Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

తిరుమల శ్రీవారి సేవలు వాటి విశిష్టతల గురించి క్లుప్తంగా...Srivari Sevalu- Tirumala Tirupati Devasthanams

తిరుమల వేంకటేశ్వరుని పూజావిశేషాలు (శ్రీవారి సేవలు):

విశ్వరూప దర్శనం: నవనీత హారతి సమర్పించి, మంగళాశాసన పఠనం పూర్తవగానే తలుపులు తెరిచి మరోసారి స్వామివారికి కర్పూరహారతి ఇచ్చి భక్తులను లోనికి అనుమతి నిస్తారు. ఆ సమయంలో భక్తులకు లభించే దర్శనాన్ని విశ్వరూప దర్శనం అంటారు.

శుద్ధి: సుప్రభాత సేవ అనంతరం తెల్లవారుజామున మూడున్నర నుంచి మూడుగంటల నలభైఐదు నిమిషాలదాకా ఆలయ శుద్ధి జరుగుతుంది. శుద్ధిలో భాగంగా గత రాత్రి జరిగిన అలంకరణలు, పూలమాలలు అన్నిటినీ తొలగించి, వాటిని సంపంగి ప్రదక్షిణంలో ఉండే పూలబావిలో వేస్తారు.

అర్చన: శ్రీవారికి ప్రతిరోజూ తెల్లవారుజామున జరిగే ఆరాధన ఇది. దీనికోసం జియ్యంగారు యమునత్తురై (పూలగది) నుంచి పుష్పమాలలు, తులసిమాలలతో ఉన్న వెదురుగంపను తన తలపై పెట్టుకుని శ్రీవారి సన్నిధికి తెస్తారు. అర్చనకు ముందు పురుష సూక్తం పఠిస్తూ భోగ శ్రీనివాసమూర్తికి ఆవుపాలు, చందనం, పసుపునీళ్లు, గంధపునీటితో అర్చకులు అభిషేకం చేస్తారు. చివరగా పుష్పాంజలి. అనంతరం భోగ మూర్తి విగ్రహాన్ని తిరిగి జీవస్థానానికి చేరుస్తారు. ప్రోక్షణ చేసి మూలవిగ్రహానికీ భోగమూర్తికీ స్వర్ణసూత్రాన్ని కలుపుతారు. ఈ సూత్రం ద్వారానే ధృవబేరం నుంచి భోగశ్రీనివాసుడి విగ్రహానికి శక్తి ప్రసరిస్తుందని భక్తుల నమ్మిక. ఆ తరువాత మూలవిగ్రహానికి పుష్పన్యాసం చేసి, అలంకారాసనం సమర్పిస్తారు. అనంతరం నామధారణ. కర్పూరంతో శ్రీవారి నుదుటి మీద ఊర్థ్వపుండ్ర చిహ్నాన్ని దిద్దుతారు. యజ్ఞోపవీతాన్ని అలంకరిస్తారు. తరువాత శ్రీవారి సువర్ణపాదాలను (తిరువడి) స్నానపీఠంలో ఉంచి అభిషేకిస్తారు.

తోమాలసేవ: తమిళంలో 'తోడుత్తమాలై' అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థం. బహుశా ఈమాటే కాలక్రమేణా మార్పులకు లోనై 'తోమాల'... తోమాలసేవ అయి ఉండవచ్చు. దీన్నే భగవతీ ఆరాధన అని కూడా అంటారు. ఈ సేవలో భాగంగా స్వామివారిని పూలమాలలతో అలంకరిస్తారు. వారంలో ఆరు రోజులు శుద్ధి అనంతరం ఈ సేవ జరిపిస్తారు. శుక్రవారం నాడు మాత్రం అభిషేకం జరిపించిన తరువాత తోమాలసేవ చేస్తారు.

కొలువు: తోమాలసేవ తర్వాత పదిహేను నిమిషాలపాటు తిరుమామణి మంటపంలో కొలువు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో దర్బార్ జరుగుతుంది. బలిబేరానికి రాజోచిత మర్యాదలు జరిపి ఆనాటి గ్రహసంచార క్రమాన్ని, ఆరోజు జరిపించబోయే ఉత్సవ విశేషాల గురించి విన్నవిస్తారు. ముందురోజు హుండీ ఆదాయం వివరాలను ఏయే నోట్లు ఎన్ని వచ్చిందీ, నాణాలు సహా (డినామినేషన్ ప్రకారం) మొత్తం విలువ తెలియజేస్తారు. అనంతరం నువ్వులు, బెల్లం కలిపి దంచిన పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు.

సహస్రనామార్చన: ఉదయం 4.45 నుంచి 5.30 వరకు సహస్రనామార్చన జరుగుతుంది. బ్రహ్మాండ పురాణం లోని స్వామివారి వేయినామాలనూ స్తుతిస్తూ చేసే అర్చన ఇది. ఈ అర్చన పూర్తయ్యాక శ్రీవారి పాదాల మీద ఉన్న పువ్వులు, తులసి దళాలతో శ్రీవారి దేవేరులకు పూజ చేస్తారు. ఈ సమయంలో మిరాశీదారు వరాహ పురాణం లోని లక్ష్మీసహస్రనామాలను పఠిస్తారు. తరువాత నక్షత్ర హారతి, కర్పూర హారతి ఇస్తారు.

మొదటిగంట, నైవేద్యం: మేలుకొలుపులు, అభిషేకాలు, కొలువుకూటం అన్నీ అయిన తరువాత స్వామివారికది నైవేద్యసమయం. నైవేద్యసమర్పణకు ముందుగా శయన మంటపాన్ని శుభ్రం చేసి, బంగారు వాకిలి తలుపులు మూసేస్తారు. తిరుమామణి మంటపంలోని గంటలు మోగిస్తారు. అర్చకులు మాత్రం లోపల ఉండి స్వామివారికి పులిహోర, పొంగలి, దద్ధోజనం, చక్కెర పొంగలి (అన్నప్రసాదాలు), లడ్లు, వడలు, అప్పాలు, దోసెలు, పోళీలు (పిండి వంటలు) కులశేఖరపడి (పడికావలి)కి ఇవతల ఉంచి సమర్పిస్తారు.

అష్టోత్తర శతనామార్చన: ఈ అర్చనతో మధ్యాహ్నపూజలు ప్రారంభమవుతాయి. వరాహపురాణంలో ఉన్న శ్రీవారి నూట ఎనిమిది నామాలను పఠిస్తారు. అష్టోత్తర శతనామావళి పూర్తికాగానే శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన జరుపుతారు.

రెండో గంట, నైవేద్యం: అష్టోత్తర శతనామార్చన అనంతరం ఆలయంలో రెండో గంట మోగుతుంది. పోటు నుంచి తెచ్చిన అన్నప్రసాదాలు, పిండివంటలు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. నివేదన తరువాత తాంబూలం, కర్పూరహారతి ఇస్తారు.

రాత్రి కైంకర్యాలు: ఉదయం జరిగే తోమాలసేవ వంటిదే రాత్రిపూట కూడా జరుగుతుంది. అనంతరం హారతి, స్వామివారికి అష్టోత్తర శతనామార్చన, శ్రీదేవి, భూదేవి మూర్తులకు లక్ష్మీనామార్చన, నైవేద్య సమర్పణ అన్నీ జరుగుతాయి. ఈ సమయంలో మూడో గంట మోగుతుంది. దీని తర్వాత మళ్లీ సర్వదర్శనం.

ఏకాంతసేవ: రాత్రి ఒకటిన్నర సమయంలో జరిగే పవళింపు సేవనే ఏకాంతసేవ అంటారు. ముఖమంటపంలో రెండు వెండి గొలుసులతో కట్టిన ఊయలలో భోగశ్రీనివాసమూర్తిని శయనింపజేసి పాలు, పళ్లు, బాదంపప్పులు నైవేద్యంగా పెడతారు. రాత్రిపూట స్వామివారిని పూజించేందుకు వచ్చే బ్రహ్మదేవుని కోసం తగినంత నీటిని వెండిగిన్నెలలో ఉంచుతారు. ఏడుకొండల వాడిని నిదురపుచ్చేందుకు అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తారు. దీన్ని తాళ్లపాక వారి లాలి అంటారు. (ఏకాంతసేవ ఏడాదిలో 11 నెలలపాటు భోగశ్రీనివాసుడికి జరిగితే ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణుడికి జరుగుతుంది). దీంతో ఆరోజుకి నిత్యపూజలు అన్నీ జరిగినట్లే.

గుడిమూసే ప్రక్రియ: రాత్రి రెండుగంటలకు గుడిమూసే ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా మూడో ద్వారాన్ని, ఆ తర్వాత బంగారువాకిలిని మూసేసి లోపలి గడియలు బిగిస్తారు. అధికారులు బయటివైపు తాళాలు వేసి వాటిపై సీళ్లు వేస్తారు.

ప్రత్యేక సేవలు, రోజువారీ అర్చనలు, ధూపదీపనైవేద్యాలు కాకుండా సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో తిరుమల వాసుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి.

అవి సోమవారం విశేషపూజ, మంగళవారం అష్టదళ పాదపద్మారాధన, గురువారం సడలింపు, పూలంగిసేవ, తిరుప్పావడ, శుక్రవారం అభిషేకం. 

స్వామికి రోజూ కల్యాణోత్సవం జరిపిస్తారు. డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు ఇవన్నీ ఉత్సవమూర్తులకు జరిగేవి.

సడలింపు: గురువారం ప్రాతఃకాల పూజలు చేశాక తలుపులు వేసి స్వామివారి ఆభరణాలను తీసేస్తారు. కర్పూర నామాన్ని తగ్గిస్తారు. దీంతో శ్రీనివాసుడి కమలాల కన్నులు భక్తులకు కనిపిస్తాయి. అనంతరం శ్రీవారికి 24మూరల పట్టు అంచు ధోవతి, 12 మూరల ఉత్తరీయాన్నీ కడతారు. సువర్ణపాదాలు, హస్తాలు, శంఖచక్రాలు, కర్ణాభరణాలు, స్వర్ణసాలగ్రామహారాలు సమర్పించి తలుపులు తెరుస్తారు. దీన్నే సడలింపు అంటారు.

పూలంగిసేవ: ఆపాదమస్తకం స్వామివారిని పుష్పమాలాలంకృతుల్ని చేయడమే పూలంగి సేవ. తనువెల్లా పూలమాలలతో అలంకరించిన శ్రీవారి దివ్యమనోహర విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది.

Tags: తిరుమల, Srivari Seva, Srivari sevalu, TTD, Tirumala, Tirupati

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు