పతివ్రత ధర్మం అంటే ఏమిటి? పతివ్రతకి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? Pativrata Rules in Telugu

పతివ్రతా ధర్మములు

పతివ్రతాధర్మము శ్రేష్ఠంబని వర్ణింపబడినది. అదెట్లనగా?

పతివ్రత - భర్త భుజించిన తరువాతనే భుజింపవలెను. అతడు నిలచియున్నచో తానును నిలుపబడవలెను.

భర్త నిద్రించిన పిమ్మట తాను శయనింపవలెను. అతడు మేలుకొనక ముందు తాను నిద్ర నుండి లేవవలెను.

ఎట్టిదావరికము లేనిదై ఎల్లకాలము భర్తకు హితము నాచరింపవలెను. సాధ్వీవనిత తాన అలంకరించుకొనియే భర్తకు కనుబడవలెను. అతడు గ్రామాంతరము వెళ్ళినపుడు మాత్రము కుంకుమ మొదలగు మంగళద్రవ్యములను ఉపయోగించి, అలంకారమును మానవలెను.

భర్త పేరు తానెప్పుడు ఉచ్చరింపరాదు. ఒకవేళ అతడు తీక్షముగా మాటలాడినను శిక్షించినను తాను మరల నాక్రోశము జెందరాదు.

భర్త పిలచినపుడు ఇంటి పనులను విడచి వెళ్ళి నమస్కరించి స్వామీ! ఏమిటి! అని వినయముతో ప్రశ్నించి యాతడు చెప్పిన కార్యమును ప్రసన్నమనంబున గావింపవలెను.

ఇంటివాకిలిని చాల కాలము తాను నిలువబడరాదు. పరగృహమునకు భర్త అనుమతి లేనిది పోకూడదు.

భర్త నుడివిన రహస్య వృత్తాంతము ఇతరులకు చెప్పవలదు.

భర్త దేవుని పూజించుటకు వలయు పత్రపుష్పాదులను చెప్పకమునుపే సమర్చియుంచవలెను.

భర్తకు ఎప్పుడెప్పుడు ఏమేమి కావలెనో అట్టి అవసరముల తీర్చుటకై పతివ్రత - సంసిద్ధురాలై యుండవలెను.

పతి - అభిమతము లేనిది కాశీరామేశ్వరాది తీర్ధక్షేత్రములకు వెళ్ళకూడదు.

ఊరేగింపులు సమాజములు మున్నగు వానిలో పాలుగొనరాదు. ఒకవేళ పుణ్యతీర్ధములందు గ్రుంకులిడవలెనని కోర్కెగలిగినచో భర్తగారి పాదోదకమును చల్లుకొని పుచ్చుకొనవలెను. 

ఎందుకనగా? గంగాది పుణ్యతీర్ధములు కాశ్యాది పుణ్యక్షేత్రములును పతి చరణోదకమునందు కలవని పతివ్రతాధర్మశాస్త్రము చెప్పుచున్నది. కావున సంశయింపరాదు.

భర్త తినగా మిగిలినది ప్రసాదమని భావించి సాధ్వీమణి పరిగ్రహింపవలెను.

దేవతా నివేదనమును చేయకుండా పితృదినమునాడు పెద్దలకు సమర్పించను, అతిధులకు పరిచారకులకు పశువులకు బిచ్చగాండ్రకు నొసగకుండను. తాను ఆహారమును స్వీకరించరాదు.

గృహమున పరికరముల నన్నిటి నెప్పటికప్పుడు సరిజూచుకొనవలెను. విసుగు లేనిదై సంబరమున నుంటూ అనవసర వ్యయముల జేయనిదై అనగా పొదుపు గలిగి యుండవలెను.

భర్త యాజ్ఞలేనిది ఉపవాసమును చేయరాదు. ఒకవేళ స్వేచ్ఛగా నుపవాసము నాచరించినచో అట్టి వనితకు ఉపవాస ఫలము సమకూరుకుండుటయే గాక నరకంబు నొనగూరును.

ప్రాణనాధుడు సుఖముగా నిశ్చింతగా నున్నపుడు యధేష్టము విహరించునపుడు ఆటంకములను కల్పించరాదు.

భర్తబలహీనుడైనను కష్టాలపాలైనను రోగగ్రస్తుడైనను ముదుసలియైనను సంతోష స్వాంతుడైనను మిడుకువాడైనను ఆతనిని తిరస్కరింపరాదు.

రజస్వలగా నున్నతణ్ణి మూడుదినములు భర్తకు కనుపడనిదై తనమాటను వినుపింపఁగూడదు. నాలుగవనాడు సుస్నాతయై మొట్టమొదట భర్త ముఖమును చూడవలెను. వీలులేనిచో పతిని మదిని తలచుకొని సూర్యునవలోకింపవలెను.

పసుపు, కుంకుమలు, సింధూరము, కాటుక, రవిక, తాంబూలము, మంగళసూత్రము, గాజులు, కమ్మలు, మొదలగు మాంగల్య వస్తువులను పతివ్రతయగు వనిత దూరము చేయరాదు. అనగా ఎల్లకాలము ధరించియుండవలెనని భావము మరియు తలవెంట్రుకలను దూసుకొని కొప్పునమర్చుట నేముగాదు. వీని నన్నిటిని విడువకుండు సువాసిని తన భర్త చిరకాలము జీవింపవలెనని యపేక్షించు సాధ్విగా గుర్తింపబడునని సారాంశము.

చాకలిదానితోడను రంకులాడితోడను సన్యాసురాలితోడను నిర్నిమిత్తముగా ద్వేషించుదాని తోడను ఒకప్పుడైనను చెలిమి జేయరాదు.

భర్తను బాధించు నామెతో మాటలాడగూడదు. ఒంటరిగా నుండకూడదు. దిసమొలతో జలక మాడరాదు (చిన్న వస్త్రమునైన ధరించి స్నానముఁజేయవలెనని భావము).

రోలు పైనను రోకలి పైనను మూకుడు పైనను బండపైనను గడపపైనను తిరుగలి విసుర్రాయి పైనను కూర్చుండరాదు.

ఏకాంతమున భర్తతో సుఖించునపుడు దక్క ఇతర సమయములలో స్వతంత్రించి సంభాషింపకూడదు.

భర్తకు ఇష్టమైన వస్తువుల యందు పనుల యందు తాను గూడ ప్రేమ కలిగి యుండవలెను.

భర్త సంతోషముతో నున్నతఱి తాను సంబరముతో నుండవలెను. ఏదేనొక సంకటమున భర్త బాధపడుచు విచారపడుచుండినచో తానును ఖిన్నురాలుగ నుండవలెను.

సంపదలయందు ఆపదలయందు నొకేవిధముగా నుంటూ ధైర్యముగలదై సంతోషాతిశయమును గాని దుఃఖాడంబరమును గాని చూపరాదు.

ఇంటియందు నెయ్యి లవణము (ఉప్పు) మంచినూనె మున్నగునవి లేనపుడు భర్తకు నెమ్మదిగా తెలుపవలెను గాని హఠాత్తుగా చెప్పియాతనిని బాధింపకూడదు.

పార్వతీదేవీ! నిజముగా విచారింప పతివ్రతకు భర్త- బ్రహ్మవిష్ణు మహేశ్వరుల కన్న నధికుడని తేటపడును. అనఁగా ప్రతి సాధ్వీమణి - తన పతి సాక్షాత్ శివుడనియే భావింపవలెనని సారాంశము.

వ్రతములను ఉపవాసములను భర్తను నిరాకరించి చేయునామె పతిదగు ఆయుష్యమును హరించును. మరియు మరణించిన తరువాత నరకదుఃఖము ననుభవించును.

భర్త యెద్దియేని కఠినముగా చెప్పినపుడు తాను క్రోధముతో సమాధానము నిచ్చునెడ గ్రామమున ఆడుకుక్కయైగాని అరణ్యమున ఆడునక్కయైగాని జన్మించును.

భర్తకూర్చుండు దానికన్న నెత్తైన పీఠమునందు తాను కూర్చుండరాదు.

