తిరుమల, 2026 జనవరి 20: టీటీడీ నిర్వహిస్తున్న ఉచిత వివాహాలకు నూతన వధూవరుల నుండి విశేష స్పందన లభిస్తుంది. టీటీడీ 2016 ఏప్రిల్ 25వ తేదీ నుండి తిరుమల పాపావినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద ఉచితంగా వివాహాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.
తిరుమలలోని కల్యాణ వేదికలో 2016 ఏప్రిల్ 25 నుండి 2025 డిసెంబర్ 31వ తేదీ వరకు దాదాపు 26,777 వివాహాలు అయ్యాయి. ఇందులో భాగంగా పురోహితుడు, మంగళవాయిద్యంతో పాటు పెళ్లి సమయంలో పసుపు, కుంకుమ, కంకణంను టీటీడీ ఉచితంగా అందిస్తుంది.
వివాహానికి కావాల్సిన ఇతర సామాగ్రిని మాత్రం వధూవరులే తీసుకురావాల్సి ఉంటుంది. వివాహానికి వధూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. పెళ్లికి రాలేని పక్షంలో అందుకు సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాలి.
వివాహం అనంతరం రూ.300/- ల ప్రత్యేక ప్రవేశం ద్వారా పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తెతోపాటు ఇరువురి తల్లిదండ్రులను కలుపుకుని మొత్తం 6 మందికి (తల్లిదండ్రులలో ఎవరైనా మరణించిన ఎడల మిగిలిన వారికి మాత్రమే) ఏటీసీ వద్ద గల క్యూలైన్ ద్వారా ఉచితంగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. దర్శనానంతరం మ్యారేజ్ రిసిప్ట్ నందు ఎంతమంది ఉంటే అంతమందికి ఉచితంగా లడ్డూలను లడ్డూ కౌంటర్ వద్ద పొందవచ్చు.
ఆన్లైన్లోనే బుకింగ్ కు అవకాశం
తిరుమలలోని కళ్యాణ వేదికలో ఉచిత వివాహలు చేసుకునేందుకు ఆన్లైన్లో కల్యాణవేదిక స్లాటును బుక్ చేసుకునే సదుపాయాన్ని 2016 మే 9వ తేదీ నుండి టీటీడీ కల్పించింది. ఇందుకోసం https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
అక్కడ ఉన్న కల్యాణవేదిక కాలమ్ లో అబ్బాయి, అమ్మాయి వివరాలను నమోదు చేయాలి. వధూవరులు తప్పనిసరిగా తల్లిదండ్రుల వివరాలను నమోదు చేయడమే కాక ఆధార్ కార్డు వివరాలను నమోదు చేయాలి. వయసు ధృవీకరణ కోసం బర్త్ సర్టిఫికేట్ లేదా పదో తరగతి మార్కుల లిస్టు/ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ లేదా పంచాయతీ కార్యదర్శి/ మున్సిపల్ అధికారులు ధృవీకరించిన బర్త్ సర్టిఫికేట్ నెంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు అందులో వివాహ తేది, సమయాన్ని వారే నిర్ణయించుకుని అప్లోడ్ చేస్తే అక్నాలెడ్జ్మెంట్ పత్రం జారీ అవుతుంది. కొత్తగా పెళ్లి చేసుకునే వారు ఆ అక్నాలెడ్జ్మెంట్ పత్రాన్ని తీసుకుని వధూవరులు ఇరువురు వారి సంబంధిత MRO (తహసిల్దార్) గారి దగ్గర ఇదే మొదటి వివాహం (UN MARRIED CERTIFICATE) అని ధృవీకరణ పత్రం తీసుకొని కేవలం 6 గంటల ముందు తిరుమల చేరుకుని కల్యాణ వేదిక వద్ద ఉన్న కార్యాలయంలో సంబందిత MRO (తహసిల్దార్) గారి దగ్గర సంతకం చేసుకొన్న అక్నాలెడ్జ్మెంట్ పత్రాన్ని మరియు అన్ని పత్రాలు (వధూవరులు, తల్లిదండ్రులు ఆధార్ కార్డు, వయసు ధృవీకరణ పత్రం) జిరాక్స్ పత్రాలు అక్కడి సిబ్బందికి ఇచ్చి వారి వివరాలను మరోసారి అక్కడి సిబ్బంది ద్వారా పరిశీలించుకోవాలి.
తిరుమలలోని కళ్యాణ వేదికలో ఉచిత వివాహలు చేసుకునేవారికి అవకాశాన్ని బట్టి ఒక Rs.50/-రూమ్ CRO/ARP కార్యాలయం వద్ద పొందవచ్చు.
ఆన్లైన్లో బుక్ చేసుకునే జంటలు తిరుమలలో ఉచితంగా వివాహం చేసుకొనుటకు తప్పనిసరిగా హిందూ మతస్తులై ఉండాలి. వధువుకు 18 సంవత్సరాలు, వరునికి 21 సంవత్సరాలు నిండివుండాలి. ద్వితీయ వివాహములు మరియు ప్రేమ వివాహములు ఇక్కడ జరుపబడవు. ఇతర వివరాలకు ఫోన్ – 0877- 2263433 సంప్రదించవచ్చు.
వివాహ రిజిస్ట్రేషన్ కొరకు
తిరుమలలో వివాహం చేసుకున్న నూతన వధూవరులు తమ వివాహన్ని రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిందూ వివాహ సబ్ రిజిస్ట్రారు వారి కార్యాలయాన్ని కల్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసింది. ఇందుకోసం నూతన వధూవరులు తమ వయస్సు ధృవ పత్రములు, నివాస ధృవ పత్రము, వివాహము ఫోటో, పెండ్లి పత్రిక, కళ్యాణ మండపము రసీదు పత్రాలను, వీటితో పాటు అవివాహితులుగా (అన్ మ్యారీడ్) ఉన్నట్లు స్థానిక ఎమ్మార్వో నుండి ధృవీకరణ పత్రాలను కల్యాణ వేదిక వద్ద అధికారులకు సమర్పించాలి.
ఇతర వివరాలకు ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయంలో నేరుగా లేదా ఫోన్ 0877 – 2263433 ద్వారా సంప్రదించవచ్చు.
తిరుమలలో వివాహం చేసుకునే దంపతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.
నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలోని కల్యాణ వేదికలో గత పదేళ్లలో జరిగిన వివాహాల సంఖ్య (సంవత్సరాల వారీగా) :
– 2016-17లో 2731
– 2017-18లో 4705
– 2018-19లో 5047
– 2019-20లో 4443
– 2020-21లో 91
– 2021-22లో 1298
– 2022-23లో 2133
– 2023-24లో 2458
– 2024-25 (డిసెంబర్ వరకు)లో 3871
మొత్తం వివాహాల సంఖ్య: 26,777.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
keywords : free marriage at tirumala, tirumala kalyanavedika , tirumala marriage online application, tirumala free marriage form, tirumala, tirumala new marriage,
