పుష్య మాసమును శూన్య మాసమని ఎందుకంటారు? Why is Pushya Masam called as Sunya masam?

పుష్య మాసమును శూన్య మాసమని ఎందుకంటారు?

సూర్యమానం ప్రకారం, చాంద్రమానం ప్రకారం కలిసి ఉండే కొన్ని మాసాలను శూన్య మాసాలంటారు. ఉదాహరణకు సూర్యమానం ప్రకారం ధనుర్మాసం చాంద్రమానం ప్రకారం పుష్యమాసం కలిసి ఉన్న కొన్ని రోజులను శూన్య మాసమంటారు.

ధనుర్మాసము మొత్తము కూడా శూన్య మాసం కాదు అదేవిధంగా పుష్య మాసం మొత్తము కూడా శూన్య మాసం కాదు. ధనుర్మాసం ప్రారంభమైన కొద్దిరోజులకు పుష్య మాసం ప్రారంభం అవుతుంది. అంటే ధనుర్మాసం ప్రారంభమైన మొదటి రోజు నుంచి పుష్యమాసం ప్రారంభమయినా ముందు రోజు వరకు శూన్య మాసం కాదు. అదేవిధంగా ధనుర్మాసము అయిపోయిన తర్వాత పుష్యమాసంలో మిగిలిన రోజులు శూన్య మాసం కాదు.

మీన మాసంతో కూడిన చైత్రమాసం, మిధున మాసంతో కూడిన ఆషాడ మాసం, కన్యా మాసంతో కూడిన భాద్రపద మాసం, ధనుర్మాసంతో కూడిన పుష్య మాసాలను శూన్య మాసాలంటారు.

ఈకాలంలో గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహాది ముఖ్య శుభ కార్యాలకు ముహుర్తాలు శూన్యం. అధిక మాసంలో కూడా శుభ కార్యాలకు ఎటువంటి ముహుర్తాలుండవు. కనుక ముహుర్తాలు లేని ఈ నెలలను శూన్య మాసాలంటారు. ఎటువంటి దైవకార్యలయినా, పితృ కార్యాలయినా శూన్య మాసంలో చేయవచ్చు. ఎటువంటి నిషేధం లేదు.

మనకు చాంద్రమానము సూర్యమానమని రెండు రకాల కాలమానాలు (క్యాలెండర్) ఉన్నాయి. చంద్రుడి గమనాన్ని ఆధారం చేసుకుని చాంద్రమాన మాసాలు ఏర్పడతాయి. చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం అని పన్నెండు మాసాలు ఉన్నాయి. శుక్ల పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు ఒక మాసముగా పరిగణిస్తారు. ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాలలో పూర్ణిమ తరువాత వచ్చే కృష్ణ పాడ్యమి మొదలు మళ్లీ వచ్చే పూర్ణిమ వరకు ఒక మాసముగా పరిగణిస్తారు.

రోజుకు ఒక నక్షత్రం చొప్పున 27 రోజులు 27 నక్షత్రాలకు దగ్గరగా చంద్రుడు ప్రయాణం చేయడానికి 27.32 రోజులు పడుతుంది. దీనికి sidereal month అని పేరు. చంద్రుడు కొంతకాలం వృద్ధి చెందుతూ పూర్ణ స్థితికి చేరుకుంటాడు. పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అని పదిహేను రోజులకు (తిధులకు) నామకరణం చేశారు. ఈ పదిహేను రోజులను వృద్ధి పక్షము లేదా శుక్లపక్షము అని పిలుస్తారు.

తిరిగి చంద్రుడు, పాడ్యమి నుంచి అమావాస్య వరకు క్షీణించి పూర్తిగా కనిపించడు. ఈ పదిహేను రోజులను బహుళ పక్షం లేదా కృష్ణ పక్షం అని పిలుస్తారు. 

చంద్రుడు వృద్ధి చెంది తిరిగి పూర్తిగా క్షీణించడానికి సగటున 29.530587981 రోజులు పడుతుంది. దీనిని Synodic month అంటారు. సంవత్సరం పూర్తి కావడానికి 354.37 రోజులు పడుతుంది.

భూమి సూర్యుని చుట్టూ తిరుగడానికి ఒక సంవత్సరం అంటే 365.25 రోజులు పడుతుంది.

ప్రతి సంవత్సరం 11.12 రోజులు ముందుగానే పూర్తవుతుంది. ఈ కారణంగా తెలుగు పండుగలు పది పదకొండు రోజులు ముందుగానే వస్తాయి. దీనిని సరి దిద్దటం కోసం ప్రతి మూడు సంవత్సరాలకు ఒక నెలను అధిక మాసంగా చేరుస్తారు. చైత్రమాసం నుంచి ఆశ్వీయుజ మాసం వరకు వచ్చే మాసాలను మాత్రమే అధిక మాసంగా కలుపుతారు. మొదటి అధిక మాసం 28 నెలల తరువాత వస్తుంది. వరుసగా 28, 34, 34, 35 నెలల తరువాత అధిక మాసం పునరావృతం అవుతుంటుంది. అధిక మాసమెప్పుడూ ముందు వచ్చి తరువాత నిజ మాసం వస్తుంది. అధిక మాసం కూడా శూన్య మాసంగా పరిగణించ బడుతుంది. ఇటువంటి సవరణ లేదు కాబట్టి అరబిక్ కాలమానం ప్రకారం జరుపుకొనే రంజాన్ శీతాకాలంలో, ఎండాకాలంలో, వానాకాలంలో కూడా వస్తుంది.

పూర్ణిమ రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో ఆ మాసాన్ని పిలుస్తారు. ఉదాహరణకు చంద్రుడు పూర్ణిమనాడు చిత్త నక్షత్రం దగ్గర ఉంటాడు కాబట్టి చైత్ర మాసం అంటారు. చంద్రుడు విశాఖ నక్షత్రమునకు దగ్గరగా ఉన్నప్పుడు వైశాఖ మాసమని పిలుస్తారు.

సూర్యుడు ప్రతినెలా ఒక రాశిలో ఉంటాడు. ధనుర్మాసంలో ధనుస్సురాశి దగ్గర ఉంటాడు. మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం అను పన్నెండు రాశుల పేర్లతో పన్నెండు సూర్య మాన నెలలు ఉంటాయి.

సూర్యుని చుట్టూ భూమి ఒక స్థిరమైన కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది. అందువల్ల సూర్యమానం ఆధారంగా చేసుకొని తయారుచేసిన కాలమానం రుతువులకు సామీప్యంగా ఉంటుంది.

Tags: పుష్య మాసము, శూన్య మాసం, Importance of Pushya Masam, Pushya Masam, Pushya Month 2024 Dates, Shoonya masam, Sunya masam in 2024, Sunya Masam Telugu

Comments