కాశీ లో వారాహి దేవి అమ్మవారి ఆలయానికి ఎలా వెళ్ళాలి? Kashi Varahi Devi Temple History | Varanasi Varahi Devi

ఆలయానికి వెళ్లినా... గర్భగుడి ఎదురుగా నిల్చుని దేవీదేవతలను కళ్లారా దర్శించుకుని, తమ ఎదురుగా ఆ విగ్రహమూర్తులకు పూజలు నిర్వహిస్తే అదో తృప్తి. కానీ... కాశీలో ఉన్న వారాహిదేవి ఆలయంలోని అమ్మవారిని పొద్దున్న రెండు నుంచి రెండున్నర గంటలకు మించి దర్శించుకునే అవకాశం ఉండదు. అదీ భూగర్భంలో కొలువైన ఈ దేవిని రెండు రంధ్రాల నుంచి చూసి వచ్చేయాల్సి ఉంటుంది. క్షేత్ర పాలికగా కాశీని కాపాడటమే కాదు, భక్తుల సమస్యలను నివారించే శక్తిస్వరూపిణిగానూ వారాహిదేవి పూజలు అందుకోవడం విశేషం.

ఉగ్రస్వరూపం, వరాహ ముఖం కలిస్తే వారాహిదేవి. చక్రం, ఖడ్గం ధరించిన ఈ దేవి ఆలయంలోని భూగర్భంలో ఉంటుంది. కేవలం పూజారి మాత్రం రోజూ పొద్దున్నే తెల్లవారు జామున ఆలయానికి వెళ్లి అమ్మవారికి అభిషేకాలూ ఇతర పూజా కార్యక్రమాలూ నిర్వహించి హారతి ఇచ్చేసి గర్భగుడి తలుపులను మూసేస్తాడు. ఆ తరువాత ఆలయానికి వచ్చే భక్తులు ఈ గుడి తలుపులకు ఉండే రెండు రంధ్రాల నుంచే అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. అది కూడా... ఒక రంధ్రం నుంచి చూస్తేనే అమ్మవారి ముఖం కనిపిస్తుంది. మరోదాంట్లోంచి వారాహిదేవి పాదాలను చూడొచ్చు. ఒకవేళ ఎవరైనా భక్తులు పూలు పట్టుకెళ్తే వాటిని భద్రపరిచి మర్నాడు తెల్లవారు జామున అమ్మవారికి సమర్పిస్తారు. అంతేకాదు ఈ ఆలయంలోని అమ్మవారికి అలంకారం చేసే ముందు పూజారి కూడా కళ్లకు గంతలు కట్టుకుంటాడని చెబుతారు. కాశీలో ఉన్న ఈ క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనదిగా పేర్కొంటారు. ఆషాఢమాసంలో నవరాత్రుల పూజలు అందుకునే ఈ దేవి గ్రామదేవతగా కాశీని కాపాడుతోందని పురాణాలు చెబుతున్నాయి.

కాశీ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళారా? వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. కాశీ వెళ్ళిన వారు తప్పక దర్శించుకోవలసిన ముఖ్య దేవాలయం. ఈ ఆలయం వేళలు ఉదయం 4:30 నుండి 8:30 వరకు మాత్రమే. కేవలం నాలుగు గంటలు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు. తరువాత మూసేస్తారు.

ఎందుకని అనేగా మీ సందేహం! అమ్మవారు ఆ వారణాసి గ్రామదేవత. చీకటి పడింది మొదలు ఉదయం 3:30 వరకు గ్రామ సంచారం చేసి వచ్చి విశ్రమిస్తుంది. అందువలన అమ్మవారి ఆలయంలో 4 గంటల పాటు పూజ చేసి భూమిలో ఉండే అమ్మవారిని దర్శించు కోవడానికి ఏర్పాటు చేసిన రెండు కన్నాలలో నుండి దర్శనం చేసుకోవాలి. ఒక కన్నంలో నుండి చూస్తే అమ్మవారి ముఖ భాగం మాత్రమే కనిపిస్తుంది, రెండవ కన్నంలో నుండి చూస్తే పాదాలు దర్శనం అవుతాయి. అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రం నిమిషాల వ్యవధిలో అలంకరణ చేసి హారతి ఇచ్చేసి సెల్లార్ లో నుండి బయటికి వచ్చేస్తాడు. ఆ తరువాత ఆ కన్నాలలో నుండి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు.

స్థలపురాణం

దుర్గాదేవి రక్తబీజుడు అనే రాక్షసుడిని సంహరించేందుకు తన శరీరం నుంచే సప్తమాతృకలను సృష్టించినప్పుడు... వరాహమూర్తి నుంచి వారాహి శక్తి ఉద్భవించిందట. ఆ వారాహిదేవి రక్తబీజుడిపైన కూర్చుని తన దంతాలతో అతణ్ణి అంతమొందించిందని పురాణాలు చెబుతున్నాయి. కాశీఖండం ప్రకారం... శివుడు అరవై నాలుగుమంది యోగినులను కాశీకి పంపించాడట. వాళ్లందరికీ కాశీ పట్టణం నచ్చడంతో అక్కడే ఉండిపోయేందుకు సిద్ధమయ్యారట. ఆ యోగినులలో వారాహి దేవి కూడా ఉందనీ... అప్పటినుంచీ అమ్మవారు కాశీని దుష్టశక్తుల నుంచి కాపాడే గ్రామదేవతగా వ్యవహరిస్తోందనీ ప్రతీతి. వారాహిదేవి సూరాస్తమయమయ్యేసరికి ఆలయం నుంచి బయటకు వచ్చి కాశీ నగర సంచారం చేసి తిరిగి తెల్లవారుజామున గుడికి చేరుకుంటుందట. అలా వచ్చినప్పుడే పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత దేవి విశ్రాంతి తీసుకుంటుందని అంటారు. అమ్మవారిది ఉగ్రస్వరూపం కావడంతోపాటూ, ఆమె ప్రశాంతతకు భంగం కలగకుండా ఉండేందుకే తలుపులు మూసేస్తారని చెబుతారు.

వరప్రదాయిని

పాండవులు కూడా ఈ అమ్మవారిని దర్శించుకున్నారనీ, ఇక్కడ దేవిని నేరుగా చూడలేక పోయినా, కొలిచిన వారికి ఆమె కొంగుబంగారమనీ భక్తుల నమ్మకం. అనారోగ్య సమస్యలూ, కోర్టుకేసులూ, దుష్టశక్తుల బెడదలూ ఉన్నవారు ఈ ఆలయానికి ఎక్కువగా వస్తుంటారని అంటారు. రోజువారీ జరిగే పూజలు ఒకెత్తయితే... ఆషాఢమాసంలో అమ్మవారికి ప్రత్యేక నవరాత్రులు నిర్వహించడం మరొకెత్తు. అదే విధంగా శ్రావణమాసంలో చేసే ఉత్సవాలతోపాటూ దసరా నవరాత్రుల సమయంలోనూ విశేష పూజలు చేస్తారు. ఒకప్పుడు ఇక్కడ నరబలులు కూడా ఇచ్చేవారట. క్రమంగా అది పోయి అమ్మవారికి రక్తాభిషేకాన్ని నిర్వహించేవారనీ ఇప్పుడు ఆ ఆచారం కూడా పోయిందనీ చెబుతారు. లక్ష్మీదేవి స్వరూపంగానూ కొలిచే వారాహిదేవిని బౌద్ధులు వజ్ర వారాహినిగా పిలుస్తారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న వారాహి దేవి ఆలయాల్లో అమ్మవారిని రకరకాల పేర్లతో కొలుస్తున్నా పూజల్ని మాత్రం ఎక్కువగా రాత్రిపూటే నిర్వహించే సంప్రదాయం కొనసాగుతోంది. ప్రధానంగా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో విశేష పూజలు జరుపుతారు.

ఎలా చేరుకోవచ్చు

ఈ ఆలయం వారణాసిలోని విశ్వనాథ ఆలయం నుంచి నడిచివెళ్లేంత దూరంలో ఉంటుంది. వారణాసికి విమానం లేదా రైల్లో చేరుకుంటే... అక్కడినుంచి వారాహిదేవి ఆలయానికి వెళ్లి ఉదయం అయిదు నుంచి ఎనిమిదిలోపు దర్శించుకోవచ్చు.

Tags: కాశీ వారాహీ, Kashi Varahi Devi , Kashi Varahi Devi Temple History, Kashi Varahi Devi Temple History Telugu, Kashi Varahi Devi, Kashi Varahi Devi Temple, Varahi, Varahi Temples, Varahi Stotram, Varahi Mantram, Varanasi

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS