కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది....!!
కృతయుగం నుండి ఇప్పటివరకు శ్రీమహావిష్ణువు తొమ్మిది అవతారాలు ఎత్తడం జరిగినది.
వేదాలు, మహా భారతం, పురాణాలను అందించిన వ్యాస మహర్షి.. కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది? దానికి ముందు జరిగే పరిణామాలు ఏంటి? అన్న విషయాలను సవివరంగా చెప్పారు. కల్కి అవతారం ఎప్పుడు వస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలంటే ముందుగా యుగాల గురించి తెలుసుకోవాలి.
వేదాలననుసరించి యుగాలు నాలుగు. అందులో మొదటిది సత్యయుగం. దీనిని కృతయుగం అని కూడా అంటారు. ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది. ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖసంతోషాలతో గడిపారు. అకాల మరణాలుండవు. రెండోది త్రేతాయుగం..ఈ యుగంలో భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతరించి రావణ సంహారం చేసి, ధర్మ సంస్థాపన చేశాడు. ఇందులో ధర్మం మూడు పాదాలపై నడిచింది. మూడోది ద్వాపరయుగం.. భగవంతుడు శ్రీ కృష్ణుడుగా అవతరించాడు. ఇందులో ధర్మం రెండు పాదాలపై నడిచింది. నాలుగోది ప్రస్తుతం మనం ఉన్నది కలియుగం.
ఇది మొత్తం 4,32,000 సంవత్సరాలు. హిందూ, బౌద్ధ కాలమానాలకు ఆధార గ్రంథమైన సూర్య సిద్ధాంతం ప్రకారం.. 3102 బీసీ ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైనదని చెబుతారు. కృష్ణుడు సరిగ్గా అదే సమయానికి అవతారం చాలించడంతో ఇది మొదలైనట్లు పరిగణిస్తారు. ప్రతి యుగంలోనూ నాలుగు పాదాలుంటాయి. కలియుగంలోనూ అంతే. ప్రస్తుతం మనం ప్రథమ పాదంలో ఉన్నాం.
మన నిత్య పూజా విధానంలో వచ్చే సంకల్పంలోనూ కలియుగే ప్రథమ పాదే అని స్పష్టంగా చెప్పారు. కలియుగం చివరి పాదంలో కల్కి రూపంలో భగవంతుడు అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి, తిరిగి సత్య యుగ స్థాపనకు మార్గం సుగమం చేస్తారని వ్యాస మహర్షి చెప్పినట్లు మన గ్రంథాలు చెబుతున్నాయి.
కల్కి అవతారానికి ముందు జరిగేది ఇదే!
దశావతారాల్లో చివరిది కల్కి అవతారం. సంవత్సరాలు గడిచే కొద్దీ స్వాహాకారం, వషట్ కారము వినపడవు. అంటే యజ్ఞము, యాగము అన్న క్రతువులు ఉండవు.
గోవధ పెరిగిపోయి, మాంసం తినడం నిత్య కృత్యంగా మారుతుంది. వివాహ వ్యవస్థ నెమ్మదిగా కూలిపోవడం మొదలవుతుంది. తల్లిదండ్రులపై గౌరవం తగ్గిపోతుంది. వాళ్లను చూసే బాధ్యతలను పిల్లలు వదిలేస్తారు. భర్తను గౌరవించే భార్య, భార్యలను ప్రేమగా చూసుకునే భర్తలు ఉండరు.
పురుషుల ఆయుర్దాయం 18 సంవత్సరాలకే పూర్తయిపోతుంది. కామ, క్రోధ లోభ, మోహ, మద, మత్సర్యాలతో మనుషులు జీవనం సాగిస్తూ ఉంటారు. మానవుడు వినియోగించే ప్రతి వస్తువు కల్తీ అయిపోతుంది.
వసంత కాలంలో అకాల వర్షాల వల్ల చెట్లు, పువ్వులు, పండ్లు తగ్గిపోతాయి. ప్రజల ధన, మాన ప్రాణాలను కాపాడాల్సిన పాలకులు నిర్భయంగా దోచుకుంటారు. ప్రజలను భయపెట్టి పాలకులు బతుకుతారు. బ్రాహ్మణులు వేదాధ్యాయనాన్ని వదిలేస్తారు. ధర్మ శాస్త్రాలను, ఆచారాలను వదిలేసి, శరీర సుఖాలకు ప్రజలు అలవాటు పడతారు.
పిల్లలు ఆలస్యంగా పుడతారు. దానం చేసే వాడు లేక దొంగతనాలు పెరిగిపోతాయి. తాగే నీళ్ల నుంచి.. పసిపిల్లలు తినే ఆహారం వరకూ ప్రతిదీ అమ్మకానికి పెడతారు.
కలియుగం చివరి పాదంలో ధర్మం పూర్తిగా గాడితప్పిన సమయంలో శంబల అనే గ్రామంలో విష్ణుయశుడు అనే బ్రాహ్మణ కుటుంబంలో కల్కి జన్మిస్తాడు. అదే శ్రీ మహావిష్ణువు పదో అవతారం.
ఆయన అవతరించారన్నందుకు గుర్తు ఏంటంటే, పాపులందరికీ భగంధర వ్యాధి వచ్చి, రక్తం కారుతూ పురుగుల్లా రాలిపోతారు. ఎక్కడ చూసిన వ్యాధులు ప్రబలుతాయి. ప్రజలను హింసించి అధికార గర్వంతో బతుకుతున్న ప్రభువులు, పాలకులను అంతం చేయడానికి శ్వేతాశ్వాన్ని ఎక్కి, కాషాయ పతాకం ధరించి కల్కి దుష్ట శిక్షణ చేపట్టి ధర్మ సంస్థాపన చేసి, అవతారం చాలిస్తాడు.
Tags: కల్కి అవతారం, Kalki Avatar, Kalki, Kalki Avatar story, Kalki Avatar birth, Kalki Avatar in Telugu, Kalki Avatar Photo, Kalki Avatar story Telugu