Drop Down Menus

క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానం - తులసిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, ఆయుష్షు ప్రాప్తి | Significance of Ksheerabdi Dwadasi

కార్తీక శుద్ద ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటాం. ఈ ద్వాదశి విశిష్టతను తెలిపే కథ భాగవతంలోనూ కార్తీక పురాణంలోనూ ప్రస్తావించబడింది. దాన్ని విన్నా, లేక చదివినా సమస్త పాపాలు తొలిగిపోతాయి.

క్షీరాబ్ది ద్వాదశి.. కార్తీకమాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినం. కార్తీక పౌర్ణమికి ముందు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటాం. దేవదానవులు క్షీరసాగరాని మదిచిన రోజు కాబట్టి.. ఈ రోజుని ‘క్షీరాబ్ది ద్వాదశి’ అని పిలుస్తారు. ఈ రోజంటే శ్రీమహావిష్ణువుకి ప్రీతి. అందుకే.. లక్ష్మీ సమేతంగా ఆయన ఈ రోజున బృందావనంలోకి అడుగుపెడతాడు. బృందావనం అంటే తులసి. తులసి అంటే.. లక్ష్మి అని కూడా అంటారు. కాబట్టి ఆ రోజున లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టులో విష్ణు స్వరూమైన ఉసిరి మొక్కని ఉంచి పూజించాలి. తులసి కోటకు చేరువలో శ్రీ మహావిష్ణువు ప్రతిమను కానీ.. శ్రీకృష్ణ ప్రతిమను కానీ ఉంచి  పూజిస్తే.. తగిన ఫలితం వస్తుంది. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించిన వారికి ఆయురారోగ్య అష్టైశ్వరాలు ప్రాప్తిస్తాయని వేదాలు ఘోషిస్తున్నాయ్.

వ్రత పూజా విధానము : ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధి చేసి ,అలికి , బియ్యపు పిండితో గాని ,రంగుల చూర్ణములతో గాని ముగ్గులు పెట్టి ,దైవ స్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి .పీట మరీ ఎత్తుగా గాని ,మరీ పల్లముగా గాని ఉండకూడదు. పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి ,కుంకుమతో బొట్టు పెట్టి ,వరిపిండి (బియ్యపు పిండి ) తో ముగ్గు వేయాలి .సాదారణంగా అష్ట దళ పద్మాన్నే వేస్తారు. ఈ రోజున (క్షీరాబ్ది ద్వాదశి ) పద్మమును, శంఖమును, చక్ర ,పాదములు కూడా అలంకరించవలెను . పూజ చేసే వారు తూర్పు ముఖంగా కూర్చోవాలి .ఏ దైవాన్ని పూజించ బోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమను గాని ,చిత్ర పటమును గాని ఆ పీటపై ఉంచాలి .ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి (పసుపును షుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి ) దానికి కుంకుమ బొట్టు పెట్టి పిదప ఒక పళ్ళెంలో గాని ,కొత్త తుండు గుడ్డ మీద గాని బియ్యం పోసి దానిపై ఒక తమల పాకు నుంచి ,అందు పసుపు గణపతినుంచి అగరువత్తులు వెలిగించాలి .ఇప్పుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి .దీపారాధన నైరుతి దిశలో చేయవలెను.

పూజకు కావలసిన వస్తువులు – దీపారాధన విధానము : దీపారాధన చేయుటకు కుంది (ప్రమిద ) వెండిది గాని ,ఇత్తడిది గాని ,మట్టిది గాని వాడవచ్చును. కుందిలో 3 అడ్డ వత్తులు 1 కుంభ వత్తి (మధ్యలో )వేసి నూనెతో తడపవలెను . ఇంకొక అడ్డవత్తి నూనెతో తడిపి ఏక హారతిలో (కర్పూర హారతికి వాడే వస్తువు ) వేసి ముందుగా ఏకహారతి లో వేసిన వత్తిని అగ్గిపుల్లతో వెలిగించి ,వెలిగించిన వత్తితో కుందిలోని 1 అడ్డవత్తి 1 కుంభ వత్తి వెలిగించవలెను. తరువాత చేయి కడుక్కుని నూనె కుంది నిండా వేసి పిదప ఆ కుందికి మూడు చోట్ల కుంకుమ అలంకారము చేయవలెను. తర్వాత అక్షతలు వేసి దీపారాదనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను. కుందిలో మిగిలిన రెండు అడ్డ వత్తులు పూజా సమయములో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు వాడవలెను .దీపారాధనకు నువ్వుల నూనె గాని ,కొబ్బరి నూనె గాని ,ఆవు నెయ్యి గాని వాడవచ్చును. ఈ విధంగా దీపం వెలిగించి గంటను వాయిస్తూ నమస్కరించి ఈ క్రింది శ్లోకమును చదువుకొనవలెను.

యన్మూలే సర్వ తీర్థాని యన్మధ్యే సర్వ దేవతాయై

యదగ్రే సర్వ వేదాశ్చ తులసి త్వాం నమామ్యహమ్ 

నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే 

నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయిని

ముందు రోజున యోగనిద్ర నుంచి మేలుకొన్న శ్రీమహా విష్ణువు ఈరోజున లక్ష్మీదేవితో కలిసి భూలోకానికి వస్తాడట. అందుకే ఈరోజున చాలామంది తులసీదేవికి, ఉసిరిక చెట్టుకు కలిపి పూజలు నిర్వహిస్తారు. తులసీ కళ్యాణం చేస్తారు. భాగవతంలోని అంబరీషుడి కథ ఈరోజు గురించిన విశిష్టతను తెలియజేస్తుంది. అలాగే కార్తీక పురాణంలోనూ ఈ కథ గురించిన ప్రస్తావన ఉంది.

ప్రహ్లాదుడిలాగానే అంబరీషుడు మహా విష్ణు భక్తుడు. ఇతను ఇక్ష్వాకు వంశరాజు. నభగ మహారాజు కుమారుడు. ఎల్లప్పుడూ హరియందే మనసును లగ్నం చేసేవాడు. ఆ భక్తుడు ఒకసారి ద్వాదశి వ్రతాన్ని చేశాడు. ద్వాదశి వ్రతం అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి తిథి వచ్చాక బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాను భుజించాలి. ఇలా సంవత్సరం పాటు నిర్వహించాలి. ఒకసారి ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తున్న అంబరీషుడికి, ద్వాదశి రోజున భుజించే సమయానికి దూర్వాస మహర్షి అక్కడకు వస్తాడు. మహర్షులను విడిచిపెట్టి తాను భుజించడం తగదని తెలిసి అంబరీషుడు మహర్షిని భోజనానికి ఆహ్వానిస్తాడు. అప్పుడు దూర్వాస మహర్షి సంతోషంగా అంగీకరించి తాను నదిలో స్నానం చేసి వచ్చేవరకు వేచి ఉండమని చెప్పి నదివైపు వెళ్లాడు.

అదే సమయానికి ద్వాదశి ఘడియలు అయిపోవస్తుంటాయి. స్నానానికని వెళ్లిన దుర్వాసమహర్షి ఇంకా రాడు. మహర్షిని విడిచి భోజనం చేస్తే ఆయన ఆగ్రహానికి గురికాక తప్పదు. అందునా దుర్వాసుడికి చాలా కోపం. అలా అని పారణ అంటే ఉపవాసం విడిచిపెట్టకుండా ఉంటే వ్రతదోషం అవుతుంది. దాంతో అంబరీషుడు తన కులగురువైన వశిష్టుడి సలహామేరకు ఆ శుభముహూర్తంలో కేవలం తులసీ నీళ్లు తాగి దీక్ష విరిమిస్తాడు.

ఇది శాస్త్రప్రకారం సమ్మతమే. కానీ స్నానం చేసి వచ్చిన దుర్వాసుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకుని ఆగ్రహానికి లోనవుతాడు. అతన్ని పదిరకాల జన్మలనెత్తమని శపిస్తాడు. అంతేకాదు అప్పటికప్పుడే ఒక రాక్షసుడిని సృష్టించి అంబరీషుడిని సంహరించమంటాడు. ఆ రాక్షసుడు అత్యంత భయానకంగా మారి అంబరీషుడి ఎదుట నిలవగానే ఆయన భయంతో శ్రీహరిని ప్రార్థిస్తాడు. దాంతో ఆయకు రక్షణగా సుదర్శన చక్రం ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరించి, దురస్వాసుడి వెంటపడుతుంది.

దుర్వాసుడు సుదర్శన చక్రం బారి నుంచి కాపాడమని వేడుకుంటూ బ్రహ్మాదిలోకాలన్నింటికీ వెళ్తాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ చక్రం వెంబడిస్తూనే ఉంటుంది. చివరికి మహా విష్ణువుని కూడా శరణువేడతాడు. కానీ ఆయన కూడా తాను అంబరీషుని భక్తికి బందీ కాబట్టి నేనేమీ చేయలేనని అంబరీషుడినే శరణువేడుకోమనీ చెప్తాడు. చివరికి దుర్వాసుడు వెళ్లి అంబరీషుడిని శరణు వేడుతాడు. దాంతో ఆయన సుదర్శన చక్రాన్ని ఉపసంహరించమని, ఆ దివ్య చక్రాన్ని స్తుతిస్తూ వేడుకుంటాడు. ఇలా దుర్వాసుడిని రక్షిస్తాడు అంబరీషుడు.

అలాగే దుర్వాసుడు ఇచ్చిన శాపాన్ని, అవసరం వచ్చినప్పుడు పది అవతారాలుగా లోకరక్షణకోసం తాను అనుభవిస్తానని శ్రీమహావిష్ణువు. దీనివల్ల భక్తులకు పరమాత్మ ఎప్పుడూ బంధీనే అనే అంశం మనకు స్పష్టమవుతుంది. ఇలా ఎవరైతే ఈ ద్వాదశి రోజున ఈ కథను విన్నా, లేక చదివినా అనేక పాపాలు నశించి, పుణ్యఫలం కలుగుతుందని కార్తీక పురాణంలో ఉంది.

Tags: తులసి, క్షీరాబ్ది ద్వాదశి, Karthika masam, Tulasi Pooja, Vishnuvu, Ksheerabdhi Dwadashi Vratam

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.