Drop Down Menus

లక్ష్మీ కళ్యాణం - చదివితే కొన్ని కోట్ల జన్మల వల్ల వచ్చిన పాపం నశించబడుతుంది - Goddess Lakshmi Kalyanam

లక్ష్మీ కళ్యాణం - చదివితే కొన్ని కోట్ల జన్మల వల్ల వచ్చిన పాపం నశించబడుతుంది. ఆడవారు కానీ, మగవారు కానీ లక్ష్మీ ఆవిర్భావం, లక్ష్మీ కళ్యాణం చదువుకుంటే చాలా మంచిది.

శ్రీ ముదివర్తి కొండమాచార్యులవారు రచించిన ఈ శ్రీలక్ష్మీ కళ్యాణం ద్విపద, శ్రీ లక్ష్మీదేవి ఆవిర్భావం, శ్రీ లక్ష్మీ కళ్యాణం

పాలమున్నీటిలో పడవంపులతగా

పసివెన్నముద్దగా ప్రభవంబునొంది


కలుములు వెదజల్లు కలికి చూపులకు

మరులొంది మధువుకై మచ్చికలట్లు

ముక్కోటి వేల్పులూ ముసురుకొనంగా

తలపులో చర్చించి తగ నిరసించి


అఖిలలోకాధారు నిగమసంచారు

నతజన మందారు నందకుమారు


వలచి వరించిన వరలక్ష్మి గాధ

సకల పాపహరంబు సంపత్కరంబు


ఘన మందరాద్రినీ కవ్వంబుగాను

వాసుకి త్రాడుగా వరలంగ చేసి


అమృతంబు కాంక్షించి అసురులు సురలు

చిలుకంగ చిలుకంగ క్షీరసాగరము

పరమ పావనమైన బారసి నాడు

మెరుగారు తొలకరి మెరుగుల తిప్ప

ఒయ్యరములలప్ప ఒప్పులకుప్ప


చిన్నారి పొన్నారి శ్రీ మహాదేవి

అష్ట దళాబ్జమందావిర్భవించె


నింగిని తాకెడు నిద్దంపుటలలు

తూగుటుయ్యాలలై తుంపెసలార


బాల తానటుతూగ పద్మమ్ము ఛాయ

కన్నె తానిటుతూగ కలువపూఛాయ


అటుతూగి ఇటుతూగి అపరంజి ముద్ద

వీక్షించుచుండగా వెదురు మోసట్లు


కల్పధ్రువంబున కలికలంబోలి

పెరిగి పెండిలి ఈడు పిల్లయ్యెనంత


తనువున పులకలు దట్టమై నిగుడ

బారసాచి ప్రమోద భాష్పముల్ రాల

రావమ్మ భాగ్యాల రాశి రావమ్మ

రావమ్మ ఇందిరా రమణి రావమ్మ


లోకశోకము బాపు లోలాక్షివీవు

నాకు కూతురువవుట నా పుణ్యమమ్మా


అంచు మురిసిపోయి అంబుధి స్వామి

ఉప్పొంగి ఉప్పొంగి ఉప్పరంబంటె


సఖియను మంగళ స్నానమాడింప

వాసవుండర్పించె వజ్రపీటమ్ము


పూత నదీజలా పూర్ణ పుణ్యాహా

కళశాలతోడ దిగ్గజములవ్వేళ


జలజాతగంధికి జలకమ్ములార్చె

బంగారు సరిగంచు పట్టు పుట్టమ్ము


కట్టంగ సుతకిచ్చె కళశవారాసి

వెలలేని నగలిచ్చె విశ్వకర్ముండు


రాజీవ ముఖులైన రంభదులంతా

కురులు నున్నగ దువ్వికుప్పెలు వెట్టి


కీల్జెడ సవరించి కింజెల్కధూలి

చెదరనీక విరుల్ చిక్కగ ముడిచి


కళలు పుట్టిన ఇండ్లు కన్నుదమ్ములకు

కమ్మని కవ్రంపు కాటుక దిద్ది


వెన్నెల తెటయౌ వెడద మోమునకు

గుమ్మడి విత్తంత కుంకుమ పెట్టి


ఆత్తరు జవ్వాజి అగరు చందనము

హత్తించి తనువల్లె ఆమె ముంగిటను


నిలువుటద్దంపును నిలిపెరంతటను

తనరూపు శ్రీలక్ష్మి దర్పణంబందు

కనుబొమ్మ నిక్కగా కనుగొని నవ్వి


సింహసనము దిగి చెంగళ్వదండ

చెదార్చి అచ్చెరల్ చేరి కొల్వంగా


కుచ్చెళ్ళు మీగాల్ల గునిసియాడంగా


గరుడ గంధర్వ యక్ష రాక్షస దివిజ

