క్షేత్రపాలకుడు అంటే ఎవరు? Interesting story of kshetra Palaka

క్షేత్రపాలకుడు..!!!

క్షేత్ర పాలకుడు అంటే ఆ క్షేత్రాన్ని పాలించేవాడు, రక్షించేవాడు అని అర్థం.

ముఖ్యంగా క్షేత్రాలలోని ఆలయాలకు తప్పకుండా ఈ క్షేత్రపాలకుడు ఉంటాడు. భక్తులు తప్పనిసరిగా ఆ స్వామిని దర్శించుకోవడం క్షేత్రనియమంగా వస్తోంది.

సాధారణంగా క్షేత్రపాలకుడంటే శివుడే అని శైవాగమాలు చెప్తున్నాయి. వైష్ణవాగమాల్లో కూడా దండపాణిగా శివుడే క్షేత్రపాలకుడుగా దర్శనమిస్తాడు.

శివాలయంలో ఈయన ముఖ్యదేవతగా ఉంటాడు. శివాలయంలో ఆగ్నేయదిక్కున ఈ స్వామి ఆలయం ఉంటుంది.

భక్తులు ముందుగా ఈయనను దర్శించి శివ దర్శనం.. శివార్చన కొరకు అనుమతి పొందిన తరువాతే ఆలయంలోకి అడుగుపెట్టాలనే నియమం కూడా ఉంది.  ఈ నియమం ఒక్క భక్తులకే కాక అర్చనాది కైంకర్యాలు జరిపే అర్చకులకు కూడా ఉంది.

ముఖ్యంగా అర్చకులు శివాలయానికి వేసిన తాళాలను ఈ క్షేత్రపాలకుడి వద్దే ఉంచి వెళ్తారు.

ఉదయాన్నే ఆలయం తెరిచే ముందు ఈయన అనుజ్ఞ తీసుకొని అర్చనాది కార్యక్రమాలు మొదలుపెడతారు.

ఈశ్వరుడి వెయ్యో అంశగా క్షేత్రపాలకుడు ఉద్భవించినట్లు సుప్రభేదాగమం చెప్పింది. 

గ్రామానికి ఈశాన్యంలో లోకరక్షణ కోసం ఈయనకు ప్రత్యేకంగా ఆలయం కూడా  నిర్మించాలని ఆగమశాస్త్ర నియమం.

క్షేత్రపాలకుడు నల్లని మబ్బులవంటి శరీరవర్ణంతో.. గుండ్రటి కన్నులతో.. నగ్నంగా.. పదునైన పళ్లకోరలతో.. భ్రుకుటిని ముడిచి.. ఎర్రటి పొడవైన కేశాలతో.. శరీరంపై కపాలమాలలతో.. చేతుల్లో త్రిశూలం, కపాలం వంటి ఆయుధాలతో నిలుచుని.. భైరవవాహనంతో ఉంటాడు.

కాశ్యప శిల్పశాస్త్రం ఆయన చేతులు, ధరించే ఆయుధాలను బట్టీ సాత్త్విక, రాజస, తామస మూర్తులుగా విభజించింది.

తెల్లగా.. శాంతముఖంతో.. రెండు/నాలుగు చేతులతో.. అభయ–వరదముద్రలతో.. రెండు ఆయుధాలతో ఉన్న స్వామి సాత్త్విక క్షేత్రపాలకుడు. ఎర్రగా..ఉగ్రముఖంతో ఆరు చేతుల్లో ఆయుధాలు పట్టిన మూర్తి రాజసిక క్షేత్రపాలకుడు.

నల్లగా.. తీక్షణంగా చూస్తూ.. మూడు కన్నులతో.. నాగాభరణాలతో.. ఎనిమిది చేతులతో తామసిక క్షేత్రపాలకుడు ఉంటాడు.

శ్రీవిద్యార్ణవ తంత్రం క్షేత్రపాలకుడు.. అనల, అగ్నికేశ,కరాళ, ఘంటికారవ, మహాకోప, పిశితాశ, పింగాక్ష, ఊర్ధ్వకేశులనే అష్ట (8) కింకరులను కలిగి ఉంటాడని పేర్కొంది.

క్షేత్రపాలకుడు ఆలయానికి.. గ్రామానికి.. క్షేత్రానికి ముఖ్యమైన దేవుడనీ.. తొలుత ఆయన్నే పూజించాలని శాస్త్రోక్తి.

జననానుడిలో.. కొన్ని స్థలమాహాత్మ్యాల్లో మాత్రం శివక్షేత్రానికి విష్ణువు.. విష్ణుక్షేత్రాలలో శివుడు క్షేత్రపాలకులని ఉంది.

ఉదాహరణకు తిరుమల ఆలయంలో ఈశాన్యంలో క్షేత్రపాలక రుద్రశిల ఉంది.

అలాగే గోగర్భం జలాశయం వద్ద ఉన్న ఒక పెద్ద రుద్రశిలను భక్తులు దర్శిస్తారు. అలాగే పంచారామ క్షేత్రాలన్నింటికీ విష్ణువు క్షేత్రపాలకుడై ఉన్నాడు. వీరేగాక భద్రాచలం, కొన్ని నృసింహ క్షేత్రాలకు ఆంజనేయస్వామి, శ్రీశైలానికి వీరభద్రుడు,

బద్రీనాథ్‌ క్షేత్రానికి ఘంటాకర్ణుడు, వారణాసి, శ్రీకాళహస్తి, ఉజ్జయిని క్షేత్రాలలో కాలభైరవుడు క్షేత్రపాలకులు. క్షేత్రపాలకుడి దర్శనం, పూజ విశేష ఫలితాలిస్తాయి..

Tags: క్షేత్రపాలకుడు, Kshetrapalaka, kalabhaivarava, dakshina murthy, kshetrapalaka history in telugu, bhakthi samacharam, devotional story's, kshetrapalaka meaning

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS