ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు శ్రీవారి పుష్కరిణి మూత
తిరుమల, 2024, జూలై 29: తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు గాను ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేస్తారు. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు.
సాధారణంగా స్వామి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవకాశం లేదు. పుష్కరిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. నిరంతరాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తొలగించి చిన్న చిన్న మరమ్మతులను పూర్తి చేస్తారు.
పుష్కరిణి మరమ్మతుల కోసం మొదటి పది రోజుల పాటు నీటిని తొలగిస్తారు. ఆ తరువాత పది రోజులు మరమ్మతులు ఏవైనా ఉంటే పూర్తి చేస్తారు. చివరి పది రోజులు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు. పుష్కరిణిలోని నీటి పిహెచ్ విలువ 7 ఉండేలా చూస్తారు. టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపడతారు.
Tags: TTD, TIRUMALA, TIRUPATI, TIRUMALA NEWS, TIRUMALA LATEST UPDATES, SRIVARI PUSHKARINI