తొలి ఏకాదశి లోపు గోపద్మ వ్రత కథ ను వింటే చాలు ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే ! Importance of Gopadma Vratam & Pooja Vidhanam

ఆషాడ శుక్ల ఏకాదశి రోజు నుండి గోపద్మ వ్రతము ప్రారంభం:

గోపద్మ వ్రతము అనేది చాతుర్మాస సమయంలో గోవులను పూజించటానికి ఏర్పాటు చేసుకున్న వ్రతము. దీనిని సుమంగళి స్త్రీలు ఆషాడ శుక్ల ఏకాదశి రోజు ప్రారంభించి కార్తీక శుక్ల ద్వాదశి వరకు కొనసాగిస్తారు.

గోపద్మ వ్రతంలో భాగంగా గోవులను పూజించటమే కాక పశువుల పాకలను ,  కొట్టాలను శుభ్ర పరచి , వాటిలో అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తారు. ఈ ముగ్గుల్లో భాగంగా ఆవునూ మరియు దూడను గీసి వాటిని 33 పద్మాలతో నింపుతారు. పూజలో భాగంగా ముగ్గు చుట్టూ 33 ప్రదక్షిణాలు చేస్తారు , 33 సార్లు అర్ఘ్యం ఇస్తారు , మరియు 33 స్వీట్లు దానం చేస్తారు. పశువుల పాక అందుబాటులో లేనివారు ఇంట్లోనే ముగ్గువేసి పూజా కార్యక్రమం చేస్తారు. ఈ గోపద్మ వ్రతాన్ని అయిదు సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగించి ఆ తర్వాత ముగిస్తారు.

హిందూ మతంలో ఆవును పవిత్రతకు చిహ్నంగా పరిగణిస్తారు. ఆవును పూజించటం అనేది వైదిక సంస్కృతిలో ఒక భాగం. సమస్త దేవతలు ఆవులో కొలువై ఉంటారని భావిస్తారు.

గోపద్మ వ్రత విధానము

వేసిన ముగ్గుకు పుష్పార్చన జరిపి , చెక్కెర , స్వీటును నైవేద్యంగా పెట్టాలి. 

వాటిచుట్టూ 33 ప్రదక్షిణలు చేసి 33 సార్లు నమస్కరించాలి. 

తర్వాత ఆవు శరీరంపై ఆరు మోహినీ దేవతలకు ప్రతిగా వేసిన ఆరు పద్మాలకు ఆరు సార్లు నమస్కరించాలి. 

హారతిని ఇచ్చి 33 మంది దేవతలకు 33 సార్లు అర్ఘ్యమివ్వాలి. 

మళ్ళీ ఆరుగురు మోహినీ దేవతలకు ఆరు సార్లు  వేరుగా అర్ఘ్యమివ్వాలి. 

తరువాత గోపద్మ వ్రత కథను చదివి , అక్షతలు వేసి పూజలో ఏమైనా అపరాధం జరిగి ఉంటే క్షమింపమని కోరాలి. స్వీట్లు మొదట సోదరులకు , తర్వాత ఇతరులకు దానమివ్వాలి.

ఈ వ్రతమును నాలుగు నెలల పాటు క్రమం తప్పకుండా చేయాలి. ఎప్పుడైనా అనివార్య పరిస్థితుల వల్ల ఒకటి రెండు రోజులు తప్పిపోయినా , ఆ తర్వాత రోజు పూజను కొనసాగించి అపరాధాన్ని క్షమింపమని కోరాలి. ఒకవేళ వరుసగా ఏడు రోజులు తప్పిపోతే ఆ సంవత్సరానికి వ్రత భగ్నం జరిగినట్లుగా భావించి ఇక కొనసాగింపకూడదు. ఈ మధ్య కాలములో సమయాభావము వలన చాలామంది గోపద్మ వ్రతాన్ని వారానికి 1-2 సార్లు మాత్రమే ఆచరిస్తున్నారు.

గోపద్మ వ్రత కథ

ఒకసారి దేవసభలో అప్సర రంభ నాట్య ప్రదర్శన చేస్తుంది. మనోహరంగా వాయిస్తున్న సంగీత వాద్యముల నడుమ ఆమె అద్భుత నాట్యం కొనసాగుతుండగా , ఒక తబలా పగిలి అపస్వరం రావటంతో కార్యక్రమం ఆగిపోయింది. దానికి ఇంద్రుడు నొచ్చుకుని వెంటనే యమ్ముణ్ని పిలిచి భూలోకంలో వ్రతమాచరించని వారి చర్మం తెచ్చి తబలాను బాగుచేయవలసిందిగా కోరతాడు. దానికి యముడు , భూలోకములో అటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుని రమ్మని  తన భటుల్ని పంపిస్తాడు. ఆ భటులు లోకమంతా తిరిగి వచ్చి యమునికి ఇలా నివేదిస్తారు. గౌరి , సావిత్రి  , అనసూయ , ద్రౌపది , అరుంధతి మరియు సరస్వతి ఇలా అందరూ ముగ్గులు వేసి పూజిస్తున్నారు. ఒక్క శ్రీకృష్ణుని సోదరి అయిన సుభద్ర ఇంటివద్ద మాత్రం ముగ్గులేదు అని తెలియచేసారు. దానికి యముడు వారిని ఆమె చర్మాన్ని తీసుకుని వచ్చి ఆ తబలాకు బిగించవలసిందిగా  ఆదేశిస్తాడు.

ఈ సమాచారాన్ని నారదుడు శ్రీకృష్ణునికి చేరవేస్తాడు. విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఉదయం నిద్రలేచిన వెంటనే సుభద్ర దగ్గరకు వెళ్లి ఆమెను ఇంటివద్ద ముగ్గు ఎందుకు లేదు మరియు వ్రతాన్ని ఎందుకు ఆచరించటం లేదు అని ప్రశ్నించగా , దానికి సుభద్ర నాకు సూర్య , చంద్రుల వంటి ఇద్దరు సోదరులు , మహావీరుడైన అర్జునుని వంటి భర్త , దేవకీ వసుదేవుల వంటి తల్లిదండ్రులు ఉండగా నేను దేనికోసం వ్రతం చేయాలి అని ఎదురు ప్రశ్నిస్తుంది.

దానికి శ్రీకృష్ణుడు అన్నీ ఉన్నాగానీ భవిష్యత్తు కోసం వ్రతం చేయాలని ఆమెను ఒప్పించి ఆమెకు వ్రత విధానాన్ని ఇలా వివరిస్తాడు. గద్ద , విష్ణు పాదము , శంఖము , చక్రము , గద , పద్మము , స్వస్తిక , బృందావన , వేణువు , వీణ , తబలా , ఆవు  , దూడ , 33 పద్మములు , రాముని ఊయల , సీత చీర అంచు , తులసి ఆకు , ఏనుగు మరియు భటుడులను ముగ్గుతో నదులు , చెరువులు మరియు దేవుని చిత్రాలతో కలిపి గీయాలి అని చెబుతాడు. అప్పుడు సుభద్ర రాతి పొడిని ముత్యములు మరియు పగడములతో కలిపి ముగ్గు వేసింది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తెలిపిన విధంగా గోపద్మ వ్రతాన్ని ఆచరించింది.

ఆ విధంగా సుభద్ర గోపద్మ వ్రతం ఆచరించి , యమభటుల నుండి తప్పించుకోగలిగింది. అప్పటినుండి ఈ వ్రతం ప్రాచుర్యం పొందింది. యమభటులు ఉత్తరానికి తల పెట్టి పడుకుని ఉన్న ఒక ఏనుగు నుండి చర్మము సంగ్రహించి తబలా బాగుచేసుకున్నారు.

Famous Posts:

ఈ ఏకాదశి నుంచీ రాబోయే రోజులూ మామూలువి కాదు, ఇలా చేయండి.

తొలి ఏకాదశి అంటే ఏమిటి, ఎందుకు చేసుకుంటారు, దీని విశిష్టత ఏంటి?

మొదటి సారి తిరుమల శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణ చేసే వారికోసం..

ఎటువంటి సర్పదోషాలు ఉన్నా భస్మం చేసే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి.

గోపద్మవ్రత కథ, Gopadma Vrata, gopadma meaning, gopadma vrata katha in telugu, gopadma rangoli, ashadam, toli ekadashi

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS