మార్గశిర మాసం ప్రారంభ, ముగింపు తేదీలు | మార్గశిర మాసం విశిష్టత | ముఖ్యమైన పర్వదినాలు - Margashira Masam 2023
2023 డిసెంబరు 13 నుంచి మార్గశిరమాసం ప్రారంభమవుతోంది. ఈ మాసంలో వచ్చే గురువారాల్లో వ్రతం ఆచరిస్తే అప్పుల బాధలు తొలగి, సర్వ సంపదలు కలుగుతాయని పరాశర మహర్షి నారదుడికి చెప్పారు.
కార్తీకమాసం నెలరోజుల పాటు భక్తిలో మునిగితేలే వారంతా మార్గశిరమాసంలోనూ అంతకుమించి అనేట్టుంటారు.ఈ నెలంతా కూడా ప్రత్యేకమే అయినా గురువారాలు విశిష్టమైనవిగా భావిస్తారు. శ్రీ మహా విష్ణువుకు ప్రీతిపాత్రమైన మార్గశిరమాసం అంటే శ్రీ మహాలక్ష్మికి కూడా మక్కువ ఎక్కువ. ఈ నెలలో వచ్చే గురువారాలు ఎవరైనా లక్ష్మీ పూజ చేస్తారో వారిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుందని విశ్వశిస్తారు.
మార్గశిర మాసం విశిష్టత..!!
శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన మాసం.!
మాసానాం మార్గశీర్షం..!
హేమంత ఋతువులో వచ్చే మొదటి నెల.
దీనినే జ్యోతిష్యాన్ని అనుసరించి..
సౌరమాన ప్రకారం ధనుర్మాసమని,
చంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అంటారు.
చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉండే నెల "మార్గశీర్షం".
చంద్రుడు మనః కారకుడు, ఆ చంద్రుడు అనుకూలంగా లేకపొతే మంచి ఆలోచనలు కలగవు, మానసిక స్థితి సరైన మార్గంలో ఉండదు.
అందుకని చంద్రుడు అనుకూలించే కాలంలో మన దైవపూజలని ప్రారంభిస్తే వాటి మీద శ్రద్ద బాగా పెరిగి తద్వారా మనోధైర్యం వృద్ది చెందుతుంది.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం..
చంద్రునికి ఉచ్ఛ స్థానం వృషభ రాశి, మృగశిర నక్షత్రం వృషభరాశికి చెందినది కావున, చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి దైవ కార్యాలని చేసే కొద్దీ చేయలనిపించే మంచి ఆలోచనలు కలుగుతాయి.
ఈ మాసంలో..!
ఇది ప్రకృతి కాంతకు సీమంతం..
తుషార బిందువుల హేమంతం..!!
మార్గశీర్ష మాసము ఒక విలక్షణమైన మాసము. మార్గశీర్షము అంటేనే మార్గములందు శ్రేష్ఠమైనది. ఉపయోగకరమైనదని అర్థం.
ఇది ఏ మార్గము అంటే భగవంతుని పొందు భక్తిమార్గము. శీర్షప్రాయమైన ఈ మార్గము మిగిలిన మార్గము లన్నింటికన్నా ప్రధానమైనది,
ప్రాముఖ్యతతో పాటు పవిత్రత కూడా ఏర్పడటంచే ఇది శ్రేష్టమైనది.
శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం మార్గశిరం.
బృహత్సామ తథాసామ్నాం- గాయత్రీ ఛందసా మహం- మాసానాం మార్గశీర్షోహ- ఋతూనాంకుసుమాకరం”
అనే శ్లోకంలో మార్గశీర్గాన్నీ నేనే,
ఆరు ఋతువులలోనూ పుష్పసౌరభం నేనే,
సామవేదానికి చెందిన గానాలలో బృహత్సామాన్ని నేనే, ఛందస్సులలో గాయత్రీ ఛందాన్ని,
శోభ అధికంగా ఉండే వసంత కాలాన్ని నేను అని భగవద్గీతలోని విభూతి యోగంలో సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్ముడే పేర్కొన్నాడు.
శ్రీకృష్ణుడు మార్గశిరం అంటే నేనేనని చెప్పుకున్న మాసమిది.
మాసాల్లో తాను మార్గశిరమాసాన్ని అంటాడు .
శ్రీకృష్ణ పరమాత్మ.!
ఈ మాసంలో చేసే ఏ పూజైన, హోమమైన,
ఎటువంటి దైవకార్యం చేసినా దానిని స్వయంగా
తనే స్వీకరిస్తానని తెలియజేశాడు.
భగవద్గీత లోని విభూతియోగంలో......
ఈకాలంలో పొలాలనుంచి ధాన్యం ఇళ్లకు చేరి ప్రజలు సంతోషంగా ఉంటారని ఉత్తమ మాసంగా పరిగణిస్తారు.!!
