Drop Down Menus

సంక్రాంతికి గొబ్బెమ్మలు ఎందుకు పెడతారో తెలుసా? పూజ విశిష్టత తెలుసుకోండి..Sankranti - Gobbemma Pooja Vidhanam

సంక్రాంతి తెలుగు వారికి అతి పెద్ద పండుగ. ఇంట్లో పండుగ సందడి, ఇంటి ముందు ముగ్గుల సందడి. ఈ ముత్యాల ముగ్గల మధ్య ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెడతారు. గోమయంతో చేసే గొబ్బెమ్మలు సాక్షాత్తూ దైవ స్వరూపం. కృష్ణుని భక్తురాళ్లైన గోపికలకు నిలువెత్తు రూపం అన్నమాట.

గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే బొమ్మలు.. అంటే గొబ్బెమ్మలు అన్నమాట. పుణ్యస్త్రీలు అంటే ముత్తైదువులకు సంకేతంగా గొబ్బెమ్మలను, లక్ష్మికి ప్రతిరూపంగా కొలుస్తారు. సంక్రాంతి లక్ష్మి రావాలంటే గొబ్బెమ్మలతోనే అది సాధ్యం. సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించేందుకు ముత్యాల ముగ్గులు, రత్నాల ముగ్గులు, రంగురంగుల ముగ్గులు, పూల ముగ్గులు అన్నీ వేసి మధ్యలో గొబ్బెమ్మలతో అలంకారం చేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాం అన్నమాట.

సాక్షాత్తూ గౌరీదేవి ఈ గొబ్బెమ్మ రూపంలో కొలువై ఉంటుందనేది పురాణాలు చెబుతున్న విషయం. గౌరీ పూజ సకల శుభకరం. గొబ్బెమ్మలకు చేసే పూజలను ప్రత్యక్షంగా గౌరీ దేవి అందుకుంటుంది. అందుకే గౌరీ స్వరూపంగా గొబ్బెమ్మలకు పూజలు చేసి.. అమ్మవారి అనుగ్రహం పొందటం మన సంప్రదాయం. గొబ్బెమ్మలను చుట్టూ పసుపు, కుంకుమ బొట్లతో అలంకరించి వీటిపైన పూలు పెడతారు.

సందె గొబ్బమ్మ, గొబ్బి పాటలు..

పల్లెల్లో ‘సందె గొబ్బమ్మ’ అనేది పెద్ద వేడుక. అంటే సాయంత్రం పూట గొబ్బెమ్మల చుట్టూ చేరిన పిల్లలు, అమ్మాయిలంతా పాటలు పాడుతూ, జట్లుగా చేరి, ఆడుతుంటారు. ఇదంతా కృష్ణతత్వాన్ని ఆస్వాదించటంలో భాగమనే విషయం మరవకండి. ఇదేదో సరదాగా చేసేది కాదు. ఇదంతా సంప్రదాయానుసారం కృష్ణ తత్వాన్ని గానం చేస్తూ, గుర్తుచేసుకునే తంతు.

కాబట్టి గోదాదేవి, లక్ష్మిదేవి, గౌరీ దేవి, కాత్యాయనీ దేవి రూపాలకు ప్రతిరూపంగా మనం గొబ్బెమ్మల పూజ చేస్తాం. ఈ గొబ్బెమ్మల్లో ధాన్యాన్ని నింపుతారనే విషయం మీలో ఎందరికి తెలుసు. కొత్త ధాన్యం ఇంటికి చేరిన రోజులు కాబట్టి పండిన కొత్త ధాన్యాన్ని ఈ గొబ్బెమ్మల్లో వేసి ధాన్య లక్ష్మిగా పూజించటం రైతుల ఆచారం. చాలామంది బియ్యం, నువ్వులు వంటివి ఈ గొబ్బెమ్మల్లో వేసి పూజిస్తారు. కొందరు నవధాన్యాలను గొబ్బెమ్మల్లో నింపి పూజిస్తారు. గొబ్బి పూజలు చేస్తే కోరుకున్నవి జరుగుతాయని భక్తుల విశ్వాసం. కన్నెపిల్లలకు తాము కోరుకున్న వ్యక్తితో పెళ్లవుతుందని, ముత్తైదువులు పూజిస్తే దీర్ఘ సుమంగళిగా ఉంటారనేది మన పెద్దలు చెప్పిన సంగతులు.

ధనుర్మాసమంతా..

అసలు సంక్రాంతి అంటేనే గొబ్బెమ్మల పండుగ. కొంతమంది ధనుర్మాసం తొలిరోజు నుంచీ వీటిని ఇంటిముందు పెట్టి పూజ చేస్తారు. చాలామంది భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు గొబ్బెమ్మలు పెట్టి పూజిస్తారు. సంక్రాంతి పండుగలో గోదా దేవి వ్రతాలు, గోదాకల్యాణం, ధనుర్మాస వ్రతాలు చేసుకుంటారు. గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ డ్యాన్స్ చేయటంలో ఎంతో ఆధ్యాత్మికత ఉంది. కృష్ణుడిపై భక్తిగీతాలు పాడుతారు. కృష్ణతత్వాన్ని వివరించే పాటలే గొబ్బిపాటలుగా పాడుతారు. స్వామీ నీపై మాకు ఇలాగే భక్తి విశ్వాసాలుండాలి అని వీరంతా కోరుకుంటారు.

గొబ్బి పూజ వెనుక సైంటిఫిక్ రీజన్స్ కూడా చాలానే ఉన్నాయి. ఆవు పేడ యాంటీ బయాటిక్ కాబట్టి ఇది ఎన్నోరకాల రోగాలు రాకుండా మన గుమ్మంలోనే అంటే గేట్ లోనే బ్యాక్టీరియాలను తరిమి కొడుతుందని పెద్దలు చెబుతారు. చలికాలం పోయేముందు రకరకాల బ్యాక్టీరియాలు, ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదముంటుందని ఇంటి ముందు పేడనీళ్లు చల్లి, పేడతో గొబ్బెమ్మలు పెడుతారు. ఇలా చేస్తే ఆ క్రిములు ఇంట్లోకి రాకుండానే చనిపోతాయి. ఆవుపేడతో మన ఆరోగ్యానికి శ్రీరామ రక్ష కల్పించటమే ఇందులోని అసలు అంతరార్థం.

గొబ్బెమ్మల మీద ఈ సీజన్ లో వచ్చే పువ్వులు పెట్టి గొబ్బెమ్మలను మరింత అందంగా తయారు చేస్తారు. అంటే కొన్ని ప్రాంతాల్లో తంగేడు పువ్వులు, జిల్లేడు పువ్వులు, బంతిపూలు, గుమ్మడి పువ్వులు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పూలతో స్థానికంగా లభించేవాటితో అలంకరిస్తారు.

లక్ష్మి దేవి నడుచుకుంటూ వస్తుంది..

ముగ్గులు, గొబ్బెమ్మలు లక్ష్మీ దేవికి చాలా ఇష్టమైనవి. ఇలా ముంగిట ముగ్గులు వేసేవారి ఇంట్లోకి లక్ష్మి దేవి నడుచుకుంటూ వస్తుందని ప్రతీతి. ఉదయం లేవగానే ఇంటి ముందు ఊడ్చి, నీళ్లు చల్లి.. చిన్నదైనా ఫర్లేదు లక్షణంగా ముగ్గులు పెడితే చాలు. లక్ష్మీ దేవి ఆ ఇంటికి నడిచి వస్తుందని రోజూ ఇంటి ముందు ముగ్గు పెట్టడం మన దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న సంప్రదాయం. తమిళనాడులో దీన్ని కొల్లం అంటారు. కర్నాటకలో రంగోలి అంటారు. మనం ముగ్గులు అంటాం. ఇదంతా దక్షిణాది సంప్రదాయమే కానీ మీకు ఉత్తరాదిలో ముగ్గుల పద్ధతులు కనిపించవు.

ఎండిన గొబ్బెమ్మలతో..

ఇలా పెట్టిన గొబ్బెమ్మలు సంక్రాంతి ఎండలకు బాగా ఎండిపోతాయి. వీటితోనే కనుమ రోజు నైవేద్యం వంటకు ఉపయోగిస్తారు. ఇలా భోగి, సంక్రాంతి రోజు పెట్టిన గొబ్బెమ్మలు ఎండిపోగా వీటితో కనుమ రోజు ఉదయమే పాయసం చేసి, దేవుడికి నైవేద్యంగా పెడతారు. కొందరు ఈ 3 రోజులు పెట్టే గొబ్బెమ్మలన్నీ జాగ్రత్తగా ఎండబెట్టి, రథసప్తమి రోజున వంట చేసి.. సూర్యుడికి నైవేద్యంగా పెడతారన్నమాట. ఈ గొబ్బెమ్మలను తొక్కకుండా జాగ్రత్తపడతారు.

Tags: సంక్రాంతి, గొబ్బెమ్మ, Sankranti, Gobbemma Pooja Vidhanam, Gobbemma Puja Telugu, Gobbemma patalu, sankranti gobbemma, Bhogi, Sankranthi Songs

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.