Drop Down Menus

Importance of Akshaya Tritiya - సిరులు కురిపించే అక్షయ తృతీయ రోజున ఈ పని చేస్తే.. మీ జీవితంలో ధన వర్షం..!

అక్షయ తృతీయ నాడు అచంచలమైన భక్తితో శ్రీమహావిష్ణువుకు శిరస్సు వంచి నమస్కరిస్తే చాలు. శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైనవి ఆయన దేవేరి మహాలక్ష్మీ‌కి కూడా ఎంతో ఇష్టం.

అక్షయ అంటే తరగనిది అని అర్థం. పురాణాల్లో అక్షయపాత్రను వినివుంటాం. ఈ పాత్ర కలిగిన వారి  ఇంటికి ఎంత మంది అతిథులు వచ్చినా కావాల్సినంత ఆహారాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీమహాలక్ష్మీ అమ్మవారు అన్ని ఐశ్వరాలకు అధినేత్రి. ఆమె అనుగ్రహం వుంటే చాలు జీవితంలో ఏ లోటు వుండదు. అందుకనే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ పర్వదినాన పూజలు నిర్వహిస్తారు.

వైశాఖ మాసంలో తదియ నాడు వచ్చే పర్వదినాన్ని పవిత్రమైనది భావిస్తారు. త్రేతాయుగం ఈ రోజునే ప్రారంభం కావడంతో అంత విశిష్టత ఏర్పడింది.

మహాభారత రచనను విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో వేదవ్యాసుడు ఈ దినానే ప్రారంభించినట్టు పురాణాలు చెబుతున్నాయి. సంపదలకు అధిపతి కుబేరుడు శివున్ని ప్రార్థించగా ఆయన లక్ష్మీ అనుగ్రహాన్ని ఇచ్చినట్టు శివపురాణం తెలుపుతుంది. మహాభారతంలో ధర్మరాజుకు అక్షయపాత్ర ఇవ్వడం, గంగానదీ ఆ పరమేశ్వరుని జటాజూటం నుంచి భువిపైకి అవతరించిన పవిత్ర దినం అక్షయ తృతీయ కావడం విశేషం.

భారతీయ సమాజంలో బంగారానికి ఎక్కువ విలువవుంది. ప్రపంచంలో ఎక్కడ లేనంతా బంగారం మనదేశంలోనే వుంది. బంగారం అనేది సంపదకు చిహ్నం. సంపద వుంటే మనం ఆర్థిక ఇబ్బందులు లేకుండా వుండగలం. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం సంపద వుంటుందన్న నమ్మకంతో బంగారాన్ని కొనుగోలు చేస్తాం. పరశురాముడిగా శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించిన దినమిది. ఇన్ని ప్రత్యేకతలు వున్నందునే అక్షయతృతీయను ఘనంగా జరుపుకొంటాం.

History :

మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం.. ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది . ఈ నాడు, తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది. అందుచే విశేష పూజనీయమైనది.

ఈ నాడు ఉపవాస దీక్ష జరిపి, ఏ పుణ్య కర్మనాచరించినా కూడా తత్సంబంధ ఫలము అక్షయముగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు. ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి, అర్చించి, తరువాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు.

ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని ఆచరించిన తరువాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందగలడు. అక్షతలు అంటే ఏ మాత్రము విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యము. అవి వరి ధాన్యము నుండి కావచ్చు, గోధుమ ధాన్యము నుండి కావచ్చు, యవల నుండి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారమును అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు.

శ్రీ నారద పురాణం కూడా, ఈనాడు చేయు దాన ధర్మాలు అత్యధిక ఫలాన్నిస్తాయని చెపుతోంది. ఈ నాడు దానం, ధర్మం చేయటమే అక్షయ ఫలితాన్ని ఇస్తుంటే, ఇక గంగా తీరంలో నాడు చేసే దానాది ఫలముల గురించి నారదమహర్షి ఇలా చెప్పాడు. అక్షయ తృతీయ నాడు గంగా తీరంలో నియమంతో ఘృత, ధేను దానం చేసినవాని ఫలితం ఇంతింత కాదు, సహస్రాదిత్య సంకాశుడై, సర్వకామ సమన్వితుడై, బంగారము, రత్నములతో కూడి చిత్రహంసలతో కూడిన విమానములో తన పితృదేవతలతో కల్పకోటి కల్పములు, కల్పకోటి సహస్రముల కాలము బ్రహ్మ లోకమున విరాజిల్లును. తరువాత గంగా తీరంలో అత్యంత ధనవంతుడైన బ్రాహ్మణునిగా పుడతాడు.

అంతమున బ్రహ్మజ్ఞానియై ముక్తిని పొందుతాడు. అలాగే యధావిధిగా గోదానము చేసినవాడు గోరోమ సంఖ్యలు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరములు స్వర్గలోకములో విరాజిల్లి, తరువాత భూమి మీద పుట్టి, చక్కని విద్యను, ఐశ్వర్యాన్ని అనుభవించి, అంతమున ముక్తిని పొందుతాడు. గంగా నది ఒడ్డున వేదవిదుడైన బ్రాహ్మణునకు కపిల గోదానము చేసినచో నరకములోనున్న తన పితరులందరూ స్వర్గాన్ని చేరెదరు. అక్కడే భూమిని దానం చేస్తే, ఎంత భూమిని దానం చేసాడో అంతభూమిలోని రేణువుల ప్రమాణాబ్ది వరకు బ్రహ్మ, విష్ణు, శివలోకములలో నివసించి భూమిమీద పుట్టి సప్త ద్వీపాధిపతి అగును.

అతడు నిద్రించినచో భేరీ, శంఖాది నినాదములచే మేల్కొలుపబడును. సర్వ ధర్మ పరాయణుడై, సర్వ సౌఖ్యములను పొంది, నరకవాసంలో ఉన్న పితరులనందరినీ స్వర్గమున చేర్చి, స్వర్గమున నున్న పితరులనందరినీ మోక్షమున చేర్చి, స్వయముగా జ్ఞానియై, అవిద్యను జ్ఞాన ఖడ్గముచే ఖండించగల పరమ వైరాగ్యమును పొంది పరబ్రహ్మమును పొందును. ఇటువంటి పుణ్య ఫలములెన్నో చెప్పబడినవి.

Tags: అక్షయ తృతీయ, akshaya tritiya 2024, akshaya tritiya 2024 nakshatra, akshaya tritiya 2024 telugu date, akshay tritiya muhurat, akshaya tritiya 2023 date and time, akshaya tritiya 2024 telugu calendar, akshay tritiya danam,

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments