Drop Down Menus

హనుమ మహారూపం- కాకాసుర కథ | Why did Hanuman give ring to Sita?

హనుమ మహారూపం

అమ్మా! ఇది రాముని ఉంగరం. నీ భర్త రాముని ఉంగరం. నాపై నీకు నమ్మకం కలిగించేందుకు నీ స్వామి నీకు ఇవ్వమని ఇచ్చిన ఉంగరం. చూడు తల్లీ! ఉంగరం మీద రాముని పేరు చెక్కి ఉంది అన్నాడు హనుమ. ఉంగరాన్ని సీతకు అందించాడు. అందుకుని ఆ ఉంగరాన్ని పరిశీలనగా చూసింది సీత. హనుమ చెప్పింది నిజమే!

ఇది రాముని ఉంగరమే! తన భర్త రాముని ఉంగరమే! కళ్ళకు అద్దుకున్నది దానిని. కన్నీరు కార్చింది. సంశయాలన్నీ తీరడంతో హనుమను ఆత్మీయంగా చూసింది. ‘‘తల్లీ! నీ కోసం రాముడు అగ్నిపర్వతంలా పరితపిస్తున్నాడు. తేనెలు తాగడం లేదు. మాంసాన్ని ముట్టడం లేదు. బతికేందుకు మాత్రమే ఇన్నో కొన్నో పళ్ళు తింటున్నాడు.

‘‘నీకు నచ్చిన ఏ వస్తువు కనిపించినా ‘సీతా సీతా’ అని విలపిస్తున్నాడు. నిద్రలేదు. పొరపాటున కళ్ళు మూతలు పడితే ‘సీతా సీతా’ అని ఉలిక్కి పడి లేస్తున్నాడు. నిరంతరం నిన్నే కలవరిస్తున్నాడమ్మా నీ స్వామి.’’ చెప్పాడు హనుమ.

భోరుమన్నది సీత. ఏడ్చింది. ‘‘నువ్వు క్షేమంగా ఉన్నావు. తన కోసం నిరీక్షిస్తున్నావు అన్న మాట చాలమ్మా! రాముడు అపారమైన వానర భల్లూక సేనలతో వచ్చి, ఈ లంకను అతలాకుతలం చేస్తాడు.’’ అన్నాడు హనుమ.

సంతోషించింది సీత. అంతలోనే రాముడు తన కోసం పరితపిస్తున్నాడని తెలిసి మళ్ళీ దుఃఖించింది. ‘‘నీ మాటలు విషం కలిపిన అమృతంలా ఉన్నాయి హనుమా. తట్టుకోలేకపోతున్నాను. అలాగే విధికి తిరుగు లేదని మా బతుకులే ఋజువు చేస్తున్నాయి. రాముడికి నన్ను సామంగా రావణుడు అప్పగిస్తాడన్న ఆశ లేదయ్యా! యుద్ధం తప్పదనిపిస్తోంది.’’ అన్నది సీత.

‘యుద్ధం’ అన్న మాట వినగానే పిడికిలి బిగించి, గుండెలు పొంగించాడు హనుమ. ‘‘రాముడితో కయ్యానికి కాలు దువ్వడం మంచిది కాదని తమ్ముడు విభీషణుడు ఎన్నోసార్లు అన్న రావణుణ్ణి హెచ్చరించాట్ట! అయినా ఆ మూర్ఖుడు వినడం లేదని విభీషణుని భార్యే చెప్పింది నాకు.’’ అన్నది సీత. అలాగా అన్నట్టుగా చూశాడు హనుమ. ‘‘జరగబోయే యుద్ధంలో నా రాముడు విజయం సాధిస్తాడు. రావణుడు మరణిస్తాడు. అనుమానం లేదు.’’ అన్నది సీత.

‘‘అవునమ్మా! అనుమానం లేదు.’’ అన్నాడు ఆనందంగా హనుమ. ‘‘రావణుడు నాకు ఇచ్చిన ఏడాది గడువులో ఇప్పుడు పదవ నెల నడుస్తున్నది. ఇక రెండు నెలలు మాత్రమే గడువు ఉన్నది. ఆ రెండు నెలలూ గడచి గడువు తీరితే నేను జీవించి ఉండను. మరణిస్తాను. ఈ మాట నా స్వామికి చెప్పు. చెప్పి, ఈ లోపలే ఆయన్ని యుద్ధానికి రమ్మను. మహోజ్వల బాణాలతో ఈ పాపాత్ముణ్ణీ, ఇక్కడి బలగాల్నీ తుత్తునియలు చేయమను.’’ కసిగా కోపంగా చెప్పింది సీత. అంతలోనే అనుకున్నది అవుతుందా? అన్న సంశయం కలిగిందేమో! కన్నీరు పెట్టుకున్నది.

‘‘ఏడవకు తల్లీ! నువ్వు కోరుకుంటున్నట్టుగానే లంకపైకి రాముడు దండెత్తి వస్తాడు. నిన్ను విడిపిస్తాడు. అంత వరకు వేచి ఉండలేనంటావా చెప్పు, నిన్ను నా వీపుపైకి ఎక్కించుకుని, ఎలా వచ్చిన వాణ్ణి అలా సముద్రం దాటి, నీ స్వామి చెంతకు నిన్ను చేరుస్తాను.’’ అన్నాడు హనుమ.

‘‘నువ్వా?’’ ఆశ్చర్యపోయింది సీత. మూరెడు కూడా లేని హనుమను ముసిముసిగా నవ్వుతూ చూసింది. ‘‘ఇంత లేవు. అంత సముద్రాన్ని ఎలా దాట గలవయ్యా? పైగా నీ వీపున నన్ను మోస్తూ..’’ అన్నది సీత. ‘‘నేనెంతటివాణ్ణో చూస్తావా తల్లీ?’’ అడిగాడు హనుమ.

కళ్ళు మూసుకున్నాడు. చేతులు జోడించి నమస్కరించాడు. ‘రామ రామ రామ’ అంటూ స్వామిని జపిస్తూ ఇంతవాడు అంతవాడయ్యాడు హనుమ. అనూహ్యంగా శరీరాన్ని పెంచాడు. మేరు, మందరపర్వతాల్లా ఎదిగిపోయాడు. వజ్రసన్నిభాలైన గోళ్ళు, కోరలు, అగ్నివంటి తేజస్సుతో ఆకాశంలోకి చొచ్చుకునిపోయి నిలిచాడు. అక్కణ్ణుంచి కిందికి, చెట్టు నీడన చూపుడు వేలంత ఉన్న సీతను చూశాడు హనుమ. ఆశ్చర్యపోయి పెద్దపెద్ద కళ్ళతో తననే చూస్తున్న తల్లితో అన్నాడిలా.

‘‘అమ్మా! నువ్వు ఆజ్ఞ ఇస్తే వనాలు, కొండలు, బురుజులు, ప్రాకారాలతో ఉన్న ఈ లంకను ఇలాగే రావణుని సహా పునాదులతో పెల్లగించి నా స్వామి చెంతకు చేరుస్తాను. చెప్పుతల్లీ! అదే నీ కోరికైతే ఈ క్షణమే నెరవేరుస్తాను. సందేహించకు.’’ అన్నాడు హనుమ.

ఆనందించింది సీతమ్మ. అంతెత్తున ఉన్న హనుమను పదేపదే చూసి పొంగిపోయింది. ‘‘నువ్వు మహా ప్రతాపవంతుడివి. ప్రతిభాశాలివి. అనుమానం లేదు. లేకపోతే అంత సముద్రాన్ని దాటి ఇక్కడికి రావడం అసాధ్యం. నువ్వు నన్ను నా రాముని దగ్గరకు చేర్చగలవయ్యా! చేర్చలేవన్న సంశయం నాకెంత మాత్రం లేదు. కాకపోతే రామకార్యం ఏ విధంగా చేస్తే సముచితం అన్నది ఆలోచిస్తున్నాను.’’ అన్నది సీత. ఆలోచించసాగింది. హనుమ మహారూపాన్ని చాలించాడు. నిజరూపాన్ని సాధించాడు. సీతకు నమస్కరిస్తూ యథా ప్రకారం ఆమె ముందు నిలిచాడు.

‘‘ఏ విధంగా ఆలోచించినా నేను నీ వెంట రావడం క్షేమం కాదనిపిస్తోందయ్యా’’ అన్నది సీత. అర్థం కానట్టుగా చూశాడు హనుమ. ‘‘నీ వెంట నేను రావడాన్ని రాక్షసులు గమనించారనుకో! వారు ఊరుకోరు. నీతో యుద్ధానికి తలపడతారు. నువ్వా ఒంటరివి, నిరాయుధుడివి. లక్షల మంది రాక్షసులతో నువ్వు యుద్ధం చెయ్యలేవు.’’ అన్నది సీత. ‘‘అది కాదమ్మా’’ అని హనుమ చెప్పబోయాడు ఏదో. అతన్ని వారిస్తూ అన్నదిలా సీత.

‘‘తెగించి రాక్షసులతో నువ్వు యద్ధానికి తలపడితే వారితో యుద్ధం చేస్తూ నన్నెలా రక్షించగలవు? నువ్వు రక్షించగలవనుకున్నా, నేను ఆ యుద్ధాన్ని చూసి బెదరి కిందపడితే?’’ ‘‘అయ్యయ్యో’’ ‘‘మాట వరసకి అనుకుందాం, నేను కిందపడి ప్రాణాలు పోగొట్టుకుంటే.. అలా కాకుంటే నీతో యుద్ధంలో రాక్షసులు గెలిచి మళ్ళీ నన్ను వాళ్ళు బంధిస్తే.. బంధించి, ఎవరికీ కనిపించని ప్రాంతంలో ఈసారి దాచిపెడితే.. ఇప్పుడు నువ్వు పడిన శ్రమ అంతా వృథా కాదా? ఏఁవంటావు?’’ అడిగింది సీత. సమాధానం ఏం చెప్పాలో తెలియలేదు హనుమకు. చూడసాగాడంతే!

‘‘ఒకవేళ యుద్ధంలో రాక్షసులను నువ్వు ఓడించావు అనుకుందాం. నువ్వు గెలిచావు అనుకుందాం. గెలిచి, నన్ను తీసుకుని వెళ్ళి నా స్వామికి నువ్వు అప్పగించావు. అది రాముడికి వేడుక అవుతుందా చెప్పు? ఎంత మాత్రం కాదు. పైగా ఆయనకు తీరని అవమానం అవుతుంది. తనకు చేతకాక నీ ద్వారా నన్ను సాధించుకున్నాడన్న అపకీర్తి రాముడికి శాశ్వ తంగా ఉండిపోతుంది. నువ్వు గొప్పవాడివే! అవక్రపరా క్రమవంతుడివే! అయితే నీ పరంగా రాముడి కీర్తికి హాని కలగడం నేను సహించలేను.’’ అన్నది సీత.

‘‘తల్లీ’’ అన్నాడు హనుమ నిజమేనన్నట్టుగా. ‘‘హనుమా! నీ వెంట నేను రాకపోవడానికి వీటి అన్నిటికంటే ఇంకో బలమైన కారణం ఉందయ్యా! అదేమిటంటే.. పతివ్రతనైన నేను, నా భర్తను తప్ప, పరపురుషుణ్ణి తాకను. మరి రావణుడు నిన్ను తాకాడని నువ్వు అనవచ్చు. నన్ను వేలెత్తి చూపించవచ్చు. ఆ సమయంలో నేను నిస్సహాయురాలిని. పైగా స్పృహలో లేను.’’ అన్నది సీత.

‘‘నిజమేనమ్మా’’ అన్నాడు హనుమ. ‘‘అందుకని దయచేసి నేను చెప్పింది విను. నువ్వు వెళ్ళి స్వామికి నా క్షేమసమాచారాన్ని వివ రించు. వివరించి, ఏ ఉపాయం చేతనైనా రామలక్ష్మణులనూ, సుగ్రీవుణ్ణీ లంకకు చేరుకోమను. చేరుకుని, అగ్నిశిఖల్లాంటి బాణాలను ప్రయోగించి, పరివారసమేతంగా ఈ రావణుణ్ణి హతమార్చమను. లంకపై విజయాన్ని సాధించి, నన్ను ఇక్కణ్ణుంచి తీసుకుని వెళ్ళమను. ఇలా చేస్తేనే నాకూ, నా రాముడికీ, రఘు వంశానికీ కీర్తి ప్రతిష్టలని చెప్పు.’’ అన్నది సీత.

Tags: hanuman, sitha, ramayanam, rama, anjaneya, sita

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.