కృష్ణుడు విష్ణ్వంశ సంభూతుడు..!
విష్ణువు సూర్యనారాయణుడై..
ధనూరాశి నుంచి మకర రాశికి ప్రయాణించే సమయమిది.
సౌరమానం ప్రకారం ఈనెలలో ధనుర్మాసం ప్రారంభమవుతుంది.
ధనుర్మాస విశిష్టతను బ్రహ్మాండ పురాణం.... భాగవతం..వైఖానసం మొదలైన గ్రంథాలు వివరిస్తున్నాయి..!
సూర్య భగవానుడు పన్నెండు నెలల్లో నెలకి ఒక మాసము చొప్పున మారుతూ ఉండేదాన్ని ‘సంక్రమణము’ అంటారు. మనకు సంవత్సరానికి పన్నెండు సంక్రమణములు వస్తాయి.
సూర్యుడు తులారాశి నుండి వృశ్చిక రాశిలోనికి ప్రవేశించడం వృశ్చిక సంక్రమణము అంటారు.
ఈ మార్గశిర మాసము శ్రీ మహావిష్ణువుకు,
శ్రీ మహాలక్ష్మీదేవికి, సూర్యభగవానుడికి కూడా ప్రీతికరమైన మాసము.
పవిత్రమైన ‘భగవద్గీత’ జన్మించిన మాసం.
సూర్యుడు ధనూరాశిలో ఉండగా..విష్ణువును మేల్కొలిపే ధనుర్మాసవ్రతం చేయాలని పురాణాలు చెబుతున్నాయి.
ఈ మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి ‘మదుసూధనుడు’ అనే నామముతో శ్రీ మహావిష్ణువును పూజించవలెను.
ధనుర్మాసంలో ప్రతిరోజు విష్ణ్వాలయాలలో ప్రత్యేక అర్చనాదులు జరుగుతాయి.
‘మార్గళివ్రతం’ అనే పేరుతో గోదాదేవి ఈ ధనుర్మాసమంతా విష్ణు వ్రతాన్ని చేపట్టి రోజుకొక్క పాశురంతో స్వామిని కీర్తించింది.
మార్గశీర్షంలో మృగశిరతో కూడిన పూర్ణిమ శ్రేష్ఠం. ఈ మాసంలో లవణం దానం చేయటం వల్ల.. ఈ మార్గశిర మాస విధులను పాటించడంవల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళముతో పూజించడం, పుణ్యప్రదం.
ద్వాదశినాడు పంచామృతాలతో అభిషేకం చేయవలెను. శ్రీ విష్ణుతోపాటు సూర్యున్ని కూడా పూజించి శుభాలను పొందాలని, ఏ పనిచేస్తున్నా ఈ మాసంలో ‘ఓం దామోదరాయనమః, ఓ నమో నారాయణయనమః’ అనే మంత్రాన్ని పఠించాలని శాస్త్ర వచనం.
ప్రతిరోజు బ్రాహ్మీముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని మృత్తికతో, తులసి ఆకులను తీసికొని ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించాలి.
ఈ మాసంలో పసుపు, ఆవాలు, మెంతులు , మిరియాలు, చింతపండు పెరుగు మొదలైనవి క్షార గుణాన్ని హరించి ఆరోగ్యాన్ని కాపాడతాయి కాబట్టి, వీటితో తయారైన పొంగలి..పులిహోర..దద్యోజనం మొదలగు మధురపదార్ధములు విష్ణువుకు నివేదించి ప్రసాదంగా స్వీకరించిన మంచిది.
మార్గశిర మాసంలోని గురువారాల్లో శ్రీ మహాలక్ష్మీని పూజిస్తూ ‘‘మార్గశిర లక్ష్మీవార వ్రతం” చేయడం, ద్వాదశి అభిషేకంవల్ల ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి.
ఆధ్యాత్మికపరంగా మానసిక శక్తిని ఇచ్చే ఈమార్గమాసంలో భగవంతునియందు లయించవలెనన్న తపనగలవారు అందరూ ఈ మార్గశిర మాసములో వైష్ణవప్రధానమైన లక్ష్మీ వ్రతాన్ని ఆచరించుటకు అర్హులే.
మార్గశిర శుద్ద పాడ్యమి నుండి ఈ మాసమంతా శ్రీ మహా విష్ణువు ని పూజిస్తారు.
శ్రీ మహా విష్ణువుకి ప్రీతికరమైన ఈ మాసంలో ప్రాతః కాలంలో స్నానం చేసి విష్ణువుని ఆరాధించడం లేదా శ్రీ విష్ణుసహస్రనామం స్తోత్రం పఠనం అనంతకోటి పుణ్య ఫలితాలనందిస్తుంది.
ఈ మాసంలో చేసే నదీ స్నానాన్ని మార్గశీర్ష స్నానాలు అంటారు.
మార్గశిర శుద్ద పంచమి రోజున నాగ పూజ చేయడం విశేష ఫలితాన్నిస్తుంది.
శుభకార్యాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజుగా చెప్పబడింది.
మార్గశిర శుద్ద షష్ఠి ని స్కంద షష్ఠి అని వ్యవహరిస్తారు.
ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి ని శక్తికొలది పూజిస్తే సంతాన అనుకూలత కలుగుతుందని ప్రతీతి.
మార్గశిర శుద్ద సప్తమి ని భానుసప్తమి, జయసప్తమి, మిత్ర సప్తమి అని అంటారు.
ఈ రోజు సూర్యారాధన చేసి పాయసం నివేదన చేస్తే అనేకమైన మంచి ఫలితాలు కలుగుతాయి.
మార్గశిర అష్టమిని కాలభైరవాష్టమి గా పిలుస్తారు, శివుని మరో రూపమే భైరవుడు.
భైరవుడంటే పోషకుడని, భయంకరుడనే అర్ధాలు వస్తాయి.
భైరవుని దగ్గర కాలుడు (కాలం) కూడా అణిగి ఉంటాడు కనుకనే కాలభైరవుడయ్యాడు.
భైరవుణ్ణి శరణు కోరితే మృత్యు భయం తొలగిపోతుంది. ఈరోజు గంగా స్నానం, పితృ తర్పణం, శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక, పార లౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది.
అలాగే భైరవుని వాహనమైన శునకానికి పాలు, పెరుగు, వంటివి ఆహారం గా ఇవ్వడం మంచిది.
మార్గశిర ఏకాదశి ని మోక్షద ఏకాదశి గా చెప్తారు. ఈరోజు శ్రీ మహా విష్ణువు కి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడింది.
విష్ణు సహస్రనామ పారాయణం సర్వ పాపాలను తొలగిస్తుంది. ఈ రోజున చేసుకొనే ఉత్తర ద్వారా దర్శనం వలన మోక్షం లభిస్తుందని చెప్తారు.
మార్గశిర శుద్ద ఏకాదశి గీతా జయంతి. భగవద్గీత పారాయణం, పార్ధసారధిని ( కృష్ణుని) ఆరాధన చేయడం మంచిది.
ఈ మాసంలో వచ్చే ద్వాదశి ని అఖండ ద్వాదశి అంటారు.
మార్గశిర శుద్ద త్రయోదశి నాడు హనుమత్భక్తులు హన్మద్వ్రతం ఆచరిస్తారు.
సంతానం లేని దంపతులు ఆచరిస్తే సంతానం కలుగుతుంది.
మార్గశిర శుద్ద పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి. దత్తాత్రేయుడంటే సాక్ష్యాత్తు త్రిమూర్తి స్వరూపం. అనఘావ్రతం ఆచరించి స్వామీని పూజిస్తే సకల పాపాలు తొలగుతాయి.
కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు కోరలు తెరుచుకొని ఉంటాడు, ఈ రోజుల్ని యమదంష్ట్రులుగా చెబుతారు.
మార్గశిర పౌర్ణమి తో అనేక రకమైన వ్యాదులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి, కనుక కృతజ్ఞత పూర్వకంగా ఈ దినం యమధర్మ రాజుని ఆరాదిస్తారు.
ఈ పౌర్ణమి ని కోరల పున్నమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు.
మార్గశిరం..ఆధ్యాత్మిక భావ వికాసానికి ప్రతీక.
కార్తీకంలో పుణ్యనదీ స్నానాలతో తరించిన భక్తుల హృదయాలు..
మార్గశిర మాసంలో మరింత భగవచ్చింతనలో తన్మయమవుతాయి..!!
నిర్మలమైన ఆకాశం మాదిరిగా మనస్సులు కూడా ఈ మాసంలో నిర్మలంగా ఉంటాయి.!!
తూర్పు తెలతెలవారుతుండగా..పొగమంచు ఇంకా విచ్చిపోకముందే ముంగిట రకరకాల ముగ్గులు.. వరిపిండితోనూ ..సున్నపుపిండితోనూ వేసి..
వాటి మధ్య బంతిపూలు తురిమిన గొబ్బిళ్లు పెట్టే ఆడపిల్లలు..
తెలుగు పల్లెటూళ్ల ధనుర్మాస శోభకు వన్నెలు.. చేకూరుస్తారు..!!!
Tags: మార్గశిర మాసం, Margashira Masam 2023, Margasira Masam, Vishnu, Margamasam, Margashira masam importance
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment