Drop Down Menus

Chilkoor Balaji Temple Information


చిలుకూరు బాలాజీ దేవాలయం:
చిలుకూరు బాలాజీ దేవాలయం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది. బాలాజీ వెంకటేశ్వరుని అనేక నామాల్లో ఒకటి.


మందిరం ప్రాముఖ్యత:
ఈ ఆలయం పెద్ద ఆర్భాటాలు లేకుండా, సీదా సాదాగా ఉంటుంది. భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొంటుంటారు. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా వెలుగొందుతున్న చిలుకూరు బాలాజీ దేవాలయం భక్తులపాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు నిత్యం పెద్దసంఖ్యలో బాలాజీని దర్శించుకుంటారు. తెలంగాణ తిరుపతిగాఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడి స్వామివారిని వీసాల బాలాజీ అని కూడా పిలుస్తుంటారు. చిలుకూరు దేవాలయం హైదరాబాద్‌ నుంచి 25 కి.మీ.ల దూరంలో వికారాబాద్‌ వెళ్లే మార్గంలో ఉంది. వారానికి 75 వేల నుంచి లక్షమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. శుక్ర, శనివారాల్లో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
స్థల గాధ:
సుమారు 500 ఏళ్ల కిత్రం.. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి పరమభక్తుడైన గున్నాల మాధవరెడ్డి ఈ చిలుకూరులో ఉండేవాడు. అతను ఏటా ఎంత కష్టమైనా.. కాలినడకన తిరుపతి వెళ్లి.. స్వామివారిని దర్శించుకుని వచ్చేవాడు. వృద్ధాప్యంలో సైతం ఆయన వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కాలినడకన వెళ్లి వస్తుండేవాడు.అలా ఒకసారి తిరుమలకు బయల్దేరిన మాధవరెడ్డి.. ప్రయాణ బడలిక కారణంగా మార్గమధ్యంలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ మగత నిద్రలో వచ్చిన కలలో అతనికి స్వామివారు ప్రత్యక్షమయ్యారు. ‘మాధవా.. ఇకపై నువ్వు నా దర్శనం కోసం ఇంతదూరం ప్రయాసపడి రావాల్సిన అవసరం లేదులే. నేను చిలుకూరిలోని ఒక పుట్టలో కొలువై ఉన్నా.. వెలికి తీసి గుడి నిర్మించు’.. అని చెప్పి మాయమయ్యాడట! నిద్ర నుంచి మేలుకున్న మాధవరెడ్డి ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలిపారు. అంతా కలిసివచ్చి.. అక్కడ ఉన్న పుట్టను గునపాలతో పెకిలిస్తుండగా.. గునపం బాలాజీ ఎదభాగంలో తగిలి రక్తం వచ్చింది. వెంటనే అపచారమైందంటూ అంతా ఆ దేవదేవుణ్ని క్షమాపణలు కోరి ఆపై విగ్రహాన్ని పాలతో కడిగి బయటకు తీశారు. అలా దొరికిన బాలాజీకి అక్కడే ఆలయాన్ని నిర్మించి.. పూజలు చేయడం ప్రారంభించారు. ఈ స్థలపురాణం నిజమేననడానికి ఇప్పటికీ ఆలయంలో కొలువైన బాలాజీ ఎదభాగంలో గునపం గుచ్చుకున్న ఆనవాళ్లు కనిపిస్తాయి. ఈ దేవాలయంలో 1963లో ‘రాజ్యలక్ష్మి’ అమ్మవారిని ప్రతిష్ఠించారు. నాలుగేళ్ల కిందట దేవాలయం వద్ద నూతనంగా ఆలయ గోపురాన్ని నిర్మించారు. రెండేళ్ల కిందట పురాతన ధ్వజస్తంభాన్ని తొలగించి, నారేపచెట్టుతో రూపొందించిన కొత్త ధ్వజాన్ని ఏర్పాటు చేశారు. ఆ పై గరుత్మంతులవారి గుడిని నిర్మించారు. పూలంగి, అన్నకోట, బ్రహ్మోత్సవాలను ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తారు.


దేవాలయం ప్రత్యేకతలు:
 ఈ దేవాలయానికి నాలుగేళ్ల కిందట స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ ఎలాంటి హుండీ ఉండదు. ఇక్కడ దర్శనానికి ధనిక, పేద, అధికార తారతమ్యాలు లేవు. అందరూ ఒకే వరుసలో వేచి ఉండి భగవంతుని దర్శించుకోవాలి.కొంతకాలం వరకూ కనీస రవాణా సౌకర్యాలు సైతం లేని ఈ దేవాలయం భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న రోడ్డు రవాణా సంస్థ వారిచే ప్రత్యేక బస్సులు నడిపించే స్థాయికి చేరుకొన్నది.
ప్రదక్షిణలు:
ఇక్కడ ప్రదక్షిణలు చేయడం ఒక ముఖ్య ఆచారం. భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తారు. తమ కొరికలు తీరిన తరువాత ఇంకోసారి వచ్చి 108 సార్లు ప్రదక్షిణలు చేసి, తమ మొక్కు తీర్చుకొంటారు. దేవుని విగ్రహాన్ని కనులు మూసుకొకుండా చూడాలి అని చెబుతారు.

బాలాజీ దర్శన సమయాలు:
ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7.45 వరకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. వీఐపీ దర్శనాలు, ప్రత్యేకపూజ టికెట్‌ వంటివేవీ లేవు. బాలాజీ దర్శనానికి ఎంతటి వారైనా సాధారణ భక్తుల మాదిరిగా క్యూలో వెళ్లాల్సిందే.
ప్రయాణ సౌకర్యాలు:
దేశంలో ఎక్కడి నుంచైనా హైదరాబాద్‌కు వచ్చేందుకు చక్కటి రోడ్డు, రైలు, విమాన ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న చిలుకూరుకు చేరడం ఎంతో సులభం. ఆర్టీసీ-హైదరాబాద్‌ అధికారులు నగరం నుంచి ప్రతి 5నిమిషాలకు ఒక బస్సు చొప్పున చిలుకూరు బాలాజీ సన్నిధికి సర్వీసుల్ని నిర్వహిస్తున్నారు.


Chilkoor balaji Temple Information, Chilukuru Balaji Temple History in Telugu, Temple Details, Best Temple Information in Hindu Temples guide, Temple Timings, Temple Accommodation in chilkoor, Hindu Temples Guide.com
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.