Sri Valluramma Temple History in Telugu - Temple Timings, Accommodation, Pooja

వరాల తల్లి... వల్లూరమ్మ :
కోరిన కోర్కెలు తీర్చు తల్లిగా, విఘ్నములు బాపు కల్పవల్లి, సంతతికి కలిగే ఆపదల నుండి గాచు అమృతవల్లిగా, దుష్టశక్తులను అంతం చేయు సర్వశక్తిమయిగా వివిధ రూపాలలో రక్షిస్తుంది. సహజంగా తండ్రి ఆలన లేకున్నా మానవుడు జీవించగలడేమో గాని, తల్లి పాలన, లాలన లేకుండా బ్రతుకు దుర్భరం. సుమారు ఐదు వందల సంవత్సరాల నాటి చారిత్రక ప్రాధాన్యతను నంతరించుకొని, నేటికిని దినదిన ప్రవర్థమానమవుతున్న దేవాలయం శ్రీ వల్లూరమ్మ దేవస్ధానం. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు పట్టణానికి సుమారు 5 కి.మీ. దూరంలో దక్షిణ దిశగా, విజయవాడ- మద్రాసు జాతీయ రహదారిపై నిరంతర వాహనాల రద్దీతో, భక్తుల సందోహాలతో ప్రసిద్దిగాంచిన క్షేత్రం వల్లూరమ్మ క్షేత్రం. క్షేత్రపాలకురాలు శ్రీవల్లూరమ్మే.

వల్లూరమ్మ గుడి ఎలా వెలసింది అనేదానికి స్థానికులు ఓ కధ చెప్తారు.
వెంకటగిరి రాజులు, ఒంగోలు మందపాటి రాజులకు సరిపడేది కాదు. వారిద్దరిలో వెంకటగిరి రాజులు బలవంతులు. వారివలన తమకు హాని జరగకుండా ఉండాలని, ప్రజలు ఇబ్బంది పడకూడదని మందపాటి రాజులు యజ్ఞం చేయాలనుకున్నారు. ఈ సంగతి తెలిసిన వేంకటగిరి రాజులు యజ్ఞం జరక్కుండా చేయాలనుకున్నారు. వెంటనే, యజ్ఞం నిర్వహించే యోగీంద్రుని ఏదో నెపాన ఆపాలనుకున్నారు. కానీ, మందపాటి రాజుల సంకల్పం ఉన్నతమైనది కనుక అలా జరగలేదు.
మందపాటి రాజులు తలపెట్టిన యజ్ఞం నిర్విఘ్నంగా సాగుతోంది. అయితే యజ్ఞవాటిక నుండి మహా జ్వాలలు బయల్దేరాయి.అందులోంచి ఉల్కలు వస్తున్నాయి. అది చూసి అందరూ భయపడ్డారు. ఏదయినా అపరాధం జరిగిందా అని సంశయించారు. కానీ చూస్తుండగానే ఆ ఉల్కలు ఒక దివ్య ఆకృతి దాల్చి ముందుకు సాగింది. అలా వల్లూరు చెరువు వైపు వెళ్ళి అక్కడ అంతర్ధానం అయింది. ఆ దివ్య స్వరూపం చూసి అక్కడివారు ముందు భయపడినా, వెంటనే మహానుభూతికి గురయ్యారు. ఆ శక్తి వేరెవరో కారని, అమ్మవారేనని అర్ధం చేసుకుని ఆలయం కట్టించారు. అగ్ని నుండి వెలసిన శక్తి కనుక ఉల్కాముఖి అని పేరు పెట్టారు. వల్లూరులో వెలసిన దేవత కనుక వాడుకలో వల్లూరమ్మగా నిలిచిపోయింది. స్థానికులు వల్లూరమ్మ అని, వల్లూరమ్మ తల్లి అని వ్యవహరిస్తూ భక్తిప్రపత్తులతో ఆరాధిస్తారు.

పొంగళ్ల సమర్పణ :
ప్రతి ఆదివారం వల్లూరమ్మ ఆలయంలో భక్తులు పొంగళ్లను, మొక్కుబడులను సమర్పిస్తారు. రైతులు. వ్యాపారులు, సంతానార్థులు, అవివాహితులు తమ ఈప్సితాలు నెరవేరేలా చూడమంటూ అమ్మవారిని ప్రార్థిస్తారు. పొర్లుదండాలు పెడతారు. మేళతాళాలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.

వాహన పూజలు
వల్లూరమ్మ ఆలయం వాహన పూజలకు ప్రసిద్ధి చెందింది. జిల్లాకు చెందినవారే గాక గుంటూరు, నెల్లూరు జిల్లాల నుండి కూడా భక్తులు కొత్త వాహనాలను ఆలయానికి తీసుకువచ్చి పూజలు జరిపిస్తారు. ఆలయం చుట్టూ ఒకసారి వాహనంపై ప్రదక్షిణ చేస్తారు. అలా చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని, ప్రమాదాలు జరగవని విశ్వాసం.

సుందర శిల్పాలయం :
దాతలు, భక్తుల సహకారంతో ఆలయం లోపలి భాగంగా 16 విగ్రహాలను, శిల్పాలను ఏర్పాటు చేశారు. అష్టలక్ష్ములతోపాటు గాయత్రి, సరస్వతి, రాజరాజేశ్వరి అమ్మవారు, శివపార్వతులు, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, దక్షిణామూర్తివంటి దేవతామూర్తులను ఏర్పాటుచేస్తున్నారు. ఇవి జీవకళ ఉట్టిపడుతూ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

విశేష కార్యక్రమాలు :
వల్లూరమ్మ ఆలయంలో శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహిస్తారు. వెయ్యిమందికిపైగా మహిళలు పాల్గొంటారు. ఆశ్వయుజ మాసంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కనుమ పర్వదినంనాడు అమ్మవారికి గ్రామోత్సవంతోపాటు వల్లూరు చెరువులో వల్లూరమ్మకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం గుడి ఉత్సవం జరుగుతుంది.

ఆలయానికి చేరుకునే మార్గం :
వల్లూరమ్మ ఆలయం విజయవాడ–చెన్నై ప్రధాన జాతీయ రహదారి పక్కన ఉంది. పల్లెవెలుగు బస్సులు, ఆటోలు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. వల్లూరు గ్రామం ఒంగోలుకు 12 కి.మీ.లదూరంలో ఉంది. బస సౌకర్యాలు ఒంగోలు, టంగుటూరుల ఉన్నాయి. వల్లూరమ్మ దేవస్థానంలో కూడా భక్తులకు అవసరమైన వసతి సదుపాయాలను దేవస్థానం అధికారులు కల్పిస్తున్నారు.

valluramma temple timings, valluramma images, valluramma temple phone number, valluramma temple history, valluramma temple accommodation details, valluramma temple prakasham district, prakasham district famous temple list, valluramma temple timings, valluramma temple valluru.

1 Comments

  1. Nice .Thanks for giving this nice information. I am from ongole.

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS