పోలి స్వర్గం కథ - కార్తీక మాసం చివరి రోజు తప్పకుండా వినాల్సిన పోలి స్వర్గం కథ | Poli Swargam Katha in Telugu
ఆరనీకుమా! ఈ దీపం.. (పోలి స్వర్గం)
పుణ్యస్త్రీలు/కన్యకామణులు అంతా కలిసి కార్తీకమాసం చివరి రోజు (కార్తీక అమావాస్య) తెల్లవారు ఝాము నిద్రలేచి అందుబాటులో ఉన్న నది/కాలువ/ చెరువు/దిగుడు బావివంటి వాటిలో అరటి దొప్పల్లో దీపాలు వదులుతారు.
అలా అతివలంతా కలిసి, ముచ్చటగా అరటి దొప్పల్లో నీటి అలలపై వదిలిన ఈ దీపకాంతులే వారి జీవితంలో అలుముకున్న చీకట్లను పోద్రోలి కాంతిమయం చేయడమేకాక, అంత్యంలో స్వర్గానికి చేర్చే వెలుగు తీరంగా కూడా మారతాయి. ఈ దీపాలు నీటి కెరటాల తాకిడికి నెమ్మదిగా కదులుతుంటే ఆ దృశ్యాన్ని చూసేందుకు వేయి కన్నులు కూడా చాలవు. ఈ సుందర, అపూర్వ అద్భుత సోయగాన్ని చూసేందుకు దివినుండి దేవతలుకూడా భూమికి దిగివస్తారంటే ఆశ్చర్యంలేదు. నేలపై పారే నీటిలో కదలాడే దివ్వెల్ని చూసి ఆరోజు ఆకాశంలో నక్షత్రాలే వెలవెలబోతాయంటే అతిశయోక్తి కాదు. ఈ దీపాలపర్వాన్నే *"పోలిని స్వర్గానికి పంపించడం"* అంటారు. అందుకు సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది.
కార్తీకమాసం ముగియబోతోందంటే ముందుగా గుర్తుకువచ్చేది పోలిస్వర్గమే!! అసలు ఈ పోలి ఎవరని ఒక్కసారి ప్రశ్నించుకుంటే ఆసక్తికరమైన విషయం ఒకటి బయటపడుతుంది. కార్తీకమాసంలో దీపానికి అత్యంత విశేషమైన ప్రాముఖ్యం ఉంది. దీన్ని మరింత బలపరిచేలా ఈ కథ ఉంటుంది.
ఇప్పుడదేమిటో తెలుసుకుందాం.
*పోలిస్వర్గం కథ*
ఆంధ్రదేశంలో కృష్ణాతీరప్రాంతాన చాలా కాలం క్రితం బాదర అనే గ్రామం ఉండేది. దాదాపు ఆ గ్రామవాసులంతా సంపన్నకుటుంబీకులే. వారితో పాటు చాకలి పోతడి కుటుంబం కూడా ఒకటి నివసించేది. ఇంటి యజమాని పోతనికి అయిదుగురు కొడుకులు. వారందరికీ వివాహలు అయ్యాయి. ఇంటిలోని వారంతా కలసిమెలసి ఉమ్మడిగానే జీవించేవారు. వారందరి లోనూ చిన్నకోడలు పేరు పోలి.
ఆమెకు చిన్ననాటినుంచే దైవం మీద అపారమైన భక్తి. పూజలు/ వ్రతాలంటే విశేషమైన ఆసక్తి. కానీ ఆమె అత్తగారు మాలికి ఈమె భక్తి అంటే గిట్టేది కాదు. తాను చేసేదే దైవపూజ అని, వేరెవరు చేసినా కాదని అనుకునే మనస్తత్వం కలది మాలి. దాంతో పూజలు/ఆచారాలు పాటించాలంటే తనకు మించిన వారు వేరెవరూ లేరనదే ఆమె అహంభావం. ఈ విషయాన్ని మిగిలిన కోడళ్లంతా గ్రహించారు. దాంతో వారంతా ఆమె మెప్పు పొందేందుకు ఆమె ఎంత అంటే అంత అంటూ వంత పాడేవారు. దాంతో ఆమె చిన్న కోడలిని వదిలి ఎక్కువగా ప్రతీ విషయంలోనూ నలుగురు కోడళ్లతోనే కలుపుగోలుగా ఉండేది.
