తిరుమలలో ఎన్ని రకాల ప్రత్యేక సేవలు ఉన్నాయి? వాటిని ఎలా బుక్ చేసుకోవాలి?
తిరుమలేశుని దర్శనం అంటే దేశంలో అందరికీ అదో రకమైన పులకరింత. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఒక అపూర్వమైన అనుభవం. దానికోసం ఏమైనా చేస్తారు.
అలాంటి స్వామి దర్శనం ఎన్నిరకాలుగా చేయొచ్చో మనకు తెలుసు. అయినా మరోసారి చూద్దాం. ధర్మ దర్శనం,300రూపాయల ప్రత్యేక దర్శనం, కాలిబాటన వచ్చే వాళ్ళ కోసం దివ్యదర్శనం…ఇవి మనం వెంకన్న దర్శనానికి వున్న మార్గాలు. ఇకపోతే ఇప్పుడు కొత్తగా 10000 రూపాయలు కడితే దొరికే లభించే అపురూపమైన దర్శనం.. విఐ పి లేక బ్రేక్ దర్శనం. ఇందులో మనము కులశేఖర పడి దాకా వెళ్లొచ్చు..ఇంకా దీంట్లో మనను ఎవరూ తోయడం లాంటివి జరగవు..ప్రశాంతంగా కొన్ని నిముషాల పాటు స్వామిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది.
అయితే అంత డబ్బు ఖర్చు పెట్టక పోతే స్వామిని , అలా చూడలేమా?? అంటే చూడొచ్చు..అంతకంటే ఎక్కువసేపు కూడా చూసే మార్గం వుంది. అది ఏదైనా ప్రత్యేక సేవలో పాల్గొనడం ద్వారా. ఇవి రోజూ వుండేవి,వారంలో ఒకసారి…ఇలా చాలా వున్నాయి. అయితే ఇవి దొరకడం అన్నది..స్వామి కరుణ మన ప్రాప్తం. అవేంటో చూద్దాం..
మొదలు రోజువారీ సేవలు::
ప్రతీ రోజూ ఉదయం ,తెల్లవారు ఝామున.."కౌసల్యా సుప్రజా రామ(ఇది రామాయణంలో మహర్షి విశ్వామిత్రుడి మేలుకొలుపు)..అంటూ మేలుకొలుపు పలికి, తరువాత పువ్వులతో అలంకరించి,సహస్రనామ అర్చన చేస్తారు. తరువాత ఒక వైపు "పొర్లు దండాలు" వారిని వదులుతారు. ఆ పై వైష్ణవ స్వాముల "శాతుమురై". ఆపైన ధర్మ దర్శనం మొదలవుతుంది. ఇక్కడ మొత్తం నాలుగు సేవలు వున్నాయి. "సుప్రభాతం" "తోమాలసేవ" "అర్చన" "పొర్లుదండాలు". సుప్రభాతం జరిగేటప్పుడు తెరవేసి స్వామికి మేలుకొలుపు చెప్తారు..పాడే అర్చకస్వాములు, భక్తులు తెరకు ఈవల వుంటారు..అయింతరువాత దర్శనం కోసం వదులుతారు. మెల్లగా సాగుతుంది..ఎవరూ తోయడం అదీ వుండదు. ఆపైన తోమాల(పువ్వులు)సేవ వారిని వదులుతారు. ఆపై "అర్చన".. స్వామివారిని సహస్రనామాలుపఠిస్తూ పూజ చేయడం..ఈ సేవలో పాల్గొనే భాగ్యం కలిగిన భక్తులు అంత సేపూ..ఎదురుగానే వుంటారు..ఆ తరువాత దర్శనానికి వదులుతారు..ఎంత భాగ్యమో కదా(నాకు ఈ భాగ్యం ప్రసాదించలేదు స్వామి ఇంతవరకు). ఇవి ఇలా జరుగుతూ వుండగా..పొర్లు దండాలు చేసే వారు..దాదాపు 2గంటల సమయంలో..పుష్కరిణిలో స్నానం చేసి,తడిబట్టలతో క్యూలో నిలబడి వుంటారు..సమయానికి వాళ్లను "అంగ ప్రదక్షిణలు"చేయించి దర్శనానికి పంపుతారు..ఇందులో కూడా తోయడాలు అవీ వుండవు.మొత్తం 750 టిక్కెట్స్..ఆడా మగా కలిపి. ఒక్క శుక్రవారం నాడు తేడా వస్తుంది..అర్చనకు వరకు ఏకాంతం లో చేసి స్వామికి అభిషేకం చేస్తారు కనుక. దీనిని నాలుగు సేవలుగా మనకు ఇస్తారు..పునుగు గిన్నె(civet vessel), కస్తూరి గిన్నె (musk vessel),పూరాభిషేకం, వస్త్రాలంకరణ సేవ. స్వామి సేవలన్నింటిలోను చాలా విశిష్టమైంది.చాలా తక్కువ దొరికేది. ఇక మిగిలింది "పొర్లు దండాలు" అని మనం పిలుచుకునే "అంగ ప్రదక్షిణ". పది రూపాయల ఖర్చు(మనకిచ్చే లడ్డూ కోసం)తో స్వామి చాలా దగ్గరగా చూపించే సేవ.ఇది ముందు రోజు క్యూలో నిలుచుని తీసుకోవాలి. 750 టిక్కెట్స్ అయిందాక ఇస్తూనే వుంటారు.
ఇక వారపు సేవలు చూద్దాం.. శని,ఆదివారాల్లో ప్రత్యేకమైన సేవలు ఏవి వుండవు.
సోమవారం: విశేష పూజ:: ప్రతీ సోమవారం రెండవ గంట అయ్యాక అయ్యే సేవ ఇది.ఆ రోజు మలయప్ప స్వామి మంటపంలో వేంచేపు చేసి,చతుర్దశ కలశాలతో పూజ చేస్తారు.ఈ 14కలశాలలో ఏడింటిలో.నువ్వుల నూనె,పాలు,పెరుగు,నెయ్యి, అక్షతలు,దర్భలు,పంచగవ్యాలు ,మిగతా ఏడిటిలో..నీళ్ళు(శుద్దోదకం)..వుంచుకొని..శ్రీ, భూ, నీలా,పురుష, నారాయణ సూక్తము లతో స్వామికి తిరుమంజనం చేస్తారు.ఆ తరువాత హోమం చేస్తారు..ఆపై సేవలో పాల్గొన్న వాళ్లకు దర్శనం వుంటుంది. వస్త్ర బహుమానం ఇస్తారు.
మంగళ వారం:: అష్టదళ పాదపద్మారాధనం- ఈ సేవ మొదలవడానికి కారణం ఒక ముస్లిం భక్తుడికి స్వామివారి మీద వున్న అచంచలమైన భక్తి. పి వి ఆర్ కె ప్రసాద్ గారి పుస్తకం "నాహం కర్తా హరి: కర్తా"లో ఈ వివరం చాలా బాగా రాశారు. మంగళవారం రెండవ గంట తరువాత ఆ భక్తుడిచ్చిన 108 బంగారు తామర పువ్వులతో స్వామివారికి అష్టోత్తర నామాలతో అర్చన చేస్తారు. ఆ తర్వాత లక్ష్మీ,పద్మావతి అమ్మవారులకు అర్చన చేస్తారు. ఈ కార్యక్రమం జరుగుతున్నంత సేపు భక్తులు బంగారు వాకిలి, కులశేఖర పడి మధ్యలో కూర్చొని స్వామి వారిని చూసే భాగ్యానికి మురిసిపోతూ,స్వామిని చూస్తూ వుంటారు.
బుధవారం:: సహస్ర కలశాభిషేకం::ఈ అభిషేకం భోగ శ్రీనివాసమూర్తికి చేస్తారు.మలయప్ప స్వామి కూడా వుంటారు. భోగ శ్రీనివాసమూర్తిని బంగారు వాకిలి బయట వుంచి,ఆయన పాదాలకు ఒక పట్టు వస్త్రము కొస కట్టి రెండవ అంచు మూలవర్ల కటిహస్థానికి కడతారు..అంటే కార్యక్రమం ..ఆయనకే చేస్తున్నట్టుగా. ఆపై 1008 కలశాలలో(వీటితో పాటు 8 పరివార కలశాలు,ఒక బంగారు కలశం వుంటాయి) తెచ్చిన పరిమళ తీర్థంతో,పంచ సూక్తాలతో పంచ శాంతి మంత్రాలతో స్వామికి అభిషేకం చేస్తారు. ఆ పై బంగారు కలశంలో జలాలు మాత్రం, వేద మంత్రాలతో,మంగళ వాయద్యాలతో ఆనంద విమాన ప్రాకరం చుట్టూ ప్రదక్షిణ తో తీసుకొని వెళ్లి మూలవర్ల పాదాలపై జల్లి,అర్చన చేస్తారు. ఈ సమయంలో తెర కట్టివుంచడాన..భక్తులకు దర్శనం వుండదు.ఆ తర్వాత పంపుతారు.
గురువారం:: తిరుప్పావడ సేవ:: ఇది ఒక అద్భతమైన సేవ. ఈ రోజు ఉదయపు సేవ అవగానే స్వామివారి అలంకరణ లు అన్నీ తీసేసి,స్వామి వారిని అంగవస్త్రం, దోతి లో మాత్రమే వుంచి, స్వామి వారి తిరునామం,కస్తూరి ని బాగా తగ్గిస్తారు..అంటే ఇప్పటి దాకా మనం చూడలేని స్వామి నేత్రాలు కనిపిస్తాయి..ఇది ఒక ప్రత్యేకమైన నేత్ర దర్శనం. మరి అంత శక్తి వున్న స్వామి చూపు మానవ మాత్రుడు భరించగలడా. అంచేత..తిరు పావడ సేవ చేస్తారు.
బంగారు వాకిలి దగ్గర జయవిజయల తర్వాత ఒక పెద్ద బంగారు దీర్ఘ చతుర్భుజ ఆకారంలో వున్న పాత్ర వుంచుతారు..6 అడుగుల పైన పొడుగు, రెండు మూడు అడుగుల వెడల్పు,,అంతే లోతు వున్న ఈ పాత్రను పులిహోర తో నింపి..దాని మీద పాయసం,జిలేబి, తేన్ తోళ,లాంటివి వుంచుతారు..
స్వామి వారి నామం తగ్గిస్తారు అనుకున్నాం కదా..అది ఇప్పుడు మంత్రోచ్చారణ మధ్య చేస్తారు..అలా స్వామి చూపు దీని మీద పడుతుంది. దీనినే "పావడ(veil)" అంటారు.
ఇది జరుగుతున్నంత సేపు భక్తులు గరుడా ల్వార్ కు అటూఇటు వున్న జాగాలో వుండి ఇదంతా చూస్తూ వుంటారు. ఆ తరువాత దర్శనానికి వదులుతారు.
అన్నట్టు ఈ సేవలో పాల్గొన్న వారికి చాలా ప్రసాదాలు ఇస్తారు.. ఎప్పుడూ చూసే లడ్డు వగైరా మాత్రమే కాకుండా.. తిరుమలలో ఎప్పుడైనా స్వామి ప్రసాదం" జిలేబి" చూసారా. చాలా పెద్దది..బహు రుచిగా..ఈ ఒక్క సేవలో మాత్రం దొరుకుతుంది.
శుక్రవారం:: ఈ రోజు రెండు సేవలు..అభిషేకం మరియు నిజపాద దర్శనం. అభిషేకం గురించి పైన కొంత రాశాను కదా. గురువారం నాడు స్వామి నేత్రదర్శనం అయింది కదా..ఈ రోజు అభి షేకానికి స్వామి తయారుగా వున్నారు.ఈ రోజు ఉదయపు సేవలు భక్తులు లేకుండా చేసేసి..అభి షే కం చేస్తారు. సేవలో పాల్గొనే భక్తులకు పచ్చ కర్పూరం,కుంకుమపువ్వు,చందనం,పునుగు తైలం చుక్కలు..ఇలాంటి వాటితో నిండిన ఒక వెండి పాత్ర ఇస్తారు. అందరూ ఆనంద విమానం చుట్టుకొని వచ్చి బంగారు వాకిలి దగ్గరకు చేరాక ఇవి తీసేసు కొని, ఆకాశ గంగ జలాలు తెచ్చి ,పంచ సూక్తాలు చేస్తూ స్వామిని అభిషేకిస్తారు. వక్షస్థల లక్ష్మీ అమ్మవారికి గంధంతో అభిషేకి స్తారు.
ఇవి కాక ఇంకా వసంతోత్సవం, పవిత్రోత్స వం,కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఇలా కొన్ని సేవలు ఆ యా నెలలో జరిగేవి వున్నాయి.
పైన సేవల్లో సుప్రభాతం చూసే భాగ్యం కలిగింది. ఇంకా ఒక పది సంవత్సరాల నాడు..స్వామి నా శ్రీమతికి కోరిక కలిగించి, తీర్చాడు..అభిషేక సేవ లో పాల్గొనే మహాధ్భగ్యం.
ఇకపోతే ఈ సేవల్లో పాల్గొనే పద్దతి. దేవస్థానం వారు ప్రతీ నెల ఒకరోజు ఆ నెలలో అవకాశం వున్న సేవలు అన్నీ తమ apps.. గోవిందా,ttdonline ద్వారా మనకు తెలియచేస్తారు.మనం మనకు కావల్సిన సేవ,రోజు ఎంచుకో వాలి. తరువాత వచ్చే డ్రా లో మనపేరు వుంటే మనకు తెలియచేస్తారు. ఇక ..రెండో పద్దతి. ప్రతీ రోజూ మరుసటి రోజు న అవకాశం వున్న సేవల వివరాలు CRO ఆఫీస్ కు ఎదురుగా వున్న విజయా బ్యాంక్ లో ప్రదర్శిస్తారు.అక్కడే క్యూలో వుండి,మనకు కావాల్సిన సేవ తో దర ఖాస్తు ఇస్తే..6 గంటలకు లాటరీలో మన పేరు వుంటే మనకు మొబైల్ లో మెసేజ్ వస్తుంది..వెంటనే వెళ్లి డబ్బులు కట్టాలి.
Tags: TTD Seva online booking, TTD 300 Rs ticket online booking, TTD online, TTD Darshan online booking availability, TTD online booking, TTD online booking for Suprabhata Seva, ttd 10,000 rs darshan online booking availability, TTD 300 Rs ticket online booking release date, TTD, Tirumala, Srivari Seva