సర్వసుఖములు, అష్టశ్వర్యాలు కలుగచెసే శ్రీ శివదేవుని కథ - Siva devuni katha

శివదేవుని కథ

పూర్వము నైమిశారణ్యము, శౌనకాది మునుల నిత్య తపోదీక్షలతోను, యజ్ఞయాగాది క్రతువులతోను, పురాణాది ప్రవచనములతోను, మహర్షుల వేదమంత్రోచ్ఛారణలతోను, శోభాయమానంగా విరాజిల్లుతుండేది. ఆ సమయమందు పురాణకథలను చెప్పుటయం దారితేరినవాడును.

సకలశాస్త్ర పారంగతుడును, ముని శ్రేష్టుడైన సూతమహర్షి ఒకనాడక్కడకు వేంచాశాడు. ఆయనను చూడగానే శౌనకాది మునులందరు లేచి నిలబడి, నమస్కరించి ఆమహర్షి చుట్టూ చేరి, “ఓ ముని శ్రేష్టా ! సూతమహర్షీ ! చాలాకాలమునకు మీరిటకు వేంచేశారు. మీద్వారా కొన్ని సందేహములు తీర్చుకోవాలని ఎప్పటినుండియో మాకు కోరికగలదు. వాటిని రూపుమాపి మా జన్మకు ధన్యతను ప్రసాదించండి స్వామి !" యని వేడికొన్నారు.

"ఓ శౌనకాదిమునులారా ! మీకు శుభములుకలుగుగాక ! మీ సందేహములను తప్పక నెరవేర్చెదను. అడగండి. ఉచితరీతిని వాటికి సమాధానములు చెప్పి మీ సందేహాలను నివృత్తి చేసెదను అని సూతమహర్షి వారి అభ్యర్ధనను అంగీకరించాడు.

"స్వామి! ఈ విశాలవిశ్వంలో సమస్తచరాచర జీవరాశియందును మానవజన్మ మహోత్కృష్టమైనదంటారే! అంతటి గొప్ప మానవజన్మ నెత్తిన మానవులలో పెక్కుమంది పలు కష్టనష్టములకు దుర్భర దారిద్య్రబాధకు లోనవుతూ పలుబాధలకు లోనవుతున్నారు గదా ! వారెంతటి తమ తమ పూర్వజన్మ సుకృతఫలములనను భవించుతున్నను వారి బాధలు పోయే మార్గమే లేదా? వారందరూ తృప్తిగా తమ జీవితమును గడుపు భాగ్యమే లేదా? దీనికేదైనా తరుణోపాయముంటే చెప్పండి స్వామి" అని ప్రార్ధించారు.

"మునులారా ! కలత చెందకండి! మానవులందరికీ తమ తమ పూర్వజన్మ పాపఫలితముగా సంభవించు పలు బాధలను పోగొట్టుకొనుటకు మన శాస్త్రము లందు కొన్నిమార్గములు నిర్దేశింపబడ్డాయి. అందులో శివదేవునికధ అత్యంత శ్రేష్టమైనది. సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు, ఏకాదశి కలిసిన సోమవారం మిక్కిలి ప్రాశస్త్యమైనది. సకలజనులకు సకలైశ్వర్యాలను ప్రసాదించి సుఖవంతులను చేయు దివ్యమైన వ్రతమది. అదే శివదేవుని వ్రతవిధివిధానమును. వ్రతకధను చెబుతాను శ్రద్ధగా వినండి”. అంటూ చెప్పసాగాడు.

పూర్వకాలంలో ఆంధ్రదేశాన గౌతమీతీరంలో ఒక కుగ్రామంలో ఒక నిరు పేదబ్రాహ్మణుడు నివసిస్తుండేవాడు. అతని పేరు శివయ్య. అతని భార్య పేరు రాజేశ్వరి. వాళ్ళు కడునిరుపేదలు. చాలాకాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు కూతురు జన్మించారు. ఆదంపతులు వారిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. కాని దారిద్ర్యం వల్ల ఆ బిడ్డల్ని సరిగా సాకలేక పోతున్నామే అని ఆ దంపతులు నిరంతరం బాధపడుతుండేవారు. రానురాను ఆబిడ్డలు పెరిగి పెద్ద వారవుతున్నారు. వారి ఆలనాపాలన ముద్దుమురిపాలు తీర్చుకొనుస్థోమత రానురాను దుర్భరమైపోవసాగింది.

ఒకనాడు ఆ దంపతులు తమ దుస్థితిని గురించి బాధపడుతుండగా శివయ్య భార్యతో ఈ దారిద్ర్య అవస్థ భరించలేకున్నాము. నేను తిరుపతికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని అక్కడే ఏదైనా వ్యాపకంతో శ్రమపడి డబ్బు సంపాదించుకు వస్తానన్నాడు. అందుకు భార్య రాజేశ్వరి కూడా అంగీకరించింది. బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటుండమని భార్యకు చెప్పి శివయ్య తిరుపతికి కాలినడకన బయలుదేరాడు వెళ్ళగావెళ్ళగా వానికి మార్గమద్యమందు ఒక ముదుసలి బ్రాహ్మణుడు తారసపడ్డాడు. ఎక్కడకు వెడుతున్నావని శివయ్యను ప్రశ్నించాడు ? శివయ్య తన దీనస్థితిని వివరించి డబ్బు సంపాదనకు తిరుపతి వెళుతున్నానని చెప్పాడు.

అతని మాటలు విన్న వృద్ధుడు ఓయీ ! వెర్రివాడా! నీవు తిరుపతి వెళ్ళినంత మాత్రాన, స్వామిదర్శనం చేసుకున్నంత మాత్రాన డబ్బుసంపాదించు కోగలవా ! నీ దారిద్ర్యం పోయి, నీకు సకలైశ్వర్యాలు కలిగి, నువ్వు, నీభార్యాబిడ్డలు సుఖపడేలా చేయగల వ్రతమొకటి ఉన్నది. అది చెబుతాను. శ్రద్ధగా విను. భక్తితో ఆ వ్రతంఆచరించి తరించు అన్నాడు.

అయ్యా ! మీరు నాపాలిటదేవుడిలా తారస పడ్డారు. ఆ వ్రతమేమిటో అది చేయవలసిన విధానమేమిటో చెప్పి నన్ను కృతార్ధుడ్ని చేయవలసిందని వేడుకున్నాడు. వాళ్ళిద్దరు ఒక చెట్టునీడకు చేరి కూర్చున్నారు. శివయ్యతో ఆ వృద్ధుడీవిధంగా చెప్పసాగాడు.

పూర్వం వంగదేశాన్ని శూరసేనుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి సుగుణవతి సౌందర్యవతియగు కుమార్తె ఉండేది. ఆమె పేరు సీమంతిని. ఆమెకు పసితనం నుండి శివదేవుడంటే అపారమైన ప్రీతి. భక్తితోనిరంతరం పూజలు పునస్కారాలు చేస్తుండేది.

యాజ్ఞవల్యముని సతి మైత్రేయి ఈసంగతి తెలుసుకుని ఆరాకుమారి వద్దకు వెళ్ళి సోమవారవ్రత మాహాత్మ్యాన్ని ఆ వ్రతవిధానాన్ని తెలియ జెప్పింది.

ఆనాటినుండి రాకుమారి సీమంతిని సోమవారవ్రతాన్ని భక్తిశ్రద్దలతో చేస్తుండేది. సదాశివుని దివ్యకధలనువింటూ ఆయనయందే భక్తిప్రపత్తులను పెంచుకుంటూ విద్యాబుద్దులందు ఆరితేరుతూ యుక్తవయస్కురాలయ్యింది.

వంగదేశానికి చేరువలోగల అంగదేశాన్ని ఇంద్రసేనుడన పరిపాలిస్తున్నాడు. ఆ రాజునకు చంద్రాంగదుడనే కుమారుడున్నాడు. అతడు గుణ మణిభూషణుడు, సౌందర్య సంపన్నుడు. యుక్తవయస్సు వచ్చిన ఆ సుగుణ రాకుమారు నాకు వివాహం చేయు నిమిత్తం విప్రులకు వాని చిత్రపటాన్నిచ్చి తగిన రాకుమార్తెను అన్వేషించుటకు అన్యరాజ్యాలకు పంపించాడు.

వాళ్ళు దేశదేశాలు తిరిగి వంగదేశం చేరారు. రాజదర్శనం చేసుకుని తామొచ్చిన పనిని నివేదించి తమరాకుమారుని చిత్రపటాన్ని రాజుకు అందచేసారు. రాజ ఆపటాన్ని అంతఃపురంలో రాకుమార్తెకు చూపించుటకై పంపించాడు. ఆ పటాన్ని చూచిన రాకుమారి సీమంతిని తన అంగీకారాన్ని తెలియజేసింది. ఇరు వర్గాలువారు ఎంతగానో ఆనందించారు. ఒకానొక శుభదినాన వారి వివాహం చేసారు. ఆదంపతులు అన్యోన్యానురాగంతో జీవిస్తున్నారు.

అన్యోన్యానురాగాలతో జీవిస్తున్న ఆదంపతుల జీవితంలో విధి వక్రించింది. ఒకనాడు చంద్రాంగదుడు తన మిత్రులతో కలిసి నౌకా విహారానికి బయలుదేరాడు. కొంతదూరం పోయేసరికి ప్రకృతి తన ప్రళయ రూపాన్ని చూపింది. తీవ్రమైన పెను తుఫానుగాలులతోను, సుడిగుండాలతోను, సముద్ర కెరటాలు ఉవ్వెత్తున లేస్తూ సముద్రజలాన్ని అల్లకల్లోలం చేయసాగాయి. ఆ సముద్ర పెనుతుఫానులో చంద్రాంగదుడి నౌక చిక్కుకుపోయి, అతలాకుతలమై మునిగిపోయింది. ఆనౌకలోని వారందరూ నీటిలో మునిగిపోయి ఆర్తనాధాలు జేస్తూ అసువులు బాసారు. చంద్రాంగదుడు మాత్రం తనకు దొరికిన చిన్న కొయ్యముక్కను పట్టుకొని ప్రాణరక్షణకై పలుప్రయత్నాలు చేయసాగాడు. ఇంతలో అతనికి, కొంతదూరములో మనిషి తలతోను, పాము శరీరంతోను ఉన్న నాగకన్య కనిపించింది. ఆమె ముఖం అద్భుత సౌందర్యంతో విలసిల్లుతూ వర్ణింపనలవి జఢకాని అందంతో వెలిగిపోతున్నది. చంద్రాంగదునికి ఆమెముఖం అత్యంత ఆకర్షణీయంగాను, శరీరం మాత్రం మిక్కిలి భయంకరముగాను తోచింది. ఏమి చేయటానికి తోచక అట్లే చూస్తుండిపోయాడు.

ఆ నాగ కన్య చంద్రాంగదుడ్ని తన తోకతో చుట్టి పట్టుకొని తన నాగలోకానికి తీసుకెళ్ళింది. తన ప్రభువైన తక్షకుని ముందు నిలబెట్టింది. అంతట తక్షకుడు “నాగకుమారీ ఎవరీ రాకుమారుడు ? ఎందుకు నాముందు నిలబెట్టావు? నీవేమైన ఈతనిని ప్రేమించితివా”? అని ప్రశ్నించి తన దివ్యదృష్టితో చంద్రాంగదుని వృత్తాంత మును పూర్తిగా తెలుసుకొన్నాడు. అంతట నాగకన్యతో “ఓ నాగసుందరీ! ఈతడు సామాన్యుడు కాడు. మహాపతివ్రతయగు సీమంతిని యొక్క భర్త.. ఆ మహాపతివ్రత యొక్క పాతివ్రత్యమహిమ వలన నీతడింకను చావక మిగిలియున్నాడు. ఆమె నుండి మనకు ముప్పురాకముందే నీవితనిని సజీవంగా తీసుకెళ్ళి భూలోకంలో విడిచిపెట్టిరమ్ము ! ఆమె సోమవారవ్రత నిరతురాలు, శివభక్తు అయినందు వలన మనకు చిక్కియు ప్రాణాలతోయున్నాడు. కా ఈతనిని భూలోకంలో విడిచిపెట్టిరా” ! అని నాగకన్యను ఆజ్ఞాపించాడు.

వీరిమాటలు వింటున్న చంద్రాంగదుడు ఏమీ పాలుపోక బిత్తరపోయి చూస్తున్నాడు. వానిని చేరి రాకుమారా ! కలవరపడకు ! నీభార్య భక్తి వలన నీవు ప్రాణాలతో మాకుచిక్నాను. నీవు చనిపోవనుకుంటున్న నీభార్య నమ్మలేక నువ్వు వస్తావని నిరీక్షిస్తున్నది. నిన్ను నీరాజ్యానికి చేరువలో భూమిపై విడిచిపెడతారు వెంటనే బయలుదేరు” అనిఅతనికి అమూల్యమైన కానుకలిచ్చి సాగనంపాడు తక్షకుడు.

సీమంతిని తనభర్త వెళ్ళిన నౌక మునిగి పోయిందని అందరూ చనిపోయారని విన్నా తన భర్త బ్రతికే ఉన్నాడన్న నమ్మకంతో అతడు క్షేమంగా తిరిగి రాగలందు ! లకు శివదేవునిని ప్రార్ధిస్తూ ఎదురుచూస్తున్నది.

ఎంతకూ భర్తజాడ తెలియక, "హే ! జననీ! పార్వతీ దేవి ! మిమ్మల్ని నిరంతరం పూజించినందుకు ఇదేనా మీ కరుణ ! నా భర్త ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సత్వరం ఇక్కడకు చేర్చి నన్ను నా మాంగళ్యాన్ని కాపాడవలసిందని” అహోరాత్రులు అన్నాహారాలు ముట్టకుండా శివదేవుని ఆరాధన చేస్తున్నది.

ఒకనాటి రాత్రి పార్వతీదేవి ఆమెకు కలలో సాక్షాత్కరించి, సీమంతిని ! కలవరపడకు ! నీ భర్తసజీవుడై ఉన్నాడు. అతిత్వరలో నీ చెంతకు రానున్నాడు. అని చెప్పి అంతర్థానమయ్యింది. కలలో, అందునా ప్రాతఃకాలపు స్వప్నంలో దేవి సాక్షాత్కరించి పలికిన పలుకులు వృధాకావని ధైర్యం తెచ్చుకుని భర్త కొరకు ఎదురు తెన్నులు చూస్తున్నది. ఆ మర్నాడు ఆమె సోమవారవ్రతమాచరించి ప్రసాదాన్ని కళ్ళ కద్దుకునే సమయానికి చంద్రాంగదుడు మణిమయరత్నాలతో ఆమె కనుల ముందు సాక్షాత్కరించాడు. 

" దేవీ నీ వ్రతమహత్యం వల్లనే బ్రతికి బయట పడ్డాను. నాగకన్యలు నన్ను రక్షించి తమ రాజు వద్దకు కొనిపోగా ఆ మహానీయుడు నీ ఉదాంత మంతయూ తన దివ్యదృష్టితో చూసినవాడై వారిని హెచ్చరించి అపూర్వమైన కానుకలతో నన్ను భువికి సాగనంపాడు అని చెప్పాడు.

ఓ విప్రోత్తమా ! వింటివిగదా ! శివదేవుని వ్రతమహిమ. నీవు నీగ్రామానికి వెళ్ళి నీవు, నీ భార్య సోమవారవ్రతము, శివదేవుని ఆరాధనచేసి మీ ఈతిబాధలు తప్పించుకొని సుఖశాంతులతో సిరిసంపదలతో వర్ధిల్లవలసిందన్నాడు. అయ్యా ! ఆ వ్రతవిధానమేమిటో చెప్పి నన్ను కృతార్ధుడ్ని చెయ్యండి అని శివ ! ఉదయమేలేచి స్నానంచేసి గృహాన్ని ముగ్గులతో తీర్చిదిద్ది ఈశాన్యభాగాన పీఠంపై శివుదేవుని పటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి అష్టోత్తరశత నామాలతో మారేడుదళాలతో శివుణ్ణి ఆరాధించి, కొబ్బరికాయ కొట్టి ధూపదీప నైవేద్యాదులుంచి కొబ్బరిముక్కలలో పంచదారగాని బెల్లం స్వామికి నివేధించి కధ చెప్పుకుని ఆ ప్రసాదాన్ని అందరికి పంచిపెట్టి మీరు కళ్ళ హద్దుకుని తీసుకోవాలి. 

ఇలా మూడు సోమవారాలు భక్తిశ్రద్ధలతో శివదేవుడ్ని ఆరాధించాలి. వ్రత లోపమున్నను భక్తి లోపముండరాదు. అని చెప్పి ఆ వృద్ధవిప్రుడు అంతర్ధానమయ్యాడు.

తనను ఉద్దరించడానికే భగవంతుడు వృద్ద బ్రాహ్మణరూపంలో వచ్చి వ్రతాన్ని సూచించాడని శివయ్య సంబరపడుతూ ఇంటికి చేరుకున్నాడు. భార్యతో జరిగిన సంగతి యావత్తూ తెలియజెప్పాడు. అంతట ఆ దంపతులు భక్తిశ్రద్దలతో మూడుసోమవారములు వ్రతాన్ని నిష్టగాచేసారు. ఇరుగుపొరుగువారికి ప్రసాదం పంచిపెట్టారు. సిరిసంపదలు కలిగి ఈతిబాధలు తొలగి శివయ్యదంపతులు సుఖంగా జీవిస్తున్నారు. కాలక్రమేణ ఏటేటా చేసుకొనే ఆ శివదేవుని వ్రతం పట్ల వారికి అశ్రద్ద కలిగింది. శివదేవుని కరుణ తొలగింది. శివయ్య పూర్వపు స్థితికి వచ్చి ఆయవారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అలా యధాప్రకారం ఆయవారం చేసుకుంటూ శివయ్య ఒకనాడొక ఇంటి ముందు ఆగి భవతీబిక్షాందేహి ! అన్నాడు. ఆమాటలకు అయ్యా ! ఈ రోజు మేము శివదేవునివ్రతం చేసుకుంటున్నాము. పూజపీటలమీద ఉన్నాం, లేచిరావడం కుదరదు. ఈ పూటకు వెళ్ళి రేపు రండి అనిచెప్పింది. ఆ పలుకులు విన్న శివయ్య తాము శివారాధనను మరచి అపచారము చేసామని గుర్తుచేసుకున్నాడు. తిన్నగా నదికి వెళ్ళి స్నానంచేసి ఇంటికి వచ్చి పూజాపీటంపై కూర్చుని శివదేవునిపూజ చేసాడు. అపచారం మన్నించమని వేడుకున్నాడు. పూజానంతరం కధ చెప్పు కుంటూ కధవినడానికి రావలసినదని భార్యను పిలిచాడు. అలసిఉన్నాను, బద్దకంగా ఉంది, వేళాపాళాలేని ఈ పూజలేమిటని మొండిగా మాట్లాడింది.

ఆమాటలకు శివదేవునకు ఆగ్రహం వచ్చింది. అందువల్ల ఆమెకు చూపు మందగించింది. ఇది గమనించిన శివయ్య భార్యను మందలించి, చూసావా! శివుదేవునిపట్ల మనం నిర్లక్ష్యం చూపడం వల్ల మనకెటువంటి దుస్థితి సంప్రాప్తించిందో. ఆయన పట్ల అపచారం, అలక్ష్యం పనికిరాదు. లేచి ఈరోజైనా పూజ కధా శ్రవణం విను, కాదనకు, అని హెచ్చరించాడు. ఆమెకు జ్ఞానోదయమయ్యింది. ఆనాటి నుండి క్రమం తప్పకుండా శివదేవుని వ్రతం చేసుకుని కథ చెప్పుకుంటుండే వారు, ఇరుగుపొరుగువారు కూడా వ్రతమహత్మ్యాన్ని తెలుసుకుని భక్తితో ఆరాధిస్తుండేవారు. శివదేవుని వ్రతాచారణ వల్ల అందరూ సుఖజీవనులై తరించసాగారు.

కావున ఈవ్రతకధ చదివిన వారికి, విన్నవారికి శివుని కరుణ కలిగి సకలై శ్వర్యాలు పొంది తరిస్తారని సూతమహర్షి శౌనకాదులకు భోదించాడు.

Tags: శివదేవుని కథ, Siva devuni katha, Siva, Shiva, Siva Story, Siva devuni Story Telugu

Comments