సంక్రాంతి సంబరం అంతా గొబ్బిళ్ల వేడుకలలోనే కనిపిస్తుంది. ఇంటిముందు రంగవల్లుల్లాంటి కొత్త బట్టలు ధరించిన ఆడపిల్లు సప్తవర్ణాలు అద్దిన రంగవల్లుల మధ్యలో గొబ్బెమ్మలు ఉంచి వాటిని పూజించి అనంతరం గొబ్బిళ్ళ పాటలు పాడుతుంటే ఆ అందం ఆనందం మరొక సందర్భంలో రాదంటారు పెద్దలు. కానీ మన సనాతన సాంప్రదాయాలు కనుమరుగు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో మనం మర్చిపోతున్న గొబ్బెమ్మల పాటను మీకు గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగా గొబ్బిపాటలను మీకు అందిస్తున్నాము.
గొబ్బెమ్మ పాట
గొబ్బీయళోయి గొబ్బిళ్ళు
సుబ్బీ గొబ్బెమ్మ సుఖమూ లియ్యావే
తామర పువ్వంటి తమ్ముణ్ణియ్యావే
చేమంతి పూవంటి చెల్లెల్నియ్యావే
అరటి పూవంటీ అక్కానివ్వావే
పున్నాగ పూవంటీ అన్నానివ్వవే
మొగలి పూవంటి మొగుణ్ణివ్వావె
కలువా పూవంటి కూతుర్నివ్వావె
మల్లెపూవంటీ మఱిదినివ్వావె
బంతి పూవంటి బావనివ్వావె
మామిడి పూవంటి మావనివ్వావె
గొబ్బిళ్ళోయి గొబ్బిళ్ళు
గొబ్బిళ్ళోయి గొబ్బిళ్ళు
కొలని దోపరికి గొబ్బిళ్ళు
యదుకుల స్వామికి గొబ్బిళ్ళు
కొండ గొడుగుగా గోవుల కాచిన
కొండక శిశువుకు గొబ్బిళ్ళో
దుండగంపు దైత్యుల కెల్లను తల
గుండు గుండనికి గొబ్బిళ్ళు
పాపవిధుల శిశుపాలుని గొట్టిన
కోపగానికిని గొబ్బిళ్ళు
యేపున కంసుని ఇడుముల బెట్టిన
గోప బాలునికి గొబ్బిళ్ళో
దండి వైరులను తరిమిన దనుజుల
గుండె బిగువునకు గొబ్బిళ్ళో
వెండి పైడియగు వేంకటగిరి పై
కొండలరాయనుకి గొబ్బిళ్ళో
సుబ్బి గొబ్బెమ్మ
సుబ్బి గొబ్బెమ్మ సుబ్బి నీయ్యవే
అరటి పండు వంటి అమ్మ నీయ్యవే
నారింజ కాయంటి నాన్న నీయ్యవే
చామంతి పువ్వుంటి చెల్లెలు నీయ్యవే
తమల పాకంటి తమ్ముడ్ని నీయ్యవే
బంతి పువ్వంటి బావా నీయ్యవే
మొగలి పువ్వంటి మొగుడ్ని నీయ్యవే
సుబ్బి గొబ్బెమ్మ సుబ్బి నీయ్యవే.
Tags: గొబ్బెమ్మ పాటలు, Sankranthi, Sankranti Gobbemma, Gobbemma Patalu Telugu, Gobbemma Songs Telugu, Gobbemma Pooja, Gobbemma Pooja Telugu, Bhogi