మగవారు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి? కట్టుకోకపోతే ఏమవుతుంది? దీని గురించి ఆసక్తికరమైన విషయాలు..
మొలతాడు లేని వాడు మగాడే కాదు' అని తెలుగులో ఒక ప్రసిద్ధ సామెత ఉంది. అసలు మగతనానికి - మొలతాడుకు మధ్య సంబంధం ఏమి? అసలు మొలతాడు ఎందుకు కట్టుకుంటారు? కట్టుకోకపోతే ఏమవుతుంది?
హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని వయసుల మగవారు నడుము భాగంలో ఈ మొలతాడు (మొలత్రాడు) ను ధరిస్తారు. మొలతాడును దారంతో తయారు చేస్తారు. కొందరు వెండి తోను, బంగారంతోను, ప్లాటినమ్ తోను ఈ మొలతాడును తయారు చేయించుకుని ధరిస్తారు. మొలతాడు మార్చవలసినప్పుడు కొత్త దానిని ధరించిన తరువాత పాతదానిని తొలగిస్తారు.
పుట్టిన 11వ రోజున మొలతాడు కడతారు. ఆ సమయంలో ముత్యాల మొలతాడు, బంగారు మొలతాడు, వెండి మొలతాడు లేదా ముంజ దర్భలతో పేనిన మొలతాడు కడతారు. ఆ తరువాత ఈ లోహపు సూత్రాలు ప్రతిరోజూ ధరించదానికి పిల్లలకు అసౌకర్యంగా వుంటుంది కాబట్టి, రోజువారీ వాడకానికి నల్లని/ఎర్రని నూలు తాడు కడతారు.
మన ఆచారంలో దేవుళ్ళకు కూడా యీ కటిసూత్రాలు వున్నాయి. రామాయణం, భాగవతం, హనుమద్భాగవతం, స్కంద పురాణంలోని బ్రహ్మోత్తరఖండం ఇంటువంటి అనేక అనువాద పురాణ, ఇతిహాస గ్రంథాలలో మొలతాడు ధారణకు సంబంధించిన ప్రసంగాలు కనిపిస్తాయి.
చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ
బంగారుమొలత్రాడు పట్టుదట్టి
సందెతాయెతులు సరిమువ్వగజ్జెలు
చిన్నికృష్ణా ! నిన్ను చేరికొలుతు.
రామదాసు కీర్తన
ఇక్ష్వాకు కులతిలకా ఇకనైన పలుకవే రామచంద్రా
నన్ను రక్షింప కున్నను రక్షకు లెవరింక రామచంద్రా ..
శత్రుఘ్నునకు చేయిస్తి బంగారు మొలతాడు రామచంద్రా
ఆ మొల త్రాటికి పట్టె మొహరీలు పదివేలు రామచంద్రా..
శ్రీకృష్ణదేవరాయల ఆముక్త మాల్యద, శ్రీనాథుడి శృంగారనైషధం, ఆంధ్ర ప్రతాపరుద్రీయం, మనుచరిత్ర, వంటి గ్రంథాలలో కూడా మొలతాడు ప్రశక్తి వుంది.
మొలత్రాడు, పురుషుల నడుం చుట్టూ కట్టే ఒక దారం లేదా దారం రూపంలో ఉన్న అలంకార లోహం . ఇది హిందూ సాంప్రదాయంలో ఒక భాగం. యావత్ భారతదేశంలో ఈ సాంప్రదాయం ఉంది. చిన్నతనంలో బాలబాలికలిరువురికీ కట్టిననూ, పెద్దవారైన తర్వాత స్త్రీలు మొలత్రాడు వాడరు. పురుషులు మాత్రం తప్పక వాడవలసిందే. పురుషుడి భార్య కాలం చేస్తే గానీ మొలత్రాడు తీయకూడదు అన్న (మూఢ) నమ్మకం ఇప్పటికీ ఉంది.
మొలత్రాడులు ప్రాథమికంగా ఎరుపు/నలుపు లలో లభిస్తుంది. నలుపు మంచిది కాదని కొందరి అనుమానం. లుంగీ, పంచె, వదులుగా ఉన్న నిక్కర్లు, ప్యాంటులు, పైజామా, లంగోటి లని (బెల్టు ఉపయోగించకుండా) బిగుతు చేసుకోవటానికి వాటిని మొలత్రాడు క్రిందకు (అంటే నడుము కు, మొలత్రాడుకి మధ్య వస్త్రం వచ్చేలా) కట్టుకొనే సౌలభ్య్ం ఉంది.
స్నానం ఆచరించేటపుడు పూర్తిగా నగ్నంగా ఉండకూడదు కనీస గుడ్డ అయినా ధరించాలి అని వేదాలలో చెప్పినట్లుగా కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. పూర్వకాలంలో అందరూ నదుల్లోనే స్నానం ఆచరించే వారు. ఒక్కోసారి కొన్ని పరిస్థితుల కారణంగా గుడ్డ ఉండకపోవచ్చు. ఈ క్రమంలో మొలతాడు పవిత్రమైనది, కాబట్టి ఎలాంటి పాపం అంటుకోదు అని దీనిని ధరించేవారు. అలాగే గుడ్డను ముడివేయటానికి రక్షణగా కూడా ఉండేది.
ఆడవారికి మంగళసూత్రం ఎలాగో, మగవారికి మొలతాడు అలాగ. మహిళలకు కూడా చిన్నతనంలో సిగ్గుబిళ్లలా ధరింపజేస్తారు. పెళ్లయ్యాక వారికి మంగళసూత్రం వస్తుంది.
ఎవరైనా వ్యక్తి చనిపోతే అతడి పార్థివదేహానికి మొలతాడును వేరుచేస్తారు. అలాగే అతడి భార్య నుంచి మంగళసూత్రాన్ని వేరుచేస్తారు. ఈ దారాలను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు కాబట్టే మంగళసూత్రానికి అలాగే మొలతాడుకు అంతటి ప్రాధాన్యత ఉంది.
ఆరోగ్య పరంగానూ ప్రాముఖ్యత కలిగింది
కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మొలతాడును ధరించాలంటారు. మొలతాడు కడుపులోకి వెళ్లే ఆహారాన్ని నియంత్రణలో ఉంచుతుంది. తద్వారా జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇది బరువు పెరగటాన్ని తెలియజేస్తుంది. బిగుతుగా మారితే కొవ్వు పెరిగినట్లు, వదులుగా ఉంటే ఆరోగ్యవంతులుగా ఉన్నట్లుగా సంకేతం.
నడుము ప్రాంతంలో నల్లటి దారం ఉంటే అది ఆ ప్రాంతంలో వేడిని గ్రహిస్తుంది. వృషణాలు అధిక వేడికి గురయితే మగవారిలో శుక్రకణాల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి వేడిని గ్రహించే నల్లటి మొలతాడు పరోక్షంగా మగవారిలో సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని చెబుతారు.
హిందూ ధర్మంలో ఇలాంటి సాంప్రదాయాలు ఆచరించాలని ఉందని పెద్దలు చెబుతారు. కాబట్టి మొలతాడును కట్టుకోవడం ఒక ఆచారంగా కొనసాగుతుంది. మొలతాడు కట్టుకోకపోతే నష్టమా అనే విషయం పక్కనపెడితే, కట్టుకోవడం ద్వారా కొన్ని రకాలుగా ప్రయోజనకరంగానే ఉంటుంది తప్పితే ఎలాంటి నష్టం లేదు.
సంపన్నులు వెండి/బంగారు మొలత్రాడులని వాడటం కూడా ఉంది. చిన్ని కృష్ణుడిని వివరించే ఒక పద్యంలో బంగారు మొలత్రాడు అనే పదాలు వస్తాయి.
Famous Posts:
> స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
Tags: మొలతాడు, Molathadu, Gents Molathadu, Red Thread Molathadu, Black Thread Molathadu, Molathadu Telugu, Importance Molathadu