మోక్షం పొందడానికి నవవిధ భక్తి మార్గాలు మీకు తెలుసా? 9 Types of Bhakti With Examples - “Navavidha Bhakti”
మోక్షాన్నిచ్చే నవవిధ భక్తి మార్గాలు..
మోక్షం పొందడానికి పెద్దలు కొన్ని మార్గాలు సూచించారు. అవి కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు. వాటిలో అత్యంత సులభమైంది భక్తిమార్గం. భగవంతుని గురించి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని తొమ్మిది విధాలు. వాటిలో ఏ మార్గంతోనైనా భగవంతుణ్ని పూజించి మోక్షం పొందవచ్చు.
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనమ్
అర్చనం వన్దనం దాస్యం సఖ్యమాత్మనివేదనమ్.
శ్రవణం:
భగవంతుని గురించి శ్రద్ధగా వినే ప్రతి మాటా, తెలియకుండానే మన మనసుని ప్రభావితం చేస్తుంది. అందుకే భక్తులు సత్సంగం పేరుతో నలుగురూ ఒకచోటకి చేరి నాలుగు మంచి మాటలు చెప్పుకొనే అవకాశాన్ని వదులుకోరు. మరణం సమీపిస్తోందని తెలిసినవారు సైతం ఆధ్యాత్మిక విషయాలను వింటూ చనిపోవాలని కోరుకుంటారు. భగవంతుడి గుణాలు, పేర్లు, కథలు వినడం వలన జ్ఞానాన్ని పెంచుకొని భగవంతుడికి దగ్గర కావడం. ఈ మార్గానికి పరీక్షిత్ మహారాజుఉదాహరణ. ఇతడు కథా శ్రవణాన్ని యోగంలా అనుష్ఠించి దాని ద్వారా ముక్తిని పొందాడు.
కీర్తనం:
భగవంతుని లీలలను పాడుతూ, ఆడుతూ మైమరచి… తానను తానే కీర్తించుకుంటున్నానంతగా భగవంతునిలో లీనమవ్వడమే కీర్తనం. కీర్తనంలో ఉండే గానధర్మం వల్ల మనస్సు సహజంగా భగవంతుడివైపు ఆకర్షితమవుతుంది. భగవత్సంకీర్తనలో ప్రథమాచార్యుడిగా కీర్తి గాంచిన నారదుడు ఇందుకు ఉదాహరణ. మీరా, తుకారాం, చైతన్య మహాప్రభు మొదలుకొని తెలుగునాట త్యాగయ్య, అన్నమయ్య వరకూ భగవంతుని వేనోట కీర్తించి తరించినవారే.
స్మరణం:
‘యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్, విముచ్యతే…’ అని విష్ణుసహస్రానామం ఆరంభంలోనే కనిపిస్తుంది. స్మరిస్తే చాలు ఈ భవసాగరం నుంచి శాశ్వతంగా విముక్తిని ప్రసాదిస్తాడు అని దీని అర్థం. భగవంతుని సదా స్మరిస్తూ ఉంటే, కొన్నాళ్లకి ఆ స్మరణ అసంకల్పితంగానే మన మనసులో మెదులుతూ ఉంటుందని పెద్దల అనుభవం. భగవంతుణ్ని ధ్యానించడం స్మరణ భక్తి. నిరంతరం నారాయణ నామస్మరణతో తరించిన ప్రహ్లాదుడు ఇందుకు గొప్ప ఉదాహరణ.
పాదసేవనం:
గరుత్మంతునిలా నిరంతరం స్వామివారి పాదాల చెంత మనం ఉండలేకపోవచ్చు. లక్ష్మీదేవిలాగా ఆయన పాదాలను తాకలేకపోవచ్చు. కానీ ఆ పాదుకల మీద నిరంతరం మన ధ్యాసను నిలిపినా చాలు, అవి మనల్ని ఈ సంసారంలో నుంచి తేలికగా నడిపించి వేస్తాయి. సత్పురుషుల పట్లా, భగవంతుని పట్లా మనకి ఉన్న వినమ్రతకు గుర్తుగా పాదుకలను పూజిస్తాము. భగవంతుడి పాదాల్ని, గురువుల పాదాల్ని, సాధువుల పాదాల్ని సేవించడమే పాద సేవన భక్తి.
అర్చనం:
భగవంతుని ధూపదీపనైవేద్యాలతో, పూజా క్రతువులతో, షోడశోపచారాలతో… ఇవేవీ కాకున్నా సాక్షాత్తూ శ్రీకృష్ణుడే సెలవిచ్చినట్లుగా ‘పత్రం పుష్పం ఫలం తోయం(నీరు)’…. ఎలాగైనా కానీ, వేటితోనైనా కానీ తనను శ్రద్ధగా పూజిస్తే చాలు ఆ భగవంతునికి మన భక్తి ని అందించినట్లే! తులసి, పుష్ప మాలలతో భగవంతుణ్ని పూజించడం అర్చన భక్తి. దీనికి ఉదాహరణ మథురానగరంలో కంసుడి పరిచారిక అయిన కుబ్జ. రకరకాల సువాసనలతో లేపనాలు తయారుచేయడం ఆమె పని. కృష్ణుడికి ప్రేమతో తన దగ్గరున్న లేపనాలు అందిస్తుందామె. ఆ లేపనాలు పూసుకున్న కృష్ణుడు ఆమె పాదాలపై తనపాదాలు మోపి గడ్డాన్ని స్పృశించగానే కురూపగా ఉన్న కబ్జ సురూపగా మారిపోతుంది.
వందనం:
భక్తి, వయసులోనైనా, జ్ఞానంలోనైనా, వ్యక్తిత్వంలోనైనా మనకంటే పెద్దలు కనిపిస్తే నమస్కరించడం మనకి పెద్దలు సూచించిన సంస్కారం. మనసావాచాకర్మణా నిన్ను నేను గౌరవిస్తున్నానన్న భావనకు వందనం ఒక సూచన. వందనం అంటే అభివాదమే కాదు స్తుతించడం, కృతజ్ఞతలు తెలుపడం అన్న అర్థాలు కూడా ఉన్నాయి. భగవంతుని పట్ల పరిపూర్ణమైన వినమ్రతను మనసులో నింపుకోవడమే దీని భావమై ఉంటుంది. శ్రద్ధలతో భగవంతుడికి నమస్కరించడం వందనభక్తి. దీనికి ఉదాహరణ అక్రూరుడు. బలరామకృష్ణుల్ని రథం మీద మథురకు తీసుకెళ్లడానికి వచ్చిన అక్రూరుడు.. బృందావనంలో శ్రీకృష్ణ, బలరాముల్ని సమీపించి వినయంతో వందనం చేసి భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు.
దాస్యం:
దాస్యం అన్న మాటలోనే చిన్నతనం ధ్వనిస్తుంది. హోదాపరంగానో, డబ్బుకోసమో ఒకరి కింద ఊడిగం చేయడం వల్ల ఎవరి అభిమానమైనా దెబ్బతింటుంది. కానీ ఆ అభిమానంతోనే ఒకరికి వీలైనంత సేవ చేయాలనుకోవడం, ఇద్దరిలోనూ ఉన్నతత్వాన్ని సూచిస్తుంది. హనుమంతుడు ఎంతటివాడు? సాక్షాత్తూ చిరంజీవులలోనే ఒకడు! కానీ మానవరూపంలో ఉన్న రాముని కోసం ఏ పనికైనా సిద్ధపడ్డాడు. సముద్రాన్ని లంఘించినా, సంజీవిని వెంటతెచ్చినా… తాను శ్రీరామునికి ఉపకారం చేస్తున్నానన్న భావనతో చేయలేదు. ఆయనకు సేవ చేసే అవకాశం వచ్చిందన్న సంబరంలో చేశాడు. సర్వకాల సర్వావస్థల్లో భగవంతుడి సేవ చేస్తూ అదే భావనతో జీవించడం. శ్రీ కృష్ణుడి చరణ సేవా భాగ్యాన్ని కోరుతూ ‘నీకు దాస్యంబు చేయని జన్మమేలా’ అని రుక్మిణి భక్తిని ప్రదర్శించింది. గరుత్మంతుడు, ఆంజనేయులది దాస్యభక్తి.
సఖ్యం:
శ్రీకృష్ణుడు సాక్షాత్తూ భగవంతుడే అయినా కుచేలుడు, అర్జునుడు కొన్ని సందర్భాలలో ఆయనను స్నేహితునిగానే భావంచారు. తమ పరిమితులను గ్రహిస్తూనే నేస్తంగా ఆయన దగ్గర మంచి విషయాలెన్నో తెలుసుకున్నారు. గోపికలు సైతం శ్రీకృష్ణుని సఖునిగానే భావించి ఆరాధించారు. సఖుడు అన్న మాటలోనే ఒక తెలియని చనువు ఉంది. ఆయన మనవాడే అన్న ఆత్మీయత ఉంది. నిరంతరం నా తోడుగా ఉంటాడన్న భరోసా ఉంది. అందుకే సఖ్యం కూడా నవవిధ భక్తులతో ఒకటిగా ఎంచబడింది. భగవంతుణ్ని స్నేహితుడిగా భావించి ఆయన గుణగణాల్ని అలవర్చుకోవడమే సఖ్య భక్తి. దీనికి అర్జునుడు మంచి ఉదాహరణ.
ఆత్మనివేదనం:
నిరాకారుడు, నిరంజనుడు అయిన పరమాత్మకు సమానంగా మనం దేనిని నివేదించగలం. ఈ దేహంతో మనం పొందిన ఆస్తిపాస్తులను కాదు, ఈ దేహమూ కాదు- ఎప్పటికైనా ఇవన్నీ నశించిపోయేవే! ఈ భౌతిక వస్తువులకు, వాటి వెనుక పడే దేహానికీ అతీతమైన ఆత్మ ఒక్కటే ఆ భగవంతునికి సరైనా కానుక. ఆత్మ ఒక్కటే శాశ్వతం అని తెలుసుకుని, ఆ ఆత్మకు తుది గమ్యం పరమాత్మ అని గ్రహించి మసలుకోవడమే ఆత్మనివేదనం. మనోవాక్కాయ కర్మలతో భగవంతుడికి తననుతాను అర్పించుకోవడం ఆత్మనివేదన భక్తి. బలి చక్రవర్తి ఇందుకు ఉదాహరణ.
భగవత్తత్వం అర్థం కావడానికి, భగవంతుడికి దగ్గర కావడానికి ఉపకరించే భక్తిమార్గాలివి. విద్యార్థులు వీటిని దృష్టిలో పెట్టుకుని.. తాము తెలుసుకోవలసిన అంశాల్ని ‘శ్రవణం’ చేయాలి. గొంతెత్తి ‘కీర్తనం’ చేయాలి. తాము చదివే విషయాల్ని ‘స్మరణం’ చేయాలి. అక్షరాలను పదాలుగా భావించి ‘సేవనం’ చేయాలి. అక్షరాలకు అక్షర దేవతలకు ‘అర్చనం’ చేయాలి. గురువులకు, తాము చదివే గ్రంథాలకు ‘వందనం’ చేయాలి. ఆ విజ్ఞాన దేవతకు ‘దాస్యం’ చేయాలి. పుస్తకాలతో ‘సఖ్యం’ చేయాలి. తాము చదివే వైజ్ఞానిక గ్రంథాలను దైవంగా భావించి ‘ఆత్మ నివేదనం’ చేసుకోవాలి. తద్వారా విజయం అనే మోక్షాన్ని పొందుతారు.
Famous Posts:
> భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?
> వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.
> శివ గుణాలు లోకానికి సందేశాలు
> భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?
> కూతురా కోడలా ఎవరు ప్రధానం...?
> సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?
> కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?
> మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి.
నవవిధ భక్తి, భక్తి అంటే, Nava vidha bhakti, 9 types of bhakti with examples, navavidha bhakti margalu, navavidha bhakti in telugu, navavidha bhakti shloka,
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment