బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనాలు విని ముఖ్యంగా భాగవత ప్రవచనం విని భాగవతం లో ముఖ్యమైన పద్యాలను నేర్చుకుందాం అనుకునేవారికి తెలుగు భాగవతం వెబ్సైటు చాల చక్కగా ఉపయోగపడుతుంది. ఇక్కడ 30 భాగవత పద్యాలు ఇవ్వడం జరిగింది ఈ పద్యాలూ ఒక ఆర్డర్ లో ఉండవు ఎందుకంటే కొత్తగా భాగవత పద్యాలు నేర్చుకుందాం అనుకునే వారికోసం సులువైన పద్యాల నుంచి ఇవ్వడం జరిగింది.
భాగవత పద్యం : 1
పలికెడిది భాగవత మఁట,పలికించెడివాడు రామభద్రుం డఁట, నేఁ
బలికిన భవహర మగునఁట,
పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా?
భాగవత పద్యం : 2
భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు,శూలికైనఁ దమ్మిచూలికైన,
విబుధజనుల వలన విన్నంత కన్నంత
దెలియ వచ్చినంత దేటపఱతు.
భాగవత పద్యం : 3
చేతులారంగ శివునిఁ బూజింపఁడేని,నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని,
దయయు సత్యంబు లోనుగాఁ దలఁపఁడేనిఁ,
గలుగ నేటికిఁ దల్లుల కడుపుఁ జేటు.
భాగవత పద్యం : 4
చదివించిరి నను గురువులుచదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నేఁ
జదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మ మెల్లఁ జదివితిఁ దండ్రీ
భాగవత పద్యం : 5
చిక్కఁడు వ్రతములఁ గ్రతువులఁజిక్కఁడు దానముల శౌచశీలతపములం
జిక్కఁడు యుక్తిని భక్తిని
జిక్కిన క్రియ నచ్యుతుండు సిద్ధము సుండీ!
భాగవత పద్యం : 6
ఇందు గలఁ డందు లేఁ డనిసందేహము వలదు చక్రి సర్వోపగతుం
డెం దెందు వెదకి చూచిన
నందందే కలఁడు దానవాగ్రణి! వింటే."
భాగవత పద్యం : 7
శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక రక్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.
భాగవత పద్యం : 8
లోకంబులు లోకేశులులోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీకటి కవ్వల నెవ్వం
డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్
భాగవత పద్యం : 9
కలఁ డందురు దీనుల యెడఁగలఁ డందురు పరమయోగి గణముల పాలం
గలఁ డందు రన్నిదిశలను
గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో?
భాగవత పద్యం : 10
కలుగఁడే నాపాలికలిమి సందేహింపఁ;గలిమిలేములు లేకఁ గలుగువాఁడు?
నా కడ్డపడ రాఁడె నలి నసాధువులచేఁ;
బడిన సాధుల కడ్డపడెడువాఁడు?
చూడఁడే నా పాటుఁ జూపులఁ జూడకఁ;
జూచువారలఁ గృపఁ జూచువాఁడు?
లీలతో నా మొఱాలింపఁడే మొఱఁగుల;
మొఱ లెఱుంగుచుఁ దన్ను మొఱగువాఁడు?
భాగవత పద్యం : 11
లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;
రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!
భాగవత పద్యం : 12
ఓ! కమలాప్త! యో! వరద! యో! ప్రతిపక్షవిపక్షదూర! కుయ్యో! కవియోగివంద్య! సుగుణోత్తమ! యో! శరణాగతామరా
నోకహ! యో! మునీశ్వర మనోహర! యో! విమలప్రభావ! రా
వే కరుణింపవే తలఁపవే శరణార్థిని నన్నుగావవే.
భాగవత పద్యం : 13
అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దాపల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహిపాహి యనఁ గుయ్యాలించి సంరంభియై.
భాగవత పద్యం : 14
సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డేపరివారంబునుఁ జీరఁ" డభ్రగపతిం బన్నింపఁ" డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.
భాగవత పద్యం : 15
తనవెంటన్ సిరి; లచ్చివెంట నవరోధవ్రాతమున్; దాని వెన్కనుఁ బక్షీంద్రుఁడు; వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖ చ
క్రనికాయంబును; నారదుండు; ధ్వజినీకాంతుండు రా వచ్చి రొ
య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్.
భాగవత పద్యం : 16
అడిగెద నని కడువడిఁ జనునడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్
వెడవెడ సిడిముడి తడఁబడ
నడు గిడు; నడుగిడదు జడిమ నడు గిడునెడలన్.
భాగవత పద్యం : 17
మకర మొకటి రవిఁ జొచ్చెను;మకరము మఱియొకటి ధనదు మాటున డాఁగెన్;
మకరాలయమునఁ దిరిగెఁడు
మకరంబులు కూర్మరాజు మఱువున కరిగెన్.
భాగవత పద్యం : 18
అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బెద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.
భాగవత పద్యం : 19
శారదనీరదేందు, ఘనసార, పటీర, మరాళ, మల్లికాహార, తుషార, ఫేన, రజతాచల, కాశ, ఫణీశ, కుంద, మం
దార, సుధాపయోధి, సితతామర, సామరవాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిఁ గానఁగ నెన్నఁడు గల్గు, భారతీ!
భాగవత పద్యం : 20
ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి, పురంబులు వాహనంబులున్సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని, చొక్కి, శరీరము వాసి కాలుచే
సమ్మెట వ్రేటులం బడక సమ్మతితో హరి కిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరాజొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్.
భాగవత పద్యం : 21
వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్, దయాశాలికి, శూలికిన్, శిఖరిజా ముఖ పద్మ మయూఖ మాలికిన్,
బాల శశాంక మౌళికిఁ, గపాలికి, మన్మథ గర్వ పర్వతో
న్మూలికి, నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాలికిన్.
భాగవత పద్యం : 22
ఆదర మొప్ప మ్రొక్కిడుదు నద్రి సుతా హృదయానురాగ సంపాదికి, దోషభేదికిఁ, బ్రపన్నవినోదికి, విఘ్నవల్లికా
చ్ఛేదికి, మంజువాదికి, నశేష జగజ్జన నంద వేదికిన్,
మోదకఖాదికిన్, సమద మూషక సాదికి, సుప్రసాదికిన్.
భాగవత పద్యం : 23
ఒనరన్ నన్నయ తిక్కనాది కవు లీ యుర్విం బురాణావళుల్తెనుఁగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దా నెట్టిదో
తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిం దెనింగించి నా
జననంబున్ సఫలంబుఁ జేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్.
భాగవత పద్యం : 24
లలితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మంజులతాశోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై.
భాగవత పద్యం : 25
"అమ్మా! మన్నుదినంగ నే శిశువునో? యాఁకొంటినో? వెఱ్ఱినో?నమ్మం జూడకు వీరి మాటలు మదిన్; న న్నీవు గొట్టంగ వీ
రి మ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీయాస్య గం
ధ మ్మాఘ్రాణము జేసి నా వచనముల్ దప్పైన దండింపవే."
భాగవత పద్యం : 26
ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపైనంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.
భాగవత పద్యం : 27
మ్రింగెడి వాఁడు విభుం డనిమ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!
భాగవత పద్యం : 28
నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె
ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ జేయుమమ్మ! ని
న్నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!
భాగవత పద్యం : 29
ఊరక రారు మహాత్ములువా రధముల యిండ్లకడకు వచ్చుట లెల్లం
గారణము మంగళములకు
నీ రాక శుభంబు మాకు నిజము మహాత్మా!
భాగవత పద్యం : 30
నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు గృపారసంబు పైఁ
జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా
జిల్లెడు మోమువాఁ డొకఁడు చెల్వల మానధనంబుఁ దెచ్చె నో!
మల్లియలార! మీ పొదలమాటున లేఁడు గదమ్మ! చెప్పరే!
Please fair out all poems ... like dhara kharvatudokandu... aarambhichadu neechamaanavudu... and all ... which are very important for children to learn..
ReplyDelete