు.
"ఊహించని మీ దర్శనం నాకు మేఘంలేని వర్షంలాగాను, కనిపించని పువ్వులు, పండ్లుగాను తోస్తున్నది. మీ అనుగ్రహం వలన నేను మూఢుడు జ్ఞాని అయినట్లుగా, ఇనుము బంగారమైనట్లుగానూ, భూమినుంచి స్వర్గానికి వెళ్ళినట్లుగాను భావిస్తున్నాను. సత్పురుషులు నివసించిన ప్రాంతాన్ని తీర్ధమని చెపుతారు కాబట్టి నేను ఈనాటి నుండి ప్రాణులను పవిత్రులను చెయ్యగల వాడనని భావిస్తున్నాను. బ్రహ్మణోత్త ములారా! నా శిరసుపై గంగ పడటంచేతను, పరిశుద్ధములైన మీ పాద జలంచేతను నేను పరిశుద్ధుడనయ్యానని భావిస్తున్నాను.
ఓ మునులారా! జంగమస్థావరాత్మకమైన రెండు శరీరాలను కలిగినప్పటికీ రెండు విధాలుగా నా శరీరం పవిత్రమైనది. స్థావరాత్మకమైన దేహం మహర్షుల పాదధూళిచేతను, జంగమాత్మకమైన దేహం మహర్షుల కార్యాన్ని సిద్ధింప చెయ్యడంచేతను అనుగ్రహింపబడినది. నా శరీరావ యవాలు దిక్కులకు వ్యాపించినప్పటికీ అవి మహర్షుల రాకవలన కలిగే సంతోషాన్ని భరింప లేక పోతున్నాయి.
తేజోరూపులైన మీ దర్శనం వలన నాలో ఉన్న రజోగుణము, తమోగుణమూ రెండూ నశించాయి. నేను మీకు చెయ్య వలసిన పని ఏమీలేదు. ఏదైనా ఉంటే నన్ను పరిశుద్ధుని చెయ్యడానికే మీరు వచ్చినట్లుగా భావిస్తున్నాను. మీకు కోరికలు లేకపోయినప్పటికీ మాకు ఏపనైనా ఆదేశిం చండి.
ప్రభువులు ఆజ్ఞాపించ డమే అనుగ్రహ మవుతుంది. ఇదిగో నేను, ఈమె నా భార్య. ఈమె నా కూతురు. మీకు ఏయే కార్యము ఎవ్వరెవ్వరివలన జరగాలో ఆదేశించండి. బంగారము మొదలైన సంపదలకు లెక్కలేదు." ఈవిధంగా పలికిన హిమవంతుని మాటలు గుహలలో ప్రతిధ్వనించినట్లుగా స్పష్టము లయ్యాయి. అప్పుడు చెప్పవలసిన విషయాన్ని చక్కగా చెప్పడంతో నేర్పరి అయిన అంగిరసుని మాట్లాడమని ప్రేరేపించారు. అంగిరసుడు హిమవంతునితో చెప్పాడు.
“నీవు కోరినదానిని ఇవ్వడానికి చాలా సమర్థుడవు. ఇంతకంటే గొప్పవాటి నివ్వగలవు. నీ శిఖరంలాగానే నీ మనసుకూడా చాలా ఉన్నతమైనది. నిన్ను స్థావరస్వరూపుడవైన విష్ణువని చెపుతున్నారు. అది యుక్తమే. చరాచర ప్రాణికోటికీ నీ గర్భము నిలయంగా ఉంది. రసాతల పర్యంతమూ నీవు భరించకపోతే శేషుడు తామర తూండ్లవలె మృదువైన తన పడగలతో భరించలేడు.
