Drop Down Menus

పీకల్లోతు అప్పుల్లో ఉన్నారా.. ఈ గుడికి వెలితే మీ ఆర్థిక కష్టాలు తీరినట్లే! Sri Bugulu Venkateshwara Swamy Devastanam , Chilpuru Gutta, Telangana

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం

ఈ రోజుల్లో అప్పు లేని వారంటూ లేరనే చెప్పొచ్చు. ఎంత కోటీశ్వరులైనా గానీ ఎంతో కొంత బాకీ పడే ఉంటున్నారనడంలో సందేహం లేదు. చేసిన అప్పులు తీర్చలేక వడ్డీలకు వడ్డీలు కడుతూ బాధను అనుభవించేవారు చాలామందే ఉంటారు.

చాలీ చాలని జీతం.. అప్పు చేయనిదే గడవని వైనం. అప్పు చేయడం సరే తీరే మార్గం ఏది.. ఆపద మొక్కుల వాడు ఆదుకుంటే ఏమైనా సాధ్యమవుతుందేమో అని ఆశ పడుతుంటారు సగటు మధ్యతరగతి జీవులు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు అప్పులు చేయడానికి కారణమవుతాయి. అప్పుల సమస్యతో బాధపడేవారు గుబులు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతుంటారు స్వామిని దర్శించుకున్న భక్తులు.

మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది.. ఆలయ విశేషాలు తెలుసుకుందాం..

హైదరాబాద్‌ వరంగల్‌ హైవేలో చిల్పూరు గుట్టలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది.

ఈ వేంక‌టేశ్వ‌ర‌స్వామిని" బుగుల్" లేదా "గుబులు "వేంక‌టేశ్వ‌ర‌స్వామి అని పిలుస్తారు.

*‘కలి కల్మష నాశాయ*

*కామితార్థ ప్రదాయినే*

*చిల్పూరుగిరి నివాసాయ* *శ్రీనివాసాయమంగళం*’  ...అని కీర్తిస్తే చాలు అప్పుల్లో కూరుకుపోయిన వారికి ఋణవిముక్తి కలిగిస్తాడు, భయంతో వణికిపోతున్నవారికి అభయాన్ని ప్రసాదిస్తాడు, చింతల్లో చిక్కుకున్నవారిని ఒడ్డున పడేస్తాడు, కొత్త దంపతులకు కోరిన వరాలిస్తాడు - అంటూ చిల్పూరు గుట్టమీద కొలువైన ‘బుగులు’ వేంకటేశ్వరస్వామి మహత్యాన్ని భక్తులు పరవశంగా చెబుతారు.

ఈ ఆలయంలో ఉన్న అఖండ దీపంలో నూనె పోసి, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే స్వామి వారి అనుగ్రహంతో అప్పులు తీరతాయని భక్తుల నమ్మకం.

ప్రతీ శుక్రవారం జరిగే అభిషేకంలో పాల్గొన్నా, శనివారం జరిగే ప్రత్యేక పూజను చూసినా స్వామి వారి అనుగ్రహం కలుగుతుందట.

వెంకటేశ్వర స్వామి అప్పుల బాధ నుండి బయట పడటానికి ఇక్కడకు వచ్చి తపస్సు చేసుకున్నారు కాబట్టి ఇక్క‌డ‌కు వ‌చ్చి స్వామివారిని ద‌ర్శనం చేసుకుంటే ఎలాంటి అప్పుల బాధ‌లున్నా స‌రే ఆ బాధ‌ల నుంచి విముక్తి పొందుతార‌ని ప్ర‌జ‌ల విశ్వాసం.

స్థల పురాణం

శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారు వివాహం చేసుకోవ‌డం కోసం కుబేరుని దగ్గ‌ర ధ‌నాన్ని అప్పుగా తీసుకున్నారని మ‌నంద‌రికి తెలిసిందే.

ఋణభారం ఎవర్నీ స్థిమితంగా ఉండనీయదు, ప్రశాంతంగా నిద్రపోనివ్వదు. ఆ అప్పుల బాధ ఆదినారాయణుడినీ వదిలిపెట్టలేదు.

అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో, వడ్డీలు ఎలా కట్టాలో అర్థం కాక...పరిపరి విధాలుగా ఆలోచిస్తూ...తిరుమల నుంచి బయల్దేరి చిల్పూరు గుట్టదాకా నడుచుకుంటూ వచ్చేశాడట. అలసిసొలసి దగ్గర్లోని గుహలో విశ్రమించాడట.

స్వామి బయల్దేరాడంటే అనుచరగణం మాత్రం అక్కడే ఉంటుందా?

దేవదేవుడి వెంట ఆంజనేయుడూ, గరుత్మంతుడూ, ఆళ్వార్లూ కూడా తరలివచ్చారు. భయంభయంగా (గుబులుతో) వచ్చి కొండ గుహలో తలదాచుకోవడంతో ‘గుబులు’ వేంకటేశ్వర స్వామిగా పేరు వచ్చింది. స్థానిక వ్యవహారంలో ‘గుబులు’ కాస్తా ‘బుగులు’గా మారినట్టు స్థల పురాణం.

శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారు ఈ గుట్ట‌కు వ‌చ్చిన‌ప్పుడు ఆ కొండ క్రింద భాగంలో స్వామివారి పాదాల గుర్తులు ఏర్ప‌డ్డాయి. స్వామివారి పాదాలు ఉన్న చోటుని పాదాల గుండు అనే పేరుతో పిలుస్తారు. ఇక్క‌డే ఒక అఖండ దీపం వెలిసింద‌ని స్థలపురాణం మ‌న‌కు తెలియ‌జేస్తోంది.

కుబేరుడి దగ్గర అప్పు చేసిన స్వామికి ఋణబాధ ఎంత తీవ్రమైందో తెలుసు. కాబట్టే, భక్తుల్ని కటాక్షించి ఋణవిమోచన కలిగిస్తాడు. పేరులోనే ‘దిగులు’ ఉన్న దేవుడికి జనం బాధలూ ఎరుకే. అందుకే, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇట్టే తీర్చేస్తాడు.

కాకతీయుల కాలానికే ఇక్కడో చిన్న దేవాలయం ఉంది. పూర్వం ఇది దట్టమైన అటవీప్రాంతం. ఇక్కడి చెట్లూ పుట్టలూ మహర్షుల రాకపోకలతో పునీతం అయ్యాయి. ఓ కథనం ప్రకారం.. ఋషి బృందానికి స్వామి స్వప్నదర్శనమిచ్చి తాను కొండ మీదున్న గుహలో వెలసినట్టు చెప్పాడు. దీంతో రుషి గణమంతా సూర్యోదయ సమయాని కంతా చేరుకుని ‘కౌసల్యా సుప్రజారామ...’ అంటూ మేలుకొలుపుతో ప్రారంభించి ‘జో అచ్యుతానంద...’ అంటూ జోలపుచ్చేదాకా అక్కడే గడిపి తిరిగివచ్చేవారట.

అనంతర కాలంలో, స్థానిక ప్రజలకు వేంకటేశ్వరుడు కలలో కనిపించి తన ఆనవాళ్లు చెప్పాడు. అంతా కలసి ఓ గుడి కట్టారు. అయితే, వయోధికులు స్వామిని చేరుకోవడం గగనంగా ఉండేది. దీంతో గుట్ట కింద వేంకటేశ్వరుడి పాదాలున్న చోట ఇంకో గుడి కట్టారు.

కానుకలకో ఆడంబరాలకో కరిగిపోయే దేవుడు కాదు ఈ శ్రీనివాసుడు.

‘అన్యధా శరణం నాస్తి’ అన్న శరణాగతి సూత్రాన్ని త్రికరణశుద్ధిగా నమ్మాలి.

‘అప్పు’డే అపార అనుగ్రహం కురిపిస్తాడు.

ఫాల్గుణ శుద్ధ సప్తమి నుంచి పౌర్ణమి దాకా తొమ్మిది రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి.

హైదరాబాద్‌-వరంగల్‌ ప్రధాన రహదారిలో... స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో...చిన్నపెండ్యాల ఉంది. గ్రామ ప్రధాన కూడలి దగ్గర ఆలయ ప్రవేశ తోరణం కనిపిస్తుంది.

ఆ మార్గంలో పది కిలోమీటర్లు ప్రయాణిస్తే దేవస్థానాన్ని చేరుకోవచ్చు.

Tags: Chilpur gutta Temple Timings, Chilpur gutta temple history in telugu, Chilpur Gutta temple contact number, Warangal to Chilpur Gutta distance, Hyderabad to Chilpur Gutta distance, Ghanpur to Chilpur gutta distance, Sri Bugulu Venkateswara Swamy Temple

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments