సౌభాగ్య ప్రదాయని వటసావిత్రీ వ్రతం.. తప్పక తెలుసుకోవాల్సిన కథ ఇది - Soubhagya Pradayini Vata Savithri Vratham

సౌభాగ్య ప్రదాయని వటసావిత్రీ వ్రతం

జ్యేష్ఠ పూర్ణిమా నాడే “వట సావిత్రి వ్రతము " ఆచరించాలని వ్రత గ్రంధాలూ పేర్కొన్నాయి.

కానీ నేటి కాలంలో "ఏరువాక పున్నమి” వెళ్ళిన 13వ రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. తన భర్త సత్యవంతుడు చనిపోయినపుడు, సావిత్రి పవిత్రమైన వటవృక్షాన్ని (మర్రి వృక్షాన్ని) పూజించి, యమధర్మ రాజు నుంచి, తన భర్త ప్రాణాలనుతిరిగి వెనక్కి తెచ్చుకున్నదని పురాణ కధనం. అందుకే, సావిత్రి పతిభక్తి విజయానికి గుర్తుగా ఈ వ్రతాన్ని ఆచరించడం ఆచారమయింది.

మన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మన దోషాలను, నష్టాలను, పాపాలను తొలగించుకోవడానికి, అష్ట ఐశ్వర్యాలను, సకల సౌభాగ్యాలను పొందడానికి ప్రాచీనకాలం నుంచి ఎన్నోరకాల నోములు, వ్రతాలను నిర్వహించుకోవడం జరుగుతోంది.  సాక్షాత్తూ దేవుళ్లు కూడా ఇటువంటి ఆచారాలను అవలంభించారని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే అటువంటి నోములలో *‘వట సావిత్రి వ్రతం’* కూడా ఒకటి. 

స్త్రీలు ఐదవతనాన్ని గొప్పవరంగా భావిస్తారు. ఐదవతనాన్ని కాపాడుకోవడానికి అనేక వ్రతాలు,  పూజలు చేస్తారు. మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, వటసావిత్రి వ్రతం వంటివి ఇందులో విశేషమైనవి. వీటిలో వట సావిత్రి వ్రతానికో ప్రత్యేకత ఉంది. *ఈ వ్రతాన్ని వటవృక్షాన్ని పూజ చేయడం ద్వారా జరుపుకుంటారు.

జీవన విధానంలో సకల సౌభాగ్యాలను ప్రసాదించడంతో పాటూ వైధవ్యం నుంచి కాపాడేవ్రతంగా *‘వటసావిత్రీ వ్రతం’* ను చెప్పుకొచ్చు.  దీనిని *జ్యేష్ఠ శుధ్ధ పూర్ణిమ* నాడు ఆచరించాలి.  ఆ రోజు వీలుకాకపోతే *జ్యేష్ఠ బహుళ అమావాస్యనాడు* ఆచరించవచ్చు.

పురాణగాథ

ఈ వ్రతం వెనుక ఉన్న సావిత్రి , సత్యవంతుల కథ ఉంది.  ఈ వ్రతం ఆచరించే సావిత్రీ తన భర్త సత్యవంతుని మృత్యువు నుంచి కాపాడుకోగలిగింది. అశ్వపతి - మాళవి దంపతుల కూతురు *‘సావిత్రి’* యుక్తవయసులో ఉండగా.. నీకు ఇష్టమైనవాడిని వరించమని తల్లిదండ్రులు అనుమతినిచ్చారు. రాజ్యం శత్రువులపాలు కావడంతో అరణ్యంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తోన్న ద్యుమత్సేనుడి తనయుడైన సత్యవంతుని వివాహమాడతానని తల్లిదండ్రులకు తెలిపింది. సత్యవంతుడి ఆయుష్షు మరో సంవత్సరమేనని నారదుడు చెప్పినప్పటికీ , సావిత్రి పట్టుపట్టడంతో సత్యవంతుడితోనే వివాహం చేశారు. మెట్టినింట చేరి భర్త , అత్తమామలకు సేవ చేయసాగింది. 

సత్యవంతుడు ఒకనాడు యజ్ఞ సమిధలు , పుష్పాలకోసం అడవికి బయలుదేరగా , సావిత్రీ భర్త వెంట వెళ్లింది. సమిధులను కోసి చెట్టు దిగిన సత్యవంతుడు తలభారంతో సావిత్రి ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు. నారదుడు చెప్పిన సమయం ఆసన్నమైనదని సావిత్రి గుర్తించింది. కొద్ది సేపటికి యముడు తన దూతలతో వచ్చి సత్యవంతుడికి యమపాశం వేసి తీసుకుని పోసాగాడు. సావిత్రి కూడ తన భర్తను అనుసరించి వెళ్ళసాగింది. యముడు వారించినప్పటికీ భర్త వెంటే తనకూ మార్గమని చెప్పి వెళ్తూండడంతో ఆమె పతి భక్తిని మెచ్చిన యముడు సావిత్రిని వరం కోరుకోమన్నాడు.

*‘మామగారికి దృష్టి ప్రసాదించండి’* అని ఓ వరాన్ని కోరింది. యముడు ప్రసాదించాడు. అయినా సావిత్రి వెంట వస్తుండడంతో , యముడు మరో వరాన్ని కోరుకోమన్నా డు. మామగారు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి ప్రసాదించమని కోరింది. యముడు ప్రసాదించాడు. అయినా సావిత్రి వెంట వస్తూండడంతో , ఆమె పతిభక్తిని మెచ్చి మూడో వరం కోరుకోమనగా.. *‘నేను పుత్రులకు తల్లిని అయ్యేట్లు వరాన్ని ప్రసాదించండి’* అని కోరింది. యముడు సావిత్రి పతిభక్తిని మెచ్చి ఆ వరాన్ని ప్రసాదించాడు. సావిత్రి అడవిలో వటవృక్షం కింద ఉన్న భర్త శరీరం వద్దకు చేరింది. భర్త లేచి కూర్చోగా , వటవృక్షం కు పూజ చేసి భర్తతో సహా రాజ్యానికి చేరినట్లు కథనం.  వటవృక్షాన్ని , సావిత్రిని పూజిస్తూ చేసి *‘వట సావిత్రి వ్రతం’* అమల్లోకి వచ్చినట్లు పురాణగాథ.

వ్రత విధానము

ఈ వ్రతాన్ని చేసే వారు ముందురోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతం రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలంటు స్నానం చేసి, దేవుడిని స్మరించుకుంటూ మర్రి చెట్టు వద్దకు వెళ్లి, మర్రి చెట్టు వద్ద అలికి ముగ్గులు వేయాలి. అక్కడ సావిత్రి , సత్యవంతుల బొమ్మలు ప్రతిష్టించాలి. వారి చిత్ర పటాలు దొరకకపోతే పసుపుతో చేసిన బొమ్మలు ప్రతిష్టించుకుని మనువైధవ్యాధి సకల దోష పరిహారార్ధం. 

*బ్రహ్మ సావిత్రీ ప్రీత్యర్థం*

*సత్యవత్సావిత్రీ* *ప్రీత్యర్ధంచ*

*వట సావిత్రీ వ్రతం కరిష్యే*

..అనే శ్లోకాన్ని పఠించాలి. 

ఈ విధంగా మర్రిచెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించిన ఫలం కలుగుతుంది. పూజానంతరం నమో వైవస్వతాయ అనే మంత్రాన్ని పఠిస్తూ మర్రిచెట్టుకు 108 సార్లు ప్రదక్షిణ చేసి నైవేద్యం సమర్పించి, బ్రాహ్మణులు, ముత్తైదువలకు దక్షిణ తాంబూలాదులు సమర్పించాలి. ఇలా చేస్తే భర్త దీర్ఘాయుర్దాయం పొందుతాడు. పూజ పూర్తయ్యాక ప్రతి స్త్రీ, ఐదుగురు సుమంగళుల నొసట బొట్టు పెట్టి గౌరవించాలి. ఇలా చేస్తే స్త్రీలకు ఐదవతనంతో పాటు అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయి.

ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి సకల సౌభాగ్యాలు లభించడంతోపాటు రకరకాల దోషాలు, పాపాలు, కష్టనష్టాల నుంచి విముక్తిని పొందుతారు.

Tags: వటసావిత్రీ వ్రతం, Vat Purnima, Vat Savitri Vrat, Vatasavitri vratam telugu, Vat savitri 2024

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS