Manasa Sarovaram Yatra Information

కొన్ని వేల ఏళ్ల నుంచి హిందువుల నమ్మకాలు ఇవి. అందుకే జీవితంలో ఒకసారైనా- మానస సరోవరంలో స్నానం చేయాలని.. కైలాస పర్వతాన్ని దగ్గరగా చూసి ప్రదక్షిణం చేయాలని కోట్లాది మంది భావిస్తూ ఉంటారు. కాని సముద్రమట్టానికి దాదాపు 15 వేల అడుగుల ఎత్తున ఉన్న మానస సరోవరాన్ని.. దానికి సమీపంలో ఉన్న కైలాస పర్వతాన్ని అధిరోహించటం అంత సులభం కాదు. అందుకే చాలా మందికి కైలాస యాత్ర ఒక కల.
తీరని కోరిక. కాని ఇప్పుడు చైనా ప్రభుత్వం అక్కడికి సులభంగా చేరుకోవడానికి ఏర్పాట్లు చేస్తోంది. భారీ వాహనాలు సైతం సునాయాసంగా ప్రయాణించటానికి వీలుగా రోడ్లు.. కొండ చరియలు విరిగి పడకుండా ఇనుప కంచెలు.. హఠాత్తుగా వరదలు వచ్చి రోడ్డు కొట్టుకుపోకుండా పక్కనే కాలువలు వంటి అనేక సదుపాయాలను కల్పిస్తోంది. వచ్చే ఒకటి రెండేళ్లలో ఈ యాత్రను సులభంగా పూర్తి చేసుకొని తిరిగి వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ప్రపంచంలో అత్యంత కఠినమైన యాత్రలలో కైలాస యాత్ర ఒకటి. వేల అడుగుల నుంచి జారిపడే జలపాతాలు, పెట్టని కోటల్లా ఎటువైపు చూసినా కనిపించే పర్వతాలు, అడుగు జారితే ఎముకలు కూడా దొరకవనే భయం కలిగించే లోయలు- ఇవన్నీ కైలాస యాత్రలో భాగాలు. ఒక విధంగా మానస సరోవరానికి, కైలాస పర్వతానికి ఆకర్షణను కలిగించేవి కూడా ఇవే. హిందూ పురాణాలలోను, కావ్యాలలోను ఈ ప్రదేశాల గురించి సవివరమైన వర్ణనలు ఉన్నా, అనుభవైక్యం అయితే తప్ప వాటి గొప్పతనం అర్థం కాదు. చైనా అధీనంలో ఉన్న టిబెట్ ప్రాంతంలో మానస సరోవరం, కైలాస పర్వతం రెండూ ఉన్నాయి. ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో ఉన్న మంచి నీటి తటాకం మానస సరోవరం.
దీనికి పశ్చిమంగా రాక్షసతాల్ అనే సరోవరం, ఉత్తర భాగంలో కైలాస పర్వతం ఉంటాయి. సముద్ర మట్టానికి పదిహేను వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ సరోవర చుట్టుకొలత దాదాపు 88 కిలోమీటర్లు ఉంటుంది. లోతు దాదాపు మూడు వందల అడుగుల దాకా ఉంటుంది. బ్రహ్మ మదిలో ఈ సరోవరం పుట్టిందని.. బ్రహ్మే దీనిని భూమిపైకి తీసుకువచ్చాడని హిందూపురాణాలు చెబుతాయి. బ్రహ్మ మానసంలో(మనసు) పుట్టింది కాబట్టి దీనికి మానససరోవరం అనే పేరు వచ్చిందని కూడా చెబుతారు. ఈ సరోవరంలో స్నానం చేస్తే వంద జన్మల్లో చేసిన పాపాలన్నీ పోతాయనేది హిందువుల నమ్మకం.
బౌద్ధ జాతక కథలలోను, ఇతర గ్రం«థాలలోను కూడా ఈ సరోవరం ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. ‘అనవతప్త’ అని బౌద్ధులు పిలుచుకొనే ఈ సరోవరం ఒడ్డున ‘చూ గంప బౌద ్ధఆరామం’ ఉంది. బుద్ధుడు భూమిపై ఉద్భవించటానికి బీజం ఈ సరోవరం ఒడ్డునే పడిందనేది బౌద్ధుల నమ్మ కం. నిజానికి ఎన్ని వేల ఏళ్ల నుంచి ఇక్కడ జనసంచారం ఉందనే విషయాన్ని చెప్పటానికి కచ్చితమైన ఆధారాలేమీ లేవు. కొన్ని వేల ఏళ్ల నుంచి భారత ఉపఖండంలో నుంచి ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి వెళ్తున్నారనే విషయంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు.
రెండు మార్గాలు..
ఒకప్పుడు ఈ ప్రదేశాలను సందర్శించటానికి ఒకే ఒక మార్గం అందుబాటులో ఉండేది. మన దేశం నుంచి ఆ ప్రాంతానికి వెళ్లి తిరిగి రావడానికి కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలలు పట్టేది. పర్వతాలలో కాలిబాటలు తప్ప వేరే మార్గమే ఉండేది కాదు. యాత్రకు వెళ్లాలనుకొనేవారు ముందు నేపాల్ చేరుకొనేవారు. ఖాట్మండులోని పశుపతినాథుడి ఆలయాన్ని సందర్శించుకొని.. అక్కడి నుంచి కాలినడకన మానస సరోవరానికి బయలుదేరేవారు. వెంట పశువుల్ని తీసుకెళ్లి పర్వత సానువుల్లో పెరిగే గడ్డిని తినటానికి ముందుగా వాటిని వదిలేవారు. ఆ పశువులు వెళ్లే మార్గాన్ని గమనిస్తూ వాటి వెనకే వెళ్లేవారు. ఎముకలు గడ్డకట్టే చలిలో ఆహారం దొరకక, ఆక్సిజన్ సరిగ్గా అందక మరణించే వారి సంఖ్య కూడా అధికంగానే ఉండేది.

అందుకే ఒకప్పుడు మానస సరోవర యాత్రకు వెళ్లి వచ్చిన వారిని ప్రజలు మృత్యుంజయులుగా చూసేవారు. వారిని అమితంగా గౌరవించేవారు. మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఆ తర్వాత కూడా టిబెట్‌లోను, అక్కడి మౌలిక సదుపాయాల విషయంలోను ఎటువంటి మార్పు రాలేదు కాని భారత్, చైనాల మధ్య కొన్ని వివాదాలు చెలరేగాయి. దీనితో 1954లో చైనా ప్రభుత్వం కైలాస పర్వతాన్ని సందర్శించటానికి భారత యాత్రికులకు అనుమతి ఇవ్వటం మానేసింది. ఆ సమయంలో కూడా కొందరు నేపాల్ చేరుకొని అక్కడి నుంచి రహస్యంగా కైలాస పర్వతాన్ని సందర్శించటానికి వెళ్లేవారు. అదెలాగున్నా 24 ఏళ్ల తర్వాత- 1978లో చైనా సర్కారు మళ్లీ భారత యాత్రికులను ఈ ప్రాంతానికి అనుమతించటం ప్రారంభించింది.
ప్రతి ఏడాది దాదాపు వెయ్యి మందిని మాత్రమే అనుమతించేవారు. అతి తక్కువ మందిని అనుమతించటం కూడా ఈ యాత్రకు అదనపు ఆకర్షణగా తయారయింది. 1990ల తర్వాత టిబెట్ పట్ల చైనా ప్రభుత్వ వైఖరి మరింత కఠినమయింది. ఇదే సమయంలో- ఈ ప్రాంతంలోకి యాత్రికులను అనుమతించటం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా చైనా గుర్తించింది. దీనితో 1995 తర్వాత ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల రూపకల్పనకు పథకాలు సిద్ధం చేయటం మొదలుపెట్టింది. ఒకప్పుడు కేవలం పర్వత మార్గం ద్వారానే యాత్రికులకు అందుబాటులో ఉండే కైలాస పర్వతం దగ్గరకు హెలికాప్టర్ సర్వీసు కూడా ప్రారంభమయింది. దీనితో కైలాస పర్వతం సందర్శించటానికి రెండు మార్గాలు ఏర్పడ్డాయి.
అయితే ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో చెప్పలేం. ఏ నిమిషంలో వాన పడుతుందో.. ఏ నిమిషంలో ఎండ వస్తుందో కనుగొనటం చాలా కష్టం. అంతే కాకుండా కొన్ని సార్లు పర్వతాలలో విపరీతమైన మంచు కురుస్తుంది. కొన్ని రోజుల పాటు సూర్యకాంతి ఉండదు. అటువంటి పరిస్థితుల్లో హెలికాప్టర్‌లలో ప్రయాణం చాలా ప్రమాదం. పైగా ఖర్చు ఎక్కువ. దీనితో ఎక్కువ మంది యాత్రికులు రోడ్డు మార్గంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మూడేళ్ల క్రితం టిబెట్‌లోని కొందరు బౌద్ధ బిక్షువులు చైనా ప్రభుత్వంపై తిరగబడడంతో దాన్ని వెంటనే అణచి వేసినప్పటికీ చైనా ఆలోచనల్లో మార్పు వచ్చింది. తమ సైన్యం టిబెట్‌లోని మారుమూల ప్రాంతాలకు సైతం త్వరగా చేరుకోవటానికి వీలుగా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే మానస సరోవరం, కైలాస పర్వతానికి రోడ్ల నిర్మాణం ప్రారంభించింది.
70 శాతం పూర్తి..

మానస సరోవరానికి, కైలాస పర్వతానికి చేరుకోవటానికి రోడ్డు ద్వారానే రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది- నేపాల్ నుంచి టిబెట్‌లోకి ప్రవేశించి జాంగ్ము, సాగాల మీదుగా మానససరోవరం చేరుకోవటం. ఖాట్మండు నుంచి టిబెట్ సరిహద్దుల్లో ఉండే ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జ్‌కు చేరుకోవటానికి కనీసం ఆరు గంటలు పడుతుంది. వేల అడుగుల లోతైన లోయల పక్క నుంచి.. హఠాత్తుగా విరిగి పడే కొండచరియలతో ఈ ప్రయాణం అత్యంత కఠినంగా ఉండేది. ఇప్పుడు కూడా ఈ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేదు. ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జి దాటిన తర్వాత జాంగ్మూకు చేరుకోవటానికి ఒకప్పుడు 12-14 గంటలు పట్టేది. ఒకప్పుడు మట్టి రోడ్లు మాత్రమే ఉండే ఈ ప్రాంతంలో ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి ఏ మాత్రం తగ్గని తారురోడ్లు వచ్చేసాయి.
అందువల్ల ఇప్పుడు ఏడెనిమిది గంటల్లో వెళ్లిపోగలుగుతున్నారు. అయితే వీటితో పాటు ప్రతి ఇరవై కిలోమీటర్లకు ఒక సైనిక శిబిరం కూడా వచ్చింది. జాంగ్మూ నుంచి సాగాకు, సాగా నుంచి మానస సరోవరానికి వెళ్లే రోడ్లు, ఆ దారిలోని మౌలిక సదుపాయాలు కూడా గణనీయంగా అభివృద్ధి చెందాయి. సాగా నుంచి మానస సరోవరానికి గత ఏడాది 30 శాతం మాత్రమే తారు రోడ్డు ఉంటే.. ఈ సారి అది 70 శాతానికి పెరిగింది. దీని వల్ల పన్నెండు నుంచి పదహారు గంటలు పట్టే ప్రయాణ సమయం ఎనిమిది గంటలకు తగ్గిపోయింది. ఈ ప్రాంతంలో మిగిలిన చోట్ల కూడా యుద్ధ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం ప్రారంభమయింది.