తనకు జరుగుతున్న అన్యాయాన్ని భర్తకు చెప్పుకుందామన్నా అతను కూడా అమ్మ మాటకు ఎదురాడలేక బదులు పలికే వాడు కాడు. మామగారు కూడా అంతే! దాంతో ఆ ఇంట్లో అత్త చెప్పిందే వేదం. పూజలు/వ్రతాల విషయంలో కూడా మాలి తన మాటనే నెగ్గించుకునేందుకు పోలిని విడిచిపెట్టి మిగిలిన కోడళ్లనే కలుపుకునేది. అలాగే కార్తీకమాసం రాగానే చిన్న కోడలిని ఇంట్లో వదిలి, మిగతా కోడళ్లతో కలిసి నదికి వెళ్లేది. అక్కడ వీరందరితో కలిసి నదీస్నానం చేసి, అరటి దొప్పల్లో దీపాలను వెలిగించుకు వచ్చేది. ఈలోగా చిన్న కోడలు తమకు తెలియకుండా ఇంటిలో ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావల్సిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ నదికి వచ్చేది, అత్తగారు.
ప్రతీ దైవ సంబంధిత విషయంలోనూ ఈ విధంగానే జరిగేది. మనసుంటే మార్గం ఉంటుందన్న మాదిరి మనసులో దైవాన్ని నమ్ముకోవాలేగానీ అనుకున్నది నెరవేరేందుకు తగిన మార్గాన్ని భగవంతుడే చూపిస్తాడు. ఇందుకు పోలి నిస్వార్థ భక్తే తార్కాణం. అత్తగారు చిన్నకోడల్ని దీపం పెట్టనీయకుండా ఎంత పకడ్బందీ జాగ్రత్తలు తీసుకున్నా, అదేమి విచిత్రమో కానీ, వీళ్లంతా నదీస్నానం ముగించుకుని వచ్చే సరికి ఇంట్లో చిన్న కోడలు పెట్టిన దీపం ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపించేది. అయితే ఈ దీపం వెలిగించేందుకు ఆమె ఎంతో కష్టపడేది. అయితే ఆ కష్టాన్ని కష్టంగాకాక, ఇది భగవంతుడు తనకు పెడుతున్న పరీక్షగా భావించి ఆయన్నే మనసులో స్మరించుకుంటూ పెరట్లో ఉన్న పత్తి చెట్టునుంచి కొద్దిగా పత్తిని కోసుకుని దాంతో వత్తి చేసేది. ఆ వత్తికి కవ్వానికి అక్కడక్కడా అంటుకుని ఉన్న వెన్న రాసి దీపాన్ని వెలిగించేది. దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు, దానిపై బుట్టని బోర్లించేంది. ఇలా కార్తీకమాసమంతా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి.
ఇలా నెలరోజులూ గడిచాయి. ఈరోజే కార్తిక మాసం చివరిరోజు. అమావాస్య. ఈ ఒక్క రోజు పరమాత్మ కృపాకటాక్షాలతో దీపం పెట్ట గలిగితే అనుకున్న ఆశయం నెరవేరుతుంది. కాబట్టి *"ఈ చిన్న కోరికను నెరవేర్చు కార్తీక దామోదరా!"* అని మనసులో శ్రద్ధాభక్తులతో స్మరించుకుంది పోలి.
కార్తికమాసం చివరిరోజు కావడంతో ఆరోజు కూడా నదీస్నానం చేసి, ఘనంగా దీపాలు వదిలి పెట్టేందుకు అత్తగారు, మిగిలిన నలుగురు కోడళ్లతో కలిసి నదికి బయల్దేరింది. వెళుతూ వెళుతూ, పోలికి ఇంటెడు చాకిరీని అంటగట్టి పోయింది. *'నేను దీపాలు వెలిగించి ఇంటికి వచ్చే సరికి ఒక్క పని కూడా మిగల్చకుండా పూర్తి చెయ్యాలి. లేదా తగిన శిక్ష అనుభవిస్తా'* వంటూ హెచ్చరించి పోయింది.
