Drop Down Menus

కోట్ల జన్మల పాప రాశులను భస్మం చేసే మహామహిమాన్వితమైన శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం | Subramanya Karavalamba Stotram Benefits in Telugu

 

కోట్ల జన్మల పాప రాశులను భస్మం చేసే మహామహిమాన్వితమైన శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం

శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్య విరచిత శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం  (దీనినే సుబ్రహ్మణ్యాష్టకం అని కూడా అంటారు )

ప్రతీ రోజు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని స్మరించడం, సకల శుభకరం.

హే స్వామినాథ! కరుణాకర దీనబంధో శ్రీపార్వతీశ ముఖపంకజ పద్మ బంధో

శ్రీశాదిదేవగణపూజిత పాదపద్మ వల్లీశనాథ మమదేహి కరావలంబం II 1 II

ఓ స్వామినాథా!! అంటే పరమశివునికే ప్రణవం బోధించాడు కాబట్టి, సుబ్రహ్మణ్యుడికి స్వామినాథ అనే నామం వచ్చినది. అంటే ఇక్కడ స్వామి వారిని గురుస్వరూపముగా చెప్పారు. ఓ స్వామినాథా, కరుణను చూపించేవాడా, దీనులను రక్షించేవాడా... ఇక్కడ దీనుడు అంటే ఎవరు? దీనుడు అంటే లౌకికముగా ఐశ్వర్యము లేనివాడు అని ఒక్కటే కాదు అర్ధం, ఎవరు తాము చెయ్యవలసిన పురుషప్రయత్నము చేసి, స్వామి వారి మీదే సంపూర్ణ భారము వేసి శరణాగతి చేస్తారో, వారు దీనులు. నీవే తప్ప ఇతఃపరంబెరుగను అని కరిరాజు ప్రార్ధించినట్లుగా చేస్తే, వాడు దీనుడు. ఎప్పుడూ నేను, ఇది నాది, నేను చేశాను ఇది అని విర్రవీగితే వాడు స్వామి వారి కరుణను ఒక్కనాటికి పొందలేడు.

శ్రీపార్వతీశ ముఖపంకజ పద్మ బంధో అంటే, సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు అమ్మ పార్వతీ అమ్మవారి రూపమే, అందుకే ఎప్పుడు మనం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళినా, ఆయనని చూస్తే, నమస్కరించాలి అనే కన్నా, దగ్గరకి వెళ్ళి ఎవరూ చూడకపోతే ఒకసారి ముద్దుపెట్టుకోవాలనిపిస్తుంది. ముద్దుల మూటకట్టేస్తాడు స్వామి, సదా బాలరూపం కదా. ఎన్ని యుగాలైనా విఘ్నేశ్వరుడూ, సుబ్రహ్మణ్యుడూ ఇద్దరూ బాలస్వరూపమే. చిన్నపిల్లలని చూస్తేనే మనకి ఎంతో ముద్దుగా ఉంటుంది, అలాంటి సాక్షాత్తు శివగౌరీ సుతుడైన సుబ్రహ్మణ్యుడిని చూస్తే ఎంత ముద్దు కలుగుతుంది. అంతటి సమ్మోహనా రూపము స్వామిది. అమ్మవారి పద్మము వంటి ముఖమును పోలి ఉన్న ముఖము కలిగినవాడు అని అర్ధం.

శ్రీశాదిదేవగణపూజిత పాద పద్మ అంటే ... సకల దేవతలూ, సాక్షాత్ శ్రీమహాలక్ష్మీ అమ్మవారి చేత పూజింపబడిన పాదపద్మములు ఉన్నవాడు. అంటే లోకములో సకల ఐశ్వర్యాలకూ ఆలవాలము శంకరుడు. అటు మహాలక్ష్మీ అమ్మవారైనా, కుబేరుడైనా ఐశ్వర్యాన్ని శంకరుని అనుగ్రహముతోనే పొందారు. అటువంటి శంకరుడికి, సుబ్రహ్మణ్యుడికి అభేదము. శంకరుడు ఎప్పుడు పుట్టాడో ఎవరికీ తెలియదు, కాబట్టి ఆయన బాల్యంలో ఎలా ఉంటాడో తెలియాలి అంటే సుబ్రహ్మణ్యుడిని చూడాలి. ఇంకో విషయం, లక్ష్మీనారాయణులకి వరసగా చెప్తే సుబ్రహ్మణ్యుడు అల్లుడు. ఎందుకంటే, వల్లీదేవసేనా అమ్మవార్లు ఇద్దరూ మహావిష్ణువు కుమార్తెలే. అలాగే ఇతర దేవతలందరూ స్వామిని పూజిస్తారు. అంతెందుకు, సాక్షాత్ మహావిష్ణు స్వరూపమైన శ్రీరామచంద్రమూర్తికి బాల్యకాండలో విశ్వామిత్రుని చేత ఉపదేశింపబడిన ఆఖ్యానము "స్కందోత్పత్తి". ఆ తర్వాత, రాముడు రావణసంహారముకి వెళ్ళే ముందు, తిరుచెందూర్ క్షేత్రము నందు స్వామిని సేవించి వెళ్ళారు అని అక్కడి స్థల పురాణం చెబుతుంది. అసలు సుబ్రహ్మణ్యుడికి ఉన్న మరో నామమే దేవసేనాపతి, అంటే సకల దేవసేనలకూ అధిపతి. సకలదేవతలచే పూజింపబడిన పాద పద్మములు కల వాడా!! ఓ స్వామినాథా!!

ఇటువంటి స్వరూపము ఉన్న ఓ స్వామినాథా!! మాకు చేయూతనివ్వు, సహాయాన్నందించే చేతులనివ్వు అని ఈ మొదటి శ్లోకములో ప్రార్ధిస్తున్నాము.

దేవాధిదేవనుత దేవగణాధినాథ దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజు పాద

దేవర్షి నారద మునీంద్ర సుగీత కీర్తే వల్లీశనాథ మమదేహి కరావలంబం II 2

దేవతలు, వారి అధిదేవతలచే కీర్తింపబడిన వాడా, ఇంద్రునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడా, నారదాది మునీంద్రులు, దేవర్షులచేత కీర్తించబడిన తండ్రీ, వల్లీనాథా మాకు చేయూత నిచ్చి మమ్మల్ని రక్షించు స్వామినాథా!!

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్ తస్మాత్ ప్రదాన పరిపూరిత భక్తకామ

శృత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప వల్లీశనాథ మమదేహి కరావలంబం II 3 II

స్వామి వారు, అనేక మంది అన్నార్తులకు, అన్నమును ప్రసాదించి, ఆ ప్రసాద రూపములో సర్వ రోగములను నివారించేవాడు. రోగములు అంటే భౌతికమైన రోగాలే కాక, భవరోగమును కూడా పరిహరించి, తనలో తీసుకునే కారుణ్యం కలిగిన వాడు. భక్తులు కోరిన కోరికలను (ధర్మబద్ధమైన కోర్కెలు) తక్షణమే తీర్చేవాడు. సకల వేదాలు, ఆగమాలు, ప్రణవములు ఏ పరబ్రహ్మ స్వరూపాన్ని కీర్తిస్తున్నాయో.. అటువంటి స్వరూపము ఉన్న ఓ వల్లీనాథా మాకు చేయూతనివ్వు, రక్షించు.

క్రౌంచామరేంద్ర పరిఖండన శక్తి శూల పాశాది శస్త్ర పరిమండిత దివ్యపాణే

శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ వల్లీశనాథ మమదేహి కరావలంబం II 4 II

క్రౌంచ పర్వతమును భేదించిన వాడివి, శక్తి, శూలము, ధనుస్సు, బాణములు చేత ధరించి, కుండలములను కర్ణాభరణములుగా కలవాడివై, అమితమైన వేగముతో పయనించే నెమలిని వహనముగా కల ఓ వల్లీనాథా!! మమ్మలను రక్షించు. ఇక్కడ బహుశా కుండలీశ అంటే కేవలం కుండలములను ధరించు వాడు అనే కాకపోవచ్చు, కుండలీ శక్తికి నాథుడు.. అంటే వల్లీ అమ్మ వారిని కుండలినీ శక్తికి ప్రతీకగా పెద్దలు చెప్తారు, అటువంటి కుండలినీ శక్తికి ఈశా అంటే నాథుడైన వాడా అని అర్ధం కూడా కావచ్చు.

దేవాధిదేవ రథమండల మధ్యవేద్య దేవేంద్ర పీఠనగరం ధృఢచాప హస్తం

శూరం నిహత్య సురకోటి భిరీడ్యమాన వల్లీశనాథ మమదేహి కరావలంబం II 5 II

ఓ దేవాధిదేవా! అనేక మంది దేవసేనల నడుమ రథమును అధిష్ఠించిన వాడివై, ఇంద్రుని రాజ్యమును కాపాడుటకు పూనుకున్న వాడివై, చేత బాణములను, విల్లును పట్టుకుని, ముఫ్ఫై మూడు కోట్ల మంది దేవతల ప్రార్ధనని మన్నించి సూరపద్మాసురుడు అనే రాక్షసురుడిని సంహరించిన ఓ వల్లీనాథా!! మమ్మల్ని నీ బాహువులచే రక్షించు తండ్రీ.

హారాదిరత్న మణియుక్త కిరీటహార కేయూరకుండల లసత్కవచాభిరామ

హేవీర తారక జయామర బృందవంద్య వల్లీశనాథ మమదేహి కరావలంబం II 6 II

హారములు, రత్నములు, మణులచే పొదగబడిన కిరీటమును ధరించినవాడా, భుజకీర్తులు, కర్ణములకు కుండలములు మరియు వక్షస్థలమునందు కవచమును ధరించినవాడా, తారకాసురుడిని జయించిన వాడా, దేవతలచేత ప్రార్ధింపబడే ఓ వల్లీనాథా! నీ చేతులతో సహాయమునివ్వు.

పంచాక్షరాది మనుమన్త్రిత గాంగతోయైః పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైర్మునీంద్రైః

పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ వల్లీశనాథ మమదేహి కరావలంబం II 7 II

పంచాక్షరి మొదలైన పవిత్రమైన మంత్రములతోనూ, గంగాది పవిత్ర నదీ జలాలతోనూ, పంచామృతాలతోనూ, ఇంద్రాది దేవతలూ, మునీంద్రులు స్తుతించబడుతూ ఉండగా, హరిహరులచే పట్టాభిషిక్తుడైన ఓ వల్లీనాథా! స్వామీ మాకు చేయూతనివ్వు.

శ్రీకార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా కామాదిరోగ కలుషీకృత దుష్ట చిత్తమ్

సిక్త్వాతు మామవ కళాధర కాంతి కాంత్యా వల్లీశనాథ మమదేహి కరావలంబం II 8 II

ఆరుగురు కృత్తికలు, స్తన్యము ఇచ్చిన కారణముగా, స్వామీ నీవు కార్తికేయ అనే నామముతో పిలువబడినావు. ఓ కార్తికేయా! నీ యొక్క కరుణతో కూడిన అమృత దృష్టి మాపై ప్రసరిస్తే చాలు, మాలోని కోరికలను, సకల రోగములను, దుష్ట చిత్తమును నిర్మూలించే వాడా, సకల కళలకూ నిధియైనవాడా, శివుని తేజస్సుతో వెలిగే ఓ వల్లీనాథా! మాకు చేయూతనివ్వు. మమ్మల్ని రక్షించు.

సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమాః తే సర్వే ముక్తి మాయాన్తి సుబ్రహ్మణ్యప్రసాదతః

సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్ధాయ యః పఠేత్ కోటిజన్మ కృతం పాపం తత్క్షణా దేవనశ్యతి. || 9 ||

ఏ ద్విజులైతే ఈ పుణ్యప్రదమైన సుబ్రహ్మణ్యాష్టకమును నిత్యమూ చదువుతారో, వారికి సుబ్రహ్మణ్యుడు ముక్తిని ప్రసాదించును. ప్రతీ రోజూ ఉదయముననే ఈ అష్టకమును ఎవరైతే పఠిస్తారో, వారు కోటి జన్మలలో చేసిన పాపము, ఒక్క క్షణములో నశించును.

ఇతి  సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం సంపూర్ణం.

Famous Posts:

subramanya ashtothram in telugu pdf, subramanya kshamapana stotram in telugu pdf, subramanya bhujanga stotram in telugu pdf, subramanya swamy ashtothram in telugu, subramanya ashtakam telugu audio, subramanya kavacham in telugu pdf, subramanya, karavalamba stotram in telugu mp3 free download, navagraha stotram in telugu, శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.