వచ్చే ఏడాది మానస సరోవర యాత్ర ప్రారంభమయ్యే నాటికి సాగా నుంచి మానస సరోవరానికి ఆరు గంటల్లో వెళ్లిపోవచ్చంటే అతిశయోక్తి కాదు. మానస సరోవరం నుంచి కైలాస పర్వతం బేస్‌క్యాంపు దాకా కూడా చైనా ప్రభుత్వం రోడ్ల నిర్మాణం ప్రారంభించింది. ఈ ఏడాది బేస్‌క్యాంపు నుంచి కైలాస పర్వతం కింది దాకా జీపులపై వెళ్లటానికి కూడా కొందరికి అనుమతులు ఇచ్చింది. ఇదే ఒరవడి ఇంతే జోరుగా కొనసాగితే- కైలాస పర్వతానికి నేరుగా జీపుల్లో వెళ్లే అవకాశం ఏర్పడవచ్చు. అంటే వచ్చే రెండు,మూడేళ్లలో- మానస సరోవర యాత్ర- చాలా మందికి ఒక పిక్నిక్‌గా మారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే అదనంగా ఐదు వేల యువాన్‌లు- అంటే 40 వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది.

ఉక్కు కవచం..
ఒక పక్క వేల మంది యాత్రికులు సునాయాసంగా కైలాస్ మానససరోవర యాత్రకు రావటానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న చైనా ప్రభుత్వం.. మరోవైపు వారిపై అంతే కఠినమైన ఆంక్షలు కూడా విధిస్తోంది. ఉదాహరణకు ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జి దాటడానికి (అంటే టిబెట్‌లో ప్రవేశించటానికి) ఎంత సమయం పడుతుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. కొందరు యాత్రికులకు రెండు రోజులు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే విధంగా దలైలామా గురించి కాని.. టిబెట్ స్వాతంత్య్ర పోరాటం గురించిగాని పుస్తకాలు పట్టుకెళితే – వారికి టిబెట్‌లో ప్రవేశం ఉండదు.
జాంగ్ము, సాగా వంటి పట్టణాలలో ఫోటోలు తీయటాన్ని కూడా చైనా సైన్యం నిషేధించింది. సాగాలో బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇది చాలా పవిత్రమైన స్థలమని హిందువుల, బౌద్ధుల ఇద్దరి విశ్వాసమూ. అందువల్ల చాలామంది ఈ నదీ తీరాన ప్రార్థనలు చేయటానికి ప్రయత్నిస్తూ ఉం టారు. అయితే ఈ నదీతీరానే చైనా సైనిక శిబిరం కూడా ఉంది. అందువల్ల ఇక్కడ ప్రార్థనలు చేయటాన్ని.. ఫోటోలు తీయటాన్ని ఈ ఏడాది కొత్తగా నిషేధించారు. ఇక మానససరోవర ప్రాంతంలోని గుడారాలలో నివసించే వారిని చైనా సైన్యం అనుక్షణం గమనిస్తూ ఉంటుంది. ఇవన్నీ కలిసి తీర్థయాత్రలోని ఆనందాన్ని మనకు తగ్గించేస్తున్నాయని చైనావాళ్లు గుర్తిస్తున్నట్టు లేరు.
ఎవరూ అధిరోహించని కైలాస పర్వతం
కైలాసపర్వతాన్ని టిబెటన్ భాషలో రిన్‌పోచి అని పిలుస్తారు. ప్రతి ఏడాది వేల మంది హిందూ భక్తులు కైలాస పర్వత ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. టిబెటన్లు కూడా ఈ పర్వతాన్ని అతి పవిత్రంగా భావిస్తారు. ఈ పర్వతంపై పాదం మోపటం పాపంగా భావిస్తారు. అందువల్ల వీరు మోకాళ్లపై కైలాస పర్వతాన్ని ఎక్కుతారు. హిందువులు ఎక్కువగా కైలాస పర్వతం చుట్టూ 52 కిలోమీటర్ల ప్రదక్షిణ చేస్తారు కాని పర్వతాన్ని అధిరోహించరు. అయితే పాశ్చాత్య దేశాలకు చెందిన అనేక మంది సాహసికులు కైలాస పర్వతాన్ని అధిరోహించటానికి గతంలో ప్రయత్నించారు. అయితే ఏదో ఒక కారణం వల్ల ఈ ప్రయత్నాలు విఫలమవుతూ వచ్చాయి. 1926లో హ్యుగ్ రటిల్ఎడ్జ్ అనే బ్రిటిష్ సాహసికుడు చేసిన ప్రయత్నం చరిత్రలో నమోదు అయిన తొలి ప్రయత్నం. 1936లో హ్యుబర్ట్ టిచి అనే వ్యక్తి కూడా ఈ పర్వతాన్ని అధిరోహించటానికి ప్రయత్నించాడు.
అయితే చివరి నిమిషంలో అతను ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. 1950 నుంచి 80 దాకా చైనా ప్రభుత్వం ఈ పర్వతాన్ని ఎక్కడానికి ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. 1980లో రిన్‌హోల్డ్ మెస్‌నర్ అనే వ్యక్తికి ఈ అవకాశాన్ని కల్పించింది. అయితే మెస్‌నర్ ఈ అవకాశాన్ని ఎందుచేతో ఉపయోగించుకోలేదు. ఆ తర్వాత 2001 దాకా కైలాస పర్వతాన్ని అధిరోహించటానికి పెద్దగా ప్రయత్నాలు జరగలేదు. 2001లో స్పెయిన్‌కు చెందిన జీసస్ మార్టినిజ్ నోవాస్ నేతృత్వంలోని ఒక బృందానికి చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కైలాస పర్వతం హిందూ మత విశ్వాసాలతో ముడిపడి ఉందని.. అందువల్ల దానిని అధిరోహించటానికి అనుమతి ఇవ్వకూడదంటూ అంతర్జాతీయంగా ఒత్తిడి వచ్చింది. దీనితో చైనా ప్రభుత్వం అనుమతిని ఉపసంహరించుకుంది. ఈ పర్వతాన్ని అధిరోహించటానికి ఎవరికీ అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది.
అతి పవిత్రం మానస సరోవరం..

* బ్రహ్మపుత్ర, కర్ణాలి (గంగ), సింధు, సట్లజ్ నదులు మానస సరోవరం నుంచి పుట్టాయని భక్తుల భావన. అయితే దీనికి ఖచ్చితమైన ఆధారాలేమీ లేవు.
* సాధారణంగా ఈ ప్రాంతంలోకి యాత్రికులను బౌద్ధ పూర్ణమి నుంచి దీపావళి వరకు అనుమతిస్తారు. కొన్నిసార్లు వాతావరణాన్ని బట్టి ఇది మారుతుంది కూడా. ఆ కాలంలో కూడా ఉష్ణోగ్రత కొన్నిసార్లు మైనస్‌కి వెళ్లిపోతుంది.
* భారత ప్రభుత్వం ఏడాదికి 750 మందిని మాత్రమే ఈ యాత్రకు పంపిస్తుంది. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి. వారు నేరుగా చైనా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు.
* మానస సరోవర ప్రాంతంలో తెల్లవారు జాము రెండున్నర నుంచి నాలుగున్నర వరకూ ఆకాశంలో విచిత్రమైన కాంతి కనిపిస్తుంది. ఈ సమయంలో దేవతలు స్నానం చేయటానికి ఆ సరోవరానికి వస్తారనేది భక్తుల నమ్మకం. ఈ కాంతిని చూడటానికి భక్తులు ఆసక్తి చూపిస్తుంటారు.
* చైనా ప్రభుత్వం మానస సరోవర ప్రాంతంలో కొన్ని నిర్మాణాలు చేపట్టింది. ఒక ప్రైవేట్ సంస్థ ఇక్కడ ఒక హోటల్‌ను కూడా నిర్మిస్తోంది. ఇటువంటి నిర్మాణాల వల్ల మానస సరోవర పవిత్రత దెబ్బతింటుందని.. పర్యావరణానికి కూడా హాని కలుగుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రాంతమంతా శక్తిమయం....
సైన్స్ ప్రకారం- కొన్ని ప్రాంతాల్లో అక్కడున్న పరిస్థితుల వల్ల ఎక్కువ శక్తి (ఎనర్జీ) ఉంటుంది. దానిని ఉపయోగించుకోగలిగితే అనేక లాభాలు ఉంటాయి. మానస సరోవరం, కైలాస పర్వతం అలాంటి ప్రాంతాలు. నేను ఈ ప్రాంతానికి గత ఏడేళ్లుగా వస్తున్నాను. వచ్చిన ప్రతి సారి ఒకో విధమైన అనుభూతి ఏర్పడుతూ ఉంటుంది. దానిని నేను మాటల్లో వర్ణించలేను. మానస సరోవరంలో రాత్రి వేళ అనేక కాంతులు కనిపిస్తూ ఉంటాయి. ఇవి మనకు కనిపించే శక్తిరూపాలు. ఇక కైలాస పర్వతం గురించి చెప్పాలంటే ఆదిముని- ఈశ్వరుడు మానవ ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించటానికి మొదట ఈ ప్రాంతానికే వచ్చాడు. మూడు నాలుగు నెలల పాటు కదలకుండా మెదలకుండా ధ్యానం చేస్తూ ఉండిపోయాడు. ఈశ్వరుడిని చూడటానికి పెద్ద గుంపు తయారయింది. ధ్యానంలో ఉన్న యోగి ఏవో అద్భుతాలు చేస్తాడని అందరూ ఎదురుచూస్తున్నారు.
రోజులు గడుస్తున్నాయి. ఎటువంటి అద్భుతాలు జరగటం లేదు. గుంపు పలచబడింది. ఏడుగురు మాత్రం మిగిలారు. ఈశ్వరుడు కళ్లు విప్పాడు. ఆ ఏడుగురు తమకు జ్ఞానం ప్రసాదించమని ప్రార్థించారు. తమ ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డారు. ఈశ్వరుడు అప్పుడు ప్రసాదించిన విజ్ఞానం- ఈ పర్వత సానువుల్లో ఉంది. ఈ విజ్ఞానం శక్తి రూపంలో ఉంటుంది. ఒక ఇల్లు కట్టినప్పుడు దానిని నిలబెట్టడానికి కొన్ని కర్రలు అవసరమవుతాయి. ఈ పర్వత శ్రేణులు కూడా అలాంటివే. అమూల్యమైన విజ్ఞాన భాండాగారాన్ని తమలో దాచుకున్నాయి. ఈ విజ్ఞానాన్ని అందుకోవాలంటే క్రమశిక్షణ అవసరం. నిబద్ధత అనివార్యం. ఈ రెండు ఉన్నవారు మాత్రమే ఈ ప్రాంతానికి రాగలుగుతారు. కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని ఈ ప్రాంతానికి వచ్చే సమయానికి ‘నేను’ అనే అహం చచ్చిపోతుంది. అహం చనిపోయినప్పుడు మానవుడు విజ్ఞానాన్ని అందుకోగలుగుతాడు. అందుకే నిష్ఠగా, ఏకాగ్రతతో ఈ ప్రాంతానికి వచ్చినవారికి అనేకమైన అలౌకిక, ఆధ్యాత్మిక అనుభూతులు కలుగుతాయి.

Credits: Krishna Prasad Aluri
Related Posts :
Famous Lord Shiva Temples in India
Tamil Nadu Famous Temples
Jyotirlinga Temples Information


Manasa Sarovaram yatra information, Best Temples Details in Hindu temples guide, Temple Timings, Siva Temples Information, Famous Temples in Tamilnadu, hindu temples guide.com
Share on Google Plus

About Temples Guide

Rajachandra Author of the blog is an enterprenuer and a graduate who has keen interest on pilgrimage. When he visited Rameshwaram , he faced difficulties to get transportation and accommodation which proposed him to start this blog. He updates detailed guidance on Darshan timings, transportation, accommodation and the near by scenic places
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment

Have You Visited These Temples