ఎడతెగక సముద్రాల చివరివరకు వ్యాపిం చిన నీ కీర్తులును, జీవనదులై ప్రవహిస్తూ సముద్రాలలో కలిసే నదులునూ పవిత్ర ములవడంచేత లోకులందరినీ పవిత్రులను చేస్తు న్నాయి. గంగానది విష్ణు పాదం నుంచి పుట్టడం వలన కొనియాడ బడుతూ ఉన్నట్లుగా నీ శిరస్సుపై పడి అలాగే కీర్తింపబడు తున్నది. అడ్డంగానూ, పైకీ, క్రిందికీ వ్యాపించే స్వభా వం కలిగిన విష్ణువునకు గల త్రివిక్రమరూపం నీకు స్వభావంచేతనే సిద్ధిం చింది. యజ్ఞభాగాన్ని పొందేవాళ్ళ మధ్యలోస్థానాన్ని పొందినందు వలన నీవలన బంగారు మయమైన ఉన్నత శిఖరంగల మేరుపర్వతుని ఔన్నత్యం వ్యర్థమైపోయింది.
నీలో కఠినత్వాన్ని అంతనూ స్థావరరూపమైన శరీరంలోనే ఉందికానీ నీ జంగమరూపశరీరము మాత్రము సజ్జనులను ఆరాధించడంలో వినయవంతమైంది. అందువలన మేము వచ్చిన కారణాన్ని విను. ఆ పని నీదే. కల్యాణముల బోధనలవలన ఈ విషయంలో కొంతభాగాన్ని మేము కూడా పొందుతున్నాము.
అణిమాది గుణములతోకూడి ఇతర పురుషులను తాకని గొప్పదైన ఈశ్వరశబ్దము అర్ధచంద్రుని ధరించి ఉంది. పరస్పర సామర్థ్య ములుగల భూమిమొదలైన అష్టమూర్తులచేత ఈ విశ్వము గుర్రములచే మార్గములో బండి భరిస్తు న్నట్లుగా భరింపబడు తున్నది. తత్త్వవేత్తలు తమ దేహాల్లోనే వెదుకుతారు. విద్వాంసులు జన్మరహితమైన స్థానము కలవానిగా చెపుతారు. అటువంటి విశ్వకర్మలకు సాక్షి అయిన మహేశ్వరుడు మా ద్వారా నీ కుమా ర్తెను కోరుతున్నాడు.
శబ్దముతో అర్థమునువలె నీ కుమార్తెను ఆయనకు ఇవ్వడానికి యోగ్య మైనది. మంచి భర్తచేతిలో ఉంచిన కన్య మాత్రమే తండ్రికి దుఃఖాన్ని కలిగించదు. చరాచరమైన ప్రాణిసమూహమంతకూ తండ్రి అయిన పరమ శివుని పెళ్ళి చేసుకోవడం వలన నీ కుమార్తె జగన్మాత అవుతుంది. దేవతలందరూ నీలకంఠునకు నమస్కరించిన తరువాత ఆయన భార్య అవడం వలన నీ కుమార్తె పాదాలకు నమస్క రిస్తారు.
పర్వతరాజా! ఉమాదేవి వధువు, నీవు దాతవు అడిగేవాళ్ళం ఈ మేము, వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడు. ఇది నీవంశాభివృద్ధికి చాలునుగదా! ఇతరులను స్తుతించక ఇతరులచే స్తుతింప బడేవాడు, ఇతరులకు నమస్కరించక తాను ఇతరులచే నమస్కరింపబడువాడు అయిన పరమేశ్వరుని నీ కుమార్తెద్వారా బంధువు అవడంచేత నీవు గురువు నాకే గురువవుతావు.”
ఈవిధంగా దేవర్షి చెపుతుండగా తండ్రి ప్రక్కన తలవంచి లీలావిలాస ముగా పార్వతీదేవి పద్మపురేకులను లెక్క పెడుతూ ఉన్నది. హిమ వంతుడు తన కోరిక నెరవేరినవాడైనప్పటికీ మేనాదేవి వైపు చూశాడు. సాధారణంగా గృహస్థులు కుమార్తె పెళ్ళి విషయంలో తమభార్య కన్నులతోనే చూస్తారు. మేనకాదేవి కూడా తన భర్తకిష్టమైన ఆ కార్యమంతా తనకిష్టమే అన్నట్లుగా తల ఊపింది. పతివ్రతలే విషయంలో నైనా భర్తనే అనుసరిస్తారు కదా!
అంగిరసుని మాటలకు ఇదే సమాధానమన్నట్లుగా శుభముగా అలం కరించుకున్న కుమార్తె చేతిని హిమవంతుడు పట్టుకుని "తల్లీ! రా ! ప్రపంచ రూపుడైన శివునకు భిక్షగా నిశ్చయించబడిన దానవయ్యావు. యాచించే వాళ్ళు మునులు. నాకు గృహస్థఫలితం సిద్ధించింది." ఈవిధంగా కుమార్తెతో చెప్పి హిమవంతుడు మహర్షులతో ఈ త్రిలోచనుని భార్య మీకు నమస్కరిస్తు న్నది అని చెప్పాడు. మహర్షులు హిమవంతుని మాటలకు సంతోషించి..
పార్వతీదేవికి వెంటనే ఫలించే ఆశీర్వచనాలను పలికారు. అరుంధతీదేవి సిగ్గుపడుతున్న పార్వతిని తన తొడలపై కూర్చుండ పెట్టుకున్నది. కూతురిపైన ఉన్న ప్రేమచేత మేనాదేవి దుఃఖిస్తుండగా ఇంతకుముందు వేరొక భార్యలేని పరమేశ్వరునకు నీ కుమార్తె భార్య అవుతున్నదని ఓదార్చింది.
హిమవంతుడు మహర్షులను పెళ్ళి ముహుర్తమెప్పుడని అడగ్గా నేటికి నాలుగవ రోజున అని చెప్పారు. వాళ్ళు హిమవంతుని అనుమతిని పొంది తిరిగి పరమశివునకు చెప్పడానికి ఆకాశమార్గంలో వెళ్ళారు. పరమేశ్వరుడు కూడా పార్వతిని పొందాలనే కుతూహలంతో నాలుగు రోజులు అతికష్టంగా రోజులు గడిపాడు.
పార్వతి పెళ్ళి సన్నాహము
మూడురోజుల తరువాత హిమవంతుడు శుక్లపక్షంలో లగ్నము నుంచి సప్తమస్థానంలో చంద్రుడు ఉండగా బంధువులతో కలిసి కన్యా దానం చెయ్య డానికి దీక్షని పొందాడు. పార్వతీదేవిపై అభిమానంతో పట్టణంలోని ప్రతి యింటిలోను పెళ్ళి సంబంధములైన మంగళకరము లైన పనులను చేస్తున్నారు.
అంతఃపురము, పట్టణము అంతా ఒకటే అన్నట్లుగా పెళ్ళి అలంకరణలు జరిగాయి. మందారపుష్పాలతో రాజమార్గాన్ని అలంకరించారు. పట్టువస్త్రా లతో నగరమంతా జెండాలను నిలపెట్టారు. బంగారపు తోరణాలతో అలంక రించారు. ఆ పట్టణం స్వర్ణశోభని పొందింది. అనేకులు కొడుకులు, కూతుళ్ళు ఉన్నప్పటికీ భర్త ఇంటికి వెళ్ళిపోతుందనే బాధతో తల్లిదండ్రులకామెపై ప్రేమ అధికమైంది.
ఆ పార్వతి ఆశీర్వచనాలను పొందుతూ బంధు జనుల ఒడిలోకి చేరింది. ఒకరు అలంకరించిన తరువాత వేరొకరు ఈవిధంగా బంధువులం దరూ తమ తమ ఒడిలో కూర్చోపెట్టుకుని అలంకరించారు. ఉత్తరఫల్గుణి నక్షత్రంలో చంద్రుడుండగా ప్రాతఃకాలముహూర్తంలో పార్వతిని పెళ్ళికూతు రుగా పుణ్యవంతులైన బంధు స్త్రీలు అలంక రించారు.
ఆ గౌరీదేవిని తెల్లని ఆవపిండితో లేత గరికలను నూరి నలుగుపెట్టి అభ్యంగన స్నానం చేయించారు. తరువాత స్త్రీలందరూ పార్వతిని పెళ్ళికూతురుగా గొప్పగా అలంకరిం చారు. పార్వతి ముత్తైదువలకు నమస్కరించగా వాళ్ళు అఖండమైన పతి ప్రేమని పొందుమని దీవించారు.
మహాశివుడు కూడా నందిభుజాన్ని ఆలంబనంచేసుకుని శార్దూల చర్మాన్ని కప్పిన ఎద్దుపై ఎక్కి ప్రయాణమయ్యాడు. సప్తమాతృకలు తమ తమ వాహనాలపై శివుని అనుసరించారు. తరువాత ప్రమథ గణాలు శూలాలను ధరించి మంగళతూర్య నాదాలతో అనుసరించారు. శివునకు సూర్యుడు విశ్వకర్మ నిర్మించి ఇచ్చిన గొడుగునిచ్చాడు.
తరువాత మొదటి బ్రహ్మ అయిన చతుర్ము ఖుడు, శ్రీవత్సలాంఛనుడైన విష్ణువు సాక్షాత్తు ఆ మహాదేవుని సమీపానికి జయ శబ్దాలను చేస్తూ వచ్చారు. ఇంద్రాది లోకపాలకులు శుభలక్షణాలైన వస్త్రాభరణాలను ధరించివచ్చి శివునకు నమస్కరించారు. మహాదేవుడు వారి నందరినీ యథారీతిగా గౌరవించాడు. వాళ్ళందరికంటే ముందుగా సప్త మహర్షులు నిలవగా చిరునవ్వుతో శివుడు ఈ వివాహ యజ్ఞానికి మీరు అధ్వర్యులుగా ప్రవర్తించండని కోరాడు.
అందరూ ఆకాశమార్గంలో ఓషధిప్రస్థ పురానికి చేరుకున్నారు. హిమవంతుడు దేవతలరాకను తెలుసుకుని ఆనం దంతో వస్త్రాలంకారాది సంపదలచేతను, ఏనుగులతోను, సపరివారంగా ఎదురువెళ్ళి సాదరంగా దేవతలందరికి స్వాగతం పలికి విడిది గృహానికి తీసుకుని వెళ్ళాడు. దారిలో ఓషధీప్రస్థపురస్త్రీలు తమ పనులను విడిచి మేడలపై నుంచి కుతూహలంతో పరమశివుని చూశారు. అక్కడ శివునకు పట్టువస్త్రాలను ధరింపచేసి క్రొత్త వెన్నెలలచేత సముద్రునివలె పార్వతీదేవి.
దగ్గరకు తీసుకొని వెళ్ళారు. హిమవంతుడు పార్వతిని తీసుకునిరాగా శివుడామెచేతిని స్వీకరించాడు. పార్వతీ పరమేశ్వరుల పాణిగ్రహణ సమయంలో ఎదురుగా ఉత్తమమైన కాంతిపుంజము ఆవిర్భవించింది. ఆ ఉమామహేశ్వరుల దాంపత్యశోభ వర్ణింప శక్యంకానిదైంది. ఆ దంపతులు ఎత్తైన అగ్నిజ్వాలల చుట్టూ ప్రదక్షిణ చేశారు.
పురోహితుని మాటని అనుసరించి ఆ దంపతులు మూడుసార్లు ఆ అగ్నికి ప్రదక్షిణం చేశారు. వధువైన పార్వతిని బ్రాహ్మణులు ఆశీర్వదించారు. "తల్లీ! ఈ అగ్ని మీ వివాహకర్మకి సాక్షి అయినది. నీ భర్త అయిన శివునితో కలిసి నిర్విచారముగా ధర్మాన్ని ఆచరించుము.”
ఈవిధంగా పార్వతీపరమేశ్వ రుల కల్యాణము ప్రజాపత్యమనే వివాహపద్ధతిలో జరిగింది. భవానీదేవి చెవులను విస్తరించి యాజ్ఞికుల మాటలను శ్రద్ధగా విన్నది. తరువాత ధ్రువనక్షత్రాన్ని చూడుమని చెప్పగా సిగ్గుతో తలఎత్తి చూసింది. ఈవిధంగా పురోహితునిచేత నిర్వహింపబడిన పాణిగ్రహణకార్యమైన తరువాత దంపతులు మేనాహిమవంతులకు నమస్కరించి తరువాత పితామహునకు నమస్కరించారు.
బ్రహ్మ "కల్యాణీ! వీరమాతవు కమ్మని దీవించాడు. బృహస్పతి పార్వతీసమేతుడైన శివునిచూసి మనసులో శాంతిని పొందాడు. తరువాత ఆ దంపతులు చతురస్త్రవేదికపై బంగారపు ఆసనాలపై కూర్చొని లోకాచారాన్ని అనుసరించి పరస్పరం తడిసిన అక్షతలను చల్లుకున్నారు. లక్ష్మీదేవి పొడవైన నాళంకల పద్మాన్ని గొడుగుగా పట్టుకున్నది. సరస్వతీదేవి సంస్కృత, ప్రాకృత రూపములైన రెండు విధములైన భాషలతోను స్తుతించింది.
ఈవిధంగా దంపతులైన పార్వతీపరమేశ్వరులకు ముందుగా పార్వతీ దేవి మనస్సంకల్పంచేత వినాయకుడు జన్మించాడు. తరువాత దేవకార్య మైన తారకాసురసంహారం నిమిత్తమై పరమేశ్వరుని రేతస్సునుంచి మరొకపుత్రుడు జన్మించాడు. వానికే సుబ్రహ్మణ్యస్వామి అని, కార్తికేయుడని, షాణ్మాత్రుడని, షణ్ముఖుడని వివిధములైన పేర్లున్నాయి.
ఈవిధమైన పవిత్రమైన పార్వతీకల్యాణాన్ని భక్తితో చదివినవాళ్ళకీ, విన్నవాళ్ళకీ అనేక శుభాలు కలుగుతాయి. పుత్రులులేనివాళ్ళకి సుగుణవంతులైన పుత్రులు జన్మిస్తారు. పెళ్ళికాని స్త్రీ పురుషులకు అన్యోన్య మైన అనుకూల మైన సహచరులు లభిస్తారు. ఇది నిరాకారుడైనప్పటికీ లోకకల్యాణం కోసమే సాకారుడై లోకాచారాన్ని అనుసరించి దాంపత్య సుఖాన్ని అనుభవించిన పరమాత్ముని మాయా విలాసము.
మహావిషయం కలిగిన ఈ చిన్న పుస్తకాన్ని వృద్ధులైన దంపతులకు, పెళ్ళికాని యువతీ యువకులకు దానంచేసినవాళ్ళ ఇంట దుష్టగ్రహ బాధలు కలుగవు. ఉత్తమ సంతానంతో వాళ్ళ వంశం అభివృద్ధి జరుగుతుందనేది నిత్య సత్యము. ఇందులో సందేహంలేదు.
Famous Posts:
> శివ గుణాలు లోకానికి సందేశాలు
> భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?
> కూతురా కోడలా ఎవరు ప్రధానం...?
> సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?
> కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?
> మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి
Tags: పార్వతీ కల్యాణం, Shiva Parvathi Kalyanam, shiva, parvathi, siva kalyanam, parvathi kalyanam, Parvathi Kalyanam Telugu
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment