Drop Down Menus

పరమ పవిత్రం పంచ రంగనాథ క్షేత్రాలు ఇవే! 5 Famous Ranganatha Swamy Temples

పంచ రంగనాధ క్షేత్రాలు..

జలం ఏ పాత్రలోకి ఒంపితే, ఆ రూపాన్ని పొందుతుంది. భగవంతుడు కూడా అంతే! భక్తులు ఏ రూపంలో ఆయనను కొలుచు కోవాలనుకుంటే.. ఆ రూపంలోకి ఇమిడిపోతాడు. అలా ఆదిశేషుని మీద శయనించే విష్ణుమూర్తిని, రంగనాథస్వామిగా కొల్చుకోవడం కద్దు. దక్షిణాదిన ఈ రంగనాథ స్వామి ఆలయాలు చాలానే కనిపిస్తాయి. వాటిలో పంచరంగ క్షేత్రాల గురించి చెప్పుకోవాల్సిందే. కావేరీ తీరాన వెలసిన ఈ పంచరంగ క్షేత్రాలు తమిళ, కన్నడ ప్రజలకు చాలా ప్రత్యేకం. ఆ పంచరంగ క్షేత్రాల వివరాలు ఇవిగో

శ్రీ రంగపట్నం:– ఈ పేరు వినగానే మనకు టిప్పు సుల్తాన్‌ కథలే గుర్తుకువస్తాయి. టిప్పు రాజ్యానికి రాజధానిగా సాగిన ఈ పట్నానికి ఆ పేరే అందులోని రంగనాథుని ఆలయం మీదుగా వచ్చింది. ఇక్కడి శ్రీదేవి, భూదేవి సహిత రంగనాథుని ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. పశ్చిమ గాంగేయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి టిప్పు సుల్తాన్‌ సహా కర్ణాటక ప్రాంతాన్ని ఏలిన రాజులంతా ఈ స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించినవారే!

తిరుప్పునగర్‌:– తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో ఉందీ గ్రామం. ఇందులోని స్వామి పేరు ‘అప్పకుడతాన్‌ పెరుమాళ్‌’. ఇక్కడ ఉభమన్యు అనే రాజుకి విష్ణుమూర్తి ఒక ముసలివాని రూపంలో దర్శనమిచ్చాడట. ఆయనకు ఎంత ఆహారాన్ని అందించినా ఆకలి తీరలేదట. చివరికి పరాశర మహర్షి సూచనతో భక్తితో అప్పాలని అందించినప్పుడే తృప్తి లభించిందట. అప్పటి నుంచి ఈ స్వామికి అప్పకుడతాన్ స్వామి అని పేరు. పంచరంగ క్షేత్రాలలోనే కాకుండా వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఒకటిగా కూడా ఈ ఆలయాన్ని ఎంచుతారు.

కుంబకోణం:– ఒకప్పుడు హేమ రుషి అనే ఆయన సాక్షాత్తు లక్ష్మీదేవి తన కుమార్తెగా జన్మించాలని తపస్సుని ఆచరించాడట. దాంతో లక్ష్మీదేవి ఒక తటాకంలోని కలువల నుంచి ఉద్భవించింది. అలా అవతరించిన లక్ష్మీదేవిని కోమలవల్లి అన్న పేరుతో కొలుచుకున్నారు. లక్ష్మీదేవి చెంత ఆ విష్ణుమూర్తి కూడా ఉండాల్సిందే కదా! ఆయన కూడా భువికి అవతరించాడు. ఇలా అవతరించిన స్వామిని అరవముదన్ లేదా సారంగపాణి అని పిల్చుకుంటారు.

మయిలదుతురై:– చంద్రుని తపస్సుకి మెచ్చి ఆ విష్ణుమూర్తి అవతరించిన చోటు ఇది. పరాకల్‌ అనే ఆళ్వారుని భక్తికి మెచ్చి స్వామివారు ఇక్కడే స్థిరపడిపోయారట. అలా చూసుకున్నా ఈ ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్నట్లు తోస్తుంది. ఇక్కడి స్వామి పేరు ‘పరిమళ పెరుమాళ్‌’. వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఒకటైన ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. ఈ స్వామివారి అనుగ్రహంతోనే నాదస్వరం ఒక సంగీత వాయిద్యంగా రూపుదిద్దుకుందని చెబుతారు.

శ్రీ రంగం:– పంచరంగ క్షేత్రాలలో శ్రీరంగాన్ని ఆద్యరంగం (చివరి క్షేత్రం)గా పిలుస్తారు. కానీ అన్నింటిలోకీ ప్రముఖమైనది ఈ ఆలయమే! విష్ణుమూర్తి చేతిలో ఉన్న శంఖు రూపంలా తోచే ఒక చిన్న ద్వీపం మీద ఈ ఆలయం నిర్మితమైంది. ఇక్కడి మూలవిరాట్టుని సాక్షాత్తు విభీషణుడు ప్రతిష్టించినట్లు చెప్పుకొంటారు. విష్ణుభక్తిలో శ్రీరంగానికి ఉన్న ప్రత్యేకత ఎంత చెప్పుకున్నా తక్కువే! గోదాదేవి విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నది ఇక్కడే! ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించడానికే 300 ఏళ్లకు పైగా సమయం పట్టిందని చెబుతారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన గోపురంగా ప్రసిద్ధకెక్కిన ఈ ఆలయాన్ని దర్శించకుంటే సర్వశుభాలూ కలుగుతాయని నమ్మకం.

ఇవీ పంచరంగ క్షేత్రాల విశేషం. కొన్ని జాబితాలలో ఇందులోని కుంబకోణం బదులు వటనగరంలోని రంగనాథ పెరుమాళ్‌ ఆలయాన్ని పేర్కొంటూ ఉంటారు.

Tags: రంగనాథ క్షేత్రాలు, Ranganatha Swamy, Srirangam, Pancharanganatha Temples, Famous Temples Vishnu

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments