Drop Down Menus

మాంసాహారం ఎందుకు తినకూడదు ? Why Hindus do not eat Non Vegetarian Food on particular days? Dharma Sandehalu Telugu

 

మాంసాహారం ఎందుకు తినకూడదు ?

మానవ జన్మ అంటూ ఎత్తాక మనస్సు తోనూ, శరీరము తోనూ, వాక్కు తోనూ ఎప్పుడూ ఏ ప్రాణికి బాధని కలగజేయకూడదు. అలా ఉండటాన్నే ఏ మతం లో జన్మించిన మహాత్ములు అయినా “అహింస” అని చెప్పారు. 

అహింసకు సమమైన ధర్మము లేదు. ఇది చాలా సులువు గా అర్ధం అయ్యే విషయం. నిన్ను ఏ ఆయుధముతో అయినా గాయ పరిస్తే ఎంత విలవిల లాడి పోతావో అదే బాధ ఇతర ప్రాణులకి కూడా కించిత్ బేధమైనా లేకుండా ఉంటుంది. మరణ యాతన అనేది అన్ని జీవులకి ఒకటే. గీత లో కృష్ణుడు “ఏ మానవుడు సమస్త భూతముల యొక్క సుఖ దుఃఖాలు తన సుఖ దుఃఖాలుగా చూస్తాడో అట్టి వాడు నాకు అత్యంత ప్రియుడు” అని చెప్పాడు. తన లాగా సమస్త జంతు జాలాన్ని ప్రేమతో చూసే వాళ్ళని అవి ఏ హాని చేయవు. అలా ఉండే వాళ్లకి సమస్త భూత గణాలు ప్రణమిల్లుతాయి. అందువల్లనే పూర్వము మునుల ఆశ్రమముల్లో పరస్పర విరుద్ధ స్వభావము గల జంతువులూ ఒక దానితో ఒకటి విరోధము లేక స్వేచ్ఛగా సంచరించేవి.

ఈ భూమి మీద పుట్టిన ఏ జాతి ఏ మతం ఏ కులం వాళ్ళు అయినా సరే సర్వ జీవుల లోనూ ఆత్మరూపమై వెలుగొందే ఆ పరమాత్మను చూడకుండా అహంకారంతో, బలంతో, గర్వం తో మూర్ఖత్వంతో జీవుల పట్ల దయ జాలి చూపించే వారి పట్ల అవహేళనతో అసూయతో ప్రవర్తిస్తూ, మనలాగే స్వేఛ్చ కోరుకునే సాటి జంతువులను పట్టి తెచ్చి క్రూర మనస్కులై బలాత్కారముగా చంపి తినేవాళ్ళు ఈ భూమి మీద లెక్కలేనన్ని సార్లు బహు చండాలమైన నీచ యోనుల్లో పుట్టి అదే విధంగా మరణిస్తారు అని చెప్పబడింది. ఇలా వాళ్ళ ఆహారానికి ఇతర జంతువులని చంపి తినేవాళ్ళు యెంత ఖరీదు అయిన జీవితం గడుపుతున్నప్పటికీ ఏ స్థాయి లో ఉన్నప్పటికీ వాళ్ళది అసుర ప్రవృత్తి కిందకే వస్తుంది !

వంద సంవత్సరాలు ఘోర తపస్సు చేసిన ఫలము ఒక్క మాంసాహారం తినటం మానితే వస్తుందని మన శాస్త్రాలు చెపుతున్నాయి. ఎందుకంటె ప్రాణి హింస గాని, వానిని చంపి తినే స్వభావము గాని ఉత్కృష్ట మైన మన మానవ జన్మకు రాయబడలేదు. కావాలంటే గమనించండి ఆఖరికి పశుపక్షులలో కూడా ఉత్తమ మైనవిగా చెప్పబడేవి ఏవీ మాంసాహారము తినవు. శ్రేష్టమైన సాధు జన్మ గల ఆవు, లేడి, ఏనుగు, గుఱ్ఱము, ఇలాటి జంతువులు ఆకులు, తృణ ధాన్యాలు మాత్రమే తింటాయి. 

అంతే గాని నికృష్ట జీవులు అయిన కుక్క, నక్క, పులి, తోడేలు మొ. వాటిలాగ మాంసాన్ని తినవు. అలాగే పక్షుల లో కూడా హంస, కోయిల, చిలక మొ. పక్షులు కాకి, గద్ద, రాబందుల లాగా నీచమైనవి తినవు. జంతువుల లోనే అలా ఉన్నప్పుడు శ్రేష్టమైన మానవజన్మ ఎత్తి మేము దేవుణ్ణి నమ్మి ఆరాధిస్తున్న మనుకునే వాళ్ళు సైతం జంతుహింసకు పాల్పడుతూ వాటిని చంపి తినడం అన్నది నిజంగా శోచనీయం.

Also Readఎవరితో పెళ్లి జరగాలో ఈ స్వామి వారు నిర్ణయిస్తాడు

ఒక జంతువుని నరకటానికి కొన్ని క్షణాలకి ముందు నిస్సహాయురాలైన ఆ జంతువు కళ్ళల్లో కనబడే ప్రాణభీతి, దాని గుండెల్లో కలిగే భయోత్పాతం, ప్రాణరక్షణ కోసం తప్పించు కోవాలని ప్రయత్నిస్తూ దాని శక్తి నంతటినీ ఉపయోగించి గుంజుకుంటూ అది చేసే ఆర్తనాదం తో కూడిన విఫల యత్నం .. నిజంగా వర్ణనాతీతం. కాని ఆ చంపే వాళ్లకి తెలియదు ఆ జీవి ప్రాణం పోయాక ఆ మృత కళేబరం లో ఏమి జరుగుతుందన్నది. ఆ జంతువుని వధించాక దాని ప్రాణం పోయే వరకు కొన్ని నిముషాల పాటు అది గిలగిలా కొట్టుకుంటూ పడే మరణ యాతన, దాని క్షోభ, దాని రోదనా తరంగాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. అవి గాక దాన్ని బలవంతంగా చంపడం తో దాని ఉసురు ఇవన్నికలిసి ఆ జీవిని వదలక దాని రక్త మాంసాల్లోనే నిబిడీకృతమై ఉంటాయి. అందువల్ల దాన్ని కడుపారా తిని ఆరగించుకున్న వాళ్లకి ఎప్పటికైనా తిరిగి అదే విధమైన మృత్యువు తటస్థిస్తుంది. ఎందుకంటె శరీరంతో చేసిన ఏ కర్మని అయినా తిరిగి శరీరంతోనే అనుభవించాలి. అంటే వాళ్ళు తిన్న ఆ మాంసం ఏ జీవిని ఎలా క్రూరంగా చంపితే వచ్చిందో అదే గతిని వాళ్ళకి తరువాత జన్మలో కలిగేలా వాళ్ళ కర్మని రాస్తుంది. ఒక గోర్రెని నరికి చంపిన వాడు దాని శరీరం మీద ఎన్ని రోమాలు అయితే ఉన్నాయో అన్ని సార్లు గొర్రె జన్మ ఎత్తి అదే విధంగా తల కొట్ట బడతాడు అని చెప్పబడింది.

కొంతమంది .. మాంసాహారులు వితండ వాదం చేస్తుంటారు. అదేంటంటే అన్ని జీవుల్లోనూ భగవంతుడు ప్రాణం రూపం లో ఉన్నప్పుడు చెట్లకు కాసే కాయ గూరల్లోనూ, ఆకు కూరలలోనూ, చెట్ల కి కాసే కాయల్లోనూ ప్రాణం లేదా .. వాటిని కోసి తింటే మాత్రం జీవ హింస చేసినట్టు కాదా అని. నిజమే .. జగదీశ్చంద్ర బోసు పరిశోధించి చెప్పినట్టు వృక్షాలకి ప్రాణం ఉంటుంది. వాటికి సంతోషం దుఃఖం ఉంటాయి. ఆయన చెప్పిన దాన్ని ఇక్కడ ఎలా అన్వయించాలో తెలియాలి. జీవ హింస చేసి భక్షించడం తప్పని సమస్త శాస్త్రాలు ఘోషిస్తున్నాయి గాని చెట్లకి లేదా మొక్కలకి నుంచి వచ్చే తినదగ్గ ఆకులూ, వాటికి కాసే కాయలు కోసి తినడం తప్పని ఏ శాస్త్రం లోనూ చెప్పబడలేదు. ఎందుకంటె ప్రాణం ఉన్నప్పటికీ అవి జడములు. అంటే వాటికి ఇతర జీవజాలాలకి ఉన్నట్టుగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉండవు. ఇంద్రియాలు ఎప్పడు అయితే లేవో వాటికి సుఖ దుఃఖాలు కలగడానికి అవకాశం ఉండదు.

అది ఎలాగంటే .. మనకి చేతికి కాళ్ళకి గోళ్ళు ఉన్నాయి. అవి పెరిగి నప్పుడు వాటిని మనం కత్తిరిస్తున్నాము. అప్పుడు మనకి ఏమీ బాధ కలగడం లేదు. మామూలుగా కత్తిరించి అవతల పారేస్తున్నాము. అలా అని గోళ్ళలో ప్రాణం లేదని అనలేము కదా ? జీవం లేనిదే గోరు పెరగదు కదా ? కాని గోరు మొత్తం పట్టుకు లేపితే కెవ్వు మని అరుస్తాము. అలాగే మన జుట్టుని కత్తిరిస్తున్నాము .. ఏ బాధ కలగడం లేదు .. అలా అని జుట్టులో ప్రాణం లేదని అనలేము, ఎందుంటే జుట్టు పెరుగుతోంది కదా మరి ? కానీ జుట్టు కట్టలా పట్టుకు లాగి గుంజితేనో .. అమ్మో అని అరవమూ ? అదే విధంగా ఫల వృక్షాలకి కూడా ఇదే సిద్దాంతం వర్తిస్తుంది. చెట్లకి కాసే ఆకులు కాయల స్థితి కూడా అలాగే ప్రాణం ఉండి లేనట్టు గా ఉంటుంది.. అందువల్ల వాటి నుంచి వచ్చే ఆకులని కాయలని కోసుకుని తినచ్చు. అలా చేయడం వాటిని హింసించినట్టు కాదు. కాని పని గట్టుకుని ఫల పుష్పాలు ఆకు కూరలని ఇచ్చి పచ్చని చెట్లని తగిన బలమైన కారణం లేకుండా వాటిని సమూలంగా నాశనం చేయకూడదు. అలా కావాలని చేస్తే అది జీవ హింస కిందకే వస్తుంది. వాటినుంచి వచ్చే ఆకుల్న్లి కాయల్ని ఫలాలని కోసినా దూసినా తెంచినా దోషం ఉండదు. జంతువులూ అలా కాదు .. మనుషుల లాగే వాటికీ ఓ కుటుంబం, సుఖము, దుఃఖము, సంతోషము, బాధ, ఇంద్రియ సుఖము, వాటి పిల్లల పట్ల ప్రేమ, ప్రాణ భయం, ఇవన్నీ ఉంటాయి. అవి కూడా మనుషుల లాగే సంయోగం చేతనే పిల్లల్ని కంటాయి, చెట్ల లాగా భూమినుంచి మొలకెత్తవు. అందుకే వాటిని బలవంతంగా చంపి తినకూడదు..

అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ భూమి మీద పెరిగే ఫల వృక్షాలు ఆకుకూరలు సకలచరాచర జీవరాసులకి ప్రాణ దాత ప్రత్యక్ష దైవం అయిన ఆ సూర్యభగవానుని కిరణాల నుంచి వచ్చే అపార మైన జీవశక్తి తో వృద్ధి చెందుతాయి. అదీ కాక సూర్యుడు ఆత్మ కారకుడు. అందువలన ఆ కిరణాల సంయోగంతో పెరిగిన ఆకు కూరల్ని, పళ్ళని ఆహారంగా భుజించే వారికి ఆత్మజ్ఞానము అధికంగా త్వరగానూ కలుగు తుంది. సూర్యుడు ఎలా అయితే చీకటిని పోగొట్టి వెలుగుని ప్రసాదిస్తాడో అలాగే ఆకుకూరలు తినే వాళ్లకి తొరగా అజ్ఞానం తొలగి జ్ఞానం కలుగుతుంది. ఇందులో సందేహం లేనే లేదు. వృక్ష జీవులకి, జంతు జీవాలకి చాలా తేడా ఉంటుంది. ఒక చెట్టు కొమ్మ నుంచి ఎన్ని కొమ్మలు వేరు చేసినా అవన్నీ వృద్ది అయి శాఖోప శాఖలు అది వృద్ధి చెందుతుంది. అలాగే ఒక చెట్టు వేరుని ఎన్ని ముక్కలు చేసినా వాటి నుంచి మళ్ళీ అది పెరిగి పెద్దది అవుతుంది. కాని జంతువు అలా కాదు వాటి కాళ్ళు, చేతులు, మెడ ఏవి నరికినా వాటి నుంచి మళ్ళీ అదే జంతువులు వృద్ధి చెందవు. ఒక జీవిని తన స్వలాభం కోసం చంపిన పాప ఫలము తత్కాలానికి కనపడక ఆనంద పడినా దాని ఫలితము వేరొక విధముగా తప్పక కనపడుతుంది .

మనము దేన్ని అయితే ఆహారంగా భుజిస్తామో దాని లోని సారం మనలో ఉన్న రక్తం లో కలుస్తుంది. దాని ప్రకారం అది తిన్న వాడి మనసుని ప్రభావితం చేస్తుంది. శాఖాహారము వలన జ్ఞానం తొరగా కలుగు తుంది. శాఖారంతినే మద గజాలని సైతం వశం చేసుకుని చెప్పినట్టుగా వినేలా చేసుకోగలం ఎందుకంటె శాఖాహారం తినే జంతువులలో గ్రాహ్య శక్తి అధికం గా ఉంటుంది. కాని మాంసం రుచి మరిగిన క్రూర జంతువు అప్పటికి అది తాత్కాలికంగా వశమైనా అది ఎప్పటి కైనా క్రూరజంతువే .. పూర్తిగా సాధు జంతువు కానేరదు.

అందువలన మాంస భక్షణం చేసే వారి ఆత్మ శక్తికి శాఖాహారం తినే వాళ్ళ ఆత్మ శక్తి కి చాలా బేధం ఉంటుంది. ఏ మతానికి చెందిన వాళ్ళలో అయినా మాంసాహారం తినే వాళ్ళలో భౌతిక విజ్ఞానానికి సంబంధించిన ఏ రంగం లో అయినా ప్రపంచ ప్రసిద్ద మేధావులు ఉండచ్చుగాక, వాళ్ళు ఎందులో అయినా ప్రధమ స్థానంలో ఉండొచ్చు గాకా, ఎన్ని పతకాలు అయినా సాధించి ఉండొచ్చు గాక, అది వాళ్లకి భౌతిక మైన విజ్ఞానం వరకే పరిమితం అవుతుంది. వాళ్ళకి నిజమైన భగవత్సంబంధ మైన ఆత్మ జ్ఞానం కలగడం, ధ్యాన యోగాలు కలగడం, మనసుని ఏకాగ్రం చేయడం, ఆత్మసాక్షాత్కారం కలగడం అన్నవి నిశ్చయం గా దుర్లభం ! పచ్చి మాంసాహారం తింటూ ఏ మతం వాళ్లైనా దైవానుగ్రహానికి మాత్రం పాత్రులు కావడం అన్నది అసంభవం. వాళ్ళు కేవలం వేష భాషల్లో ఆచారాల్లో వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు గుడ్డిగా నమ్ముకుని అనుసరిస్తున్న వాళ్ళే తప్ప ఇంకేమీ కారు. వాళ్లకి ఆత్మ పరమాత్మల సంబంధ మోక్షజ్ఞానం కలగదు. వాళ్ళు జీవహింస మాని సాత్వికాహారం తీసుకునే సంస్కారం అబ్బే వరకు కొన్ని వేల లక్షల జన్మలు ఎత్తవలసిందే . కావాలంటే చూసుకోండి ప్రపంచ ప్రసిద్ద తత్వవేత్తలు మహా యోగులు ఎవరు ఏ జాతి ఏ మతం ఏ దేశం వారు అయినా సరే వాళ్ళు అందరూ పచ్చి శాఖాహారులే అన్నది నిజం !

Also Read : ఆడవాళ్లు వేసుకునే జడ ల వల్ల లాభాలు, సాంప్రదాయాలు చదవండి.

ఒక జంతువుని చంపేవాడు ,చంపటానికి ఇష్టపడే వాడు, చంపమని చెప్పేవాడు, దాని మాంసం అమ్మే వాడు, కొనే వాడు, తీసుకుని వెళ్ళే వాడు, దాన్ని ముక్కలు చేసి వండే వాడు, దాన్నితినే వాడు ఈ ఎనిమిది మందికి హింసా దోషం తప్పక ఉంటుందని శాస్త్రవచనం.. అలాగే పుణ్య కార్యాలు గానీ పాప కార్యాలు గానీ చేసేవాడు, చేయించేవాడు, దానికి ప్రేరణ చేసేవాడు, చూసి సంతోషించే వాడు, ఆయా పనులకి తగ్గ సమాన మైన ఫలితం పొందుతారు అని చెప్ప బడింది.

మానవుల ఆధ్యాత్మిక సాధనలో అహింసకి చాల ముఖ్యమైన స్థానం ఉంది.  

సన్యాసి అనే వాడు సర్వమూ వదిలేసినా పరవాలేదు కానీ అహింసని మాత్రం వదలకూడదు అని చెప్పబడింది. 

ఇంద్రియాణం నిరోదేన రాగ ద్వేష క్షయేణ చ 

అహింసాయా చ భూతానా మమృతత్వాయ కల్పతే 

అంటే ఇంద్రియ నిగ్రహం వలనా, రాగద్వేషాలని వదిలెయ్యడం వలనా, సర్వ జీవాలపట్ల అహింసని అవలంబించడం వలనా అమృతత్వము అంటే మోక్షం కలుగుతుందని చెప్పబడింది. 

యో బంధన వధక్లేశాన్ ప్రాణీనాం న చికీర్షతి 

స సర్వస్య  హితప్రేప్సు:  సుఖ మత్యంత మశ్నుతే 

అంటే ఎవరు ప్రాణులని చంపడానికి గానీ, బంధించడానికి గానీ, వాటిని బాధ పెట్టడానికి గానీ ఇష్టపడరో, ఎవరు ఎల్ల ప్రాణుల యొక్క హితము కోరతారో వాళ్ళు అనంతమైన సుఖాన్ని పొందుతారు అని చెప్పబడింది. 

ఆహారం కోసం కూడా ప్రాణులని హింసించ కూడదు అని కూడా ఈ క్రింద శ్లోకంలో చెప్పబడింది

అనుమాన్తా విశసితా నిహన్తా క్రయవిక్రయా 

సంస్కర్తా చోపహర్తాచ ఖాదకశ్చేతి ఘాతకాః 

అంటే మాంసము తిన్నవాడు, పెట్టిన వాడు, వండిన వాడు, అమ్మిన వాడు, ప్రాణికి చంపిన వాడు, అవయవములు విడదీసిన వాడు, దానికి అనుమతించిన వాడు అందరూ ఆ జీవిని చంపిన వాళ్ళే అవుతారు. 

యో ఆ హింసకాని భూతాని హినస్త్యా త్మ సుఖేచ్ఛయా 

సజీవంశ్చ మృత శ్చైవ న క్వచి త్సుఖమేధతే 

అంటే హింస కలిగించని ప్రాణులని [ అవి జంతువులైనా కావచ్చు మనుష్యులైనా కావచ్చు ] తమ సుఖం కోసం ఎవరైతే హింసిస్తారో వాళ్ళు బ్రతికున్నా కూడా చచ్చిన వాళ్ళ కిందే లెక్క.  అటువంటి వాళ్ళకి ఇహ పరములు రెండిట్లోనూ సుఖం ఉండదు.  అయితే తప్పని సరి పరిస్థితులలో కేవలం ఆత్మ రక్షణ కోసం ఆయుధం తీసి ఉపయోగించడం తప్పు కాదని చెప్పబడింది.

అహింసయేంద్రియా సంగై  ర్వైదికైశ్చైవ కర్మభిః 

తప్సశ్చరణై శ్చోగ్రై: సాధయనన్తీ హ తత్పదమ్ 

అంటే సర్వ ధర్మములలోనూ సత్య అహింసలకి అగ్రస్థానం ఇవ్వబడింది.  అయితే హింస లేకుండా మనం బ్రతకగలమా  ? అన్న ప్రశ్న వస్తుంది.  ఎందుకంటే మనం నడిచేటప్పుడు అనేక మైన క్రిమి కీటకాలు మన కాళ్ళ కింద పడి చనిపోతున్నాయి కదా ? అలాగే ఆకు కూరల్లోనూ ప్రాణము లేదా ?  ఈ హింస చేస్తున్నప్పుడు ఆ హింస ఎందుకు చెయ్యకూడదు అని కొందరి వాదన.   అయితే మనువు చెప్పేది ఏంటంటే ప్రాణులకి హాని తలపెట్టడం అన్నది యెంత తక్కువ అయితే అంత ఉత్తమమని,   అసలు వాటికి హాని తలపెట్టకపోవడం  అన్నది సర్వోత్తమమని చెప్పడం జరిగింది. 

Also Readపాపాలను, శాపాలను పోగొట్టి, కష్టాలను తీర్చి, ఆయుష్షును పెంచే ఆదిత్య హృదయం

అద్రోహేణైవ భూతానా మల్పద్రోహేణవా పునః అంటే దయగలవాడు ఎప్పుడు ఇంత కంటే తక్కువ ప్రాణి హింస నాకు సాధ్యము కాదా అని ఆలోచించాలి.   అంతే కానీ అనేక రకాల జీవులకి, నేల మీద ప్రాకే అనేక రకాల క్రిమి కీటకాలకి  మనకి తెలిసో తెలియకో పొరపాటునో అనివార్యంగా ఎంతో కొంత హాని జరుగుతూనే ఉంది కదా దాని వలన ఎలాగో పాపం వస్తోంది కదా ..  ఇంకొంచం జీవహింస చేస్తే ఏంటి పాపం అని ఆలోచించ కూడదు.

ఎందుకంటే తెలియకనో  లేదా పొరపాటునో,లేదా అప్రయత్నంగానో, అసంకల్పితంగానో  చేసిన హింసకి కావాలని బుద్ధి పూర్వకంగా, తన ఆనందం కోసం చేసిన హింసకి ఫలితం అనేది వేరుగా ఉంటుంది అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.

Famous Posts:

అగ్నిసాక్షిగా వివాహం ఎందుకు చేస్తారు..?

 

అన్నదానం చేసేటపుడు 100 లో 99 మంది చేసే అతి పెద్ద తప్పు


గుడి దగ్గర్లో ఇల్లు ఉండకూదనడానికి ఖచ్చితమైన కారణాలు ఇవే


దీపావళి రోజు ఉప్పుతో ఇలా చేస్తే చాలు


ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది ?


చేతిలోని డబ్బు నిలవాలంటే...ఏమి చేయాలి?

 

నిత్య దరిద్ర కారణాలు ఇవే..


రజస్వల వివరణ - దోషము -నియమ నిబంధనలు

మాంసాహారం, Dharma Sandehalu Telugu, dharma sandehalu online, non veg in hinduism, hindu gods who eat meat, non veg in bhagavad gita, veg and non veg

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.