సంఘముల మద్యకు సరుగున వచ్చె


చెప్పచోద్యంబయిన శ్రుంగారవల్లి

మొలకనవ్వుల ముద్దు మోమును చూచి


సోగ కన్నుల వాలు చూపులు చూచి

ముదురు సంపెంగ మొగ్గ ముక్కును చూచి


అమృతంబు తొలకెడు అధరంబు చూచి

సిగ్గులు సుడివడు చెక్కిళ్ళు చూచి


ముత్యాల మెచ్చని మునిపండ్ల చూచి

పాలిండ్లపైజారు పయ్యెద చూచి


జవజవమను కౌసు సౌరుని చూచి

గుండ్రని పిరుదుల కుదిరిక చూచి

కమనీయ కలహంస గమనంబు చూచి

మొగమునకందమౌ మొటిమను చూచి


మధుసూధనుడు తక్క మగవారలెల్ల

వలపు నిక్కాకకు వశవర్తులైరి


కన్నులకెగదన్ను కైపున తన్ను

తిలకించుచున్నట్టి దిక్పాలకాది


సురవర్గమును చూచి సుదతి భావించె


ఒకడంటరానివాడొకడు జారుండు

ఒకడురక్తపిపాసొక్కడు జడది


ఒక్కడు తిరిపెగాడొకడు చంచలుడు

కాయకంఠి ఒకండు కటికవాడొకడు


ఒక్కటి తరకైన ఒక్కటి తాలు

ఈ మొగమ్ములకటే ఇంతింత నునుపు


శ్రీవత్సవక్షుండు శ్రితరక్షకుండు

పుండరీకాక్షుండు భువనమోహనుడు


శంఖచక్రధరుండు శారంగహస్తుండు

తప్తచామీకరా ధగధగద్ధగిథ

పీతాంబరధరుండు ప్రియదర్శనుండు


మణిపుంజరంజిత మంజులమకుట

మకరకుండలహార మంజీరకటక


కాంచికాకేయూర కమ్రభూషణుడు

అనుపమ ఙ్ఞాన బలైశ్వర్య వీర్య మాధుర్య


గాంభీర్య మార్థవౌదార్య శౌర్య స్థైర్య చాతుర్య

ముఖ్య కళ్యాణ గుణగణ మహార్ణవుండు


తనకు నీడగువాడు తననించు వాడు

విశ్వమంతయును తానైనవాడు


శేశాద్రినిలయుండు శ్రీనివాసుండు

పతియైన సుఖములు పడయంగ వచ్చు

తులలేని భోగాల తులతూగ వచ్చు

ఎడేడు లొకాలనేలంగవచ్చు


అంచు శౌరికి వేసె అలవేలు మంగ

చెంగళ్వ విరిదండ చిత్తమొప్పంగా


సకల జగంబులు జయ వెట్టుచుండ

శచియు గౌరియు వాణి సర్వేశ్వరునకు


తలయంటి పన్నీట తానమాడించి

తడియొత్తి వేణుపత్రములంత జేసి


నామంబులను దిద్ది నవభూషణముల

గైసేయ దివిజవర్గంబులు గొలువ


కదలనై రావణ గజముపై స్వామి


కేశవాయంచును కీరముల్ పలుక

నారాయణాయంచు నమలులు పలుక


మధవాయంచును మధుపముల్ పలుక

గోవిందయంచును కోయిలల్ పలుక


తైతక్కధిమితక్క తద్దిమ్మితకిట

జనుతతకజనుత జనుత యటంచు

అచ్చర విరిబోణి ఆడిపాడంగా

ముత్తైదువులు శెస ముత్యాలు జల్ల

చల్లగా వేంచేయు జలదవర్ణునకు


అగ్రంబునన్ వేద ఆమ్నాయ ఘోష

వెనుక మంత్రధ్వని వినువీధి ముట్టే


అదె వచ్చె ఇదె వచ్చె అల్లుడటంచు

మామగారెదురేగి మధుపర్కమిచ్చె


పందిటిలోనికి పట్టి తొడ్తెచ్చి

పుణ్యతీర్థంబులు ప్రోక్షించి ఋషులు


మంగళశాసన మంగళమ్మిడగా

కమలచేతికి చక్రి కట్టె కంకణము


దివ్యశంకంబులు తిరుచిన్నములును

వేణుమర్దల రుద్రవీణలు మొరయ


తలవంచి కూర్చున్న తన్వి కంఠమున

మధువైరి గీలించె మాంగళ్యమపుడు


చేతుల తలంబ్రాలు చేకొనికూడా

పొయగా వెనుకాడు పువుబోణి ముందు

శిరమువంచినయట్టి శ్రీధరు జూచి

పకపకా నవ్విరి పల్లవాధరులు


పదునాల్గు భువనముల్ పాలించునట్టి

చల్లనివిభునకు జయమంగళంబు


పదము మోపిన చోట పసిడి పండించు

చూడికుత్తుకకు శుభమంగళంబు


అంచు హారతులెత్త అంగనామణులు

సాగె బువ్వము బంతి సంతోషముగను


కళిత కంకణ జనాత్కారమ్ము లెసగా

కటక గళంగళాత్కారముల్ పొసగా


మొగమున తిలకంబు ముక్కున జార

చిరు చెమ్మటలదోగి చెదరు గంధమ్ము


గమగమ వాసనల్ క్రుమ్మరింపంగా

చురుకు చూపులకోపు చూపరగుండె


పలువ చిచ్చు రగల్పు వగలాడియొకతె

కోడిగమ్మాడెను కొమరితె ఒకతె


మన పెండ్లి కొడుకెంత మహనీయుడమ్మా

మహిళలను వలపించు మంత్రగాడమ్మ


మచ్చు మందులు జల్లి మది దోచకున్నా

కరివానినెవ్వరు కామింతురమ్మ


సుకియలు పోలీలు సొగియవు గాని

పురపుర మట్టిని బ్రొక్కెడునంట


పట్టె మంచము వేసి పానుపమరింప

పాముపై తాపోయి పవళించునంట


అంబారి యేనుగు అవతలకంపి

గద్ద మీద వయాలి కదలెడునంట


వింత వెషములెన్నో వేసెడునంట


రాసిఖ్యమటులుంచి రంగటులుంచి

ఆకార సౌందర్యమరయిదుమన్నా


కనులు చేతులు మోము కాల్లు మొత్తమ్ము

తామర కలికికి స్థానమ్ము సుమ్ము

ఈయంటు మన బాలకెపుడంటకుండా

తామర సిరికల ధన్యాత్మునకును


నలిచి నల్లేరుతో నలుగిడవలెను

కందనీటను ఒడల్ కడగంగవలెను


గంధకలేపమ్ము కడుబూయవలెను

వాడవాడల తిప్పి వదలంగవలెను


ఆ మాటలాలించి హరు పట్టమహిశి

మాధవ చెల్లియ ఆ మడతుకిట్లాడె


అతి విస్తరంబేల అందాల చిలుక

నీవు నేర్చిన తెలుగు నెర్తురే యురులు


వెన్నుని నలుపంచు వెక్కిరించితివి

నెలతుక ఎరుపంచు నిక్కుచూపితివి


కలువ పూవూ నలుపు కస్తూరి నలుపు

కందిరీగ యెరుపు కాకినోరెరుపు


ఈ రెండు రంగులందేరంగు మెరుగో

సొడ్డు వేయుట కాదు సూటిగా చెప్పు


వరుని చూచిన కంట వధువుని చూడు

మాయ మర్మము వీడి మరి పదులాడు


కళికి కాల్సేతులు కన్నులు మోము

తామర విరిసిన తావులు కావో


కొమ్మ మేనికి దూలగొండి రాచెదవో

కంద నీటికిగిచ్చగారవించెదవో

ఇంతింత కన్నుల ఎగదిగ చూచి

సిగ్గుతో నెమ్మోము చేత కప్పుకొని


అనలు కొనలు వేయు అనురక్తి తోడ

రసికత లేని మా రంగని మెడను


పూలమాలను వేసి పొలుపుగా అతని

గుండెలపై చేరి కులుకంగ తలచు


రంగనాయకి ఎంత రసికురాలమ్మ

చపరలోచన ఎంత చపలురాలమ్మా


ఆనవ్వు లీనవ్వులరవిరిమల్లె

అందాలు చిందుచు అలరింప మదులు


సకల వైభవములా జరిగెను పెండ్లి

అంపకమ్ముల వేల అరుదెంచినంత


పసుపు కుంకుమ పూలు పండుటెంకాయ

తాంబూలమొడి దాల్చి తరళాక్షి లక్ష్మి


తలపు లోపల క్రుంగు తండ్రిని చేరి

నాయనా యని పిల్చి నవదుఖ: భాష్ప


కణములు జల జల కన్నుల రాల

గుండెపై తల వాల్చి కుములుచుండంగా


కడివెడు బడబాగ్ని కడుపులోననిచి

శిరమున మూర్కొని చెక్కిళ్ళు నిమిరి


పాలపూసల తల్లి భాగ్యాల వెల్లి

వేడ్క అత్తింటికి వెళ్ళి రావమ్మా

ఆడ పిల్లలకు తండ్రి అయ్యెడు కంటే

మతి గతి లేనట్టి మానౌట మేలు


వీనుల నీ పాట వినిపించుచుండ

కన్నుల నీ ఆట కనిపించుచుండ


ఊరటతో యెట్టులుండెదనోయమ్మా

గడియలొ నిను వచ్చి కనుకుందునమ్మా


అనిసాగరుడు పుత్రిననునయింపంగా

బుద్దులు గరపిరి పుణ్య కామినులు


ఏమి నోము ఫలంబొ ఏమి భాగ్యమ్మో

వేదంతవేద్యుడు విభుడాయె నీకు


ఆముదాలన్నియూ ఆణిముత్యములే

చిగురుబోండ్లందరూ సింధు కన్యకలే


తల్లినీవెరుగనీ ధర్మంబుగలదే

నెలతనీవెరుగనీ నీతులున్నవియే


పదుగురు నడిచిన బాటయే బాట

మందికి నచ్చిన మాటయే మాట


మంచిని విత్తిన మంచి ఫలించు

జొన్నలు విత్తిన చోళ్ళేల పండు


పోయిరాగదమ్మ పుత్తడిబొమ్మ

నీదుపుట్టింటిపై నెనరుంపరమ్మ


కనిపెంచకున్ననూ కళ్యాణి నిన్ను

కన్నుల చూడక పొద్దు గడచునే మాకు


చిలుకలు పలికిన చిగురుమావిళ్ళ

కోయిలల్ కూసిన గుండెలెట్లాడు


పొగడ చెట్లకు వ్రేలు పూదొట్ల గన్నా

నిమ్మలంబుగ యెట్లు నిలుతుమే కన్నా

కాటుకాయను కాంతనేనిత్తు

కుంకుమ భరణిని కొమ్మనేనిత్తు


జోడు సొమ్మెలు నీకు జోటినేనిత్తు

పట్టినదంతయు బంగారు కాగా


ముట్టినదెల్లయూ ముత్యంబు కాగా

కడుపు సారెకు వేగ కదిలిరావమ్మ


మదిలోన మమ్ముల మరిచిపోకమ్మ

అంత మహాలక్ష్మి అనుగు నెచ్చెలుల


చెక్కిళ్ళు ముద్దాడి చుబుకంబునంటి

కంఠంబు నిండిన కన్నీళ్ళనాపి


బంగారు చెలులారా ప్రాణంబులారా

నేనయిమీరెల్ల నెగడిమాయింట


అయ్య కన్నుల ముందు ఆడుకోరమ్మ

పట్టు కుచ్చులు నావి పరికిణీల్ నావి


పందిట తూగాడు పవిటల్ నావి

కాళ్ళ గజ్జెలు నావి కడియాలు నావి


పొలుపైన బచ్చెన బొమ్మలు నావి

బొమ్మలకునువెట్టు భూషణముల్ నావి

స్వేచ్చగా మీరెల్ల చేకోరమ్మా

అప్పుడప్పుడు లచ్చి తలుచుకోరమ్మా


అని బుజ్జగములాడి అందలంబెక్కి

కమళాక్షునింటికి కదిలె శ్రీలక్ష్మి


కనుపాపలో క్రాంతి క్రందుకొన్నట్లు

కండచక్కెర పాలు కలిసియున్నట్లు


అంజనాచలవాసుడలమేలుమంగ

జంట వాయక సుఖ సంతోషలీల


సాధురక్షణమును సలుపుచున్నారు

సాధురక్షణమును సలుపుచున్నారు

అఱుగని మంగళసూత్రము చెరగనికుంకుమ,పసుపు,చెదరని సిరులున్,తఱుగని సుఖము లొసంగును,హరిసతి యీ పాట విన్న అబలల కెపుడున్.

Famous Posts:

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం


ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే


గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?


శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

Tags: లక్ష్మీ కళ్యాణం, Lakshmi Kalyanam, Lakshmi, Lakshmi Kalyanam Telugu, Lakshmi Narayana, Srinivasa Kalyanam

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments