ప్రతీ సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే పూర్ణిమను "శ్రావణపూర్ణిమ లేక జంధ్యాల పూర్ణిమ" మరియు రాఖీ లేక రక్షాబంధన్ పండుగ అని పిలుస్తూ ఉంటారు. జంధ్యాలు ధరించే వారందరూ ఈరోజున నూతన జంధ్యాలు ధరిస్తారు.
ఈ రోజు బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీతధారణలు చేసి విద్యార్ధులకు వేదపఠనం ప్రారంభిస్తారు. వేదపండితులు వేదాలను వల్లెవేయడం అంటే; ఆ వృత్తి చెయ్యడం ఈ రోజునుండే ప్రారంభిస్తారు. ఆ విధంగా వీరు ఈరోజు వేదాలన్నింటిని ప్రారంభ ఋక్కును, చివరి ఋక్కును పఠిస్తారు. కాలక్రమంలో ఈ రోజు "రక్షాబంధన్ లేక రాఖీ" పండుగగా ప్రాచుర్యం పొందసాగింది. ఈ రక్షాబంధనము ఈ దిగువ మంత్రాన్ని పఠిస్తూ భార్య - భర్తకు, సోదరి - సోదరునకు యుద్ధానికి వెళ్ళే వీరునకు విజయప్రాప్తి కోసం ఈ రక్షాబంధనన కడుతూఉంటారు.
యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః|
తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల||
శ్రీ మహావిష్ణువు శక్తిచే మహాబలుడు అయిన బలిచక్రవర్తిని బంధించినట్లుగా ఓ రక్షాబంధనమా! నీవు చలించక వీనికి రక్షణ కల్పించుము అని మంత్రార్థం. ఈ - రక్షాబంధన్ ఎలా ప్రారంభమైనది అంటే! ఈ గాథ మనకు మంచి ప్రామాణిక మవుతుంది.
పూర్వం దేవతలకు - రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధము సాగింది. ఆ యుద్ధములో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారమంతటిని కూడగట్టుకుని 'అమరావతి' లో తలదాచుకుంటాడు. అట్టి భర్తనిస్సహాయతను గమనించిన ఇంద్రాణి 'శచీదేవి' తగు తరుణోపాయమునకై ఆలోచిస్తూ ఉన్న సమయాన ఆ రాక్షసరాజు చివరకు 'అమరావతి'ని కూడా దిగ్భంధన చేయబోతున్నాడు అని గ్రహించి, భర్త దేవేంద్రునకు 'సమరోత్సాహము' పురికొలిపినది. సరిగా ఆరోజు "శ్రావణ పూర్ణిమ" అగుటచేత 'పార్వతీ పరమేశ్వరులను', లక్ష్మీ నారాయణులను పూజించి ఆ పూజించబడిన "రక్షా" దేవేంద్రుని చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరు వారు పూజించిన రక్షలు తెచ్చి ఇంద్రునకు కట్టి ఇంద్రుని విజయాత్రకు అండగా నిలచి, తిరిగి 'త్రిలోకాధిపత్యాన్ని' పొందారు. ఆనాడు శచీదేవి ప్రారంభించిన 'ఆ రక్షాబంధనోత్సవం' నేడు అది 'రాఖీ' పండుగ ఆచారమైనది.
ఈ రాఖీకి ఉన్న పవిత్రత ఏమిటంటే భార్య - భర్తకు, సోదరి - సోదరులకు కట్టే రఖీద్వారా వారి వారు తలపెట్టే కార్యములు విజయవంతమై సుఖసంపదలు కలగాలని, వారి మాన మర్యాదలకు వారు బాసటగా ఉండాలని ఆకాంక్షించే సత్ సంప్రదాయమే ఈ 'రాఖీ' విశిష్టత. అలా రాఖీలు కట్టించుకున్న భర్తలు, సోదరులు వార్కి నూతన వస్త్రాలు చిరుకానుకలు సమర్పించి, అందరు కలసి చక్కని విందు సేవిస్తారు.
విదేశీయులు మనదేశాన్ని పాలిస్తున్న రోజులలో మొగాలాయీల దుర్నీతికి దురంతాలకు ఏమాత్రం అడ్డూ అపూ అనేది లేకుండా పోయేది. హిందూ జాతి వారి కబంధహస్తాలలో నలిగిపోయేది. స్త్రీలు వారి మాన ప్రాణరక్షణకై వీరులైన యోధులను గుర్తించి వార్కి 'రక్షాబంధనం' కట్టి వారు చూసే సోదర భావముతో, రక్షణ పొందేవారు. ఒకసారి 'రాణి కర్ణావతి' శత్రువులు తన దుర్గాన్ని ముట్టడించినప్పుడు 'ఢిల్లీపాదుషాకు' రాఖీ పంపగా ఆమెను సోదరిగా భావించి శత్రువులను తరిమికొట్టి ఆ సోదరి ఇంట భగినీ హస్తభోజనంచేసి, కానుకలు సమర్పించినట్లు గాధలు ఉన్నాయి.
అట్టి శ్రావణ పూర్ణిమ లేక జంధ్యాల పూర్ణిమ, మరియు రాఖీ లేక రక్షాబంధన్ పండుగ అమితానందంతో జరుపుకుని మన చక్కని భారతీయ సంప్రదాయ విలువలను కాపాడుదాం!
Related Postings:
> Tirumala Complete Information in Telugu
> Arunachalam Complete Information in Telugu
> Devotional Ebooks Free Downlaod
> Shakthi Peethas Information in Telugu
> Andhra Pradesh Temples Information
> Sri Chaganti Popular Videos Speeches
Rakhi, Rakhi Purnima information in telugu, Rakhi visistata, Rakhi history, raksha bandan, Rakhi Purnima 2017, rakhi, rakhi 2017 date in india, raksha bandhan 2017, raksha bandhan histosry, rakhi 2018, what is raksha bandhan, hindu temples guide.com
Tags
Story