దుర్మార్గుల చెంతకు వెళ్ళకూడదు. భర్త నుద్దేశించి నిందావాక్యములుగాని భీతి గొలుపుమాటలను గాని యాడరాదు. ఒకరిని నిందింపఁ గూడదు. పోట్లాటను దూరమొనర్పవలెను. అనఁగా తానెప్పుడును కలహింపరాదని భావము.

పెద్దలముందు హెచ్చుగా మాటలాడరాదు. హెచ్చుగా నవ్వకూడదు. భర్త బయట నుండి వచ్చుటను గమనించి మందస్మితముతో నెదుర్కొని ఆహార పానీయములను తాంబూలాదుల నొసగి పాదసేవ జేయుచు మార్గాయాసమును పోగొట్టు సంతోష మనోహర వచనముల పలుకుచు నాతని రంజింప జేయు సాధ్వీమణి ముల్లోకములను సంతసింప చేశినదగును.

తండ్రిగాని అన్నదమ్ములుగాని కుమారుఁడు గాని కలుగఁజేయు సుఖము పరిమితమై యుండును. భర్త వలన నేర్పడు శరీర సుఖముగాని మానసిక ఆనందము! ఇహపరముల రెంటికిని సాధనమగును. కావున నట్టి భర్త నెల్లకాలము గౌరవిం నవమానింపరాదు.

తన మాంగళ్య జీవనమునకు కీర్తిప్రతిష్ఠలకును భర్తయే కారణమ దైవముగా భావింపవలెను.

భర్తయే దేవుఁడు భర్తయే గురువు. పతియే ధర్మము పుణ్యతీర్ధములు వ్రతములు నగువాడు. అందువలన వ్రతోపవాసాది నియమములను విడనాడి భర్తనే సేనింపవలెను.

భర్తను నిరాకరించి రహస్యముగా ప్రవర్తించు వనిత - చెట్టు తొఱ్ఱయందు నివసించు పెద్ద ఫిట్టయై పుట్టును.

భర్త దండింపగా తాను నాతనిని కొట్టదలచిన యామె - ఆడు పెద్దపులిగా జన్మించును.

పరపురుషుని కడకంటి చూపులతో గాంచునది - మెల్లకన్నుగలదగును.

భర్తకు పెట్టకుండా తాను మిష్టాన్నమును భుజించునెడ ఊర పంధియై గాని ఆడుమేకయై గాని జన్మించును.

ప్రియుని నీవు అని పలుకరించునది మూగదై పుట్టును.

సవతినెల్ల కాలము ద్వేషించు వనిత ప్రతి జన్మయందును దౌర్భాగ్యురాలగును.

భర్త చూపు తప్పించి పరపురుషుని మోహముతో గాంచు భార్య - ఒకకన్ను గ్రుడ్డిదై పెడముఖముతో కురూపిగా జన్మించును.

జీవాత్మ అనగా ప్రాణము లేని శరీరము క్షణకాలములో అపవిత్ర మైనట్లు పెనిమిటి లేని తరుణి బాగుగా స్నానము జేశి యలంకరించు కొనినను పరిశుద్ధురాలు కాకుండును.

పతివ్రతను కనిన తలిదండ్రులు ధన్యులు; పతివ్రతను పరిగ్రహించిన పురుషుఁడును పుణ్యాత్ముడని చెప్పవచ్చును. పతివ్రతఁ తగు సత్ప్రవర్తనమున చేసి తండ్రివంశము వారు ముగ్గురు, తల్లివంశమువారు ముగ్గురు, భర్తవంశమువారు ముగ్గురును స్వర్గమున దివ్యసుఖముల ననుభవింతురు, స్త్రీలు దుర్మార్గమున నడచినచో మాతాపితృపతికుల త్రయమును పుణ్యలోకముల నుండి పడద్రోయుదురు.

పతివ్రత యొక్క పాదము స్పృశించు ప్రదేశము పవిత్రమై సంచరించువారి పాపములను పోగొట్టును.

సూర్యభగవానుడు చంద్రుడు వాయుదేవుడును సాధ్విదగు చరణమును స్పృశించి తమకు పావనత్వము నొదవజేసుకొందురు.

ఉదకములు పతివ్రతను తాకి “ఇప్పుడుగదా మా కల్మషమును తొలగించుకొంటి" మని భావించును. ఐతే భర్తయే పరమదైవమని భావించి ప్రవర్తించు సాధ్వీమణులను పురుషులు చులకన జేయరాదని దిగువ సందర్భమున గాననగును.

భార్యా సంతానవృద్ధయే గృహస్థుని సంసారము చక్కగా సాగుటకు ఇల్లాలే మూలము; శారీరక వాచిక మానసిక సుఖముల బడయుటకు ధర్మపత్నియే నిదానము; ధర్మార్థకామ మోక్షఫలముల నొందుటకును భార్యయే భర్తకు సహకరించును. మంచి సంతానమును బడసి వంశవృద్ధి గలుగజేయుటకును సతియే కావలెను.

సౌందర్యము అంగసౌష్టవముగల తరుణీమణులు సర్వసాధారణముగా గృహముల నుండువారు కాని పూర్వజన్మమున గావింపఁబడిన శివారాధనము వలనను ఈజన్మ యందలి పురుషునకు పతివ్రతయగు భార్యలభించును. సాధ్విని పత్నిగా పొందినవాడు ఇహపరలోకమ అయింవఁజాలును.

భార్యలేనివాడు దేవతా కార్యమును పితృకర్మను అతిథి సత్కా యజ్ఞయాగ వ్రతములను చేయుటకు తగినవాడుకాడు.

పతివ్రతయగు భార్య తనయింట గల భర్తయే సర్గృహస్థుడని చెప్పవచ్చును. అట్లుకానిచో ముదుసలి తనము శరీరమును క్షీణింప చేయునట్లు రాక్షసి తన ఎదుట ఉన్న వారిని మ్రింగునట్లును దుర్మార్గురాలగు భార్య - భర్తను పీడించుచు క్రుంగదీయును.

గంగాస్నానముతో దేహము పవిత్ర మగునట్లు పతివ్రతా దర్శనము వలన సమస్త చరాచరము పావనంబగును.

గంగానదికిని పతివ్రతకు నెట్టి భేదములేదు. అందువలన పతివ్రతయు తత్పతియు గౌరీశంకరులనియే భావింపవలెను.

పతివ్రతలు-విధానాలు

అమ్మా! గిరిజాదేవీ; పతివ్రతాధర్మము నిట్లు వర్ణించితిని. ఇక నాధర్మముదగు భేదములను నుడువుచున్నాను. సావధానముగా వినుము!

పతివ్రతలు - ఉత్తమురాలు మధ్యమురాలు కనిష్ఠురాలు మిక్కిలి నికృష్టురాలునని నాలుగు తెఱగులుందురు.

స్వప్నమున గూడ తన అంతఃకరణమున భర్తనే గాంచుచు పరపురుషుని కలలోనైన భావింపని వనిత - ఉత్తమపతివ్రత అనబడును.

పరపురుషుని తండ్రి వలెగాని సహోదరుని వలెగాని కుమారుని వలెగాని చూచెడు బుద్ధిమంతురాలు మధ్యమ పతివ్రత అనబడును.

స్వధర్మము కాదని గుర్తెరిగి వ్యభిచరింపని మగువ కనిష్ఠ పతివ్రత యగును.

భర్తకు భయపడిగాని తనవారికి వెఱచిగాని భ్రష్టురాలు కానట్టి తరుణి అతి నికృష్టయగు పతివ్రతయని గ్రహింపనగును.

ఈ నాలుగు విధముల వారును పాపములను పోగొట్టు పతివ్రతలనియే చెప్పవచ్చును. మరియు వీరు ఇహపర లోకములయందును సంతృప్తిజెందువారై లోకములను పవిత్రము జేయుదురు.

Tags: పతివ్రత ధర్మం, Pativrata Rules in Telugu, Pativrata, Pativrata Rules, Pativrata Dharmam, Devotional, Dharma Sandahalu, Bhakthi Samacharam, Pathivratha

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS