సూర్య భగవానుడు జన్మరహస్యం..
ప్రత్యక్ష దైవమైన సూర్యుడు సమస్త మానవాళికి జవజీవాలను కల్పిస్తున్నాడు. ఆ భగవానుడి వల్ల మానవులే కాదు దేవతలూ మేలు పొందారని పురాణాలూ చెబుతున్నాయి.
అయితే సూర్యుడు క్రియాశక్తి ప్రవృత్తి, కిరణాలతో దేవతలను, పితృదేవతలను, మనుషుల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. చంద్రుడు శుక్లపక్షంలో సూర్యుడిలో ఉన్న అమృతాన్ని స్వీకరించి దాన్నే తన అమృతంగా మార్చుకుంటాడు.
ఆ అమృతాన్ని సౌమ్యులు, కామ్యులు అయిన దేవతలు, పితృదేవతలు ఆహారంగా గ్రహిస్తారు. మరి సూర్యభగవానుడు ఎవరు? అయన జన్మ రహస్యం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రహ్మ పురాణం ప్రకారం, కశ్యప ప్రజాపతి, అదితి దంపతుల ముద్దుల తనయుడు సూర్యుడు. ఆ సమయానికే రాక్షసుల ఆగడాలు పెచ్చుపెరిగాయి. అసురుల ఆట కట్టించగల అపార శక్తిమంతుడిని బిడ్డగా ప్రసాదించమని అదితి సౌరశక్తిని ప్రార్థించింది.
విశ్వమంతా విస్తరించిన తేజస్సునే సంక్షిప్తీకరించి ఆ తల్లి కడుపున నిక్షిప్తం చేసిందా దివ్యకాంతి. పుట్టబోయే కొడుకు కోసం వ్రతాలూ ఉపవాసాలూ చేస్తున్న అదితిని చూసి కశ్యపుడు ఎగతాళి చేశాడు. బిడ్డని ఆకలితో చంపేస్తావా? అని అరిచేశాడు. ఆ మాటకు తల్లి మనసు గాయపడింది.
నిరసనగా తన గర్భాండాన్ని త్యజించింది. ఆమె కడుపులోంచి నేలమీద పడగానే లక్ష అగ్నిగోళాల్లా భగభగా మండిందా అండం. ఆ వేడికి సృష్టి అతలాకుతలమైంది. అదితీకశ్యపుల ప్రార్థన తర్వాత, ఆ అండం పగిలి అందులోంచి అందమైన పసివాడు బయటికొచ్చాడు.
ఆ బాలుడే భానుడు! ఆనాడు మాఘశుద్ధ సప్తమి రథసప్తమి ఆ ముహూర్తానికే ఏడుగుర్రాల రథాన్ని అధిరోహించి, వెలుగుల దేవుడిగా బాధ్యతలు స్వీకరించాడని మత్స్యపురాణం చెబుతోంది.
తల్లి కోరిక మేరకు దేవతల శత్రువులైన రాక్షసులను ఓడించినందువల్ల ఆదిత్యుడని పిలవబడినాడు. సూర్యుడు ఎరుపు వర్ణము కలవాడు. ఆయన రథము నందు ఒకే చక్రముంటుంది. దీనినే సంవత్సరము అని అంటారు. ఈ రథము నందు పన్నెండు మాసములు, ఆరు ఋతువులు, నాలుగు – నాలుగు మాసముల చొప్పున మూడునాభులు ఉంటాయి.
ఇదియే కాలచక్రమని కూడా అంటారు. కాబట్టి సూర్యభగవానుడు పన్నెండు మాసములలో 12పేర్లతో ఆరాధించబడతాడు. విశ్వకర్మ తన నైపుణ్యాన్నంతా గుదిగుచ్చి అగ్నిగోళం లాంటి సూర్యబింబాన్ని అరగదీసి, కరగదీసి తాప తీవ్రతను తగ్గించాడు. ఆ అరుగుదలలో పుట్టిన రేణువుల నుంచీ విష్ణువుకు చక్రాన్నీ, శివుడికి శూలాన్నీ తయారు చేసిచ్చాడని పురాణం.
ఖగోళశాస్త్రం ప్రకారం, సూర్యుడి వయసు నాలుగువందల అరవై కోట్ల సంవత్సరాలు. దాదాపుగా సృష్టి వయసూ కూడా అదే. సూర్యుడు వేలవేల నక్షత్రాల మధ్య ఓ మహానక్షత్రం. హైడ్రోజన్, హీలియంలతో నిండిన వాయుగోళం. ఆ గురుత్వాకర్షణశక్తి కారణంగానే, భూమి సహా వివిధ గ్రహాలు సూర్యభ్రమణం చేస్తున్నాయి.
సౌర వ్యవస్థలో తొంభైతొమ్మిదిశాతం దినకరుడి అధీనంలోనే ఉంది. సూర్యుడి వ్యాసం భూమి కంటే వందరెట్లు పెద్దది. అయితే సూర్యభగవానుని రూపాలను పన్నెండుగా, వారినే ద్వాదశాదిత్యులుగా ఆయా మాసాలలో ఆ రూపాలలో పూజిస్తుంటారు. వాటిలో భాగంగానే కశ్యప్రజాపతి కుమారుడు సూర్యుడని, వారిలో ఇక్ష్వాకుడు రాజయిన కారణంగా ఇక్ష్వాకువంశంలో రాజులందరినీ సూర్యవంశ రాజులు అంటరాని చెబుతారు.
ఇక సూర్యుడు వేసే ప్రతి అడుగు వేగానికి, కాలగమనానికి కొలబద్ద. మనం లెక్కించే సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలకు ఆధారం సూర్యుడే. కాలమే వేదస్వరూపం అంటోంది వేదం. కాలం కంటికి కనబడదు. దైవమూ అంతే. కానీ కాలానికి ప్రమాణికమైన సూర్యుడు మనకు కనిపిస్తాడు.
అందుకే ఆయనను ప్రత్యక్షదైవంలా కొలిచి, ఆది నారాయణుడిగా ఆరాధిస్తాం. భౌతిక, వైజ్ఞానిక, దృష్టితో పరిశీలిస్తే సృష్టి, స్థితి, లయ కారకుడు సూర్యుడు మాత్రమే.
ఆయన వల్లే సమస్త ప్రకృతి చైతన్యమవుతుంది ..
Tags: సూర్య భగవానుడు, Surya, Surya Narayana, Surya Bhagavan, Suryanarayana Stotram, Arasavalli, Sun, Surya Stotram Telugu