అయినా దైవాన్నే నమ్మిన పోలి రోజువారీ పనులేకాక అత్తగారు తనకప్పగించిన ఇతర పనుల్ని కూడా భగవత్కృపతో సునాయాసంగా పూర్తిచేసి రోజు మాదిరిగానే కార్తీకదీపం వెలిగించుకుంది.
పోలిని దీపం పెట్టనీయకుండా నీచబుద్ధితో అత్తగారెన్ని అవాంతరాలు కల్పించినా వాటిని అవలీలగా పూర్తి చేసి ధర్మాన్ని, దైవాన్ని నమ్ముకున్న పోలిని చూసి క్షీరాబ్ధివాసునికి ముచ్చట వేసింది. దాంతో పోలిని బొందితో అంటే ప్రాణం ఉండగా శరీరంతోనే) స్వర్గానికి రప్పించుకునేందుకు పుష్పక విమానాన్ని పంపించాడా వైకుంఠవాసి, పరంధాముడు.
సరిగ్గా అదే సమయానికి అత్తగారు, నలుగురు కోడళ్లూ ఇంటికి చేరుకుంటున్నారు. పైనుంచి తేజోమయమైన కాంతి పుంజం ఒకటి కిందికి వస్తోందా అన్నట్టు పోలి ఇంటి ముందుకొచ్చి నిలిచిందా దివ్యమైన దేవతా విమానం. తమకోసమే ఆ విమానం వస్తోందని వారంతా అనుకుంటుంటే దేవతలంతా పోలిని అందులోకి సాదరంగా ఆహ్వానిస్తూ చేయందించి మరీ లోపల కూర్చోపెట్టుకున్నారు. అయితే అది తమ కోసమే వచ్చిందనుకుని భ్రమిస్తూ మురిసి పోతున్న అత్తగారి ఆశలన్నీ అడియాశలయ్యాయి.
ఎలాగైనా పోలితో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకుంటూ పోలి కాళ్లు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఇసుమంతైనా ప్రయోజనం లేక పోయింది. విమానంలో పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అర్హత ఉందని మీకు లేదంటూ దేవతలంతా వారిని కిందకి తోసివేస్తున్నారు. అంతే కాదు. చిన్నకోడల్ని దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఎన్ని ఆటంకాలు కల్పించినా అన్నింటినీ తన అచంచలమైన భక్తితో అధిగమించి కార్తీకమాసం నెలరోజులూ ఒక్కరోజు కూడా మానకుండా దీపం పెట్టిన పోలి శ్రద్ధా భక్తికి పరంధాముడు ఎంతగానో పరవశించాడని అందుకే ఆమెను తీసుకు రమ్మంటూ పుష్పక విమానం పంపించాడని అందులోని దేవతలు చెబుతూ విమానాన్ని పట్టుకు వేలాడుతున్న మాలి, ఆమె కోడళ్ల చేతులను నరికివేశారు.
దీన్ని బట్టి మనం గ్రహించాల్సిందేమిటంటే ఆహంకారాన్ని వీడి నిష్కల్మషమైన మనసుతో ఏది చేసినా దాన్ని పరమాత్మ స్వీకరిస్తాడని అదే ఆయనకు ప్రియమని తెలుసుకోవాలి. పోలి ఆ విషయాన్ని తెలుసుకుంది.
అప్పటినుంచి మహిళామణులంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య తెల్లవారుఝాము అరటిదొప్పల్తో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. కార్తికమాసంలో ఏరోజుదీపాన్ని వెలిగించకపోయినా కనీసం ఈరోజు 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని కార్తిక పురాణం చెబుతోంది. వీలైతే ఈరోజు బ్రాహ్మణులకు ఉసిరి దీపాన్ని కానీ, స్వయంపాకాన్ని కానీ దానం చేస్తే మంచిది.
యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచయద్భవేత్, తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే!!
*సర్వేజనా సుఖినోభవంతు!*
*స్వస్తి!*
Tags: పోలి పాడ్యమి, పోలి స్వర్గం కథ, Poli Swargam, Karthika Masam, Poli Swargam Kadha, Karthika Masam last day, Poli Padyami, Karthika Masam Story
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment