శ్రీ కాత్యాయనీ వ్రతం
7 మంగళవారములు
వ్రతమునకు కావలసిన సామాగ్రి
1. కుంకుమ
2. తమలపాకులు
3. పోకచెక్కలు
4. అగరువత్తులు
5. ఆవు నెయ్యి
6. మంచిగంధము
7. గులాబీ, మందార.. మొదలగు ఎర్రని పువ్వులు
8. ఆవునేతితో, కుంకుమతో చేసిన అక్షతలు
9. అప్పాలు (బియ్యంపిండి, బెల్లం కొద్దిగ ఉప్పుచేసి వండినవి 7)
10. చెఱుకుగడ (తొక్కతీసి చిన్నగ చేసిన ముక్కలు 7)
11. కొబ్బరికాయ పాతకాయ మొదటివారం ఇదే 7 వారాలు పనికివచ్చును.
12. ఎర్రని రవికలగుడ్డ ఇదే, 7 వారాలు పనికివచ్చును.
13. మంగళసూత్రములు బంగారం లేదా పసుపుకొమ్ములు కట్టినవి ఇదే 7 వారాలు పనికివచ్చును.
14. కాత్యాయనీదేవి (శంకరుని ఎడమ తొడపై కూర్చినియున్న పార్వతీ) పటము, యంత్రము
15. బియ్యం
16. దీపముకుందె
17. వత్తులు
18. కర్పూరము
19. పసుపు
20. నూనె
21. వక్కపొడి
22. అరటిపండ్లు
23. కొబ్బరికాయ
24. ప్రసాదము
25. హారతి స్టాండ్
26. 3 స్టీలు పళ్ళెములు
27. కొబ్బరికాయ కొట్టటానికి రాయి
28. చేయి తుడుచుకొనుటకు వస్త్రము
29. ఉద్దరిణి
30. నీళ్ళు
31. ఆచమనపాత్ర మరియు ప్లేటు
32. పసుపురాసిన పీట
33. క్రొత్త ఎర్రటివస్త్రము (కలశస్థాపనకు)
34. పూలమాల
35. శ్రీ చక్రము లేదా మేరువు లేదా రూపాయి నాణెం
36. కూర్చోవటానికి పీటలు
37. అగ్గిపెట్టె
శ్రీ కాత్యాయనీ వ్రతము చేయవలసినవారు
1. కన్యలు (పెళ్ళికానివారు) ఈ వ్రతం ఆచరించవచ్చును.
2. ఒకసారి వివాహము రద్దుఅయినవారు ఆచరించవచ్చును.
3. ఒకసారి వివాహము అయి కొన్నిదినములకే భర్తపోయినవారు ఆచరించవచ్చును.
4. ఒకసారి వివాహము అయి విడాకులు తీసుకున్నవారు ఆచరించవచ్చును.
5.bతరుచుగా వివాహప్రయత్నములు విఫలమగుచున్నవారు ఆచరించవచ్చును.
6. మీ మనస్సుకునచ్చే వరుడు కోసం అన్వేషణ చేస్తున్నవారు ఆచరించవచ్చును.
7. అన్నివిధాల తగిన సంబంధము కోసం అన్వేషణ చేస్తున్నవారు ఆచరించవచ్చును.
8. కుజదోషము జాతకచక్రములో వున్నవారు ఆచరించవచ్చును.
9. కుజమహర్దశ, అంతర్దశ, విదశ జరుగుచున్నవారు ఆచరించవచ్చును.
10. రాహుమహర్దశ, అంతర్దశ, విదశ జరుగుచున్నవారు ఆచరించవచ్చును.
11. ఎంతమంది పెళ్ళికొడుకులు చూసిన నచ్చనివారు ఆచరించవచ్చును.
12. ఆర్ధికస్తోమత లేక (కట్నం ఇవ్వలేక) వివాహమునకు ఆటంకములు కలవారు. ఆచరించవచ్చును.
13. స్త్రీ జాతకచక్రములో రాహుకేతు దోషములు కలవారు ఆచరించవచ్చును.
14. స్త్రీ జాతకచక్రములో సప్తమ, అష్టమస్థానములలో పాపగ్రహములు ఉండి వివాహప్రయత్నములు సఫలంకానివారు ఆచరించవచ్చును.
15. నిశ్చితార్థం అయి పెళ్ళి వాయిదాపడుచున్నవారు ఆచరించవచ్చును.
శ్రీ కాత్యాయనీ వ్రతమ్
పూజామండపములో శ్రీ కాత్యాయనీ పటమును
అలంకరించవలెను.
శ్లో॥ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాన్తయే ॥
కేశవాయ స్వాహా నారాయణాయ స్వాహా మాధవాయ స్వాహా అని మూడుమారులు పై నామములు చెప్పి ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని ఆచమనము చేయవలయును. దీపారాధనం కృత్వా - ఆవునేతితో దీపము వెలిగించి
గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః హృషీకేశాయ నమః పద్మనాభాయనమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్దాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః అని ఈ నామములు చదువుకొని చేతిలోనికి అక్షతలు తీసుకొని ఈ క్రింది శ్లోకము చదువుకొని ఆ అక్షతలు వాసనచూచి తమ ఎడమవైపు | వేయవలయును.
ఉత్తిష్ఠంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
అక్షతలు ఎడమవైపు వేసిన తరువాత
మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ కాత్యాయనీ దేవతాముద్దిశ్య శ్రీ కాత్యాయనీ దేవతా ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన......సంవత్సరే.. ఆయనే....... ఋతౌ...... మాసే........ పక్షే.........తిధౌ.. ........ మంగళవాసరే ప్రదోష సాయం సమయే శ్రీమతే.. .....గోత్రవతీ.........నామధేయవతీ శ్రీమత్యాః గోత్రవత్యాః నామధేయ వత్యాః మమ జన్మలగ్నవశాత్ వివాహ ప్రతిబంధక దుష్టగృహదోష నివారణార్థం కుజదోషాది సర్వదోష నివారణార్థం శీఘ్రమేన కళ్యాణసిద్ధ్యర్ధం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ కాత్యాయనీవ్రతం కల్పోక్త ప్రకారేణ కరిష్యే ఆదౌ నిర్వఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే.
అని చెప్పి మూడుమార్లు ఉద్ధరణతో నీళ్ళు తీసుకొని పళ్ళెములో వదిలిపెట్ట వలయును. పిదప కలశకు (అనగా పూజ చేసుకొనుటకు వాడుచెంబునకు) మూడుపక్కలా గంధము పెట్టి కుంకుమ అద్ది, ఆ నీటిలో పుష్పమును గంధములో అద్ది అక్షతలతో గూడ ఆ పుష్పమును చెంబులో వేసి చేతితో మూసి ఈక్రింది శ్లోకము చదువవలెను.
శ్లో॥ కలస్య ముఖేవిష్ణుః కంఠేరుద్రః సమాశ్రితః
మూలే తత్రస్థితో బ్రహ్మమధ్యే మాతృగణాః స్మృతాః
కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదః యజర్వేదః సామవేదో హ్యధర్వణః
అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః
అయాన్తు శ్రీ కాత్యాయనీ పూజార్థం దురితక్షయ కారకాః
గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు
కలశోదకేన దేవం ఆత్మానం పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య
కలశలోని నీటిని ఆ పుష్పముతో దేవునిమీద తమమీద పూజచేయు
పుష్పములమీద చల్లవలెను.
పసుపుతో గణపతిని చేసుకొని దానిని ఒక తమలపాకుపై యుంచి దానిపై ఒక పుష్పము నుంచి ఈ క్రింది శ్లోకము చదువవలయును.
శ్లో॥ వక్రతుండం మహాకాయ కోటిసూర్య సమప్రభం
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
శ్రీ మహాగణపతిం అస్మిన్ హరిద్రా బింబే అవాహయామి స్థాపయామి పూజయామి పసుపు గణపతిపై అక్షతలు లేదా పుష్పం ఉంచవలెను. శ్రీ మహాగణాధి పతయే నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి గణపతిపై అక్షతలు లేదా పుష్పము ఉంచవలెను. శ్రీ మహాగణాధిపతయే నమః పాద్యం సమర్పయామి
(కలశలోని నీరు పుష్పముతో చల్లవలెను)
మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (కలశలోని నీళ్ళు చల్లవలెను) శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే అచమనీయం సమర్పయామి (కలశలోని నీళ్ళు చల్లవలెను) శ్రీ మహాగణాధిపతయే నమః స్నాపయామి స్నానం సమర్పయామి (కలశలోని నీళ్ళు చల్లవలెను) శ్రీ మహాగణాధిపతయే నమః స్నానానంతరం శుద్ధాచమనం సమర్పయామి (కలశలోని నీళ్ళు చల్లవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రం సమర్పయామి (దూదితో చేసిన వస్త్రము ఉంచవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమయజ్ఞోపవీతం సమర్పయామి (దూదితో చేసిన జంధ్యము ఉంచవలెను) శ్రీ
మహాగణాధిపతయే నమః గంధం సమర్పయామి (గంధం ఉంచవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి (పసుపు అక్షతలు ఉంచవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పైః పూజయామి (ఈ క్రింది 16 నామములతో పుష్పములుంచవలెను)
1. సుముఖాయ నమః 2. ఏకదంతాయ నమః 3. కపిలాయ నమః 4. గజకర్ణికాయ నమః 5. లంబోదరాయ నమః 6. వికటాయ నమః 7. విఘ్నరాజాయ నమః 8. ధూమకేతవే నమః 9. గణాధ్యక్షాయ నమః 10. ఫాలచంద్రాయ నమః 11. గజాననాయ నమః 12. వక్రతుండాయ నమః 13. శూర్పకర్ణాయ నమః 14. హేరంభాయ నమః 15. స్కందపూర్వజాయ నమః 16. సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీమహాగణాధిపతయే నమః షౌడశ నామపూజాం సమర్పయామి (నమః అన్న తరువాత పుష్పముతో శ్రీ మహాగణపతిని పూజింపవలయును) శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి) అగరవత్తి వెలిగించి ధూపము చూపవలెను.
శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి. (ఆవునేతి దీపము చూపవలెను) శ్రీ మహాగణాధిపతయే నమః ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి.
(పువుతో కలశలోని నీటిని జల్లవలయును)
శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.
(బెల్లం ముక్క గణపతియందుంచి 5 సార్లు చూపవలెను).
శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి (అక్షతలుంచవలెను) శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షణ నమస్కారాన్ సమర్పయామి (అక్షతలుంచవలెను)
పిదప చేతిలో అక్షతలు నీళ్ళు పోసుకుని
అనయా ధ్యాన వహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః
శ్రీ మహాగణపతి స్సుప్రీతః సుప్రసన్నో వరదోభవంతు. అని పళ్ళెములో ఆ నీటిని వదలవలెను. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృష్ణామి (గణపతికి పూజచేసిన పుష్పము శిరస్సులో ధరించి
అక్షతలు శిరస్సుమీద ఉంచుకోవలెను)
అథ కాత్యాయనీ పూజా
కలశపైన ఉన్న కొబ్బరికాయపై ఈ క్రింది మంత్రము చెప్పుచు శ్రీ కాత్యాయనీ దేవిని కలశమందు అవాహన చేయవలెను. పుష్పమును తీసుకొని.. అస్మీన్ కలసే సమస్త తీర్థాధిపం వరుణ మావాహయామి అని పుష్పము ఉంచి మరల పుష్పము తీసుకొని
ధ్యానం
శ్లో॥ ధ్యాయామి దేవీం సకలార్థ ధాత్రీం చతుర్భుజాం కుంకుమరాగా శోణాం ! ఈశాన వామాంక నివాసినీం శ్రీకాత్యాయనీం త్వాం శరణం ప్రపద్యే ॥
కాత్యాయనీ మహాదేవి శంకరార్థ స్వరూపిణీ|
కళ్యాణం కురుమేదేవి శివశక్తి నమోస్తుతే ॥
శ్రీ కాత్యాయనీ దేవ్యై నమః ధ్యాయామి॥ (ఎర్రటి పుష్పము నుంచవలెను)
ఆస్మిన్ కలశోపరి సాంబ సదాశివ సహిత కాత్యాయనీం మహాగౌరీం అవాహయామి స్థాపయామి పూజయామి.
పుష్పమును వుంచి ఈశ్వరుని ఎడమతొడపై కూర్చున్నట్లుగా కాత్యాయనీదేవిని భావించి నమస్కరించవలెను.)
శ్లో॥ సర్వదోష ప్రశమనీ సర్వాలంకార సంయుతే యావత్వాం పూజయిష్యామి తావత్వం సుస్థిరోభవ శ్రీ కాత్యాయనీదేవ్యై నమః అవాహయామి'
పుష్పములుంచవలెను.
రత్నసింహాసనమ్
శ్లో॥ భౌమవార ప్రియేదేవీ కుజదోష నివారిణీ స్కందమాత్రా స్వర్ణ రత్నసింహాసనం సమర్పయామి శ్రీ కాత్యాయనీ దేవ్యై నమః స్వర్ణ రత్నసింహాసనం సమర్పయామి.
పుష్పముగాని అక్షతలు గాని ఉంచవలెను.
పాద్యము
శ్లో॥ గంగాది సర్వతీరైశ్చ శోభితం చ సువాసితం పాద్యం గృహాణ వరదే గౌరీ కల్యాణ కారిణీం ॥
శ్రీ కాత్యాయనీ దేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి
పుష్పముతో నీటిని చల్లవలెను.
ఆర్ఘ్యము
శ్లో॥ శుద్దోదకం సువిమలం గంధ పుష్పాది మిశ్రితం ఆర్ఘ్యం దాస్యామితే దేవి గృహ్యతాం శివవల్లభే ॥
శ్రీ కాత్యాయనీ దేవ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
పుష్పముతో నీటిని చల్లవలెను
ఆచమనీయం
శ్లో॥ సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవి మయాదత్తం శుభప్రదే ॥
శ్రీ కాత్యాయనీ దేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి
పుష్పముతో నీటిని చల్లవలెను
స్నానము
శ్లో॥ గంగా గోదావరీ దేవ్యైః తీర్చైశ్చ మిళితం శుభం శుద్ధోదక స్నానమిదం గృహాణ పరమేశ్వరి ॥
శ్రీ కాత్యాయనీ దేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి
పుష్పముతో నీటిని చల్లవలెను
వస్త్రము
శ్లో॥ సురార్చితాంఘ్ర యుగళే దుకూలవసన ప్రియే రక్తవస్త్రద్వయం దేవి గృహ్యతాం సురపూజితే॥
శ్రీ కాత్యాయనీ దేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి
కుంకుమ అద్దిన దూదితో చేసిన వస్త్రములుంచవలెను.
మాంగళ్యము
శ్లో॥ తప్తహేమకృతం దేవీ మాంగళ్యం మంగళప్రదం మయా సమర్పితం దేవి గృహ్యతాం శివవల్లభే ॥
శ్రీ కాత్యాయనీ దేవ్యై నమః మంగళప్రద మాంగళ్యం సమర్పయామి
మంగళసూత్రములు ఉంచవలెను.
ఆభరణము
శ్లో॥ సువర్ణ భూషణాదేవి నవరత్న మయానిచ సమర్పయామి
హే దేవి స్వీకురుష్వ శుభప్రదే
శ్రీ కాత్యాయనీ దేవ్యై నమః సర్వాభరణాన్ సమర్పయామి
పుష్పము లేదా అక్షతలు ఉంచవలెను.
గంధము
శ్లో॥ కర్పూరాగరు కస్తూరీ రోచనాది సుసంయుతం
గంధం దాస్యామి శుభగే స్వీకురుష్వ శుభప్రదే ॥
శ్రీ కాత్యాయనీ దేవ్యై నమః పరిమళ గంధం సమర్పయామి
పుష్పము గంధములో అద్ది ఉంచవలెను.
అక్షతలు
శ్రీ అక్షతానవరుణాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గోమృతాక్తాన్ రక్తవర్ణాన్ స్వీకురుష్య మహేశ్వరీ ॥
శ్రీ కాత్యాయనీ దేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి
(ఎర్రటి బియ్యపు మొనలుగల బియ్యం నేతితో, కుంకుమతో కలిపిన) అక్షతలు ఉంచవలెను.
పుష్పములు
శ్లో॥ మందారైః కరవీరైశ్చ పాటలైశ్చ సుశోభనైః పుష్పేస్తాం పూజయిష్యామి దేవీ కాత్యాయనీ |
శ్రీ కాత్యాయనీ దేవ్యై నమః పుష్పైపూజయామి
నమః అన్న తరువాత ఎర్రటి పుష్పములతో పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజింపవలయును.
అంగపూజా
1.ఉమాయై నమః - పాదౌపూజయామి, గౌర్యై నమః జంఘే పూజయామి
2.పార్వత్యై నమః - జానునీ పూజయామి
3.జగన్మాత్రే నమః - ఊరూ పూజయామి
4. జగత్ప్రతిష్ఠాయై నమః - కటిం పూజయామి -
5. మూలప్రకృత్యై నమః - నాభిం పూజయామి
6. అంబికాయై నమః - ఉదరం పూజయామి -
7.అన్నపూర్ణాయై నమః - స్తనౌ పూజయామి
8. శివసుందర్యై నమః - వక్షస్థలం పూజయామి
9. మహాబలాయై నమః - బాహూన్ పూజయామి
10. శ్రీపదాయై నమః - హస్తాన్ పూజయామి
11. కంబుకంఠ్యే నమః - కంఠం పూజయామి
12. బ్రహ్మవిద్యాయై నమః - జిహ్వాం పూజయామి
13. శాంకర్యై నమః ముఖం పూజయామి
14. శివాయై నమః - నేత్రే పూజయామి
15. రుద్రాణ్యై నమః - కర్ణా పూజయామి
16. సర్వమంగళాయై నమః - శిరః పూజయామి
కాత్యాయన్యై నమః సర్వాంగాని పూజయామి.
తరువాత కాత్యాయనీ అష్టోత్తరములతో పసుపు, కుంకుమ, పువ్వులు అక్షతలచే నమః అనునపుడు పూజ చేయవలయును.
శ్రీ కాత్యాయనీ అష్టోత్తర శతనామావళిః
ఓం గౌర్యై నమః
ఓం గణేశజనన్యై నమః
ఓం గిరిజాతనూభవాయై నమః
ఓం గుహాంబికాయై నమః
ఓం జగన్మాత్రే నమః
ఓం గంగాధరకుటుంబిన్యై నమః
ఓం వీరభద్రప్రసవే నమః
ఓం విశ్వవ్యాపిన్యై నమః
ఓం విశ్వరూపిణ్యై నమః
ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః
ఓం కష్టదారిద్య్రశమన్యై నమః
ఓం శివాయై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం శాంకర్యై నమః
ఓం బాలాయై నమః
ఓం భవానై నమః
ఓం భద్రదాయిన్యై నమః
ఓం మాంగళ్యదాయిన్యై నమః
ఓం సర్వమంగళాయై నమః
ఓం మంజుభాషిణ్యై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మంత్రారాధ్యాయై నమః
ఓం మహాబలాయై నమః
ఓం హేమాద్రిజాయై నమః
ఓం హైమవత్యై నమః
ఓం పార్వత్యై నమః
ఓం పాపనాశిన్యై నమః
ఓం నారాయణాంశజాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిరీశాయై నమః
ఓం నిర్మలాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం మృడాన్యై నమః
ఓం మునిసంసేవ్యాయై నమః
ఓం మానిన్యై నమః
ఓం మేనకాత్మజాయై నమః
ఓం కుమార్యై నమః
ఓం కన్యకాయై నమః
ఓం దుర్గాయై నమః
ఓం కలిదోషవిఘాతిన్యై నమః
ఓం కాత్యాయినై నమః
ఓం కృపాపూర్ణాయై నమః
ఓం కల్యాణ్యై నమః
ఓం కమలార్చితాయై నమః
ఓం సత్యై నమః
ఓం సర్వమయై నమః
ఓం సౌభాగ్యదాయై నమః
ఓం సర్వస్వత్యై నమః
ఓం అమలాయై నమః
ఓం అమర సంసేవ్యాయై నమః
ఓం అన్నపూర్ణయై నమః
ఓం అమృతేశ్వర్యై నమః
ఓం అఖిలాగమ సంస్తుతాయై నమః
ఓం సుఖసచ్ఛిత్సుధారాయై నమః
ఓం అంబాయై నమః
ఓం బాల్యారాధికభూతా నమః
ఓం భానుకోటిపుదాయై నమః
ఓం సముద్యతాయై నమః
ఓం హిరణ్యాయై నమః
ఓం వరాయై నమః
ఓం సూక్ష్మాయై నమః
ఓం శీతాంశుకృతశేఖరాయై నమః
ఓం హరిద్రాకుంకుమాయై నమః
ఓం మారాధ్యాయై నమః
ఓం సర్వకాలసుమంగళ్యై నమః
ఓం సర్వభోగప్రదాయై నమః
ఓం సామశిఖరాయై నమః
ఓం వేదాంతలక్షణాయై నమః
ఓం కర్మబ్రహ్మమయై నమః
ఓం కామకలనాయై నమః
ఓం వాంచితార్థదాయై నమః
ఓం చంద్రార్కాయు తాటంకాయైనమః
ఓం చిదంబరశరీరణ్యై నమః
ఓం శ్రీచక్రవాసిన్యై నమః
ఓం దేవ్యే నమః
ఓం కామేశ్వరపత్యై నమః
ఓం కమలాయై నమః
ఓం మురారిప్రియార్థాయై నమః
ఓం మార్కండేయగె నమః
ఓం వరప్రసాదాయై నమః
ఓం పుత్రపౌత్రవరప్రదాయై నమః
ఓం పుణ్యాయై నమః
ఓం పురుషార్థప్రదాయై నమః
ఓం సత్యధర్మరతాయై నమః
ఓం సర్వ సాక్షిణ్యై నమః
ఓం శశాంకరూపిణ్యై నమః
ఓం శ్యామలాయై నమః
ఓం బగళాయై నమః
ఓం పాండ్యై నమః
ఓం మాతృకాయై నమః
ఓం భగమాలిన్యై నమః
ఓం శూలిన్యై నమః
ఓం విరజాయై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం ప్రత్యంగిరాంబికాయై నమః
ఓం ఆర్యాయై నమః
ఓం దాక్షాయణ్యై నమః
ఓం దీక్షాయై నమః
ఓం సర్వపశూత్తమోత్తమాయై నమః :
ఓం శివాభిదానాయై నమః
ఓం శ్రీవిద్యాయై నమః
ఓం ప్రణవార్ధస్వరూపిణ్యై నమః
ఓం ప్రణవాద్యై నమః
ఓం నాదరూపాయై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం త్రిగుణాంబికాయై నమః
ఓం షోడశాక్షర దేవతాయై నమః
ఓం శ్రీమహాగౌర్యై నమః
ఓం శ్రీ కాత్యాయన్యై నమః
అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి..
ధూపము
శ్లో॥ దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం
ధూపం దాస్యామి తేదేవి గృహాణ త్వం సురేశ్వరీ ॥
శ్రీ కాత్యాయనీ దేవ్యై నమః ధూపం అఘ్రాపయామి
అగరువత్తి వెలిగించి చూపవలెను.
దీపము
శ్లో॥ కాత్యాయనీ మహాదేవీ సర్వాలంకార సంయుతే
దీపం దాస్యామి భూమాతః స్వీకురుష్వ సుశోభనే ॥
శ్రీ కాత్యాయనీ దేవ్యై నమః దీపం దర్శయామి
నేతి దీపం చూపవలెను.
శ్రీ కాత్యాయనీ దేవ్యై నమః ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి
పుష్పముతో కలశలోని నీళ్లు చల్లవలయును.
నైవేద్యము
శ్లో॥ ఆఫూపాన్ లవణ సంయుక్తాన్ ఇక్షు ఖండైశ్చ సంయుతాన్
భక్ష్యాన్ ఘృతాక్తాన్ హే దేవి స్వీకురుష్వ మహేశ్వరి |
శ్రీ కాత్యాయనీ దేవ్యై నమః ఇక్షుఖండ సంయుత లవణాపూపాపాది నివేదయామి
ఒక పళ్ళెములో ఉప్పువేసి వండిన అప్పాలు 7 చెఱుకు గడలోని ముక్కలు 7 ఉంచి అమ్మవారి ఎదుటపెట్టి ఆమెకు ప్రధమాత్మనే నమః ద్వితీయాత్మనే నమః తృతీయాత్మనే నమః చతుర్ధాత్మనే నమః పంచమాత్మనే నమః అనుచు అయిదుసార్లు అమ్మవారికి చూపుతూ ఆమె తిన్నట్లుగా భావించి కొంచెం నీళ్ళు ఒక పుష్పముతో క్రిందవదలవలెను. శ్రీ కాత్యాయనీ దేవతాయై నమః, హస్తా ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి అని 3 మార్లు నీళ్ళు వదిలిపెట్టవలయును.
తాంబూలము
శ్లో॥ ఎలా లవంగ కర్పూర పూగీఫల సుశోభితం
తాంబూలం చ ప్రదాస్యామి స్వీకురుష్వ శివప్రియే ॥
శ్రీ కాత్యాయనీ దేవ్యై నమః తాంబూలం సమర్పయామి
తాంబూలం ఉంచవలెను.
మంగళహారతి (నీరాజనం)
శ్లో॥ ఘృతవర్తి త్రయోపేతం నీరాజనం సమర్పయామి।
స్వీకురుష్వ మహాదేవి పాపం నాశయ సత్వరం ॥
శ్రీ కాత్యాయనీ దేవ్యై నమః నీరాజనం సమర్పయామి
ఆవునేతితో తడిపిన 3 వత్తులు హారతిగా అమ్మవారికి చూపవలెను.
పుష్పాంజలి (మంత్రపుష్పము)
శ్లో॥ శివే హరిప్రియే దేవి! కాత్యాయని వరప్రదే
పుష్పాంజలి మిదం తుభ్యం దాస్యామి సురపూజితే ॥
శ్రీ కాత్యాయనీ దేవ్యై నమః సువర్ణ పుష్పాంజలిం సమర్పయామి
అమ్మవారిపై పుష్పములను ఉంచవలెను.
ప్రదక్షిణ నమస్కారములు
శ్రీ గౌరీభవానీ రుద్రాణీ శర్వాణీ శంకరప్రియా
ప్రదక్షిణం కరిష్యామి పాపాన్నాశయ సత్వరం !!
పై శ్లోకము చదువుచూ 3 సార్లు ప్రదక్షిణము చేసి అమ్మవారి మోకాళ్ళవరకు వంగి నమస్కారము చేయవలెను. శ్రీ కాత్యాయనీ దేవ్యై నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అని అమ్మవారిపై పుష్పములు ఉంచవలెను.
ప్రార్థన
దేవదేవి మహాదేవి శంకరార్థ స్వరూపిణీ
కాత్యాయనీ మహాదేవి కైలాసాచల వాసినీ
తవపూజాం భక్తియుక్త చేతసా హం సదాముదా
కరిష్యామి తవప్రీత్యై మమాభీష్టం ద్రుతం కురు
గ్రహదోషాది దుర్గోషాన్ క్షిప్రం మాపయ శాంభవి
కల్యాణం కురుమే దేవీ సౌభాగ్యం దేహిమే శివే
శ్రీ కాత్యాయనీ దేవ్యై నమః ప్రార్ధన నమస్కారాన్ సమర్పయామి అని పుష్పముగాని, అక్షతలుగాని అమ్మవారి ముందు ఉంచి ఆమెను ప్రార్ధింపవలయును.
అనయాధ్యాన ఆవాహనాది ఏకవింశత్యుపచార పూజయా భర్గవీ సర్వాత్మికా శ్రీ కాత్యాయనీ దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదో భవంతు.
అని చెప్పి అక్షతలు చేతిలోనికి తీసుకొని ఉద్ధరిణితో నీరు పోసుకొని అది అమ్మవారి ముందు వదిలిపెట్టవలయును. ఆ తరువాత అక్షతలు చేతిలో పట్టుకొని కథను చదువుకొని కధాక్షతలు అమ్మవారిమీద వేసి పిదప శిరసుమీద వేయించుకొనవలయును.
శ్రీ కాత్యాయనీ వ్రతకథ
పూర్వకాలమున పరమ పవిత్రమగు నైమిశారణ్యమున శౌనకాది మహామునులందరూ బహు పురాణములు ఎరింగిన వ్యాస శిష్యుడగు సూత మహర్షిగాంచి భక్తితో ప్రణమిల్లి ఓ మహర్షీ! నీవెన్నియో పురాణములను వినిపించితివి మరియు సందర్భానుసారముగా వ్రతములను వ్రతమహాత్మ్య ములను తెలిపితివి. నీవు మా సంశయములను పొగొట్టు మహానీయుడవు, చతుర్దశ భువనాధీశుడైన ఈశ్వరుని మొదటి భార్యయగు సతీదేవి తన తండ్రియగు దక్షప్రజాపతి యజ్ఞగుండమున బడి దేహత్యాగ మొనరించెను గదా ! ఆ విధముగా జరుగుటకు కారణమేమి?
ఈశ్వరుడామెను రక్షింపలేక పోయెనా ? లేక సతీదేవియందు అనురాగము లేక మౌనముగా ఊరకుండెనా? ఈశ్వరునకు భార్యావియోగము ఎట్లు సంభవించెను? మా సందేహములను తొలగించు సమర్థులు తాము తప్ప మరియొకరు లేరు. తెలియజెప్పుడని ప్రార్ధించిరి. వెంటనే సూతమహర్షి ఓ మునులారా! మీ సందేహము తప్పక పొగొట్టగలను. సావధానముగా వినుడు అని ఇట్లు చెప్పసాగెను.
దక్ష ప్రజాపతి తన కుమార్తెయగు సతీదేవిని ఈశ్వరునకు భార్యగా నొసంగెను. సతీదేవి పరమేశ్వరునితో కలసి కైలాసమున సుఖముగా నుండి కృతయుగమంతయూ గడిపెను. త్రేతాయుగమున ఒకనాడు ఈశ్వరుడు సతిదేవితో ముచ్చటలాడుచుండగా ఆకస్మాత్తుగా ఈశ్వరుడంతర్ధానము నొందెను. సతీదేవి ఈశ్వరుడు మాట్లాడుచు మాట్లాడుచు మాయమైనందుకు పరిపరి విధముల ఆలోచించుచుండగా పకపక నవ్వుచూ ఈశ్వరుడు సాక్షాత్కరించెను.
సతీదేవి పరమేశ్వరుని గాంచి నాధా! మీరెచ్చటికి వెళ్ళిరి? ఎందుకు నవ్వుచున్నారు? నేనేమైనా తప్పుమాట్లాడితినా ? అని ప్రశ్నించెను. వెంటనే పరమేశ్వరుడు ఓ సతీ! నాకు విష్ణువు తండ్రివంటివాడు. నేనాతనికి తండ్రివంటివాడను. మా ఇరువురకు ఏవిధమగు అంతరమునులేదు. ప్రస్తుతం మహావిష్ణువు భూలోకమున శ్రీరామునిగా అవతరించి పితృవాక్య పరిపాలనకై తన భార్యయగు సీతతోను, సోదరుడగు లక్ష్మణుని తోడనూ వనవాసమునకై వెడలి పంచవటీ తీరమున పర్ణశాల నిర్మించుకొని నివసించుచుండెను. మనభక్తుడగు రావణుడు మాయోపాయముచే సీతనపహిరించి లంకకు కొనిపోయెను. పర్ణశాలలో సీతనుగానక శ్రీరాముడామెను వెదకుచూ ఆ అడవియంతయూ గాలించెను.
సీతనెందును గానక శ్రీరాముడు సీతావియోగముచే కుమిలి మతిదప్పి ఆ అడవిలో కనబడ్డ పక్షిని, మృగమును, చెట్టునుపుట్టను రెమ్మను పుష్పమును సీతను చూచినారా? అని ప్రశ్నించుచూ పోవుచుండెను. ఒకచోట పాడుబడ్డ శివలింగమును గాంచి శ్రీరాముడు ఎలుగెత్తి పరమశివా! నా సీతను జూచితివా? అని ప్రశ్నించెను. నా తండ్రియగు విష్ణువుకేక విన్నంతనే నేనచ్చటకు బోయి శ్రీరాముని ఎదుట నిలబడితిని కాని మానవ రూపములో నున్న ఆ మహానీయుడు. నన్ను చూడనట్లుగానే ముందుకు బోయెను. మానవనేత్రాలతో దేవతలను చూడలేరుగదా! అందుచే మాయామానుషరూపధారియగు శ్రీరాముడునన్ను చూడనట్లే నటించి ముందుకు బోయినందులకు నేను నవ్వుచుంటిని. ఇంతకు తప్ప మరియొక కారణము లేదుసుమా! అని ఈశ్వరుడు పల్కెను. ఆ మాటలు విన్న సతి ఓ నాధా! మీ మాటలు నమ్మశక్యంగా లేవు. మహావిష్ణువు రామునిగా అవతరించి భార్యా వియోగముచే మతిదప్పుటయేమి? రాజుల కనేకమంది భార్యలుందురుగదా! సీత కోసమని రాముడు పిచ్చివానిగా సంచరించునా? ఇది నమ్మశక్యముగా లేదు. మీరు కల్లబొల్లి మాటలాడుచుండిరి.
మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించినంత మాత్రాన మిమ్ము చూడలేకపోవుటయా? అని పలెను. వెంటనే శివుడు సతీ నీవు నా మాటలు నమ్మనియెడల నీవు స్వయముగా నచటకుబోయి ఆ రాముని సీతావియోగబాధను కన్నులారా గనుము. నీకంతయు బోధపడగలదని పల్కెను. వెంటనే సతీదేవి నాధా! నేనా రాముని పరీక్షించి రాగలనని పలికి అదృశ్యమై పంచవటీ తీరమున శ్రీరాముడున్న ప్రాంతమునకు జని యచట ఆ శ్రీరామచంద్రుని సీతావియోగబాధను కన్నులారా గాంచి చెవులారా ఆతని యాక్రందనమును విని సందేహాస్పదయై ఆ రాముని పరీక్షింపదలచి 'నేను సీతగా మారిపోవలయునని తలంచెను. వెంటనే సతీదేవి సీతారూపము పొందెను. అదే సమయమునకు కైలాసముందున్న శివుడు సతీదేవి శ్రీరామునేవిధంగా పరీక్షించునో తెలుసుకొనవలయునని తలంచి రహస్యముగా నా ప్రాంతమునకు జేరి సీతామహాదేవిని గాంచి కనులు మూసుకొని చేతులొగ్గి నమస్కారము గావించి. మరల చూడగనే నామె శ్రీరామునకు అభిముఖముగా పోవుచుండెను. అపుడు శివుడు నా తల్లి నా తండ్రి చెంతకు పోవుచుండెనని సంతోషింపసాగెను.
ఇంతలో శ్రీరాముడామెను గాంచి వెంటనే ఆమెకు నమస్కరించి ఓ జగన్మాత! నన్ను మోసగింపదలిచితివా! నాకు నా భార్య తప్ప మరియొక్క స్త్రీ స్వస్వరూపములో కన్పడును అని పల్కిన వెంటనే సతీదేవి స్వస్వరూపమునొంది రామా! నిన్ను పరీక్షించుటకై నేను సీతారూపమునొందితిని. నీ సీత ఎచ్చటనున్నను మహాసాధ్వియై యుండగలదు. అని పల్కి అదృశ్యమాయ్యెను. శివుడుకూడా జరిగినదంతయు తెలుసుకొని సతీదేవికంటే ముందుగానే కైలాసముచేరి ఏమియు తెలియనివానివలె మౌనముగా నుండెను. ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి నాధా! నేనుపోయి శ్రీరాముని పరీక్షించితిని. నిజముగా నాతడు మహావిష్ణువై యుండికూడా మానవునివలె పామరునివలె నటించుచుండెను. అని పల్కెను. వెంటనే శివుడు 'సతీ! నీవాతని ఎటుల పరీక్షించితివి! అని ప్రశ్నించెను. వెంటనే ఆమె నాధా!
నీవు పరీక్షించిన విధంగానే పరీక్షించితిని అని అబద్ధమాడెను. వెంటనే శివుడు సతీ! నీవు పరీక్షించిన విధము నా కన్నులకు కట్టినట్లుగా కన్పడుచున్నది. ఇప్పటికీ నీవు దాల్చిన నా తల్లిరూపము నాకుకనబడుచున్నది. నీవు నా తల్లివి నమస్కారమని వెడలిపోయెను. అంతట ఆ సతీదేవి జరిగిన తప్పును తెలిసికొని నేను సందేహించుట ఓ తప్పు. దానిని కప్పిపుచ్చుటకు అబద్ధమాడుట మరియొక తప్పు పని చేసి. కళంకము పొందితిని. ఆ కళంకిత దేహముతో నీశ్వరుని యర్ధాంగిగా నుండు అర్హతను గోల్పోయితిని అందుచే దయామయుడగు పరమేశ్వరుడు నన్ను తల్లిగా జూతునని శిక్షించెను. అని పరిపరి విధముల విచారించి కళంకితమైన తన దేహమును త్యజించుటకు నిశ్చయించెను తన దేహమును విడచిపెట్టుటకు పలువిధముల యోచించి చివరకు తానే యింట పుట్టెనో యచ్చటనే దేహము వదలుట యుక్తమని ఆ సతి నిశ్చయించెను. ఆమె మహామాయగాన తన తండ్రికి ఈశ్వరుడన్న ద్వేషమును కల్గించి ఈశ్వరుని బిలువకుండ యజ్ఞమొనరించు కోరికను కలిగించెను.
మహామాయ నిర్ణయానుసారముగ దక్షుడు శివుని అవమానింపదలచి శివునకు హవిర్భాగమిడకుండ యజ్ఞమును తలపెట్టి దేవతలందరూ ఆ యాగమునకు వెళ్ళుచుండగా సతీదేవికూడ ఆ యాగమునకు పరమేశ్వరునితో కలసి వెళ్ళుదమని ఈశ్వరుని కోరెను. ఆ యాగమునకు వెళ్ళుట యుక్తముకాదని పరమశివుడు చెప్పిననూ ఆమె వినిపించుకొనక ఆ యాగమునకు వెళ్ళితీరవలయునని మంకుపట్టు పట్టెను. దానితో శివుడు చేయునదిలేక నందీశ్వరుడు భృంగీశ్వరులను సాయమిచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపెను.
దక్షుని యాగముండములోనికి సతీదేవి ప్రవేశించి అచట తనవారెవ్వరూ పల్కరింపక పోవుటచే అవమానము నొంది రగులుచున్న అగ్నిగుండం చెంతకుచేరి చేతులు జోడించి 'ఓ అగ్నిదేవా! నేనొక అబద్ధమాడుటచే నీశ్వరునికి దూరమైతిని. ఇచ్చట అవమానము నొంది ఈశ్వరుని చూడలేను కావున కళంకమొందిన నా దేహమును బూడిదచేసి చల్లని హృదయము కల్గినవాడును, నిర్మలమగు మనసున్న దయాహృదయుని కుమార్తెనై జన్మించి తిరిగి పరమేశ్వరునే భర్తగా పొందునట్లు చేయుము అని ప్రార్థించి భగభగమండుచున్న ఆ అగ్నిగుండములోనికి దుమికెను. దేవతలందరూ హాహాకారములు చేయుచుండగా నందీశ భృంగీశులొక్క క్షణములోశివుని చెంతకుచేరి జరిగినదంతయు దెల్పిరి. సతీ మరణవార్త విన్నంతనే శివుడు మహారౌద్రాకారమును దాల్చి వీరభద్రుని సృష్టించెను. ఆ వీరభద్రుడు దక్షవాటికకు చేరి తనవంటి కోటానుకోట్ల మహావీరులను సృష్టించి దక్షవాటికను శ్మశానవాటికగా మార్చెను.
ఈశ్వరుడు సతీవియోగముచే కల్గిన కోపమును భరింపలేక హిమాలయ శిఖరములకు జేరి నచట విశ్రాంతి నొందుచుండెను. ఆ సమయమున పరమేశ్వరుని లలాటమునుండి చెమటబిందు వొకటి భూమిపై పడెను. శివలీలచే వెంటనే ఆ చెమటబిందువు చూచుచుండ గానే నాల్గుభుజములు కలిగి ఎర్రనిరంగుతో దివ్యతేజముతో వెల్లుశిశువుగా మారెను. ఆ శిశువు భూనభోంతరాళములు ప్రతిధ్వనించునట్లుగా రోదనము చేయసాగెను. శివుని భయముచే భూదేవి స్త్రీ రూపమునొంది ఆ శిశువును ఒడిలోనికి చేర్చుకొని స్తన్యమొసంగెను.
అపుడు రుద్రుడామెతో 'ఓ భూదేవి! నీవు చాలా పుణ్యాత్మురాలవు ఈ నాశిశువును పెంచుకొనుము. అతడు నీయందు పుట్టుటచే కుజుడు. భౌముడు అను పేర్లతో సార్థకనామము పొందును. ఎర్రని రంగుతో నుండుటచేత అంగారకుడనికూడా పిల్చెదరు. నవగ్రహములతో నీతడొక గ్రహము కాగలడు. ఇతడింత కాలము నన్నాశ్రయించియుండుటచే నాకు భార్యవియోగము కల్గినది. ఈ కుజుని పుట్టుక నెవరువిందురో వారికి కుజదోష పరిహారమగును అని శివుడు వెడలి వేరొకచోట సమాధి నిష్టాగరిష్ఠుడయ్యెను.
హిమవంతుడు పర్వతరాజు మంచుకొండగాన నిర్మలమైన చల్లనైన ధీరహృదయుడు, అతని పట్టపురాణి మేనాదేవి. ఆమె నాదేవి గర్భవాసమున సతీదేవి ప్రాణములు ప్రవేశించి నవమాసములు నిండగానే ఒక శుభదినమున యుద్భవించెను. హిమవంతుడు పూర్వజన్మలో 'కతి యనుముని అందుచే అతని పుత్రికగా జన్మించుటచే "కాత్యాయనీ”యనియు పర్వతరాజు కుమార్తెయగుటచే “పార్వతి" అనియు మహర్షులామెకు నామకరణం గావించిరి. ఆ కాత్యాయని శుక్లపక్షంలోని చంద్రునివలే దినదిన ప్రవర్ధమానయై బాల్యములోనే సర్వవిద్యా కళాకోవిదమై వెలుగొందెను. మరియు అఖండమగు ఈశ్వరారాధన ఆమెలో పెల్లుబికసాగెను. క్రమముగా నారదుని ప్రోత్సాహముతో పరమేశ్వరుని సన్నిధానమున శుశ్రూష చేయు అవకాశము లభించెను.
పార్వతికి వివాహ వయస్సురాగా దేవేంద్రుడా శివుని సమాధిని భగ్నమొనరిం చుటకై మన్మధుని పంపెను. మన్మధుడు దేవకార్యమును కాదనలేక శివునిపై మన్మధ బాణములను ప్రయోగించెను. ఆ బాణ ప్రభావముచే శివుడు సమాధిని వీడి మహాసౌందర్య రాశియగు పార్వతిగాంచి వెనువెంటనే తన సమాధిని భగ్నపరచిన మన్మధుని జూచి మూడవ నేత్రముతో నాతని భస్మము గావించి వెడలిపోయెను.
పార్వతి తన కన్నులయెదట జరిగిన సంఘటన గాంచి భీరువుగాక ధైర్యము నవలంభించి తన తపముచే నీశ్వరుని వశం గావించుకొనదలచి కఠోరమగు తపము సలిపెను. ఆ తపస్సుచే నీశ్వరుడు సంతుష్టుడై నామెను పరీక్షించి భార్యగా స్వీకరించుటకు సమ్మతించెను. సప్తమహర్షులను హిమవంతుని చెంతకు కన్యావరణకై శివుడు పంపెను. ఆ మహర్షులు హిమవంతుని చెంతకుబోయి పరమశివునికి పార్వతి నొసంగుటకు సంసిద్ధము గావించిరి. ఒక శుభలగ్నమున అత్యంత వైభవోపేతముగా శివపార్వతీ కల్యాణము బ్రహ్మస్వయముగా జరిపించెను.
శివుడు పార్వతిని వివాహమాడి ఎనలేని యానందముతో నిండియుండగా మన్మధుని భార్యయగు రతీదేవి పార్వతీనాధుని పాదములపైబడి తన భర్తను బ్రతికింపమని ప్రార్ధింపగా నాతడు సంతోషముతో మన్మధుని బ్రతికించి రతీదేవికి మాత్రమే దృగ్గోచరుడగునట్లుచేసి ఆమెకు సంతోషము కల్గించెను. దేవతలంతా పరమేశ్వరుని దయాదృష్టికి మహదానందము నొంది ఆ దపంతులపై పూలవర్షంను కురిపించిరి. ఆ సమయమున పార్వతి పరమేశ్వరునితో నాధా!
నిన్నాశ్రయించిన దోషముచే గతజన్మలో నేను సందేహాస్పదనై ఆసత్యమాడి నీకుదూరమై శరీరత్యాగ మొనరించితిని. నావియోగముచే నీవు రౌద్రావతారము దాల్చి ఆ తాపము దీర్చుకొనుటకై నా తండ్రి పర్వతసానువులకు చేరినంతనే నీ లలాటమునుండి ఆ దోషము చెమట బిందువుగా మారి భూమిపై బడెను. వెంటనే ఆ బిందువు శిశువుగామారి రోదన మొనరించుచుండగా భూదేవి ఆ శిశువును ఒడిలోనికి దీసుకొని స్తన్యమొసగి పుత్రునిగా స్వీకరించెను. ఆ సమయమున నీవు ఆ శిశువునకు భౌముడని సార్థకనామముబెట్టి నవగ్రహములలో నాతనికొక స్థానమొసంగితిని. ఆ కుజుడు నిన్నువీడి నాకెంతయో మహదానందం కల్గించెను.
ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకుగూడా బాధలేకుండా చేయగలందులకు ప్రార్ధించుచున్నాను. అని పల్కెను. వెంటనే ఈశ్వరుడామెతో 'ఓ పార్వతీ! కుజుని జన్మకథను విన్నవారికి కుజదోష పరిహారమగునటులు ఆనాడే వరమిచ్చి తిని-నీకోరికననుసరించి ఇపుడు లోకములోని జనులకు కుజదోషపరిహారమై శీఘ్రముగా వివాహమగుటకున్నూ వివాహ ప్రతిబంధక దోషములు నివారణయగుటకున్నూ ఒక వ్రతమును నీనామాంకితముగా స్థాపన చేయుచుంటిని.
ఆ వ్రతమునకు నీవే ప్రధానాంశము. భౌమవారముచే కుజుడు ప్రదోషకాల మగుటచే నేనును అందు భాగస్వాములమైతిమి 'కాత్యాయనీ ప్రత మనుపేరుతో భూలోకమున సుస్థిరము కాగలదు అని పల్కెను. ఆ మాటలువిని పార్వతి మహదానందము నొందెను. పిదప పరమేశ్వరుడా పార్వతితో ముక్కోటి దేవతలు వెంటరాగా కైలాసమునకు జేరెను, అని సూతమహర్షి శౌనకాదులకు విన్పించెను.
వ్రతవిధానము
మహర్షులు ఓ మహనీయా ! మా సందేహం తీర్చితివి కాని కాత్యాయనీ వ్రతమునుగూర్చి సవిస్తరంగా తెలియజేయగలందులకు ప్రార్ధించుచుంటిమని పల్కిరి. వెంటనే సూతమహర్షి వారితో ఓ మునులారా! కాత్యాయనీ వ్రతమును గూర్చి సవిస్తరంగా చెప్పుదును వివాహ ప్రతిబంధక దోషములున్నూ అంగారక దోషములున్నూ నివారణయగుటకు శ్రీఘ్రంగా అనుకూలమగు భర్తను పొందుటకున్నూ కాత్యాయనీ వ్రతంతో సాటియైనది మరియొకటిలేదు.
ఈ వ్రతమారించువారికి భక్తి విశ్వాసములు ముఖ్యం. తారాబల, చంద్రబలయుక్తమైన మంగళవారమున ఈ వ్రతము ప్రారంభించవలయును. ఆరోజు ఉదయం కాలకృత్యములు తీర్చుకొని భక్తిశ్రద్ధలతో గౌరీదేవికి ప్రణమిల్లి ఉపవాసముండి సాయంకాల ప్రదోషకాలమున నీ వ్రతమును ప్రారంభించవలెను.
ముందుగా గణపతి పూజచేసి పిదప ఒక కలశను ఏర్పాటు చేసి అందు సగంవరకు పవిత్రోదకం పోసి మామిడిపత్రము నుంచి చెట్టునుండి క్రిందపడిన కొబ్బరికాయను పసుపు కుంకుమలతో నలంకరించి ఆ కలశముపై నుంచి ఎర్రని రవికలగుడ్డను ఆ కొబ్బరికాయపై నుంచి అందు పరమేశ్వరుని వామాంకముననున్న కాత్యాయనీదేవి నావాహనగావించి భక్తిశ్రద్ధలతో (21) ఇరువదియొక్క ఉపచారములతో నాదేవిని పూజింపవలయును.
బంగారంతోగాని పసుపుకొమ్ములుతోగాని వారి |శక్తానుసారంగా మంగళసూత్రముల నా కలశకు అలంకరింపవలయును. కొద్దిగా ఉప్పువేసి వండిన అప్పాలను ఏడింటిని మరియు చెఱుకుగడతో కోసిన ఏడు చెఱుకుముక్కలను కలిపి నైవేద్యం చేయవలయును. భక్తిశ్రద్ధలతో వ్రతసమాప్తి చేసి కథనువిని, ఆ కధాక్షతలను అమ్మవారిమీద వుంచి పిదప ఆ అక్షతలు శిరస్సుపై పెద్దలచే వేయించుకొని రాత్రి భోజనము జరుపవ లయును.
ఈ విధముగా 7 వారములు వ్రతము భక్తితో జరుపవలెను. మధ్యలో ఏవారమైన అడ్డంకివచ్చినచో ఆపై వారము జరుపుకొనవలెను. 8వ మంగళవారమునాడు ఉద్యాపన జరుపవలయును ఆ రోజు ఏడుగురు ముత్తైదువులను పిలిచి తలంటిపోసి వారినే గౌరీదేవిగా భావించి పూజించి 7 అప్పాలను, 7 చెఱుకుముక్కలను శక్త్యానుసారముగా చీర, రవికెలగుడ్డ వాయనమిచ్చి, వారినుండి అశీస్సులనుపొంది వారికి భోజనము పెట్టవలయును.
ఈ విధముగా జరిపిన కన్యలకు కుజదోష పరిహారమునూ ఇతర వివాహ ప్రతిబంధక దోషనివారణ యు జరిగి, శ్రీవ్రంగా వివాహమగును. మరియు ఆ కన్య సుఖసౌభాగ్యాలతో వర్ధిల్లును. పూర్వం దమయంతి ఈ వ్రతము ఆచరించి నలుని చేపట్టెను. రుక్మిణి ఈ వ్రతమాచరించి ఉద్యాపననాడే శ్రీకృష్ణుని చెంతకుచేరెను. ఈ కుజదోషము మరియూ వ్రతకథను విన్నవారికి, చదివినవారికి, అభీష్టలాభం సిద్దించును. తదితర సమస్త దోష పరిహారమగును. అని సూతమహర్షి శౌనకాదులకు తెల్పెను.
Tags: కాత్యాయనీ వ్రతం, Katyayani, Sri Katyayani Vratam, Katyayani Vratam telugu, katyayani vratam pdf
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment